రూ. 25 లక్షలు చెల్లించాలని వంగపల్లి డిమాండ్‌

ఉస్మానియా యూనివర్సిటీ :పీహెచ్‌డీ చేసినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. దీంతో తీవ్ర మనస్తాపం చెంది ఓయూలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా పాలడుగుకు చెందిన కొంపల్లి నరసయ్య(44) గతేడాది జాగ్రఫీలో పీహెచ్‌డీ పూర్తి చేశాడు. ప్రభుత్వ, జాగ్రఫీ విభాగంలో పార్ట్‌టైమ్‌ ఫ్యాకల్టీ జాబ్‌కు తీవ్రంగా యత్నించాడు.

వయసు మీరడం, ఉద్యోగం రాకపోవడంతో ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని గాంఽధీ ఆస్పత్రికి తరలిస్తుండగా విద్యార్థి సంఘాల నాయకులు, కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ ప్రతిఘటించారు. నరసయ్య కుటుంబానికి వర్సిటీ తరఫున రూ.25 వేలు అందజేస్తామని, రూ.2 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా వచ్చేలా చూస్తామని రిజిస్ట్రార్‌ గోపాల్‌రెడ్డి చెప్పారు.

నరసయ్య కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలని టీఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌, జాతీయాధ్యక్షుడు మేడిపాపయ్య మాదిగ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఓయూలో విద్యార్థి నిరుద్యోగ ఫ్రంట్‌ చైర్మన్‌ దయాకర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు.

Courtesy Andhrajyothi