– వాస్తవాలు వెల్లడిస్తున్న అధ్యయనాలు..
– నిర్మించుకోకుంటే గ్రామాల్లో సంక్షేమ పథకాలు కట్‌..!
– నీటి సదుపాయం కరువు..
– సెప్టిక్‌ ట్యాంకులను శుద్ధి చేసేదెలా…?
మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని కేంద్రప్రభుత్వం భారత్‌ను నేడు ‘బహిరంగ మలవిసర్జన రహిత దేశం’ (ఓడీఎఫ్‌)గా ప్రకటించబోతున్నది. సరిగ్గా అయిదేండ్ల క్రితం ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (ఎస్‌బీఎం)ను అట్టహాసంగా ప్రారంభించారు. 2019 అక్టోబర్‌ 2 నాటికి దేశాన్ని ఓడీఎఫ్‌గా మార్చాలనేది దీని లక్ష్యం. కానీ దీని ప్రాథమిక లక్ష్యాలను ఎస్‌బీఎం అందుకున్నదా..! ఇంతకీ ఇది విజయవంతమైందా లేదా అనేదే ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రశ్న…?
న్యూఢిల్లీ : గతనెల అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీకి గేట్స్‌ ఫౌండేషన్‌ ‘గ్లోబల్‌ గోల్‌ కీపర్‌’ అవార్డు అందించింది. ఎస్‌బీఎంలో భాగంగా దేశంలో సుమారు కోటికి పైగా మరుగుదొడ్లను నిర్మించినందుకు ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. సరిగ్గా అదే రోజు మధ్యప్రదేశ్‌లోని భవఖేడి గ్రామంలో బహిరంగ మలవిసర్జన చేసినందుకు గానూ వెనుకబడిన కులాలకు చెందిన ఇద్దరు చిన్నారులపై పలువురు దుండగులు దాడి చేయడంతో వారిరువురు చనిపోయారు. వారి మరణం తర్వాత పలు ఉత్తరాది రాష్ట్రాల్లో అంతకుముందు జరిగిన ఈ తరహా ఘటనలు సైతం ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇదిలాఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది ప్రజలు బహిరంగ మలవిసర్జనకే వెళ్తున్నారని అధికారిక గణాంకాలతో పాటు స్వచ్ఛంద సంస్థల నివేదికలూ వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు గతనెల 28న రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ కంపాసినేట్‌ ఎకనామిక్స్‌ (ఆర్‌ఐసీఈ) నివేదిక వాస్తవ విషయాలను బహిర్గతపరిచింది. నివేదికలో పేర్కొన్న అంశాలు కింది విధంగా ఉన్నాయి.

మరుగుదొడ్లు వాడేదెంతమంది..?
ఎస్‌బీఎంలో భాగంగా నాసిరకం మరుగుదొడ్లను నిర్మించి కేంద్రం చేతులు దులుపుకున్నది. అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో నిధులు విడుదల కాకపోగా.. మరికొన్ని చోట్ల టాయిలెట్లు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాగా, దేశంలోని 5,99,963 గ్రామపంచాయతీలను ఓడీఎఫ్‌గా మార్చామని ఎస్‌బీఎం అధికారిక వెబ్‌సైట్‌లో ఉంది. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని దీనిని రూపొందించారు. కానీ దాదాపు 25 శాతం మంది తాము మరుగుదొడ్డిని ఉపయోగించడం లేదని స్వచ్ఛందంగా చేసిన సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఆర్‌ఈసీఈ 2014 నుంచి 2018 వరకు చేసిన సర్వే ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లోని 43 శాతం కుటుంబాలు బహిరంగ మల విసర్జనకే వెళ్తున్నారని తేలింది. అంతేగాక మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వెలువరించిన నివేదిక ప్రకారం.. ఆ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో సుమారు 30 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు.

