human rights commission chairman Chandraiah

  • ఉప లోకాయుక్తగా ఒలిమినేని నిరంజన్‌రావు
  • మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌గా బి.చంద్రయ్య

హైదరాబాద్‌, డిసెంబరు: తెలంగాణ రాష్ట్ర తొలి లోకాయుక్తగా జస్టిస్‌ చింతపంటి వెంకట(సీవీ) రాములు, ఉప లోకాయుక్తగా ఒలిమినేని నిరంజన్‌రావు నియమితులయ్యారు. అలాగే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ తొలి చైర్మన్‌గా జస్టిస్‌ గుండె చంద్రయ్య, సభ్యులుగా సెషన్స్‌ కోర్టు జిల్లా జడ్జి నడిపల్లి ఆనందరావు, నాన్‌ జ్యుడీషియల్‌ సభ్యుడిగా మొహమ్మద్‌ ఇర్ఫాన్‌ మొయినుద్దీన్‌లను నియమిస్తూ ప్రభుత్వం గురువారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. లోకాయుక్త, ఉప లోకాయుక్తల పదవీ కాలం ఐదేళ్ల పాటు ఉంటుంది. మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల పదవీ కాలం మూడేళ్లపాటు ఉంటుంది. లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌లను ఈ నెల 20 కల్లా నియమించాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో నియామక కమిటీలు గురువారం ప్రగతి భవన్‌లో భేటీ అయ్యాయి. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ఈ కమిటీల్లో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి, ఎంఐఎం శాసనసభాపక్ష ఉపనేత పాషాఖాద్రి, మండలిలో ఎంఐఎం పక్ష నేత జాఫ్రి ఉన్నారు. హక్కుల కమిషన్‌కు సంబంధించిన కమిటీలో అదనంగా హోంమంత్రి మహమూద్‌ అలీ ఉన్నారు. లోకాయుక్త, ఉప లోకాయుక్త, హక్కుల కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల పేర్లను ఈ కమిటీలు గవర్నర్‌ తమిళిసైకు పంపారు. ఆమె ఆమోదించడంతో ఉత్తర్వులు ఇచ్చారు.

 జస్టిస్‌ సీవీ రాములు నేపథ్యమిదీ: జస్టిస్‌ సీవీ రాములు నిజామాబాద్‌ జిల్లా అచనపల్లి గ్రామంలో 1949 ఫిబ్రవరి 20న జన్మించారు. 1978లో మహారాష్ట్రలోని యశ్వంత్‌ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసుకున్నారు. 24 ఏళ్లపాటు ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఏపీ హైకోర్టు అడిషనల్‌ జడ్జిగా 2002లో, జడ్జిగా 2004లో బాధ్యతలు స్వీకరించారు. 2011 ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేశారు. కాగా, ఉపలోకాయుక్తగా నియమితులైన వి.నిరంజన్‌రావు న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేశారు.

జస్టిస్‌ జి.చంద్రయ్య నేపథ్యమిదీ: జస్టిస్‌ జి.చంద్రయ్య ఆదిలాబాద్‌ జిల్లా తిమ్మాపూర్‌లో 1954 మే 10న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంఏ చదివారు. ఏపీ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా 1980లో పేరు నమోదు చేసుకున్నారు. హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2005లో హైకోర్టు అడిషనల్‌ జడ్జిగా ప్రమాణస్వీకారం చేశారు. 2006 ఫిబ్రవరి 20న జడ్జిగా నియమితులైన ఆయన.. 2016లో పదవీ విరమణ చేశారు.

(Courtesy Andhrajyothi)