తెలంగాణలో నిరుద్యోగులకు తప్పని నిరీక్షణ 
నిబంధనల రూపకల్పనలో జాప్యంతో నిలిచిన సర్కారీ కొలువుల ప్రకటనలు 
ఏడాదవుతున్నా వెలువడని గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ 
టీఎస్‌పీఎస్సీ పరిధిలోనే నిలిచిపోయిన 1,949 పోస్టులు

రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న గ్రూప్‌-1, 2 తదితర ఉద్యోగ ప్రకటనలు నిలిచిపోయాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పోస్టుల విభజన, సర్వీసు నిబంధనలు రూపొందించడంలో జాప్యంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఏడాది నుంచి ఈ విషయమై కసరత్తు చేస్తున్నప్పటికీ స్పష్టత రాలేదు. తెలంగాణ తొలి గ్రూప్‌-1 ప్రకటనను గత ఏడాది జూన్‌లోనే వెలువరించాలని భావించినా, జోన్ల విభజన సాంకేతిక సమస్యలతో ఆగిపోయింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పోస్టుల విభజనతో ముడిపడి దాదాపు 1,949 పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు ఆగిపోయాయి. గ్రూప్‌-1 ప్రకటనలో డిప్యూట కలెక్టర్లు, డీఎస్పీలు, సీటీవో, మున్సిపల్‌ కమిషనర్లు, సంక్షేమ అధికారులు, జిల్లా, డిప్యూటీ రిజిస్ట్రార్లు తదితర పోస్టులు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా డీఎస్పీ-42, ిప్యూటీ కలెక్టర్‌ -8, సీటీవో-19 పోస్టులు ఉన్నాయి.

ప్రధానకారణమిక్కడే..
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం గుర్తించిన పోస్టులను జిల్లా, జోన్లు, మల్టీ జోన్ల వారీగా పునర్విభజించాలి. ఈ ప్రక్రియ వెంటనే చేపట్టి, ఆ మేరకు సవరణ ప్రతిపాదనలు పంపించాలంటూ 1,949 పోస్టులను టీఎస్‌పీఎస్సీ వెనక్కి పంపించింది. సవరణ ప్రతిపాదనల కోసం టీఎస్‌పీఎస్సీ పలుమార్లు విభాగాధిపతులతోనూ సమావేశం నిర్వహించి, ప్రక్రియ వేగవంతం చేయాలంటూ లేఖలు రాస్తోంది. మరోవైపు నూతన ఉత్తర్వుల ప్రకారం పోస్టుల విభజన, రోస్టర్‌, ఖాళీ పోస్టుల గుర్తింపుపై సాధారణ పరిపాలన విభాగం కసరత్తు ప్రారంభించింది. విభాగాల వారీగా జిల్లా, జోన్లు, మల్టీజోన్ల వారీగా పోస్టుల పునర్విభజన చేయాలని సూచించింది. ఈమేరకు కొన్ని విభాగాలు ప్రతిపాదనలు పంపించినా, మిగతా విభాగాలు పంపించకపోవడంతో ఈ ప్రక్రియ కొలిక్కి రాలేదు. ఇప్పటికే పంపించిన పలు  విభాగాల్లోని పోస్టుల కేటగిరీలు మారిపోయాయి. గతంలో జిల్లా పోస్టులు జోనల్‌ పోస్టులుగా, జోనల్‌ పోస్టులు మల్టీజోనల్‌గా మార్పు చేశాయి.

రోస్టర్‌ లెక్కింపు ఎలా…?
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పోస్టుల విభజనపై రోస్టర్‌ను ఎలా లెక్కించాలన్న విషయమై కొన్ని ప్రభుత్వ విభాగాల్లో స్పష్టత రాలేదు. కొత్త జోన్ల ప్రకారం పోస్టుల విభజన, రోస్టర్‌, ఖాళీ పోస్టుల గుర్తింపుపై ఇప్పటికే సాధారణ పరిపాలనశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ విభాగాధిపతులతో సమావేశాలు జరుపుతోంది. ఉద్యోగులకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఆయా శాఖల నుంచి తీసుకుంటోంది. ఇప్పటికే మంజూరు చేసిన పోస్టులను నూతన జోన్లు, మల్టీజోన్ల ప్రకారం కేటాయించాల్సి వచ్చినప్పుడు రోస్టర్‌ పాయింటు లెక్కింపు కొత్తగా చేపట్టాలా? పాత రోస్టర్‌ పాయింటు ప్రకారం ముందుకు వెళ్లాలా విషయమై నిబంధనలు పరిశీలిస్తోంది. కొత్త రోస్టర్‌ను తీసుకుంటే ఇప్పటికే నోటిఫై చేసిన పోస్టులను రద్దుచేయాలా? రోస్టర్‌ ప్రకారం ఆయా పోస్టుల రిజర్వేషన్‌ కేటగిరీ మార్చాలా? విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

స్పష్టత రావలసిన అంశాలు
* గతంలో ఒకే మల్టీజోన్‌ ఉండేది. ఇప్పుడు రెండుగా విభజించడంతో ఆయా పోస్టుల్ని రెండు జోన్లకు  కేటాయించాలి.
* తెలంగాణలో ఆరు జోన్లు చేసినందున, ఆ మేరకు రెండుజోన్ల పోస్టులను సర్దుబాటు చేయాలి.
* రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినప్పుడు 31 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు 33కు పెరిగినందున  ఏ జోన్‌ పరిధిలోకి వస్తాయో  తెలియాలి.
* కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత.. పూర్వజిల్లాల సిబ్బందిని ఆర్డర్‌టు సర్వ్‌ కింద పనిచేయాలని ఆదేశాలిచ్చారు. వీరిని శాశ్వతంగా సర్దుబాటు చేయాలి.

Courtesy eenadu