న్యూఢిల్లీ : మోడీ సర్కార్‌ హయాంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తీరు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పలు రాష్ట్రాల్లో సీబీఐ సాధారణ విచారణ అధికారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రద్దుచేస్తున్నాయి. తాజాగా జార్ఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీబీఐ సాధారణ విచారణ అధికారాన్ని రద్దు చేస్తూ తీర్మానం చేసింది. కొద్ది రోజుల క్రితం కేరళ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నది. ఈ విధమైన నిర్ణయాలు తీసుకున్న రాష్ట్రాల్లో సీబీఐ ఏదైనా కేసు విచారణ చేపట్టాలంటే అక్కడి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ ఐదు రాష్ట్రాలు ( మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, కేరళ) సీబీఐ సాధారణ విచారణను రద్దు చేయగా, ఈ జాబితాలో తాజాగా జార్ఖండ్‌ చేరటం గమనార్హం. ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌, 1946 ద్వారా సీబీఐకు పలు అధికారాలు కల్పించబడ్డాయి. చట్టంలో పేర్కొన్న జాబితాలోని నేరాలపై విచారణ చేపట్టడానికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం సీబీఐకి లేదు. అయితే సాధారణ అనుమతి రద్దు అయిన రాష్ట్రాల్లో మాత్రం ఇక నుంచీ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తేనే విచారణ చేపట్టే పరిస్థితి ఉంటుంది.

Courtesy Nava Telangana