తిమ్మిని బమ్మిగా చేయడంలో, చరిత్రను వక్రీకరించడంలో, అడ్డగోలుగా వాదించడంలో ఆరెస్సెస్‌కు ప్రత్యేక నైపుణ్యం ఉంది. 370 అధికరణంలో కాశ్మీర్‌కు గల ప్రత్యేక హోదా రద్దుకు సంబంధించి మోడీ ప్రభుత్వం చేస్తున్న వాదనలు ఈ కోవకు చెందినవే.
వాదన : కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఉన్నందువల్లే కాశ్మీర్‌లో వేర్పాటువాదం బలపడుతోంది. కనుకనే దానిని రద్దు చేశాం.
వాస్తవం: కాశ్మీర్‌ ఈ దేశంలో అంతర్భాగం కాకుండా స్వతంత్రంగా ఉండాలనేది కాశ్మీర్‌ మహారాజా హరిసింగ్‌ వాదన. దానిని బలపరిచింది ఆరెస్సెస్‌.
తమ స్వయం ప్రతిపత్తికి గ్యారంటీ ఉండే పక్షంలో భారతదేశంలో విలీనం అవ్వడానికి సిద్ధమేనన్నది కాశ్మీర్‌ ప్రజల వైఖరి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వైఖరి. అటువంటి స్వయం ప్రతిపత్తి రూపమే 370 అధికరణ ద్వారా సంక్రమించిన ప్రత్యేక హోదా. అంటే ఈ ఆర్టికల్‌ కాశ్మీర్‌ విలీనానికి దోహదం చేసిన అంశం తప్ప వేరుపడిపోవడానికి కాదు. ఇది దేశానికి కాశ్మీర్‌ను అనుసంధానం చేసింది. కానీ అమిత్‌ షా నేడు దానిని రద్దు చేసి తద్వారా దేశానికి కాశ్మీర్‌ను అనుసంధానం చేశామంటూ అడ్డగోలు వాదన చేశారు.
వాదన : కాశ్మీర్‌ కోసం ప్రత్యేక చట్టం వేరే ఉండకూడదు. దేశమంతటా ఒకటే చట్టం ఉండాలి. ఉదాహరణకు ఈ ఆర్టికల్‌ ప్రకారం జమ్మూకాశ్మీర్‌లో, భారతదేశం లోని ఇతర ప్రాంతాల ప్రజలు, స్థలాలు కొనడం, అమ్మడం చేయరాదు.
వాస్తవం : మనది ఫెడరల్‌ వ్యవస్థ. అనేక భాషలు, జాతులు, సంస్కృతుల సమాహారం మన దేశం. వీటన్నిటికీ గల భిన్నత్వంలో నుంచి రూపొందిన ఏకత్వ రూపమే భారత రాజ్యాంగం. ఆయా రాష్ట్రాల, ప్రాంతాల, సమూహాల ప్రత్యేకతలను గుర్తించి, గౌరవించి, వాటి రక్షణకు భరోసా ఇవ్వడం బట్టి ఏకత్వం సాధ్యమౌతుందే తప్ప ఆయా ప్రత్యేకతలను నిరాకరించడం ద్వారా కాదు. ప్రత్యేకతలను గుర్తించడానికి నిరాకరిస్తేనే అనైక్యత పెరుగుతుంది. అందుకే రాజ్యాంగంలో వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు భరోసా కల్పించేందుకు ఆరో షెడ్యూలు కింద ఈశాన్య రాష్ట్రాలను చేర్చారు. దేశం లోని ఇతర ప్రాంతాల ప్రజలు ఆరో షెడ్యూలు రాష్ట్రాల్లో స్థిరాస్తులు కొనడం నిషేధం. 35(ఎ) అధికరణం అటువంటిదే. పార్లమెంటు చేసిన చట్టాలు ఈశాన్య రాష్ట్రాల్లో ఆటోమేటిక్‌గా వర్తించవు. గిరిజన స్వయం పాలనా సూత్రం బట్టి మాత్రమే వర్తిస్తాయి. 35(ఎ) అధికరణం అంతే చెబుతుంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా వంటి రాష్ట్రాల్లో కొన్ని వెనుకబడిన ప్రాంతాలు ఐదో షెడ్యూలు కింద ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఇతరులు పోయి భూములు కొనడం, ఇళ్లు కొనడం, వడ్డీ వ్యాపారం చేయడం వంటివి నిషేధం. 35(ఎ) అధికరణం అదే చెబుతుంది. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. కాశ్మీర్‌కూ ఇప్పటి దాకా ఉంది. మొత్తంగా చూస్తే ప్రత్యేక సమస్యలు, వెనుకబాటుతనం, ప్రత్యేక చారిత్రక నేపథ్యం ఉన్నప్పుడు ప్రత్యేక చట్టాలు అవసరం అవుతాయన్నది విదితమవుతోంది. బిజెపి వాదనే కనుక అంగీకరిస్తే రాజ్యాంగం లోని ఆరవ, ఐదవ షెడ్యూళ్లను రద్దు చేయాలి. వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక రక్షణకు సంబంధించి, వెనుకబడిన జాతుల, కులాల, మైనార్టీలకు సంబంధించి ప్రత్యేక రక్షణ చర్యలేవీ ఉండకూడదు. రిజర్వేషన్లు వుండకూడదు. ఈ వైఖరి అసమానతలను పెంచేదిగా వుంది. సమైక్యత అనేది అసమానతలను రూపుమాపివేస్తుంది తప్ప వాటిని పెంచితే రాదు.
