ప్రజలను రక్షించడం అంటే దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి. ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు, దేశ వారసత్వ సంపదకు చారిత్రక నిర్మాణాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ వారసత్వ సంపదను కూల్చివేయడం అనేది నవ భారత నిర్మాణానికి ఎంతమాత్రం సహకరించదు.

ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటం ముగింపు ఇంకా సుదూరంగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు కూడా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. వైరస్‌ నియంత్రణకు గానూ విధించిన లాక్‌డౌన్‌తో ప్రభావితం అయిన వారిలో కార్మికవర్గం ప్రధానంగా ఉంది. ప్రపంచదేశాల ఆర్థికవ్యవస్థలు కూడా గణనీయంగా దిగజారాయి. దేశంలో ప్రజల కష్టాలను తగ్గించే పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ఉపశమన ప్యాకేజీ ఆపారదర్శకంగా ఉండడంతో పాటు ఆశించిన ఫలితాలు సాధిస్తుందన్న దానిపై నిపుణులతో పాటు అన్నివర్గాల ప్రజలు సందేహాస్పదంగా ఉన్నారు. ఇటువంటి గందరగోళ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం ఒక ఏమాత్రం అవసరం లేని ఒక మెగా నిర్మాణం పనుల్లో మునిగిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం.

1911 వరకూ బ్రిటిష్‌ వారు భారత్‌ను కోల్‌కతా కేంద్రంగా పాలించారు. పార్లమెంటరీ కౌన్సిల్‌ సమావేశాలు కూడా కేంద్ర ప్రధాన కార్యాలయ భవనంలో నిర్వహించ బడేవి. అనంతరం ఢిల్లీ నగరం భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉందన్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకున్న బ్రిటిష్‌ పాలకులు రాజధానిని ఢిల్లీకి మార్చారు. అనంతరం పార్లమెంటరీ కౌన్సిల్‌ సమావేశాలకు వారు ఒక ప్రదేశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ పనిని బ్రిటిష్‌వారు మోంటగే థామస్‌కు అప్పగించారు. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరిగే నగరంలోని అలీపోర్‌ రోడ్‌లో ఉన్న ఓల్ట్‌ సెక్రటేరియట్‌ బిల్డింగ్‌ను 1912లో నిర్మించారు. అక్కడ పార్లమెంటరీ కౌన్సిల్‌ మొదటి సమావేశం 1913, జనవరి 27న జరిగింది. అప్పటి నుంచి 1926 వరకూ కూడా సమావేశాలను అక్కడే నిర్వహించారు. 1912 నుంచి 1926 వరకూ నేషనల్‌ కౌన్సిల్‌ సమావేశాలు చారిత్రికంగా ప్రసిద్ధి చెందిన ఈ భవనంలోనే జరిగాయి. సాధారణ బడ్జెట్‌, రైల్వే బడ్జెట్‌, రైల్వే సంస్కరణలు, ఇతర అంశాలకు సంబంధించిన చట్టాలను కూడా ఇక్కడే చర్చించి ఆమోదిం చారు. రౌలత్‌చట్టంపై జరిగినచర్చలో సీనియర్‌ పార్లమెంట్‌ సభ్యులు పాల్గొన్నారు. ఈ చట్టం దేశ పౌరుల హక్కులను, స్వేచ్ఛను హరిస్తుందని వ్యతిరేకిస్తూ ఈ ప్రదేశం లోనే ఆందోళనలు చేశారు. ఈ చట్టంపై జరిగిన చర్యలను గ్యాలరీ నుంచి చూసిన వ్యక్తుల్లో మహాత్మాగాంధీ కూడా ఒకరు.

