Image result for mob lynching"కె. శ్రీనివాస్ 

అంతా పూర్తయ్యాక మిగిలేది ఏమిటి? ఒకటి ప్లస్‌ నాలుగు మరణాలు. న్యాయవ్యవస్థకు ఒక తిరస్కారం. పోలీసు అసమర్థత ఖననం. చట్టవిరుద్ధమయిన చర్యకు పూలవర్షం. రేపు ఈ చర్య ఎక్కడయినా జరగవచ్చు, జరిగిన ప్రతిసారీ వారు జేజేలు కోరవచ్చు. జేజేల కోసం మీడియాలో ముందస్తు సన్నాహాలు సిద్ధం కావచ్చు. మనసుల్ని సిద్ధం చేసి, మన మరణానికి మనలనే అర్రులుసాచేట్టు చేయవచ్చు. లోకంలో జరిగే పరిణామాలకు మీడియా తానే ఎందుకు ఉద్వేగపడాలి? ఆక్రందనో ఆక్రోశమో విలాపమో తానే ఎందుకు చేయాలి? తానే ఎందుకు కోపించుకోవాలి?

తక్షణం ప్రతీకారం కావాలని స్వప్నిక, ప్రణీతలు కోరుకోవడం సహజం. కానీ, ఆ కోరికను వరంగల్‌ యువత చేత అడిగి అడిగి చెప్పించిన దృశ్యమీడియా వైఖరిని ఆమోదించడం కష్టం. జరగబోయే ఎన్‌కౌంటర్‌కు ఇది భూమిక ఏర్పాటు చేసింది. ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్య అంగంగా ఉన్న మీడియా ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దిశగా నడుచుకోవాలి తప్ప నాశనం చేసే దిశగా కాదు. సెన్సేషన్‌ కోసం ఇట్లాగే చేసుకుంటూ పోతే ఇతర ప్రజాస్వామ్య విధ్వంసకులను నిలదీసినట్టే మీడియాను కూడా నిలదీసే రోజులు వస్తాయి.

డాక్టర్‌ కె. బాలగోపాల్‌
(‘అన్యాయ న్యాయానికి ఆమోదమా?’, 2007)

పన్నెండేళ్ల కింద వరంగల్‌లో జరిగిన ఆసిడ్‌దాడి–ఎన్‌కౌంటర్‌ సంఘటనల అనంతరం బాలగోపాల్‌ ఇదే పత్రికలో రాసిన ఈ వ్యాసం ఇప్పటికీ ప్రాసంగికంగా ఉండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అప్పుడు జరిగినట్టే, ఇప్పుడూ ఒక అఘాయిత్యం – ఎన్‌కౌంటర్‌ జరిగాయి. అప్పుడు ప్రజలలోని ఆగ్రహావేశాలను సంచలనాత్మకంగా మలచిన నేరం కేవలం దృశ్యమీడియాదే కావచ్చు, ఇప్పుడది అన్ని రకాల వార్తాసాధనాలకూ వర్తించవచ్చు. ఏ బాపతు ప్రజాస్వామ్య విధ్వంసకులనైనా ప్రజలు నిలదీస్తున్నారో లేదో తెలియదు, మీడియాను కూడా నిలదీస్తున్నారని అనుకోనక్కరలేదు. కానీ, సమాచార సాధనాలంటే రానురాను గౌరవం అడుగంటిపోతోంది. ఒక అప్రజాస్వామికమైన పర్యవసానాన్ని ప్రోత్సహించడమే కాదు, అందులో భాగస్వామ్యం తీసుకోవడానికి కూడా జర్నలిజం తహతహలాడుతున్నది.

వార్తలు చెప్పవలసిన గొంతు, దేశమంటే తానేనని హుంకరిస్తున్నది. టీవీ బాక్సులు బద్దలయ్యేలా కేకలు పెడుతున్నది. అక్కడికక్కడ తీర్పులు చెబుతున్నది. యుద్ధాలు చేస్తున్నది. శత్రువును గుర్తించి ద్రోహముద్రను అద్దుతున్నది. హత్యలను సమర్థిస్తున్నది.