ఇటువంటి ప్రత్యేక చర్యలు, ప్రత్యేక చట్టాలు గత 70 ఏళ్లుగా అమల్లో ఉన్నాయి. వీటివల్ల దేశ సమైక్యతకు భంగం కలిగిన దాఖలా ఒక్కటీ లేదు. మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కూడా విభజన కారణంగా నష్టపోయింది. కనుకనే ప్రత్యేక హోదా అవసరమని తొలుత వాదించింది వెంకయ్య నాయుడు గారే. తిరుపతిలో హామీ ఇచ్చింది మోడీ గారే. ఆ హామీని ఉల్లంఘించి వెనక్కి పోయిందీ ఆయనే.
బిజెపి వాదన అంగీకరించడమంటే రాష్ట్రాల ప్రత్యేక హక్కులు వదులుకోవడానికి అంగీకరించడమే. ఆంధ్రప్రదేశ్‌ విషయంలో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండాలని వాదిస్తూ, ఇంకోవైపు కాశ్మీర్‌ ప్రత్యేక హోదాను రద్దు చేయడాన్ని ఏ విధంగా సమర్థిస్తున్నాయో చెప్పాలి.
వాదన : ముస్లిం మైనారిటీలను బుజ్జగించే అవకాశవాద ధోరణుల వల్లనే కాశ్మీర్‌లో ఉగ్రవాదం పెట్రేగిపోయింది.
వాస్తవం : అటు కాంగ్రెస్‌ ప్రభుత్వం కానీ, ఇటు బిజెపి ప్రభుత్వం కానీ కాశ్మీర్‌ విషయంలో అణచివేత, అవకాశ వాదం అనే రెండు తప్పుడు విధానాలను అనుసరించాయే తప్ప బుజ్జగించింది ఎన్నడూ లేదు.
1952లో కాశ్మీర్‌ విలీనంపై జరిగిన ఢిల్లీ ఒడంబడికలో భారత ప్రభుత్వానికి 1) రక్షణ, 2) విదేశాంగ వ్యవహారాలు, 3) కమ్యూనికేషన్స్‌…ఈ మూడింటిపై మాత్రమే కాశ్మీర్‌కు సంబంధించిన మేరకు అధికారం ఉండాలని అంగీకరించారు. తక్కిన ఏ అంశంలోనైనా భారత ప్రభుత్వం చేసే చట్టాలను కాశ్మీర్‌ ప్రభుత్వం ఆమోదిస్తేనే అవి కాశ్మీర్‌లో అమలౌతాయి. అయితే 1954 నుండి కాశ్మీర్‌ రాష్ట్రానికి గల ప్రత్యేకాధికారాలపై దాడి జరుగుతూనే వుంది. 1953 నుండి 1964 మధ్య 11 సంవత్సరాల కాలంలో కొద్ది నెలలు మినహాయిస్తే తక్కిన కాలమంతా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు షేక్‌ అబ్దుల్లాను కాంగ్రెస్‌ ప్రభుత్వం జైలు లోనే నిర్బంధించింది. కాశ్మీర్‌లో అస్థిరత నెలకొందన్న సాకుతో ఆయనను అరెస్టు చేశారు. అక్రమ కేసులు బనాయించారు.
1954 నుండి 1994 మధ్య 47 సార్లు కాశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని దెబ్బ తీస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘ఈ ఆర్టికల్‌ 370 క్రమేపీ నిర్వీర్యం అయింది. ఈ పదాన్ని నేను ఉపయోగించడానికి కారణం గడిచిన కొన్ని సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అనేక పనుల వలన కాశ్మీర్‌ భారత్‌లో విలీనం అయిందనడంలో సందేహమే లేదు.’ ఈ మాటలు అన్నది దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ. 1963 నవంబరు 27న లోక్‌సభలో ఆయన చేసిన ప్రకటన ఇది.