ప్రస్తుతం పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న భవనాన్ని ఎడ్విన్‌ లుత్యేన్‌, హెర్బర్ట్‌ బాకేర్‌ అనే ఇద్దరు అర్కిటెక్టులు, ఇంజనీర్లు నిర్మించగా.. అప్పటి గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ ఇర్విన్‌ దీన్ని 1927, జనవరి 18న ప్రారంభించారు. భారత పార్లమెంట్‌ మూడవ సమావేశం 1927, జనవరి 19న ఈ భవనంలోనే జరిగింది. భారత్‌కు స్వాతంత్రం వచ్చిన విషయాన్ని కూడా జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ భవనం నుంచే ప్రకటించారు. భారత రాజ్యాంగ సభ ఇక్కడి నుంచి విధులు నిర్వర్తించడం ప్రారంభమైంది. డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌, డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌, పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్ధార్‌ వల్లభారు పటేల్‌, ఇతరుల విలువైన సహకారంతో రూపొందిన భారత రాజ్యాంగం కూడా ఈ భవనం నుంచే ఆమోదం పొందింది.
కాంగ్రెస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే ఈ పార్లమెంట్‌ భవనాన్ని పున:నిర్మించాలా లేక ఇక్కడే సమావేశాలను కొనసాగించాలా లేక కొత్త భవనాన్ని నిర్మించాలా అన్న విషయంపై చర్చ నడిచింది. అయితే దీనిపై ఎటువంటి నిర్ణయం మాత్రం జరగలేదు. కానీ ఇప్పుడు కొత్త పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించాలన్న ప్రధాని మోడీ కలల ప్రాజెక్టు మేరకు కేంద్ర ప్రభుత్వం ‘సెంట్రల్‌ విస్టా’ అనే పథకాన్ని ప్రారంభించింది.

86 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.20 వేల కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించాలనే యోచనలో కేంద్రం ఉంది. కొత్త పార్లమెంట్‌ భవనం, సౌత్‌ బ్లాక్‌ వెనుక ప్రధాని అధికారిక నివాసం, నార్త్‌ బ్లాక్‌ వెనుక ఉపరాష్ట్రపతి అధికారిక నివాసం.. ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించదలచారు. ప్రస్తుతం మొదటి రెండు వరుసల్లో కూర్చునే పార్లమెంట్‌ సభ్యులకు మాత్రమే డెస్క్‌ సౌకర్యం ఉంది. సెంట్రల్‌ విస్టాకు చెందిన ఆర్కిటెక్టులు అందరికీ ఈ సౌకర్యాలను కల్పించేందుకు చూస్తున్నారు. దీన్ని సమర్ధవంతంగా చేసేందుకు వారు ఇటలీ, జర్మనీ, క్యూబా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల్లోని పార్లమెంట్‌ భవనాలను సందర్శించారు. భారత పార్లమెంట్‌ కొత్త భవనాన్ని 2024లోపు పూర్తి చేయాలనే యోచనలో ఆర్కిటెక్టులు ఉన్నారు. భారత పార్లమెంట్‌కు చెందిన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిభింభించేలా కొత్త భవన నిర్మాణం ఉంటుందని సంబంధించి డాక్యుమెంట్లు పేర్కొంటున్నాయి. కొత్తగా నిర్మించే ఈ భవనం మరో 150 నుంచి 200 సంవత్సరాల పాటు దేశ వారసత్వానికి ప్రతీకగా ఉంటుందని తెలిపాయి.

2022లో జరిగే 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సమయానికి కొత్త భవనం నిర్మాణం పూర్తై, ప్రారంభోత్సవం కూడా జరుపుకుంటుందని ఇప్పటికే ప్రకటించారు. ప్రాజెక్టులో భాగంగా ఇంకా ఏవైనా తుది మెరుగులు ఉంటే అవి 2024కు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకొని అనంతరం తిరస్కరించింది. కొత్త పార్లమెంట్‌ భనవ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్‌పై ఇప్పటి వరకూ ప్రస్తుతం పార్లమెంట్‌లో చర్చించలేదు.. సభ్యుల ఆమోదం తీసుకోలేదు. ఈ భవనాన్ని నిర్మిస్తున్న ఆర్కిటెక్టులు, ఇంజనీర్లు, ఇతర నిపుణులు ప్రస్తుత పార్లమెంట్‌ సూచనలు, మార్గదర్శకాలను తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వైఖరి ప్రతిఒక్కరి నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

