– ఘటనపై వాస్తవాలు బయటపెట్టండి :
నోబెల్‌ గ్రహీత అభిజిత్‌ బెనర్జీ

న్యూఢిల్లీ : జేఎన్‌యూలో చోటుచేసుకున్న ఘటనలపై వాస్తవాల్ని బయటపెట్టాలని మోడీ ప్రభుత్వాన్ని నోబెల్‌ గ్రహీత అభిజిత్‌ బెనర్జీ డిమాండ్‌ చేశారు. ఇండియా పరువుప్రతిష్టల గురించి ఆలోచించే దేశ పౌరులను ఆదివారంనాటి జేఎన్‌యూ దాడి ఘటన ఆందోళనకు గురిచేస్తున్నదని ఆయన అన్నారు. జర్మనీలో ఒకప్పుడు ఇలాంటి వాతావరణం, ఘటనలు చోటుచేసుకున్నాయనీ, దాంతో ఆ దేశం నాజీల పాలనలోకి వెళ్లిపోయిందనీ ఆయన గుర్తుచేశారు. జేఎన్‌యూ విద్యార్థులపై దాడి ఘటనను ఖండిస్తూ పలు న్యూస్‌ వెబ్‌పోర్టల్స్‌కు తన స్పందనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే…”విద్యార్థులపై దాడికి సంబంధించి నిజానిజాలు బయటకురావాలి. ఆరోపణలకు ప్రతి ఆరోపణ సమాధానం కాదు. ఈ గందరగోళంతో విద్యార్థుల గొంతును అణచివేసే అవకాశం కల్పించరాదు. గాయపడ్డవారి గురించి నేను తీవ్రంగా ఆందోళన చెందుతున్నా. హాస్టల్‌ ఫీజు పెంపునకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల ఆందోళన హింసకు దారితీసిందని వర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ చెప్పటం దారుణ”మని అన్నారు.

దాడి ఘటనపై నివేదిక ఇవ్వండి : హెచ్చార్డీ
జేఎన్‌యూ క్యాంపస్‌లో నెలకొన్న పరిస్థితులపై వెంటనే నివేదిక ఇవ్వాలని వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రమోద్‌ కుమార్‌ను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ (హెచ్చార్డీ) ఆదేశించింది. వర్సిటీ క్యాంపస్‌లో ప్రశాంత వాతావరణం నెలకొల్పటంపై ఢిల్లీ పోలీసులు, వైస్‌ఛాన్స్‌లర్‌తో మాట్లాడమని హెచ్చార్డీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

(Courtesy Nava Telangana)