‘370వ అధికరణాన్ని ఉపయోగిస్తూనే కాశ్మీర్‌లో రాజ్యాంగాన్ని అమలుపర్చగలం. ఇదొక సొరంగం లాంటింది. దీని ద్వారానే రాజ్యాంగం అమలు జరపడం వీలౌతుంది.’ ఇది హోంమంత్రి గుల్జారీలాల్‌ నందా 1964 డిసెంబర్‌ 4న అన్న మాట. ఈ సొరంగం ద్వారానే భారత రాజ్యాంగం లోని 395 అధికరణల్లో 260 అధికరణలను కాశ్మీర్‌కు వర్తింపజేశారు. కేంద్ర జాబితా లోని 97 అంశాల్లో 94 అంశాలను వర్తింపజేశారు. ఇతర రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనను ఒక నిర్ణీత సమయం దాటి పొడిగించాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. కానీ కాశ్మీర్‌లో రాష్ట్రపతి ఉత్తర్వుతో రాష్ట్రపతి పాలన ఎంత కాలమైనా పొడిగిస్తూ పోవచ్చు. 1975లో ఇందిరాగాంధీ, షేక్‌ అబ్దుల్లా మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం కాశ్మీర్‌ భారత దేశంలో ఒక యూనిట్‌గా పేర్కొనబడింది. దేశ ప్రాదేశిక సమగ్రతకు సంబంధించి ఏ అంశం పైన అయినా శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు ఇవ్వబడింది. సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్‌ తదితర వ్యవస్థలన్నింటి అధికారాలు కాశ్మీర్‌కు కూడా విస్తరించాయి. మరి కాశ్మీర్‌లను బుజ్జగించింది ఎక్కడీ 370వ అధికరణను కాపాడింది ఎక్కడీ
వాదన : ఆర్టికల్‌ 370 మూలంగా జమ్మూకాశ్మీర్‌ ప్రజలు భారత దేశ సార్వభౌమాధికారాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ చిహ్నాలను అవమానించినా, ఎటువంటి నేరమూ కాదు.
వాస్తవం : ఇది శుద్ధ అబద్ధం. ఆర్టికల్‌ 370లో అలాంటి అంశమే పేర్కొనలేదు. అలాంటి అంశం ఉందని చెప్పడం స్వాతంత్య్ర సమరయోధులైన రాజ్యాంగ నిర్మాతలందరినీ అవమానించడమే. స్వాతంత్య్ర పోరాట వీరులైన రాజ్యాంగ నిర్మాతలు తమ జాతీయ పతాకాన్ని అవమానిస్తే నేరం కాదని రాజ్యాంగం లోని ఒక ఆర్టికల్‌లో రాశారని ప్రచారం చేయడం అబద్ధాలకు పరాకాష్ట!
వాదన : సుప్రీంకోర్టు తీర్పులు ఈ రాష్ట్రంలో పని చేయవు.
వాస్తవం : ఇదో పెద్ద అబద్ధం. ఉదాహరణకు 2016లో ‘జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రం ఆర్టికల్‌ 370 కారణంగా సర్వసత్తాక అధికారాలు కలిగిన రాష్ట్రం’ అని ఆ రాష్ట్ర హైకోర్టు పేర్కొంటే దానిని 2016 డిసెంబరులో సుప్రీం కోర్టు కొట్టివేసింది. జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రం సర్వసత్తాక దేశమైన ఇండియాలో ఒక భాగమని పేర్కొన్నది. ఆ తీర్పును జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర హైకోర్టు గానీ, ప్రభుత్వం గానీ వ్యతిరేకించలేదు. సుప్రీంకోర్టు తీర్పులే కాదు, రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా ఈ రాష్ట్రంలో వర్తిస్తున్నాయి.
వాదన : జమ్మూకాశ్మీర్‌లో ఉండే కాశ్మీర్‌ యువతి దేశంలో వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకుంటే, ఆమెకు కాశ్మీరీ పౌరసత్వం రద్దవుతుంది. అదే, పాకిస్తాన్‌ యువకుడిని పెళ్లి చేసుకుంటే మాత్రం, పెళ్లి చేసుకున్న భర్తకు కాశ్మీరీ పౌరసత్వం లభిస్తుంది.
వాస్తవం : ఈ ప్రచారం కూడా అబద్ధమే. ఇలాంటి అంశమేదీ ఆర్టికల్‌ 370లో లేదు. కాకపోతే రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డరు ప్రకారం 35-ఏ ఆర్టికల్‌ అమల్లోకి వచ్చింది. దానికి అనుగుణంగా జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానం చేసింది. దాని ప్రకారం ఆ రాష్ట్రం లోని పురుషుడు వేరే రాష్ట్ర యువతిని పెళ్లి చేసుకుంటే, వారి సంతానానికి వారసత్వ హక్కులు లభిస్తాయి. అదే కాశ్మీర్‌ యువతి వేరే రాష్ట్రానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంటే, వారి సంతానానికి ఆ రాష్ట్ర పౌర హక్కులు, వారసత్వ హక్కులూ లభించవు. అంతేకాని, పాకిస్తాన్‌ పౌరుడిని పెళ్లి చేసుకుంటే, ఆమె భర్తకు కాశ్మీర్‌ పౌరహక్కులు లభిస్తాయనడం పూర్తిగా తప్పుడు ప్రచారం.
