మహమ్మద్ ఖదీర్‌బాబు

సాయంత్రం వేళ అంటే పిల్లలు ఇంటికి వచ్చే సమయం. కసువు ఊడ్చుకునే సమయం. వంటకు సిద్ధమవ్వాల్సిన సమయం. దీపాలు వెలిగించి ఇంటిని వెలుతురు చేసుకోవాల్సిన సమయం. కాని ఆ సమయంలో ఆ స్త్రీలు బురఖాలు వేసుకొని, పిల్లలను తీసుకుని, తాళాలు వేసుకొని, ఆ చోటుకు చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. కాసేపటికి 200 నుంచి 300 మంది దాకా తోడవుతున్నారు. ఎనిమిదిన్నర వరకూ ఉండి మళ్లీ ఇళ్లకు చేరుకుంటున్నారు.

గత 26 రోజులుగా కాకినాడ ‘ఆజాద్ బాగ్’లో కనిపిస్తున్న దృశ్యం ఇది.

కాకినాడలో ముస్లింలు ఎక్కువగా ఉండే రెండు పేటల పేర్లు తెలుసా? రామారావు పేట. రామకృష్ణ పేట. మిగిలిన ఏరియాల్లో కూడా కొద్దిమంది ఉన్నారు. వీరంతా ఏ రోజుకారోజు వాట్సప్పుల్లో ఉత్సాహపరుచుకుని సాయంత్రానికి ఎన్ని పనులు ఉన్నా మానుకుని బాలాజీ చెరువు సెంటర్‌లో ఉన్న నెహ్రూ బొమ్మ కిందకు చేరుకుంటారు. పైకప్పు లేని ఆ సెంటరే వారి నిరసన తావు. ఆజాద్ బాగ్.

‘మాకు రావడానికి ఒక్కొక్కరికి రోజుకు 50 రూపాయలు ఖర్చు అవుతోంది’ అని ఒక ఆమె అంది.

‘అందరూ మధ్యతరగతి స్త్రీలే. ఒకరిద్దరు చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నారు. తోచిన డొనేషన్ ఇస్తున్నారు. మిగిలినవారు భర్తలను అడిగి తెస్తున్నారు. మేమే మా ఖర్చులను భరిస్తున్నాం’ అని ఈ నిరసనలో చురుగ్గా ఉంటున్న నజ్మా అనే బురఖా స్త్రీ చెప్పింది.

నిన్నటి వరకూ వీరికి సరైన మైక్ లేదుట. నిన్న ఒక లెక్చరర్ వెయ్యి రూపాయలు ఇస్తే మైక్ పెట్టి సి.పి.ఎం వాళ్లు చేయించిన కేసెట్లు ప్లే చేస్తున్నారు.

అక్కడ మౌనంగా మాటా పలుకూ లేనట్టుగా కూచుంటున్న స్త్రీలలో ఎవరూ ఉత్సాహంగా లేరు. సమరోత్సాహంతో ఊగేవారు లేరు. బిగించిన పిడికిళ్లతో లేరు. వారంతా స్తబ్దుగా ఉన్నారు. బెంగగా ఉన్నారు. దిగులుగా ఉన్నారు. నైరాశ్యంతో ఉన్నారు. రోదిస్తున్నట్టుగా ఉన్నారు. కచ్చితంగా తగిలేలా లోన శాపనార్థాలు పెట్టేలా ఉన్నారు.

తమ కుటుంబానికి, భర్తకు, పిల్లలకు ఏదో ప్రమాదం వచ్చిపడిందని మాత్రమే వారికి తెలుసు. దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలియదు. ఎలా ఆపాలో తెలియదు. చేయగలిగిందల్లా ఇంటిని వదిలి ఇలా రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలియ చేయడమే.

‘డిటెన్షన్ క్యాంపులలో వేస్తారు సరే… మందులు కొనుక్కుని వేసుకొనే ఏర్పాటు చేస్తారా’ అని ఒక ముసలామె భయంగా అడిగింది.

‘మా కుర్రాళ్లు ఎక్కువ మంది రావడం లేదు. ఎందుకనో వాళ్లకు ఇదంతా పట్టడం లేదు. కొందరు భయపడుతున్నారు’ అని ఈ నిరసనకు కన్వీనర్‌గా ఉన్న అహమద్ అనే వ్యక్తి అన్నాడు.

‘హిందువులు ఇది తమ సమస్య కాదనుకుంటున్నారు. చర్చిలకు వెళ్లి మద్దతు అడిగితే ఇస్తామంటున్నారు గానీ మనస్ఫూర్తిగా వచ్చి కలవడం లేదు. మనదాకా వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా చాలామంది ఉన్నారు’ అన్నాడతడు.

‘ఇలా ఎంతకాలం కూచోగలరు?’ అని అడిగితే ‘చివరి వరకు’ అని ఒకామె అంది.

ఈ నేల ఎవరిది అనేది ఇప్పుడు కొత్త చట్టం అడుగుతున్న ప్రశ్న.

ఇక్కడ జమ అవుతున్న స్త్రీలంతా ప్రతి రోజూ మగ్‌రీబ్ నమాజ్ చదివి, తమ నుదురు నేలకు తాకించి ‘మాది మాది’ అని జవాబు చెబుతున్నట్టుగా అక్కడ నిలబడినప్పుడు అనిపించింది.

ఎవరి రక్తం బొట్టు కింద పడితేనో, మరెవరి కన్నీటి బొట్టు నేలను తాకితేనో క్షామం వచ్చి పడుతుందని విశ్వసించే ధార్మిక భూమి ఇది.

ఇందరు స్త్రీల క్షోభను తుడిచి పెట్టడానికి ఆ ధార్మికతతోనే ఈ భూమి ప్రజలంతా ఏకమవుతారనే నమ్మకం తప్పక ఉంది.

(మార్చి1, 2020 క్రియ పిల్లల పండగకు హాజరైన సందర్భంగా)