ప్రధాని మోడీని జస్టిస్‌ అరుణ్‌మిశ్రా ప్రశంసలతో ముంచెత్తడంపై రిటైర్డ్‌ జడ్జిల విమర్శ
న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై అనుమానాలు రేకెత్తించే వ్యాఖ్యలొద్దంటూ హితవు

న్యూఢిల్లీ: శనివారం ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోడీని సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జి అరుణ్‌మిశ్రా ప్రశంసల్లో ముంచెత్తడాన్ని రిటైర్డ్‌ జడ్జిలు తప్పు పట్టారు. సిట్టింగ్‌ జడ్జి తీరు న్యాయవ్యవస్థ స్వతంత్రత పట్ల అనుమానాలకు తావిచ్చేలా ఉన్నదని వారు విమర్శించారు. ప్రధాని మోడీని బహుముఖ ప్రజ్ఞాశాలిగా, అంతర్జాతీయ దార్శనికత ఉన్న నేతగా జస్టిస్‌ అరుణ్‌మిశ్రా కొనియాడారు. ప్రాపంచికంగా ఆలోచిస్తూ స్థానికంగా వ్యవహరిస్తారంటూ ప్రశంసించారు. అంతర్జాతీయ సమాజం పట్ల ఎంతో బాధ్యతాయుతంగా, స్నేహశీలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రధాని మోడీని జస్టిస్‌ అరుణ్‌మిశ్రా అభినందించారు. సదస్సు ముగింపులో ఓట్‌ ఆఫ్‌ థ్యాంక్స్‌ చెబుతూ జస్టిస్‌ అరుణ్‌మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ఉన్నత న్యాయస్థానానికి చెందిన సిట్టింగ్‌ జడ్జి ఈ విధంగా మాట్లాడటం ఆమోదయోగ్యం కాదని ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, లా కమిషన్‌ మాజీ చైర్మెన్‌ ఎపి షా అన్నారు.

కార్యనిర్వాహక వ్యవస్థకు నేతృత్వం వహించే వ్యక్తిని సిట్టింగ్‌ జడ్జి ఇలా అభినందించడం తగదని షా అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై అనుమానాలు వ్యక్తమవుతాయని షా హితవు పలికారు. అటువంటి వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ పట్ల తప్పుడు సందేశాలిస్తాయని ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి ఆర్‌ఎస్‌ సోధి అన్నారు. ఉన్నత న్యాయస్థానాలు విచారించే పలు కేసుల్లో ప్రభుత్వాలు కూడా పార్టీలుగా ఉండటాన్ని జస్టిస్‌ సోధి గుర్తు చేశారు.

చట్టం ముందు పౌరులతోపాటు ప్రభుత్వం కూడా సమానమేనన్న భావన కలిగించాలని ఆయన హితవు పలికారు. ఉన్నత న్యాయస్థానం అనుసరించే సంప్రదాయాలకు జస్టిస్‌ మిశ్రా కూడా కట్టుబడి ఉండాలని జస్టిస్‌ సోధి సూచించారు. ప్రధానమంత్రిని ఈతీరున పొగడటం సిట్టింగ్‌ జడ్జికి తగదని సుప్రీంకోర్టు మాజీ జడ్జి పిబి సావంత్‌ విమర్శించారు. ఈ ఏడాది ఇదో మంచి జోక్‌ అంటూ జస్టిస్‌ సావంత్‌ చమత్కరించారు.

Courtesy Nava Telangana