కేంద్రానికి హెల్త్‌ రిపోర్టర్ల ప్రశ్నాస్త్రం

న్యూఢిల్లీ : దేశంలో 1500 పైగా కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరుపై పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. వైరస్‌ ‘పరిమిత సంక్రమణ (లిమిటెడ్‌ ట్రాన్స్‌మిషన్‌’ దశలోకి దేశం ప్రవేశించిన విషయాన్ని ప్రభుత్వం కప్పిపుచ్చుతోంది. గత ఆదివారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ఈ విషయాన్ని అంగీకరించేందుకు నిరాకరించారు. అయితే అదే శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో మాత్రం ‘లిమిటెడ్‌ ట్రాన్స్‌మిషన్‌’లోకి వెళ్లిన వాస్తవాన్ని అంగీకరించింది. దీంతో పాటు కరోనాకు సంబంధించిన అనేక ప్రాథమిక విషయాలను కేంద్రం బయటకు పొక్కనీయడం లేదు. ఉదాహరణకు కరోనా పరీక్షలు జరిపేందుకు అవసరమైన కిట్‌లను ప్రైవేటుగా తయారు చేసి అమ్మేందుకు లైసెన్స్‌లు మంజూరు చేసిన విషయాన్ని ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. ఈ నేపథ్యంలో హెల్త్‌ రిపోర్టర్ల బృందం కేంద్రానికి పది ప్రశ్నలను సంధించింది. కరోనాను ఎదుర్కొనే తీరు ఇదేనా అని నిలదీసింది. ఆ వివరాలు..

  1. దాదాపు అన్ని దేశాల్లోనూ కరోనా పరీక్షలు ఉచితం. మన దేశంలో మాత్రం ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలకు అనుమతిం చి చార్జీలను ఎందుకు వసూలు చేస్తున్నారు? పైగా ప్రపంచంలో ఎక్కడ లేనంత అత్యధిక ధరను (రూ.4,500) ఎందుకు నిర్ణయించారు. ప్రజలు ఇంత ధర వెచ్చించి పరీక్షలు చేయించుకోవడం సాధ్యమా?

  2. పరీక్షలకు అవసరమైన కిట్‌లను తయారు చేసేందుకు ఎన్ని లైసెన్స్‌లు మంజూరు చేశారు? దిగుమతి చేసుకుంటున్న కిట్‌ల జాబితాను ఎందుకు విడుదల చేయడం లేదు? విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ఎన్ని సంస్థలు ఆమోదం పొందాయి? ఆర్‌టీ-పీసీఆర్‌ కిట్‌లు, రాపిడ్‌ యాంటీ బాడీ కిట్‌ల మధ్య ఎంత తేడా ఉంది? కరోనా పరీక్షలు నిర్వహించే వారు రాపిడ్‌ యాంటీ బాడీ కిట్‌లను ఉపయోగించుకునేందుకు అనుమతిస్తున్నారా? లేక ఐసీఎమ్‌ఆర్‌ ప్రకటించిన కమ్యూనిటి స్థాయిలోని సర్వేలకు మాత్రమే పరిమితం చేశారా?

  3. వ్యక్తిగత రక్షణ పరికరాల కొరత నేపథ్యంలో కవరాల్స్‌, మాస్క్‌లు, గ్లోవ్‌లు ప్రస్తుతం ఎన్ని అందు బాటులో ఉన్నాయో ఎందుకు చెప్పడం లేదు? భవిష్యత్‌లో ఎన్ని అవసరమవుతాయి, ఎన్ని అందు బాటులోకి వస్తాయన్న వివరాలను ఎందుకు వెల్లడించడం లేదు?

  4. అన్ని రకాల పరికరాలతో కూడిన పరీక్షలు నిర్వహించేందుకు ఒకే సంస్ధకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు గుర్తింపునిచ్చింది? కవరాల్స్‌ అవసరాన్ని కేంద్రం ఎందుకు గుర్తించలేదు? దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్ధ మార్గదర్శకాలను ఎందుకు పట్టించుకోలేదు?.

  5. ఐసీఎంఆర్‌ ప్రకటించిన సిరోలాజికల్‌ సర్వేలతో పాటు, కమ్యూనిటి స్ధాయిలో కరోనా వ్యాప్తిని గుర్తించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి?

  6. కరోనా పరీక్షలు జరిపించుకున్న వారందరినీ ఆసుపత్రులలో చేర్చుకుంటున్నారు. ఒక వేళ వారి సంఖ్య పెరిగితే వారిని ఐసోలేట్‌ చేసేందుకు ప్రణాళిక ఏమైనా ఉందా?

  7. అవుట్‌ పేషెంట్‌ సేవలను ఎందుకు నిలిపివేశారు? లాక్‌డౌన్‌ సమయంలో రోగులు ఆరోగ్య సంరక్షణను ఎలా పొందుతారు? కాన్సర్‌, క్షయ, హెచ్‌ఐవీ వంటి ప్రాణాంతక పరిస్ధితుల్లో ఉన్న రోగులకు వైద్య సౌకర్యం అందించేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు?

  8. రోగనిరోధక శక్తిని పెంచుకునే కార్యక్రమాలను, గ్రామీణ ఆరోగ్యం, పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమాలను కొన్ని రాష్ట్రాలు రద్దు చేశాయి. ఈ సేవలను రద్దు చేసే ప్రక్రియ లాక్‌డౌన్‌ కొనసాగే 21 రోజుల వరకే పరిమితమవుతుందా? మరికొంత కాలం కొనసాగుతుందా? ఇమ్యూనైజేషన్‌కు సంబంధించిన కీలక కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించిందా?

  9. కరోనా నియంత్రణకు జరుగుతున్న పోరాటంలో వైద్య సేవలు అందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు రూ.50 లక్షలు ప్రమాద బీమాను ప్రకటించింది. అప్పుడు ఇది ప్రమాద బీమా అవుతుందా? లేక జీవిత బీమా అవుతుందా? ఆరోగ్య కార్యకర్తకే వైద్య చికిత్స అవసరమైతే పరిస్థితి ఏంటి? ఈ బీమా మూడు నెలలకు మాత్రమేనని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మహమ్మారి మూడు నెలలు మించి కొనసాగితే పరిస్థితి ఏమిటి?

10.ఎంతమంది ఆరోగ్య కార్యకర్తలకు ఈ పథకం వర్తిస్తుంది? ఈ పథకానికి ఎవరు అర్హులు. దేశ వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలు అందరూనా, లేదా కేవలం కొంత మందేనా? ఒక వేళ అలాగే అయితే దానిని ఎలా నిర్వచిస్తారు? దీని కోసం ప్రభుత్వం ఎంత మొత్తాన్ని బీమా చేస్తుంది, ఎంత మొత్తాన్ని ప్రభుత్వం దీని కోసం చెల్లిస్తుంది?

Courtesy Nava Telangana