నిరసనకారులకు సంఘీభావం ప్రకటిస్తూ 300మంది ప్రముఖుల లేఖ

ముంబయి: కేంద్రప్రభుత్వం మతప్రాతిపదికన తీసుకొచ్చిన అత్యంత వివాదాస్పదమైన సీఏఏతో భారత ఆత్మకు ముప్పు వాటిల్లుతుందనీ, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు, ప్రజలకు తాము సంఘీభావం ప్రకటిస్తున్నామని పేర్కొంటూ దేశంలోని 300ల మందికి పైగా ప్రముఖ వ్యక్తులు బహిరంగ లేఖ రాశారు. వీరిలో నటుడు నసీరుద్దీన్‌ షా, చిత్రనిర్మాత మీరా నాయర్‌, గాయకుడు టి.ఎం కృష్ణ, రచయిత అమితావ్‌ ఘోష్‌, చరిత్రకారులు రోమిలా థాపర్‌ వంటి వ్యక్తులు ఉన్నారు. ఈ మేరకు తమ సంతకాలతో కూడిన లేఖను ఈ నెల 13న ఇండియన్‌ కల్చరల్‌ ఫోరంలో ప్రచురించిన నోట్‌లో పేర్కొన్నారు. బహుళ, భిన్నత్వ సమాజానికి కట్టుబడి ఉండాలన్న భారత రాజ్యాంగ సూత్రాల రక్షణకు ఎన్ని ఆటం కాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నిరసనలు కొనసాగిస్తున్న విద్యార్థులు, ప్రజలకు తామంతా సెల్యూట్‌ చేస్తున్నామని పేర్కొన్నారు. అన్యాయాన్ని ఎదుర్కొంటున్నప్పుడు చాలా మంది తరచూ మౌనంగా ఉండిపోయారనీ, కానీ, విద్యార్థులిచ్చిన ఈ స్ఫూర్తి.. ప్రతి ఒక్కరూ మన హక్కుల కోసం నిల బడాలని తెలియజేస్తున్నదని వెల్లడించారు. ప్రజల అసమ్మతి, బహిరంగ చర్చకు అవకాశం ఇవ్వకుండానే, లౌకిక సూత్రాలకు విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాలు..

కేంద్రం మందబలంతో పార్లమెంట్‌లో త్వరగానే ఆమోదం పొందుతున్నాయని విమర్శించారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లతో లక్షలాది మంది మన తోటి భారతీయుల జీవనోపాధి ప్రమాదంలో పడుతున్నదని ఆరోపించారు. ప్రభుత్వం చెబు తున్నట్టు, హింసకు గురవుతున్న మైనారిటీలకు ఆశ్రయమివ్వడానికే ఉద్దేశించినదిగా సీఏఏ కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. పొరుగు దేశాలైన శ్రీలంక, చైనా, మయన్మార్‌లకు చెందిన మైనారిటీలను సీఏఏ నుంచి ఎందుకు మినహాయించారని ప్రశ్నించారు. అంటే, ముస్లిం ప్రభుత్వాలు మాత్రమే మతపరమైన హింసకు పాల్పడుతున్నాయా? అని నిలదీశారు.

Courtesy Nava telangana