• జేఎన్‌యూ వీసీకి బీజేపీ పెద్దల అండ
  • హెచ్‌ఆర్డీ మంత్రిత్వ శాఖంటే లెక్కలేదు
  • ఆయన వల్లే రెడ్డి సుబ్రహ్మణం బదిలీ?

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జేఎన్‌యూ పరిణామాలతో.. ఆ వర్సిటీ వీసీ ఎం.జగదీశ్‌ కుమార్‌ నేపథ్యం ఏమిటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇటీవలి ఘటనలను బట్టి ఆయన వెనుక ఏదో బలీయ శక్తి ఉందనే ప్రచారం జరుగుతోంది. నల్లగొండ జిల్లా మామిడాలలో పుట్టిన జగదీశ్‌ కుమార్‌ సరిగ్గా నాలుగేళ్ల క్రితం జేఎన్‌యూ వీసీగా నియమితులయ్యారు. దీనిని నాటి మానవ వనరుల మంత్రి స్మృతీ ఇరానీ వ్యతిరేకించినా రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్‌ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. కొందరు వర్సిటీ విద్యార్థులు దేశ ద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ వీసీగా జగదీశ్‌ను పంపడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది ఎవరన్నది చర్చనీయాంశంగానే ఉంది. అయితే, తర్వాతి పరిణామాలను గమనిస్తే జగదీశ్‌ కొరకరాని కొయ్య లాంటి వ్యక్తి అని తెలుస్తోంది. ఆయనతో విభేదించిన కేంద్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం ఏ కారణం లేకుండానే హఠాత్తుగా బదిలీ కావడమే దీనికి నిదర్శనం.

రెండున్నర నెలల క్రితం జేఎన్‌యూలో హాస్టల్‌ చార్జీల పెంపు తదితర అంశాలపై విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఉన్నత విద్యా శాఖ జోక్యంతో ఇది డిసెంబరులో సద్దుమణిగింది. అనంతరం మానవ వనరుల శాఖ పంపిన కమిటీ డిసెంబరు 10, 12 తేదీల మధ్య అధికారులు, విద్యార్థులతో మాట్లాడి రాజీ ఫార్ములా రూపొందించింది. ఆ సమయంలోనూ వీసీ హోదాలో జగదీశ్‌ ఏ సమావేశానికీ హాజరు కాలేదు. ఇదే సందర్భంలో డా.జగదీశ్‌కు, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యంకు విభేదాలు వచ్చాయి. ఈక్రమంలో రెడ్డి సుబ్రహ్మణ్యంనే కేంద్రం బదిలీ చేయడంతో రాజీఫార్ములా అమల్లోకి రాలేదు. ప్రస్తుత ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్‌ ఖరే నిర్వహించిన సమావేశానికీ జగదీశ్‌ గైర్హాజరయ్యారు.

(Courtesy Andhrajyothi)