వార్తలను రాయవలసిన చేయి కూడా నిష్పాక్షికత ఇరుసు మీద నిలబడలేక, అధికారం వైపు ఒరిగిపోతున్నది. అనేక అఘాయిత్యాల తరువాత, తెల్లవారి లేచి చూసుకుంటే, పాత్రికేయుల చేతికి కూడా ఎంతో కొంత నెత్తురు అంటి ఉంటున్నది.

ఇదేదో వ్యక్తుల పతనమో, సంస్థల స్వార్థమో కానక్కరలేదు. ఒక సమాజం లోని వివేకవంతుల శ్రేణి, విమర్శకుల బృందం, ఏ స్థాయిలో ఉంటే, ఆ సమాజపు అత్యున్నత వ్యక్తీకరణ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. పత్రికలు కూడా అంతే. అవి ఆవిర్భవించిన కాలంలో, అవి నాటి పౌరసమాజాన్ని ప్రతిబింబించాయి. సమాజం అంతా ఎంత అసమానతలతో, అవిద్యతో, అసంస్కారంతో ఉన్నా, దాని ఉన్నతస్థాయి చైతన్యానికి ప్రతినిధులుగా ఉన్నవారి విలువలే ఆదర్శాలుగా ఉంటాయి. ప్రధానస్రవంతి అని పిలిచే మెజారిటీ జనసముదాయం యథాతథ విలువలతో, హీన అధమ వ్యక్తీకరణలతో కూడిన సంవాదంలో కూరుకుపోయి ఉంటుంది. ఈ రెండు పొరల మధ్య ఉండే తేడాను ప్రగతిశీలంగా తగ్గించుకుంటూ పోగలగడమే పురోగమనం. కానీ, విచక్షణ వివేకం కాక వేలంవెర్రిగా వ్యవహరించే మూకసాంస్కృతిక విలువలే ప్రధానవేదిక మీదికి వచ్చి సమాజానికి తానే విలువల ప్రతినిధిని అని ప్రకటించుకుంటే ఎట్లా ఉంటుంది? నేటి మీడియా క్రమంగా ఆదర్శాలను వదిలి, యథాతథవాద, మూకస్వామ్య, వెకిలి, హీన, హింసాత్మక వ్యక్తీకరణల ఆకర్షణలోకి వేగంగా పతనమవుతున్నది. తరచి తరచి లోచూపును పెంచడం కాక, ఈలలు వేయించడానికి, కేరింతలు కొట్టించడానికి ఉత్సాహపడుతున్నది. మూకదాడులకు మృదంగసహకారం అందిస్తున్నది.

దిశను హత్య చేసిన హంతకులు, నేరశోధన ప్రక్రియలో, పోలీసులమీద దాడిచేసి ఎదురుకాల్పుల్లో హతులయ్యారు– అని పోలీసులు చెబుతున్నారు. కానీ, రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు, అనేక రంగాల ప్రముఖులు అందరూ– అది ఉద్దేశ్యపూర్వకంగా, నేరస్థులకు బుద్ధిచెప్పడానికి చేసిన హత్యే అంటున్నారు. సాక్షాత్తూ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కూడా చటాన్‌పల్లి దగ్గర జరిగింది బూటకపు ఎన్‌కౌంటరే అన్నట్టుగా మాట్లాడారు. ఆయనకు అయితే, జాతీయ మానవహక్కుల కమిషన్‌ ఒక రాజ్యాంగ బద్ధ సంస్థ అని కూడా తెలియదు. ఏదో పౌరహక్కుల సంఘం లాంటి ప్రజాసంఘం అనుకుంటున్నాడు. ఎన్‌హెచ్‌ఆర్‌సి– మీద చిరాకు పడడం ఇప్పుడు అందరికీ ఒక విప్లవాత్మక స్పందన. బూటకపు ఎన్‌కౌంటర్‌ అని గుర్తించి ప్రశంసిస్తేనేమో ఓకె. బూటకపు ఎన్‌కౌంటర్‌ అని ఖండిస్తే మాత్రం తప్పు. ప్రశంసించదగిన ఎన్‌కౌంటర్‌కు తగిన వాతావరణాన్ని సృష్టించడంలో మీడియా నిర్వహించిన పాత్ర అమోఘం. అదే ఎన్‌కౌంటర్‌ విషయంలో తరువాత చిక్కులొస్తే, ఆ వార్తలను పత్రికలు ప్రచురిస్తే పోలీసులకు కోపం.

