ఎం. రాఘవాచారిImage result for ఎం. రాఘవాచారి పాలమూరు అధ్యయన వేదిక

మత విద్వేషాల దశ దాటి నాగరికమవుతున్నదనుకున్న సమాజాన్ని మరోసారి మత విద్వేషాలలోకి దింపుతున్నారు పాలకులు. జమాల్‌ బిహారీ ఒక మానవీయ ఎజెండా మన చేతికి ఇచ్చిపోయాడు. అసలైన ఎజెండాతో పోరాటాలు నిర్మించాలని కోరాడు. మత ప్రాతిపదిక పౌరసత్వ విధానానికి, నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడటమే మనం ఆయనకు ఇచ్చే నివాళి 

పదిహేనో తేదీన ఆయన మరణ వార్త తెలిసి దుఖం ఆవహించింది. 1994లో నాగర్‌కర్నూల్‌లో జరిగిన సమావేశంలో కొద్ది నిమిషాలే ఆయన మాట్లాడారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నాయకత్వ వైఫల్యమే జిల్లాను కరువు జిల్లాగా నిలబెట్టిందని, నీటి ఎజెండాతో ప్రజల మధ్యకు పోవాలని సూటిగా, దృఢంగా మాట్లాడారు. ఆ మీటింగ్‌ మినిట్స్‌ రాసుకుంటూ ఆయన పేరు జమాల్‌ బీహారీ అనీ, బీహార్‌కు చెందిన ఆయన ఇక్కడి మట్టి మనుషుల కోసం పని చేస్తున్నాడని తెలుసుకున్నాను. వ్యవస్థ పట్ల ఆయన భావాలు విన్నాను. గౌరవాస్పదుడైన ఆయనతో స్నేహం చేశాను. దాపరికం లేని హృదయమే కాదు, దాచుకోవడానికి ఆస్తి కూడా ఏమీ లేని మనిషాయన. మీరు మనుషుల్ని ప్రేమిస్తే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు. సాటి మనుషుల కష్టం తీరాలని మీరు కష్టపడితే మీతో పాటు ఆయనా కష్ట పడతాడు.

1956–67 ప్రాంతంలో హైదరాబాద్‌లోని బడిచౌడిలో రామ్‌ మనోహర్‌ లోహియా నేతృత్వంలోని సోషలిస్టు పార్టీ కేంద్ర కార్యాలయం ఉండేది. ఆ కార్యాలయం కేంద్రంగా నడిచే అన్ని కార్యకలాపాల్లో యువ జమాలుద్దీన్‌ చురుగ్గా పాల్గొనేవాడు. ఆయన వచ్చిన ప్రాంతాన్ని పేరుకు తగిలించి జమాల్‌ బీహారీ అని పిలిచేవారు. అందరి తలలో నాలుకలా ఉండేవాడు. అక్కడికి వచ్చేపోయే వాళ్ల ఆకలిని అరుసుకున్నాడు. ఆలోచనలు పంచుకున్నాడు. 1954లో లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ కల్వకుర్తి, తాడూరు, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి ప్రాంతాలలో పర్యటించారు. అంతకు మునుపే ఆచార్య వినోబా భావే కూడా భూదానోద్యమంలో భాగంగా అ ప్రాంతంలో పర్యటించారు.

ఆ పర్యటనలు జిల్లాలోని సర్వోదయ, సోషలిస్టుల సమీకరణకు తోడ్పడ్డాయి. కల్వకుర్తి ప్రాంతం తర్నికల్‌లో చాకలి పుల్లయ్య సోషలిస్టు ఆచరణతో పేదల భూముల కోసం, ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూముల ఆక్రమణ నిర్వహించేవాడు. ఆయనకు మద్దతుగా సోషలిస్టు నాయకుడు (తరువాతి కాలంలో గవర్నర్‌గా చేశాడు) బి. సత్యనారాయణ రెడ్డి వస్తూ ఉండేవారు. జమాల్‌ బీహారీ ఆయన సభలకు వచ్చేవాడు. కల్వకుర్తి పాత బస్టాండ్‌ ప్రాంతంలోని సోషలిస్టు పార్టీ కార్యాలయమే జమాల్‌ నివాస స్థలమైపోయిది.

