హైదరాబాద్‌ డీసీసీబీ చైర్మన్‌ రేసులో ఉన్న
కొత్త మనోహర్‌రెడ్డి కంపెనీలో సోదాలు
8జేబీ ఇన్‌ఫ్రాలో రెండు రోజులుగా తనిఖీలు?

రంగారెడ్డి/మన్సూరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతలు, సంబంధీకులను టార్గెట్‌ చేసి వరుస సోదాలు నిర్వహిస్తున్న ఆదాయ పన్ను శాఖ తెలంగాణలో టీఆర్‌ఎస్‌ నేతలను టార్గెట్‌ చేసింది. ఇటీవల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని అఽధికార పార్టీ ఎమ్మెల్యేతో పాటు కొందరు ముఖ్యనేతల అనధికారిక పెట్టుబడులు ఉన్న కంపెనీపై దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు తాజాగా మరో టీఆర్‌ఎస్‌ నేత కంపెనీలో తనిఖీలు చేశారు. హైదరాబాద్‌ డీసీసీబీ చైర్మన్‌ రేసులో ఉన్న కొత్త మనోహర్‌రెడ్డి భాగస్వామిగా ఉన్న జేబీ ఇన్‌ఫ్రా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో ఐటీశాఖ రెండు రోజులపాటు(గురు,శుక్రవారాల్లో) సోదాలు చేసింది. శుక్రవారం హైదరాబాద్‌ పట్టణం బీఎన్‌రెడ్డి నగర్‌లోని జేబీ ఇన్‌ఫ్రా కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆర్ధిక లావాదేవీలపై సిబ్బందిని ప్రశ్నించినట్లు తెలిసింది.

ఈ వివరాలు తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లిన మీడియాను కంపెనీ ప్రతినిధులు అడ్డుకున్నారు. కాగా అనతికాలంలోనే అనూహ్యంగా పెరిగిన జేబీ ఇన్‌ఫ్రా ఆర్థిక లావాదేవీలపై ఐటీశాఖ నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ కంపెనీలో కీలక భాగస్వామిగా ఉన్న మనోహర్‌రెడ్డి కుల్కచర్ల ప్రాథమిక సహకార సంఘంలో నాలుగో వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం సొసైటీలోని మిగతా 12 వార్డులనూ ఏకగ్రీవం చేసుకొని హైదరాబాద్‌ డీసీసీబీ చైర్మన్‌ రేస్‌లో ఆయన ముందున్న తరుణంలో ఈ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.

Courtesy Andhrajyothi