హక్కుల గురించి మాట్లాడడమంటే, నేరస్థులను, నేరాన్ని సమర్థించడం అనుకునే వాతావరణాన్ని పెంచి పోషించారు. మీడియా చర్చల్లో చూడాలి, కొందరు యాంకర్లయితే, తీవ్రమయిన రక్తదాహంతో ఊగిపోతుంటారు. చనిపోయిన నలుగురు కాదు సమస్య. తక్కిన బాధ్యులే సమస్య. వరంగల్‌ ఎన్‌కౌంటర్‌ గురించి కూడా బాలగోపాల్‌ ఇలా అన్నారు. ‘‘పిల్లలు మానవతా విలువలకు దూరమవుతుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారని అడగనక్కరలేదు, వారు విద్యార్థులైతే వారి అధ్యాపకులు ఏం చేస్తున్నారని అడగనక్కరలేదు. వారితో కలసి సినిమాలకూ షికార్లకూ పోయే స్నేహితులు ఏం చేస్తున్నారని అడగనక్కర్లేదు.

ప్రజాజీవితాన్నీ, సంస్కృతినీ అమానవీయంగా తయారుచేస్తున్న సకల సంస్కృతి బేహారులనూ మీ వ్యాపార లాభాల కోసం మీరేం చేస్తున్నారనీ అడగనక్కరలేదు.’’ ఎవరైనా నేరానికి పాల్పడితే, నేరస్వభావాన్ని అలవరచుకుంటే అందుకు ఎందరు బాధ్యులుంటారో మనం గుర్తించామా? అన్నిటి కంటె ముఖ్యమైనది, పోలీసుల అసమర్థత, ఆ రాత్రి సకాలంలోనే పోలీసులను ఆశ్రయించి సాయం కోరిన కుటుంబానికి ఎటువంటి సమర్థత ఎదురయిందో తెలుసు కదా? వెలుతురు లేని టోల్‌గేట్లు, యథేచ్ఛగా లారీలను పార్కింగ్‌ చేసిన డ్రైవర్లు, హైవేల మీద బార్లా తెరచిన మద్యం అంగళ్లు– ఏమేమి కలిసి ఆ కాళరాత్రిని సృష్టించాయో మరచిపోయి, ఆ నలుగురిని కాల్చేసినందుకు పూలవర్షాలు కురిపించింది సమాజం! ఇటువంటి దుర్మార్గాలు మళ్లీ జరగకుండా ఏమి చేయవచ్చునో కనీసం పక్కరాష్ట్రంలో ఆలోచనైనా చేశారు, తెలంగాణలో ఒక్కటంటే ఒక్కటి విధానపరమైన లేదా రాజకీయపరమైన నిర్ణయం తీసుకున్నారా? నిర్భయ తరువాత మీడియాలో జరిగినటువంటి చర్చ ఏదైనా తెలుగు సమాచార సాధనాల్లో జరుగుతోందా? మనుషుల్ని క్రూరులుగా అమానవులుగా తీర్చిదిద్దుతున్న పరిస్థితులేమిటో గుర్తించే ప్రయత్నం ఎక్కడైనా కనబడుతోందా?

