– విశ్వభారతి వర్సిటీలో ముసుగు గూండాల దాడి
– ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు

కోల్‌కతా : జేఎన్‌యూ ఘటన పునరావృతమైంది. పశ్చిమ బెంగాల్‌లోని విశ్వ భారతి విశ్వవిద్యాలయంలో ముసుగు గూండాలు రెచ్చిపోయారు. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు ఒకరు ఉండటం గమనార్హం. బుధవారం సాయంత్రం ముసుగులు ధరించిన కొందరు విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చారనీ, వారంతా ఏబీవీపీకి చెందినవారేనని వర్సిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా, అక్కడ కూడా దాడికి ప్రయత్నించినట్టు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబందించి శాంతినికేతన్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. గత కొన్ని రోజులుగా ఏబీవీపీ సభ్యులు వైస్‌ చాన్సెలర్‌తో కలిసి క్యాంపస్‌లోకి వస్తున్నారనీ.. ఆయన అనుమతితోనే ఈ ఘటన జరిగినట్టు విద్యార్థులు చెబుతు న్నారు. 15న సాయంత్రం విద్యాభవన్‌ బాలుర హాస్టల్‌లోకి ప్రవేశించి విద్యార్థులను బెదిరించటం మొదలుపెట్టారు. ఈ నెల 8న బీజేపీ నేత స్వపన్‌ దాస్‌ గుప్తాను కళాశాలలో ఘెరావ్‌ చేసింది ఎవరంటూ ప్రశ్నిస్తూ
హెచ్చరికలుచేశారనీ, ఆ తర్వాత.. అర్థశాస్త్రం విభాగం ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు స్వప్నానిల్‌ ముఖరీ, మరోవిద్యార్థి దేవబ్రతనాథ్‌ను ఎత్తుకొని వీసీ బంగ్లావైపు తీసుకెళ్ళారు. ముసుగులు వేసుకున్న మరికొంతమంది మూకలు అక్కడకుచేరుకుని వారిద్దరినీ లాఠీలు, ఇనుపరాడ్లతో తీవ్రంగా కొట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న విశ్వవిద్యాలయ భద్రతాధికారి తాను ఏమీ చేయలేనంటూ వెళ్ళిపోయారు. కాగా, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులే తమపై దాడిచేశారంటూ ఏబీవీపీ ఆరోపించటం కొసమెరుపు.