న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో దాదాపు 3.5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పెరుగుతున్న కేసులకు తగినట్టుగా న్యాయాధికారులు, జడ్జీల నియామకాలు జరగడం లేదు. దీంతో న్యాయ పరిష్కారం కోసం బాధితులు దీర్ఘకాలం పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ఇక విచారణ ఖైదీలకైతే.. న్యాయ విచారణే ఒక శిక్షగా మారిందన్న అభిప్రాయాలున్నాయి. ఎందుకంటే న్యాయస్థానం తీర్పు కోసం ఎదురుచూస్తూనే లక్షలాది మంది నిందితులు విచారణ ఖైదీలుగా జైళ్లల్లో మగ్గుతున్నారు. సిబ్బంది కొరతతో బాధపడుతున్న కోర్టుల్లో కేసుల పరిష్కారం నత్తనడకన సాగుతున్నది. అధికారిక సమాచారమే ఈ దుస్థితిని వెల్లడిస్తున్నది. దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో దాదాపు 3.5 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్‌ తెలిపారు. ఇందులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 59,867 కేసులు పెండింగ్‌ ఉన్నాయనీ, హైకోర్టుల్లో 44.75 లక్షల కేసులు, జిల్లా, సబార్డినేటర్‌ స్థాయి న్యాయస్థానాల్లో 3.14 కోట్ల కేసులు ఇంకా పరిష్కారాలకు నోచుకోవాల్సి ఉన్నాయని వివరించారు. నవంబర్‌ 2019 వరకు న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్‌ కేసులు వివరాలు ఇవి. కాగా, మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన 2014 నుంచి పెండింగ్‌ కేసుల సంఖ్యలో పెద్దగా మార్పుల్లేవు. అంటే, పరిష్కారం పొంది పెండింగ్‌ కేసుల సంఖ్య చెప్పుకోతగ్గస్థాయిలో తగ్గలేదు. 2014లోనూ సుప్రీంకోర్టులో 62,791 కేసులు, హైకోర్టుల్లో 41.53 కేసులు, ఇతర దిగువస్థాయి కోర్టుల్లో 2.62 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

239 నియామకాల ప్రతిపాదనలు పెండింగ్‌లోనే..
పెండింగ్‌ కేసుల సంఖ్య.. న్యాయ వ్యవస్థలోని సిబ్బంది సంఖ్యపై ఆధారపడుతుంది. న్యాయమూర్తుల నియామకాల్లో మోడీ సర్కారు నిర్లక్ష్యమే పెండింగ్‌ కేసుల సంఖ్య పెరగడానికి పరోక్ష కారణంగా అర్థమవుతున్నది. ఎందుకంటే 2014 నుంచి ఇప్పటి వరకు పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడం గమనార్హం. న్యాయాధికారులు సహా దేశవ్యాప్తంగానున్న అన్ని కోర్టుల్లో 2013లో 19,518 మందికిగాను 15,115 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. 2019లో 23,566(సాంక్షన్‌ అయిన సంఖ్య) మంది విధులు నిర్వహించాల్సి ఉండగా.. కేవలం 17,342 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కాగా, హైకోర్టుల్లో 239 మంది న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన సిఫారసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్టు కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్‌ వెల్లడించారు. దీంతో మొత్తంగా హైకోర్టు న్యాయమూర్తుల ఖాళీల సంఖ్య 421(40శాతం) రికార్డు స్థాయికి చేరింది. దేశంలోని 25 హైకోర్టుల్లో 239 న్యాయమూర్తుల నియామకాల కోసం హైకోర్టు కొలీజియం సిఫారసులు చేసిందనీ, ఈ సిఫారసులు ప్రస్తుతం సుప్రీంకోర్టు, కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి తెలిపారు. నిర్దేశించిన నియామక ప్రక్రియలోని వివిధ దశల్లో ఈ సిఫారసులు ఉన్నట్టు వివరించారు.

Courtesy Navatelangana..