న్యూసర్వర్‌రూంలో బయోమెట్రిక్‌, సీసీటీవీలు ఎవరూ పాడుచేయలేదు
జేఎన్‌యూలో ఘటనపై ఆర్టీఐ సమాధానంలో వెల్లడి

ఢిల్లీ : జేఎన్‌యూ పరిపాలనా యంత్రాంగం అబద్ధాలాడుతున్నదా? ఈ నెల మొదటివారంలో కళాశాలలోని సర్వర్‌రూంలో బయోమెట్రిక్‌ సిస్టమ్స్‌, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారంటూ ప్రత్యేకంగా లెఫ్ట్‌ విద్యార్థులపై పాలనాయం త్రాంగం చేసిన ఆరోపణల్లో నిజమెంత? వర్సిటీలోని జేఎన్‌యూఎస్‌యూ నేత అయిషీ ఘోష్‌ సహా ఇతర లెఫ్ట్‌ విద్యార్థులు, అధ్యాపకులపై దాడి ఘటనకు ఒక రోజు ముందు జరిగిన ఈ ఘటనపై వర్సిటీ చెబుతున్న దాంట్లో వాస్తవం ఏమిటి? పరిపాలనా యంత్రాంగం చేసిన తన వాదనకు విరుద్ధంగా సర్వర్‌ గదిలోని బయోమెట్రిక్‌ సిస్టమ్స్‌, సీసీటీవీ కెమెరాలు జనవరి మొదటి వారంలో ఎలాంటి విధ్వంసానికి గురికాలేదని ఆర్టీఐ ప్రశ్నకు జేఎన్‌యూ స్వయంగా సమాధానం ఇచ్చింది. ‘జేఎన్‌యూ ప్రధాన సర్వీర్‌ సెంటర్‌ ఫర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (సీఐఎస్‌) ఈ నెల 3న కొద్దిసేపు పనిచేయలేదు. అలాగే మరుసటి రోజు అంటే 4వ తేదీన ‘విద్యుత్‌ సరఫరా అంతరాయం కారణంగా’ షట్‌డౌన్‌ అయ్యింది’ అని నేషనల్‌ క్యాంపెయిన్‌ ఫర్‌ పీపుల్స్‌ రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ (ఎన్‌సీపీఆర్‌ఐ) సభ్యుడు సౌరవ్‌ దాస్‌ దాఖలు చేసిన ప్రశ్నకు జేఎన్‌యూ సమాధానం ఇచ్చింది. ‘2019 డిసెంబరు 30 నుంచి 2020 జనవరి 8 వరకూ ఏ ఒక్క సీసీటీవీకానీ, బయోమెట్రిక్‌ సిస్టమ్‌ కానీ విధ్వంసానికి గురికాలేదు’ అని ఆర్టీఐ సమాధానంలో స్పష్టంచేసింది.

సీఐఎస్‌ ఆఫీసు గదికీ.. సీసీటీవీ కెమెరాల సర్వర్‌కు సంబంధంలేదు…
సీఐఎస్‌ ఆఫీసు గదికీ.. క్యాంపస్‌లో వున్న మొత్తం సీసీటీవీ కెమెరాల సర్వర్‌కు ఎలాంటి సంబంధంలేదని కూడా స్పష్టమైంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కూడా సౌరవ్‌ దాస్‌ కోరగా.. సీసీటీవీ కెమెరాల సర్వర్లు డేటా సెంటర్‌లో వున్నాయనీ, సీఐఎస్‌ ఆఫీసులో కాదని జేఎన్‌యూ పాలనా యంత్రాంగం తెలిపింది. భద్రతా కారణాల రీత్యా ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలున్నాయన్న సమాచారాన్ని మాత్రం అందించలేమని ఆర్టీఐకి సమాధానం ఇచ్చింది. 2019 డిసెంబరు 25 నుంచి 2020 జనవరి 8 వరకూ సాంకేతిక సమస్యలతో జేఎన్‌యూ వెబ్‌సైట్‌ ఎన్నిసార్లు పనిచేయకుండా పోయిందని కూడా సౌరవ్‌ ప్రశ్నించారు. ‘ఇందుకు ప్రత్యామ్నాం ఉన్నది. క్లిష్టమైన సమయాల్లో ప్రత్యామ్నాయ బ్యాకప్‌ నుంచి వెబ్‌సైట్‌ పనిచేస్తుంది’ అని వర్సిటీ తన సమాధానంలో పేర్కొంది.

