– ఢిల్లీలో జేఎన్‌యూ విద్యార్థుల భారీ ర్యాలీ
– దేశ, విదేశీ వర్సిటీల బాసట
– లండన్‌లో భారత కార్యాలయం ఎదుట 12 గంటలు నిరసన
– 377 మంది అంతర్జాతీయ ఉన్నత విద్యావేత్తల బాసట
– ఆయనకు ఆ పదవిలో కొనసాగే హక్కు లేదు : బీజేపీ సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి

దాడులకు తలవంచేది లేదని జేఎన్‌యూ విద్యార్థి లోకం నినదిస్తున్నది. ప్రజాస్వామ్య విలువల విషయంలో జేఎన్‌యూ సంప్రదాయాలను కాపాడుకునేందుకు నడుంకట్టింది. వర్సిటీ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా తమపై జరిగిన దాడికి బాధ్యత వహిస్తూ వీసీ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ.. ఢిల్లీలోని మండి హౌస్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌ దాకా ర్యాలీ తీశారు. వారికి దేశ, విదేశాలకు చెందిన వర్సిటీల విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు అండగా నిలుస్తున్నారు. లండన్‌లోని భారత కార్యాలయం ఎదుట సుమారు 12 గంటల పాటు విద్యార్థులు నిరసన చేపట్టారు. ఇంకోవైపు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ వర్సిటీలలో పనిచేస్తున్న 300 మంది విద్యావేత్తలు.. జేఎన్‌యూకు బాసటగా నిలిచారు. ముసుగు మూకల దాడిని తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనీ, వీసీని తొలగించాలనే డిమాండ్లతో కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమవడంతో విద్యార్థులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లే మార్గంలో పోలీసులు విద్యార్థులను అడ్డుకుని లాఠీచార్జి చేసినా.. నిరసనలను ఆపలేదు. తమ హక్కులను సాధించుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గేది లేదని ముక్తకంఠంతో నినదిస్తున్నారు.

జేఎన్‌యూ విద్యార్థులను అత్యంత పాశవికంగా కొట్టిన ఏబీవీపీ కార్యకర్తలపై వీసీ ఇప్పటివరకు ఎందుకు కేసు(ఎఫ్‌ఐఆర్‌) నమోదు చేయించలేదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. దాడి చేసిన మూకపై వీసీకి ఎందుకు ప్రేమ ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. జేఎన్‌యూలో లెఫ్ట్‌ తదితర విద్యార్థులపై జరిగిన దాడిలో వీసీ కూడా పరోక్షంగా కుట్రదారుడేనని ఆయన అన్నారు.. జేఎన్‌యూలో ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడికి నిరసనగా ఆ వర్సిటీ విద్యార్థులు గురువారం ఢిల్లీలోని మండిహౌస్‌ నుంచి ఎంహెచ్‌ఆర్‌డీ ముట్టడికి భారీ ర్యాలీ నిర్వహించారు. వర్సిటీ నుంచి విద్యార్థులు కాలినడకన ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, పోలీసులు ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పడంతో విద్యార్థులు ఇతర వాహనాల ద్వారా మండిహౌస్‌ చేరుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సీపీఐ(ఎం), సీపీఐ, ఆర్జేడీ, ఆప్‌, డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీలు…. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ, ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐడీఎస్‌ఓ, ఎన్‌ఎస్‌ యూఎస్‌ఐ తదితర విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా వీసీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీసీ జగదీశ్‌కుమార్‌ డౌన్‌ డౌన్‌ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ఏచూరి మీడియాతో మాట్లాడారు. మూడు గంటల పాటు విద్యార్థులను ముసుగు వేసుకున్న దుండగులు చావబాదుతుంటే వీసీ ఏం చేశారని ప్రశ్నించారు. పోలీసులు గేట్‌ బయటే ఉన్నా… వారిని లోనికి ఎందుకు అనుమతించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వీసీని ప్రభుత్వం తక్షణమే తొలగించాలన్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి దొరస్వామి రాజా మాట్లాడుతూ… ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, జేఎన్‌ వర్సిటీ ఫీజుల పెంపుపై పోరాడుతున్న విద్యార్థులను తుక్డే తుక్డే గ్యాంగ్‌ అంటూ సంభోధించడం సరికాదన్నారు. అసలు ఈ దేశంలో తుక్డే గ్యాంగ్‌ ఏదైనా ఉందంటే మోడీ – షాలేనని ఆయన అభివర్ణించారు. జేఎన్‌యూ విద్యార్థులు ప్రజాస్వామ్యయుతంగా తమ హక్కుల కోసం పోరాడుతున్నారని అన్నారు. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌కారత్‌ మాట్లాడుతూ… జేఎన్‌యూలో బీజేపీ దాని అనుబంధం శక్తులు యుద్ధ వాతావరణం సృష్టించేందుకు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ కుమార్‌ ఝా మాట్లాడుతూ… జేఎన్‌ యూ విద్యార్థులపై వీసీ పథకం ప్రకారమే దాడి చేయించారని అన్నారు. ఎల్‌జేపీ అధినేత శరద్‌ యాదవ్‌ మాట్లాడుతూ… జేఎన్‌యూ విద్యార్థుల పోరాటానికి యావత్‌ దేశం మద్దతు ఉందని చెప్పారు. ఈ ర్యాలీలో ఇంకా సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌, నిలోత్పల్‌ బసు, సీపీఐ ఎంపీ బినరు విశ్వం, ఆప్‌ నేత సంజరు సింగ్‌, జేఎన్‌యూఎస్‌యూ మాజీ విద్యార్థి సంఘం నేతలు కన్నయ్య కుమార్‌, ఎన్‌ సాయి బాలాజీ, ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మయూక్‌ బిశ్వాస్‌ పాల్గొన్నారు.