సెప్టిక్‌ ట్యాంకులను శుద్ధి చేసేదెవరు..?
కోటికి పైగా మరుగుదొడ్లను నిర్మించామని ప్రచారం చేసుకుంటున్న కేంద్రం.. వాటిని శుద్ధి చేసేవారెవరనే దానికి సమాధానం చెప్పడం లేదు. ఈ పథకం కింద మరుగదొడ్లను గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా నిర్మించారు.
కానీ పట్టణాల్లో మాదిరి సెప్టిక్‌ ట్యాంకులను శుద్ధి చేసే యంత్ర పరికరాలు గ్రామీణ ప్రాంతాల్లో లేవు. పోగా అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో నిరుపేదలకు వాటిపై అంత వెచ్చించేంత స్థోమతా లేదు. పట్టణ ప్రాంతాల్లోనూ ధనవంతులు మినహా మున్సిపాలిటిల్లో, సాధారణ ప్రజల ఇండ్లల్లోనూ శుభ్రం చేసేది అణగారిన వర్గాల కార్మికులే. కాగా, కేంద్రం కూడా ఇందుకు సంబంధించిన బడ్జెట్‌ను ఎస్‌బీఎంలో చేర్చలేదు. గ్రామాల్లో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లలో నిర్వహణ పంచాయతీల మీద ఉండగా.. ఇది తిరిగి దళితులను బలవంతంగా ఆ వృత్తిలోకే దించనున్నది. గడిచిన నాలుగైదేండ్లలో సెప్టిక్‌ ట్యాంకులు శుద్ధి చేస్తూ దాదాపు 1200 మంది సఫాయి కార్మికులు చనిపోయారని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. మాన్యూవల్‌ స్కావెంజింగ్‌ నేరమని చట్టాల్లో ఉన్నా అవి కాగితాలకే పరిమితమవు తున్నాయి.

నీరే అసలు సమస్య…
కేంద్రం ఇచ్చిన అత్తెసరు నిధులతో ప్రజలు నిర్మించుకున్న టాయిలెట్లకు నీటి సదుపాయమే ప్రధాన సమస్య. నీటి సౌకర్యం లేకపోతే ప్రజలు వాటిని ఉపయోగించరు.
ఎస్‌బీఎం కింద నిర్మించుకున్న మరుగుదొడ్లలో నీటి సదుపాయం లేక గ్రామీణ ప్రాంతాల్లో చాలా కుటుంబాలు వాటిని వాడటం లేదని ఈ ఏడాది వేసవి కాలంలో వార్తలు వచ్చాయి. దేశాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటించాలని ఉబలాటపడుతున్న కేంద్రం.. టాయిలెట్లకు నీటి సదుపాయం గురించి మాత్రం మాట్లాడటం లేదు. అయినా ప్రజలు తాగునీటికే అల్లాడుతుంటే.. మలవిసర్జనకు, వాటిని శుభ్రం చేయడానికి నీళ్లనెక్కడి నుంచి తీసుకొస్తారని దీని మీద పరిశోధనలు చేస్తున్న విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

గ్రామాల్లో బలవంతంగా ఓడీఎఫ్‌
గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించుకోనివారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. వారికి సంక్షేమ పథకాల్లో కోత.. రేషన్‌ బియ్యం నిలిపివేత.. జరిమానాలను విధిస్తూ వారిని టాయిలెట్లు నిర్మించుకోమని బలవంతం చేస్తున్నది. ఈ మేరకు గ్రామాధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నది. ఆర్‌ఐసీఈ ఈ ఏడాది జనవరిలో వెలువరించిన నివేదిక ప్రకారం.. బీహార్‌, యూపీ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాలలో 56 శాతం కుటుంబాలు ఈ తరహా దాడులను ఎదుర్కున్నామని చెప్పాయి.
తమతో బలవంతంగా టాయిలెట్లను నిర్మిస్తున్నారనీ, లేకుంటే పైన చెప్పిన విధంగా దాడులకు సైతం వెనుకాడటం లేదని వారు చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే కేంద్రం మాత్రం దీనిని ప్రజా ఉద్యమంగా అభివర్ణిస్తుండటం విడ్డూరంగా ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ అనుయాయులతో దీనికి సంబంధించిన పుస్తకాలు రాయిస్తూ కేంద్రం ప్రచారం చేసుకుంటుంది.. మిగిలిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదని వారు విమర్శిస్తున్నారు. దీనిపై ఇటీవలే ఓ కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ప్రజలు మరుగుదొడ్లను నిర్మించుకోవడం వల్ల ఏటా రూ. 50 వేల వరకు ఆదా అయ్యాయని చెప్పారు. అయితే, టాయిలెట్లు లేని కారణంగానే ప్రజలు రోగాల బారీన పడుతున్నారా..? అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

Courtesy Navatelangana…