కాంగ్రెస్‌, కమ్యూనిస్టు, సోషలిస్టు, ఆర్య సమాజ్‌, సర్వోదయ ఉద్యమాల ప్రభావాల సంఘర్షణలో జమాల్‌ సోషలిస్టుల వెంట, కౌలుదార్లు, కూలీల పోరాటాల వెంట నిలబడ్డాడు. 1970ల తర్వాత నాగర్‌ కర్నూల్‌కు తరలాడు. విలువలకు, ప్రజాస్వామిక ఆచరణకు కట్టుబడి చివరి దాకా ఎట్లా బతికాడో ఊహించుకుంటే భయం కలుగుతుంది. ఎప్పటికైనా సోషలిస్టులు అధికారం చేపడతారనే విశ్వాసంతో ఉండేవాడు. అప్పుడప్పుడే తలెత్తుతూండే పేదల వ్యతిరేక ఆలోచనల పట్ల ఆందోళన వ్యక్తం చేసేవాడు. జైలు జీవితం అనుభవించాడు. తన అత్యవసరాలకు సన్నిహితుల తోడ్పాటు దొరికినా అభిప్రాయాలకు నిలబడవలసి వచ్చినప్పుడు మొహమాటానికి రాజీకి అయన వద్ద స్థానం ఉండేది కాదు.

ఎక్కడో బీహార్‌లోని లఖీ సరాయ్‌ ప్రాంతం మారుమూల పల్లె నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు స్థిరపడ్డారన్న ప్రశ్నకు తనకు ఒక ఎజెండా ఉందంటూ ‘లఢాయీ ఖేత్‌ కే లియే చల్‌నా, కేల్దారీ హక్‌ కే లియే చల్‌నా, బే రోజ్‌గారీ కే ఖిలాఫ్‌ చల్‌నా, పఢాయీ కే లియే, దవాయీ కే లియే చల్‌నా, హర్‌ ఇన్సాఫ్‌కా ఇజ్జత్‌ కే లియే చల్‌నా’ అని చెప్పేవాడు. అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎజెండా నుంచి వైదొలిగి ప్రజలకు దూరమయ్యాయన్నాడు. మేం కరువు వ్యతిరేకే పోరాట కమిటీగా ఏర్పడినప్పుడు చాలా సంతోష పడిపోయి కమిటిలో చేరిపోయాడు. పన్నెండేండ్ల పాటు మా అందరికీ ప్రేరణగా కృషి చేశాడు.

ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, వలసలు, వలస మరణాలు అయన్ను చాలా దుఖపరిచేవి. ఆ కుటుంబాలకు తక్షణ, శాశ్వత సపోర్టు అందే చర్యల కోసం రాజకీయ నాయకులపై అవసరమైన ఒత్తిడి నిర్మాణం చేయాలనే వాడు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమ, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాల సాధన కృషిలో పాల్గొన్నాడు. 2012లో ఈ పథకాల నీరు అందటం మొదలైనప్పుడు ఆయన అనుభవించిన సంతోషానికి అవధులు లేవు. ‘సూఖీ ఖేత్‌ మే హమ్‌ పానీ లాయే’ అన్నాడు. 2007 నుంచి పాలమూరు అధ్యయన వేదిక సభలో పాల్గొంటున్నాడు. తన వయసు పెరిగిందని, పిల్లలు సరైన విద్య, సరైన ఉపాధి అవకాశాలు పొందే స్థాయిని అందించలేకపోయానని బాధపడ్డాడు. కానీ, తాను అనుభవించిన పేదరికానికి కుంగిపోలేదు.

ఏ అంశంపై ఎవరు ముందు నిలబడగలరో ఆలోచించి వాళ్లని ఆ ఉద్యమంలోకి కదిలించే వాడు. తాగు నీటి సమస్యపై పోరాటంలో బిందెలతో స్ర్తీలను రోడ్ల మీదికి కదిలించాడు. ఆఫీసులు, వీధులు దుమ్ము పేరుకు పోయి రోగాలు వస్తుంటే ‘ధూల్‌ సాఫ్‌’ ఆందోళన చేశాడు. ప్రజల భవిష్యత్తు కోసం తన కుటుంబ భవిష్యత్తును పణంగా పెట్టాడు. మల్లెపువ్వులా మెరుస్తూ ఉండే తెల్లటి, చవక పాలిస్టర్‌ దస్తులు తొడుక్కునే వాడు. భార్యాబిడ్డలకు కొద్ది పాటి సమయం, కొద్ది పాటి ప్రేమా తప్ప నేను ఏమి ఇవ్వగలిగాను, వాళ్ల కష్టంతో వాళ్లు బతుకుతున్నారు అనేవాడు.

ఆరు నెలల క్రితం ఇంటికి వచ్చి తన ఆవేదనను నాతో పంచుకున్నాడు. మత విద్వేశాల దశ దాటి నాగరికమవుతున్నదనుకున్న సమాజాన్ని మరోసారి మత విద్వేషాలలోకి దింపుతున్నారు. ఇప్పుడు అసలైన ఎజెండాతో పోరాటాలు నిర్మించాలని కోరాడు. ఒక మానవీయ ఎజెండా మన చేతికి ఇచ్చిపోయాడు. మత ప్రాతిపదిక పౌరసత్వ విధానానికి, నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడటమే మనం ఆయనకు ఇచ్చే నివాళి.

పాలమూరు అధ్యయన వేదిక

(Courtesy Andhrajyothi)