– విజయవంతానికి కార్మికుల సమాయత్తం
– 220కి పైగా సంఘాల భాగస్వామ్యం
– 20 కోట్ల మంది రోడ్ల మీదకు
– దేశ చరిత్రలో మైలు రాయిగా నిలవనున్న ‘జనవరి 8’

పివి హాయాంలో మొదలైన సరళీకృత ఆర్థిక విధానాల విస్తృతి మోడీ పాలనకొచ్చేసరికి పతాక స్థాయికి చేరుకుంది. గతంలో నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మాత్రమే ప్రవేటీకరించారు. కాని నేడు మోడీ ప్రభుత్వం లాభాలొచ్చే ప్రభుత్వ రంగ సంస్థలను బలవంతంగా నష్టాల్లోకి నెట్టి ప్రయి వేటుకు ధారాదత్తం చేస్తున్నది. అందులో భాగంగానే ఎన్నో పోరాటాలు చేసి కార్మికులు సాధించుకున్న హక్కులపై ఉక్కుపాదం మోపుతున్నది. సంపద సృష్టించే కార్మికుల హక్కులను కాలరాస్తూ పెట్టుబడి దార్లకు ఊడిగం చేస్తున్న బీజేపీ సర్కార్‌ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు రేపు చేపట్ట నున్న సమ్మెకు కార్మిక లోకం సన్నద్ధమవుతుతున్నది.

సమ్మె విజయవంతానికి విస్తృత ప్రచారం
కేంద్ర కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమ్మెకు కార్మికులు, కర్షకులు, రైతులు సిద్ధమవుతు న్నారు. కాశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకు
జరగనున్న సమ్మెలో దాదాపు 220కి పైగా వివిధ సంఘాలు పాల్గొంటున్నాయి. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల తో పాటు సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేసే 20 కోట్ల మంది నేరుగా ఈ సమ్మెలో భాగస్వాములవుతున్నారు. 1990 దశకం నుంచి మూడు దశాబ్దాల కాలంలో ఇప్పటివరకు 18 సార్లు జరిగిన సమ్మెకు భిన్నంగా అందర్ని బాగస్వాముల్ని చేసేందుకు కార్మిక సంఘాలన్ని విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా సభలు, సమావేశాలు, పరిశ్రమల ముందు గేట్‌ మీటింగ్‌లు జరుపుతూ సమ్మె ఆవశ్యకతను కార్మికులకు వివరిస్తున్నారు.సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌(ఏఐటీయూసీ) హిందుస్తాన్‌ మజ్దూర్‌సంగ్‌ (హెచ్‌ఎంఎస్‌) ఇండియన్‌ నేషనల్‌ ట్రేడ్‌యూనియన్‌ కాంగ్రెస్‌ (ఐఎన్‌టీయూసీ) తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రేపు జరగనున్న సమ్మె భారతదేశ చరిత్రలో ఓ మైలు రాయిగా నిలిచి పోనున్నదని భావిస్తున్నారు.

సమ్మె నేపథ్యం
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండవ సారీ అధికారం చేపట్టిన తర్వాత దేశంలో కార్మికుల హక్కులపై దాడి తీవ్రతరం చేసింది. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల్లో కార్పోరేట్లకు రెడ్‌కార్పెట్‌ పరుస్తున్నది. ఇన్సూరెన్స్‌రంగంలో వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అవకాశం కల్పించడం, దేశంలో ఉన్న 20కి పైగా బ్యాంకులను పది బ్యాంకులుగా విలీనం చేయడం, పోస్టల్‌, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌, రైల్వేలు ఒక్కటేంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్లకు అప్పనంగా అప్పగించేందుకు కావాల్సిన చర్యలకు పూనుకుంది. ఫలితంగా అనేక సంస్థలు, పరిశ్రమలు మూతపడుతుం డడంతో ప్రతి ఏటా లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారు. భవిష్యత్‌లో ప్రయివేటు పెట్టుబడి దార్లకు మేలు చేసేలా కార్మికుల హక్కులపై కేంద్ర ప్రభుత్వం నేరుగా దాడికి దిగింది. కార్మికుల త్యాగాల ఫలితంగా సంక్రమించిన హక్కులను హరించి వారిని పెట్టుబడి దారులకు బానిసలుగా మార్చే విధానాలకు శ్రీకారం చుట్టింది. 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించేందుకు పూను కుంది. ఫలితంగా 8 గంటల పనిదినాలు, యూనియన్లు పెట్టుకోవడం, సమస్యల సాధనకు సమ్మెచేయడం మొదల గు హక్కులు కోల్పోతారు. అలాగే సంఘటిత, అసంఘటిత రంగంలో ఉద్యోగ, ఉపాధి భద్రత కరువవుతుంది. మోడీ అనుసరిస్తున్న పారిశ్రామిక, ఆర్థిక విధానాల వల్ల దేశం తిరోగమనంలో పయనిస్తున్నది. నిరుద్యోగం, విద్య, వైద్యం, ఆకలి లాంటి సమస్యలను పక్కదారి పట్టించేందుకు కేంద్రం ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌, కాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ రద్దు తదితర భావోద్వేగ అంశాలను తెరపైకి తెస్తున్నది. కార్మికులు, కర్షకుల హక్కుల జరుగుతున్న దాడిని నిరసిస్తూ కార్మిక లోకం సమ్మెకు పూనుకున్నది.

(Courtesy Nava Telangana)