– దాడి చేసిన పోలీసులపై చర్యలకు డిమాండ్‌

న్యూఢిల్లీ బ్యూరో
జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో అంధ విద్యార్థులపై లాఠీచార్జీ చేసి చావబాదిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం స్టూడెంట్‌ యూనియన్ల ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. దాడికి క్షమాపణ చెప్పాలి… డౌన్‌ డౌన్‌ ఢిల్లీ పోలీస్‌ అంటూ ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. ధర్నాలో భాగంగా ఢిల్లీ పోలీసులు వికలాంగవిద్యార్థులపై తీవ్రంగా దాడి చేశారని జేఎన్‌యూఎస్‌యూ కౌన్సిలర్‌ శశిభూషన్‌ పాండ్య చెప్పారు. అందుకు నిరసనగా తాము పార్లమెంట్‌స్ట్రీట్‌లో ర్యాలీ తీసి ఆందోళన నిర్వహించామన్నారు. వికలాంగులని కూడా చూడకుండా పోలీసులు అమానవీయంగా కొట్టారని తెలిపారు.
తమపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దాంతోపాటు ఢిల్లీ పోలీసు కమిషనర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. యాజమాన్యం పెంచిన ఫీజులపై తాము పోరాడుతున్నామని… అటువంటి తమపై దాడి చేయడం హేయనీయమని శశిభూషన్‌ పేర్కొన్నారు. నిరసన తెలపడం తమకి ప్రజాస్వామ్య హక్కు అంటూ నినాదించారు. ఢిల్లీ పోలీసులు స్పందించేవరకు ఈ అంశంపై పోరాడుతామని చెప్పారు.

Courtesy Navatelangana..