నేను రాజ్యసభ్య సభ్యుడిగా ఉన్న సమయంలో 2019, అక్టోబర్‌ 29న అదనపు కార్యదర్శి ప్రదీప్‌ చతుర్వేదికి లేఖ రాశాను. నా అభిప్రాయాలు, అభ్యంతరాలను అందులో తెలిపాను. బ్రిటిష్‌ పార్లమెంట్‌లో 427 మంది కూర్చునే సామర్ధ్యం ఉండగా, అనంతరం పార్లమెంటరీ సీట్లను 650కు పెంచారు. సమావేశం జరుగుతున్న సమయంలో సెషన్‌కు హాజరయ్యే వారు ఆలస్యంగా వస్తే వారు నిలబడి పార్లమెంట్‌ కార్యకలాపాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. కానీ, బ్రిటిష్‌ పాలకులు మాత్రం కొత్త భవనాన్ని నిర్మించాలని అనుకోలేదు. ఫ్రెంచ్‌ పార్లమెంట్‌ భవనాన్ని 1722లో, ఇటలీ పార్లమెంట్‌ భవనాన్ని 1871లో నిర్మించారు. ప్రసుతం రెండు దేశాల పార్లమెంట్‌లు కూడా అదే భనవంలో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. 1894లో నిర్మించిన జర్మనీ పార్లమెంట్‌ భనవంలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న తర్వాత కూడా తగిన పునరుద్ధరణ చేపట్టి తిరిగి అదే పాత భవనంలో సమావేశాలను నిర్వహించు కోసాగారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా చారిత్రకంగా, సంస్కృతిపరంగా వారసత్వ భవనాలు పార్లమెంట్‌ సమావేశాల నిమిత్తం ఇంకా వినియోగంలో ఉన్నాయి. భారత పార్లమెంట్‌ భవనానికి కూడా అంతే చరిత్ర ఉంది. దేశ నిర్మాణంలో పాలుపంచుకున్న అనేక మంది నాయకులకు కూడా ఈ భవనం గుర్తుగా ఉంది.

ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం దేశాన్ని వెంటాడుతోంది. దేశ ప్రజల చేతుల్లో కొనుగోలు శక్తి కుంచించుకుపోయింది. ఇటువంటి సమయంలో ప్రజల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీలు చేయాలని విప్రో గ్రూప్‌ మాజీ చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ, టీవీఎస్‌ సంస్థకు చెందిన సీనియర్‌ పారిశ్రామికవేత్త వేణు శ్రీనివాసన్‌తో సహా ఇతర ప్రముఖులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం తీవ్రత, రెట్టింపవుతున్న సామాన్యుల కష్టాలు.. ఈ రెండు సవాళ్లు కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ముందున్నాయి. ఇటువంటి సమయంలో కొత్త పార్లమెంట్‌ భవనం నిర్మాణం పేరుతో రూ.20 వేల కోట్లను వ్యర్ధ వ్యయం ఎందుకు చేయాలని ప్రజలు భయాందోళనతో ఆలోచన చేస్తున్నారు. ప్రజాస్వామ్య ఆలయంగా పార్లమెంట్‌ అనేది వర్ధిల్లుతోంది. ప్రధాని మోడీ కూడా మొట్టమొదటి సారిగా ఎంపీగా ఎన్నికైన 2014లో పార్లమెంట్‌ భవనంలోకి ప్రవేశించే సమయంలో ప్రవేశ మెట్లను తాకారు. ప్రజాస్వామ్యం యొక్క నిజమైన రక్షకులు దేశ ప్రజలు మాత్రమే. అటువంటి ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో.. ఆ సంక్షోభ పరిస్థితు లను అధిగమించేందుకు సాయం చేయకపోగా, ఈ విధంగా కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే చర్యలను దేశ ప్రజలు ఏమాత్రం హర్షించరు.

ప్రజలను రక్షించడం అంటే దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి. ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు, దేశ వారసత్వ సంపదకు చారిత్రక నిర్మాణాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ వారసత్వ సంపదను కూల్చివేయడం అనేది నవ భారత నిర్మాణానికి ఎంతమాత్రం సహకరించదు.

టికె రంగరాజన్‌

Courtesy Nava Telangana