వారి విధులకు పోలీసులు, భద్రతా బలగాల అడ్డంకి
కారణం లేకుండానే నిర్బంధాలు..జైళ్లకు
జమ్మూకాశ్మీర్‌లో దారుణ పరిస్థితులు

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లో సాధారణ ప్రజానీకం, నాయకులు మాత్రమే కాదు.. జర్నలిస్టులు సైతం అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. అక్కడి పరిస్థితులు ప్రపంచానికి తెలియజేసే జర్నలిస్టులపై జమ్మూకాశ్మీర్‌ పోలీసులు, అక్కడి భద్రతా బలగాలు అడుగడుగునా ఆటంకం కలిగిస్తున్నాయి. కేంద్రం, జమ్మూకాశ్మీర్‌ అధికార యంత్రాంగం ఆదేశాలతో రెచ్చిపోతున్నాయి. న్యూస్‌ కవరేజీ కోసం పాస్‌లు ఉన్నప్పటికీ.. కారణం లేకుండానే జర్నలిస్టులను నిర్బంధిస్తున్నారు. మరి కొందరిని జైళ్లలో పెడుతున్నారు. చివరకు లాఠీలు కూడా ఝుళిపించిన సందర్భాలూ ఉన్నాయి. జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టు సంఘాలు ఎప్పటికప్పుడు ఖండిస్తూ సర్కారు వైఖరిని తప్పుబడుతున్నాయి. కేంద్రం, రాష్ట్ర సర్కారు మాత్రం జర్నలిస్టులను ఇబ్బందులు పెడుతూ.. వారికి అవాంతరాలు కలిగిస్తున్నది. జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న దారుణమైన పరిస్థితులను బయటి ప్రపంచానికి తెలియనీయకుండా జాగ్రత్త పడుతున్నది.

ఈనెల 7న మొహర్రం సందర్భంగా శ్రీనగర్‌లోని రేనావారీ ప్రాంతంలో జరిగిన ర్యాలీని షాహిద్‌ ఖాన్‌అనే జర్నలిస్టు కవర్‌ చేశారు. అయితే ఈసందర్భంగా ఆ జర్నలిస్టులపై స్థానిక పోలీసులు విరుచుకుపడ్డారు. ‘ఇలాంటి కార్యక్రమాలను ఎందుకు చిత్రీకరిస్తున్నావు. నువ్వు నీ చర్యలతో అనేక సమస్యలను సృష్టిస్తున్నావు’ అని ఖాన్‌ను పోలీసుల బృందం తీవ్రంగా కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఖాన్‌ ఆస్పత్రి పాలయ్యాడు. ఆయనను మూడు వారాల విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు.

జమ్మూకాశ్మీర్‌లో సమాచార వ్యవస్థను కేంద్రం స్తంభింపచేయడంతో తాము ప్రస్తుతం ఎలాంటి కష్టకాలంలో ఉన్నామన్న విషయం జర్నలిస్టులకు అర్థమవుతున్నదని సీనియర్‌ జర్నలిస్టు ఎ. గనారు తెలిపారు. జర్నలిస్టులపై పోలీసుల వేధింపులు, ఒత్తిళ్లకు సంబంధించి గత కొన్ని రోజులుగా అనేక కేసులు తెరపైకి వస్తున్నాయని గనారు అన్నారు.

అంతర్జాతీయ జర్నలిస్టు షహానా భట్‌కు సైతం ఇదే పరిస్థితి భద్రతా బలగాల నుంచి ఎదురైంది. ఈనెల 5న శ్రీనగర్‌లోని ఎలారు బాఘ్ లో 11వ తరగతి విద్యార్థి అస్రర్‌ అహ్మద్‌ అంత్యక్రియలను ఆమె కవర్‌ చేసింది. అయితే ఈ సందర్భంగా భట్‌, ఆమె కెమెరామెన్‌ విధులకు పోలీసులు అడ్డుపడ్డారు. ‘ నా దగ్గర కర్ఫ్యూ పాస్‌ ఉన్నప్పటికీ పోలీసులు నన్ను అడ్డుకున్నారు. కెమెరాను ధ్వంసం చేస్తామని బెదిరించారు. పోలీసు సిబ్బంది మాతో అమర్యాదగా ప్రవర్తించింది. మా కెమెరాను చెక్‌ చేసిన అనంతరం ఏమీ లేదని నిర్దారించుకొని మమ్మల్ని అనుమతించారు’ అని అప్పటి ఘటనను భట్‌ వివరించారు. జమ్మూకాశ్మీర్‌లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న కష్టాలు అనేకమని, తమ విధులను స్వేచ్ఛగా నిర్వర్తించనీయకుండా పోలీసు బలగాలు అడ్డుపడుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను కాశ్మీర్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌(కేడబ్య్లూజేఏ) గతవారం ఖండించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుబడుతూ ఒక ప్రకటనను విడుదల చేశాయి.

ఇదే విధంగా మరో మహిళా జర్నలిస్టు రిఫాత్‌ మొహిదీన్‌పై కూడా పోలీసులు దూషణకు దిగారు. ఆమె విధులకు అడ్డుపడి అమర్యాదకర రీతిలో వ్యవహరించారు. కాగా, ఆర్టికల్‌ 370ను మోడీ సర్కారు రద్దు చేసిన అనంతరం జమ్మూకాశ్మీర్‌లో గత 44 రోజుల్లో ఇద్దరు జర్నలిస్టులను పోలీసులు నిర్బంధించారు. పుల్వామా జిల్లా ట్రాల్‌ పట్టణానికి చెందిన అహ్మద్‌ మాలిక్‌ అనే జర్నలిస్టును.. భద్రతా బలగాలు గతనెల 14న అర్ధరాత్రి సమయంలో ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లాయి. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించి రెండు రోజుల అనంతరం ఆయనను పోలీసులు విడుదల చేయడం గమనార్హం. అయితే మాలిక్‌ అరెస్టుపై పోలీసులు సమాచారాన్ని వెల్లడించలేకపోవడం గమనార్హం.