వాదన : కాశ్మీర్‌లో మైనారిటీలకు (హిందువులు, సిక్కులు, బౌద్ధులు) రాజ్యాంగబద్ధంగా రావలసిన 16 శాతం రిజర్వేషన్లు అమలు కావడం లేదు.
వాస్తవం : ఇది కూడా అబద్ధ ప్రచారమే. రాజ్యాంగం భారతదేశం మొత్తం లోను కొందరిని మైనారిటీలుగా నిర్ణయించింది. వారు ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, జొరాస్ట్రియన్లు (పార్సీలు). అంతేకాని, ప్రతి రాష్ట్రానికీ వేరు వేరుగా మైనారిటీలు నిర్ణయించబడలేదు. పంజాబ్‌లో సిక్కులు సంఖ్యలో మెజారిటీ, హిందువులు మైనారిటీ. నాగాలాండ్‌, మిజోరాం, లక్షద్వీప్‌, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌లో క్రైస్తవులు సంఖ్యలో మెజారిటీ, హిందువులు మైనారిటీగా ఉంటున్నారు. కానీ రాజ్యాంగం దేశానికంతటికీ మాత్రమే మైనారిటీలను నిర్ణయించిన కారణంగా ఆ రాష్ట్రాల్లో కూడా పైన చెప్పిన ఆరు మతాల వారు మాత్రమే, మైనారిటీలుగా పరిగణించబడుతున్నారు. ఉదాహరణకు పంజాబ్‌లో సిక్కులు మెజారిటీ సంఖ్యలో ఉన్నా, రాజ్యాంగం ఆ రాష్ట్రంలో కూడా సిక్కులను మైనారిటీగానే గుర్తిస్తోంది. అలాగే జమ్మూకాశ్మీర్‌ లోని కాశ్మీర్‌ ప్రాంతంలో ముస్లింలు సంఖ్యలో మెజారిటీగా ఉన్నా, లేహ్ ప్రాంతంలో బౌద్ధులు సంఖ్యలో మెజారిటీగా ఉన్నా రాజ్యాంగం ఆ రాష్ట్రంలో ఆ రెండు మతాల వారినీ మైనారిటీలు గానే గుర్తిస్తోంది. ఇదీ వాస్తవం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అంకుర్‌ శర్మ అనే న్యాయవాది జమ్మూకాశ్మీర్‌లో హిందువులను మైనారిటీలుగా గుర్తించమని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిల్‌ వేస్తే, సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న వేసింది. అదేమిటంటే, ‘జమ్మూకాశ్మీర్‌లో హిందువులను మైనారిటీలుగా గుర్తిస్తారా?’ అని. దానికి ఆ రాష్ట్రంలోని పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ‘హిందువులను మైనారిటీలుగా గుర్తించం’ అని స్పష్టమైన సమాధానం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం సమాధానమే ఇవ్వలేదు. దానిపై ఆగ్రహించిన సుప్రీంకోర్టు రూ.15 వేల జరిమానా వేసింది. అయినా కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం మౌనంగానే ఉంది (ది పయనీర్‌ 7-2-17). ఇంత స్పష్టంగా ఆ రాష్ట్ర వైఖరీ, మౌనాన్ని ఆశ్రయించిన కేంద్ర వైఖరీ వుంటే, రాజ్యాంగ బద్ధంగా రావలసిన రిజర్వేషన్లు జమ్మూ-కాశ్మీర్‌లోని హిందువులకు అందడం లేదనే ప్రచారం ఎంత మోసపూరితం?
కాశ్మీర్‌లో ఉగ్రవాదం పెట్రేగిపోయిందన్న సాకు చూపించి కాశ్మీర్‌కు గల ప్రత్యేక హోదాను రద్దు చేయడం ఎంత అసంబద్ధమైనదో, అసమంజసం అయినదో స్పష్టం అవ్వడం లేదా! స్వయం ప్రతిపత్తితో పాటు రాష్ట్ర హోదాను సైతం పోగొట్టుకున్న కాశ్మీర్‌ ప్రజలకు ప్రజాతంత్ర వాదులంతా అండగా నిలవాల్సిన అవసరం స్పష్టం కావడం లేదా.?

Courtesy prajasakti