ఎఫ్‌ఐఆర్‌లో చెప్పిందేమిటి?
జనవరి 3న ముసుగులు ధరించిన విద్యార్థుల బృందం బలవంతంగా సీఐఎస్‌లోకి చొరబడి… విద్యుత్‌ సరఫరాను ఆపివేశారనీ, సర్వర్‌ పనిచేయకుండా చేశారనీ, అందువల్ల సీసీటీవీ, బయోమెట్రిక్‌ హాజరు ఇంటర్నెట్‌ సహా పనిచేయకుండా పోయాయనీ జేఎఎన్‌యూ పాలనా యంత్రాంగం ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

ముందస్తు ప్రణాళి ప్రకారం జరిగిన హింసాత్మకదాడి : అయిషీ ఘోష్‌
ముందస్తు ప్రణాళికతో ప్రకారమే హింసాత్మక దాడికి పాల్పడినట్టు మరోసారి రుజువైందని జేఎన్‌యూఎస్‌యూ నేత అయిషీఘోష్‌ అన్నారు. కుట్రలో భాగంగానే దాడికి ముందు సబర్మతి హాస్టల్‌ వద్ద లైట్లును కూడా ఆపివేశారని ఆమె ఆరోపించారు. ‘జనవరి 5న జరిగిన దాని నుంచి దృష్టిని మరల్చేందుకు ఉద్దేశపూర్వకంగానే వీసీ తప్పుడు ఆరోపణలు చేశారు. ముందురోజు స్కూల్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ సమీపంలో ఘర్షణకు సంబందించి ఏబీవీపీ ప్రమేయంపై కూడా వీడియో ఆధారాలు లేవు. అడ్మినిస్ట్రేషన్‌ ప్రక్రియపై కూడా వర్సిటీ అబద్ధాలాడుతున్నది. జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్‌ స్వచ్ఛందంగా బహిష్కరించబడింది. మొత్తం ఘటనను వీసీ వక్రీకరిస్తున్నారు. అందుకే వీసీ తక్షణమే రాజీనామా చేయాలని మేం డిమాండ్‌ చేస్తున్నాం’ అని అయిషీ ఘోష్‌ అన్నారు.

ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదైన జేఎన్‌యూఎస్‌యూ వైస్‌ ప్రెసిడెంట్‌ సాకేత్‌ మూన్‌ మాట్లాడుతూ ‘ఆర్టీఐ సమాధానంతో నేనేమీ ఆశ్చర్యానికి గురికాలేదు. నిజమే.. అది మా వైఖరిని మరోసారి ధ్రువీకరించింది. నిజమే, బయో మెట్రిక్‌, సర్వర్‌ రూమ్‌ విధ్వంసానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్‌ చేస్తున్న వాదనకు ఎలాంటి ఆధారం లేదు. విధ్వంసం కారణంగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లూ అందుబాటులో లేవని చెప్పటం కూడా అబద్దం. ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన మేరకు అన్ని ఫుటేజ్‌లను అప్పగించాల్సిన బాధ్యత జేఎన్‌యూ పరిపాలనా యంత్రాంగంపై ఉన్నది.

‘మాపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి. 5న ముసుగు గూండాలు జరిపిన దాడిని కప్పిపెట్టేందుకే వీసీ మొత్తం కథానాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తుట్టు ఆర్టీఐ స్పష్టంచేసింది. అని ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదైన అపేక్షా ప్రియదర్శిని అన్నారు.

(Courtesy Nava Telangana)