స్త్రీలకు భద్రత అన్నది ఒక వాతావరణాన్ని సూచిస్తుంది. ఆ వాతావరణం సమకూరడానికి అనేక చర్యలు అవసరం. కుటుంబంలో ఆడపిల్లను తక్కువగా చూడడం, భార్యను వేధించడం, కోడళ్లను కాల్చుకు తినడం, ఉద్యోగ వృత్తిరంగాలలో పనిచేసే మహిళలతో అగౌరవంగా వ్యవహరించడం– ఇవీ, ఒక అపరిచిత రౌడీ మూక నిస్సహాయ యువతిపై హత్యాచారం చేయడం వేరు వేరు అంశాలు కావు. ఒకే అంశంలోని వేరువేరు వ్యక్తీకరణలు. ఆడవాళ్లకు మంత్రివర్గంలో స్థానమే లేకుండా ఒక పదవీకాలం అంతా నెట్టుకొచ్చిన ప్రభుత్వం, మహిళాకమిషన్‌ ఒకటి అవసరమన్న సంగతి కూడా గుర్తించని ప్రభుత్వం – పరోక్షంగా స్త్రీలపై హింసను పెంచడం లేదా, సాధికారతా భావనను అణగార్చడం లేదా? స్త్రీ పాత్ర లేని ఏకాంకిక వంటి ప్రభుత్వాలు, పాలనలు ఏ వాతావరణాన్ని సృష్టిస్తాయి?

అంతా పూర్తయ్యాక మిగిలేది ఏమిటి? ఒకటి ప్లస్‌ నాలుగు మరణాలు. న్యాయవ్యవస్థకు ఒక తిరస్కారం. పోలీసు అసమర్థత ఖననం. చట్టవిరుద్ధమయిన చర్యకు పూలవర్షం. రేపు ఈ చర్య ఎక్కడయినా జరగవచ్చు, జరిగిన ప్రతిసారీ వారు జేజేలు కోరవచ్చు. జేజేల కోసం మీడియాలో ముందస్తు సన్నాహాలు సిద్ధం కావచ్చు. మనసుల్ని సిద్ధం చేసి, మన మరణానికి మనలనే అర్రులుసాచేట్టు చేయవచ్చు.

లోకంలో జరిగే పరిణామాలకు మీడియా తానేఎందుకు ఉద్వేగపడాలి? ఆక్రందనో ఆక్రోశమో విలాపమో తానే ఎందుకు చేయాలి? తానే ఎందుకు కోపించుకోవాలి? రేస్‌కోర్సులో గుర్రాలను రెచ్చగొట్టినట్టు పాఠకులను ప్రేక్షకులను ఎందుకు ప్రేరేపించాలి? సమాచారం ఇచ్చి, స్పందన ప్రేక్షకుడికి వదిలిపెట్టలేమా? శాంతి సమయంలో మాత్రమే మీడియా నిష్పాక్షికంగా ఉంటుందట, సంక్షోభకాలంలో వీరంగం వేస్తుందట, యుద్ధమే కనుక వస్తే, దానంత ఉన్మాది మరొకటి ఉండదట– ఎవరో పెద్దమనిషి అన్నాడు. ఇంతకంటె ఉదాత్త కర్తవ్యాన్ని స్వీకరించలేమా? సినిమా నిర్మాతల్లాగా, ప్రేక్షకులు కోరుతున్నారు కాబట్టి చెత్త ఇస్తున్నామని మీడియాకూడా సమర్థించుకోవాలా?

పాఠకులారా, ప్రేక్షకులారా, శ్రోతలారా, వార్తలతో పాటు ఇంత విషం కూడా ఉంటుందేమో జాగ్రత్త పడండి. విచక్షణతో వడగట్టి, నిగ్రహంతో ఆలకించండి. ‘దిశ’ పునరావృత్తం కాకుండా ఏమి చేయాలో అప్పుడు ఆలోచించండి.

(Courtesy Andhrajyothi)