హెచ్‌ఆర్‌డీ వాదన సంతృప్తికరంగా లేదు : అయిషీ ఘోష్‌
ర్యాలీ జరుగుతున్న సమయంలోనే ఎంహెచ్‌ఆర్‌డీ జేఎన్‌యూ ఎస్‌యూ విద్యార్థి సంఘం నేతలను చర్చలకు ఆహ్వానించింది. అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌, ఉపాధ్యక్షులు సాకేత్‌ మూన్‌లతో కూడిన ఎనిమిది మంది విద్యార్థుల బృందం చర్చలకు హాజరైంది. హెచ్‌ఆర్‌డీ అధికారులు వీసీని తొలగించడంపై ఎటువంటి హామీ ఇవ్వలేదని సమావేశం తర్వాత అయిషీ ఘోష్‌ మీడియాకు తెలిపారు. ఫీజులపై కూడా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని అన్నారు. తమ రెండు కీలక డిమాండ్లపై స్పష్టత ఇవ్వకపోతే చర్చలకు హాజరై ఏమి లాభమని ప్రశ్నించారు. తమను కొట్టేందుకు ఉపయోగించిన ప్రతి రాడ్డు దెబ్బకు భావజాల చర్చతోనే తాము ఈ దేశ ప్రజానీకానికి సమాధానం చెబుతామన్నారు. నిరంకుశానికి ప్రజాస్వామ్యమే అసలు సిసలైన సమాధానమని అన్నారు.

రాష్ట్ర్రపతి భవన్‌ ముట్టడికి విద్యార్థుల యత్నం
జేఎన్‌యూ వీసీ తొలగింపు… ఫీజుల తగ్గింపు కోసం జరిగిన ర్యాలీ తర్వాత పలువురు విద్యార్థులు రాష్ట్రపతి భవన్‌ ముట్టడికి యత్నించారు. ప్రెసిడెంట్‌ భవన్‌ దగ్గరిలో గల విజరు చౌక్‌ వద్దకు చేరుకున్న విద్యార్థులు రాష్ట్రపతి భవన్‌ దిశగా దూసుకెళ్ళేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డగించారు. అటు వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న విద్యార్థులను స్థానిక పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీసు స్టేషన్‌కి తరలించారు.

జేఎన్‌యూ దాడి వెనుక హౌం, హెచ్చార్డీ : కాంగ్రెస్‌ నాయకులు జైరాం రమేష్‌
జవహర్‌లాల్‌ నెహ్రూ యూనిర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థులు, ఉపాధ్యాయులపై జరిగిన హింస వెనుక కేంద్ర హౌం, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ (హెచ్చార్డీ) శాఖల హస్తం ఉన్నదని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జైరాం రమేష్‌ ఆరోపించారు. ఇది వారి ఆధిపత్య లబ్ధికోసం చేయించిన ‘అధికారిక గూండాయిజం’గా పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. ‘జేఎన్‌యూ ఘటన జరిగి 72 గంటలు గడిచింది. ఇది అకస్మికంగా జరిగినది కాదు. ప్రణాళికా ప్రకారం దాడికి తెగబడ్డారు. దీని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. దీంట్లో కేంద్ర హౌం, హెచ్చార్డీ శాఖల హస్తం ఉన్నది. ఇది అధికా రిక ప్రయోజిత గూండాయిజం’ అంటూ ట్వీట్‌ చేశా రు. అలాగే, పదవికి రాజీనామా చేయడానికి జేఎన్‌ యూ వీసీపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్నారు.

(Courtesy Nava Telangana)