చెన్నై : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసిన మేధావులకు సూపర్ స్టార్ కమల్ హాసన్ మద్దతు పలికారు. దేశంలో మూక దాడులు పెరుగుతుండటాన్ని, ‘జై శ్రీరామ్’ నినాదాన్ని దుర్వినియోగం చేయడాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాసినవారిపై దేశద్రోహం కేసు నమోదు చేయడంపై కమల్ హాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ చెప్తున్నదానికి, ప్రస్తుతం జరుగుతున్నదానికి చాలా తేడా ఉందన్నారు.

మంగళవారం కమల్ హాసన్ ఇచ్చిన ట్వీట్లలో మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడచుకోవాలని డిమాండ్ చేశారు.

‘‘ప్రధాన మంత్రి సామరస్య భారత దేశం కావాలని కోరుకుంటున్నారు. పార్లమెంటులో ఆయన ప్రకటనలు దీనిని ధ్రువీకరిస్తున్నాయి. దీనిని ప్రభుత్వం, చట్టాలు తు.చ. తప్పకుండా పాటించవద్దా? ప్రధాన మంత్రి ఆకాంక్షలకు విరుద్ధంగా దేశద్రోహం కేసులో 49 మంది నా తోటివారిని నిందితులుగా చేశారు’’ అని మొదటి ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘‘ప్రజాస్వామికంగా న్యాయాన్ని నిలబెట్టేందుకు మన ఉన్నత న్యాయస్థానాలు కదలాలని, బిహార్ నుంచి వచ్చిన కేసును రద్దు చేయాలని నేను కోరుతున్నాను’’ అని రెండో ట్వీట్‌లో కమల్ హాసన్ కోరారు.

మూక దాడులు పెరుగుతుండటాన్ని నిరసిస్తూ అపర్ణా సేన్, ఆదూర్ గోపాలకృష్ణన్, రామచంద్ర గుహ, రేవతి వంటి మేధావులు 49 మంది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జూలైలో లేఖ రాశారు. దీనిపై బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన ఓ న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

Courtesy Andhrajyothi…

Tags-india, Kamal hasan, criticized ,sedition, Case, against ,intellectuals, Modi ,government,say, something, do, otherwise, Lynching, wrong