అలాగే గతవారం అనంత్‌నాగ్‌ జిల్లా నుంచి మరో జర్నలిస్టును భద్రత బలాగాలు తీసుకెళ్లి కుల్గాం జిల్లాలోని ఆర్మీ క్యాంపులో నిర్బంధించాయి. అయితే ఐదు రోజుల అనంతరం ఆయనను విడుదల చేశారని కేడబ్ల్యూజేఏ సీనియర్‌ సభ్యుడొకరు వెల్లడించడం గమనార్హం.

యశ్వంత్‌ సిన్హా అడ్డగింత
బీజేపీ మాజీ సీనియర్‌ నాయకులు యశ్వంత్‌ సిన్హాను శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో పోలీసులు, అధికారులు అడ్డుకున్నారు. అక్కడ ఆంక్షల నేపథ్యంలో అధికారులు ఆయనను అనుమతించలేదు. కొంత సమయం అనంతరం ఆయననను లాస్ట్‌ ఫ్లైట్‌లో ఢిల్లీకి తిప్పి పంపిచారు. రిటైర్డ్‌ ఎయిర్‌ మార్షల్‌ కపిల్‌ కాక్‌, సామాజిక కార్యకర్త సుశోభ భవేతో కలిసి బుధవారం మధ్యాహ్నం శ్రీనగర్‌ విమానాశ్రయానికి సిన్హా చేరుకున్నారు. అయితే సిన్హా రాక గురించి ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో విమానం దిగుతున్న ఆయనను చూసి ఎయిర్‌పోర్టు అధికారులు, పోలీసులు షాక్‌ అయ్యారు. ఆయనను శ్రీనగర్‌కు అనుమతించే విషయంలో ఎలాంటి స్పష్టతో లేకపోవడంతో వెంటనే ఆయనకు ఎస్కార్ట్‌ కల్పించి వీఐపీ లాంజ్‌కు తీసుకెళ్లారు. అయితే నగరంలో ఆంక్షలు ఉన్నాయనీ, అనుమతించడం కుదరదనీ, తిరిగి వెళ్లాల్సిందిగా అధికారులు సిన్హాకు వివరించారు. శ్రీనగర్‌లో ప్రవేశించడానికి తనను ఎలాగైనా అనుమతించాలనీ, తాను మాత్రం ఢిల్లీకి తిరిగి వెళ్లేది లేదని అధికారులతో సిన్హా వాదించారు. అయితే ఎట్టకేలకు అధికారులు మాత్రం ఆయనను చివరి ఫ్లైట్‌లో ఢిల్లీకి తిప్పి పంపించారు.

కూతురు, సోదరితో సమావేశం.. వార్తాపత్రికల పఠనం
నిర్బంధంలో ఫరూక్‌ అబ్దుల్లా తొలి రోజు
ప్రజా భద్రత చట్టం కింద నిర్బంధంలో ఉన్న జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా తొలి రోజు కుటుంబ సభ్యులతో గడిచిపోయింది. ఈ సందర్భంగా ఫరూక్‌తో ఆయన పెద్ద కూతురు సాఫియా, సోదరి సురయాలు సమావేశమై మాట్లాడారు. ఈ సందర్భంగా ఫరూక్‌ అబ్దుల్లా గార్డులు కూడా అక్కడే ఉన్నారు. అలాగే వార్తాపత్రికలను ఆయన తిరగేశారు. టీవీలో వచ్చే వార్తలను చూశారు. కాసేపు లాన్‌లో నడిచారని అధికారులు తెలిపారు. 

నా కూతురి పెండ్లి.. అల్లుడిని విడుదల చేయండి..
ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం అరెస్టయిన తన అల్లుడిని విడుదల చేయాలంటూ అధికారులకు విన్నవించడం కోసం ఓ వ్యక్తి తన చివరి ప్రయత్నంగా శ్రీనగర్‌లోని వార్తాపత్రికలను ఆశ్రయించారు. బారా ముల్లా జిల్లాకు రఫియాబాద్‌కు చెందిన నజీర్‌ అహ్మద్‌ భట్‌ ప్రభుత్వ ఉద్యోగి. తన కూతురిని అదే జిల్లా మక్బూల్‌ ఆబాద్‌ గ్రామసర్పంచ్‌, వ్యాపారవేత్త తన్వీర్‌ అహ్మద్‌కు ఇచ్చి సెప్టెంబర్‌ 8న వివాహం చేయడానికి నిశ్చయించారు. ఇందుకు ఇస్లాం మతం పద్దతి ప్రకారం.. పెండ్లికి సంబంధించిన సంతకాల పత్రాలను కూడా సిద్ధం చేశారు. అయితే ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం తన్వీర్‌ను భద్రతా బలగాలు అరెస్టు చేసి లక్నో జైలుకు తరలించాయి. దీంతో తన్వీర్‌ విడుదల కోరుతూ అహ్మద్‌.. అధికారులును ఎంత వేడుకొన్నా ఫలితం దక్కలేదు. దీంతో చివరి ప్రయత్నంగా శ్రీనగర్‌లోని వార్తా పత్రికల కార్యాలయాలను ఆశ్రయించి తద్వారా తన విజ్ఞాపనను వెల్లడించాలని నిర్ణయించుకున్నారు.

(Courtesy Nava Telangana)