తోట భావనారాయణ

టీవీ విషయంలో ప్రభుత్వ నియంత్రణ ఎంతమేరకు విజయం సాధించిందో గమనిస్తే ఇప్పుడు చెబుతున్న డిజిటల్ మాధ్యమాల నియంత్రణ మీద కూడా అనుమానాలు రావడం సహజం. కేంద్రం నేరుగా నియంత్రించడం సాధ్యమవుతుందా? రాష్ట్రాల మీద బాధ్యత పెడుతుందా? రాష్ట్రాలు పట్టించుకుంటాయా? పట్టించుకున్నా, రాజకీయాలకు అతీతంగా పని చేస్తాయా అనేవి ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు.

అడ్డూఅదుపు లేకుండా ఎదుగుతూ డిజిటల్ మాధ్యమాలు రకరకాల సమస్యలు తెచ్చిపెడుతున్నాయనే ఆరోపణల మధ్య ఎట్టకేలకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ స్పందించి రంగంలోకి దిగింది. ఒటిటి, వెబ్‌సైట్లు, వెబ్‌చానల్స్, యూట్యూబ్ చానల్స్ లాంటివాటిని తన పరిధిలోకి తెచ్చుకుంటూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయించింది. ఇప్పటిదాకా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్న ఈ డిజిటల్ మాధ్యమాల పర్యవేక్షణ కేవలం టెక్నాలజీకి సంబంధించినది కాదని, ప్రసారాంశాలు చాలా ముఖ్యమని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కొంతకాలంగా చెబుతూ వచ్చింది. సరైన నియంత్రణ ఉండాలంటే తమ ఆధిపత్యం ముఖ్యమని చెప్పి మొత్తానికి పరిధి మార్పించగలిగింది.

అయితే, నియంత్రణ అనగానే చాలామంది అది ఎలా ఉండబోతుందోనన్న అనుమానాలు లేవనెత్తుతున్నారు. అందుకే సమాచార, ప్రసారమంత్రిత్వశాఖ (ఎంఐబి) ఇటీవలి కాలంలో చేసిన ప్రకటనలు, ఇప్పటిదాకా అమలు చేస్తూ వచ్చిన నియంత్రణలను ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒటిటి వేదికల విషయంలో పట్టు బిగించటానికి ప్రయత్నాలు కాస్త ముందుగానే మొదలుపెట్టింది. ఎలాంటి కార్యక్రమాలు అనుమతించబోవటం లేదో ఒక జాబితా ఇస్తామని చెప్పింది. అంటే, గతంలో టీవీ చానల్స్ తరహాలోనే చేయకూడని ప్రసారాల గురించి చెప్పవచ్చు. కానీ న్యూస్ చానల్స్ తరహాలో స్వీయ నియంత్రణ విధించుకుంటామన్న ఒటిటి వేదికల అభ్యర్థనను మాత్రం ఎంఐబి నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.

ఇంటర్నెట్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఎంఎఐ) సంస్థ రూపొందించిన స్వీయ నియంత్రణ నియమావళిని జీ5, వయాకామ్ 18, డిస్నీ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, ఎం ఎక్స్ ప్లేయర్, జియో సినిమా, ఎరోస్ నౌ, ఆల్ట్ బాలాజీ, అర్రె, హొయ్ చోయ్, హంగామా, షెమారూ, డిస్కవరీ ప్లస్, ఫ్లిక్స్ ట్రీ లాంటి ప్రధాన ఒటిటి సంస్థలు ఆమోదించాయి. దీని వల్ల వినియోగదారుడు తాను స్వయంగా ఏ కార్యక్రమాలు చూడాలనుకుంటాడో, కుటుంబ సభ్యులకు, పిల్లలకు ఏవి అందుబాటులో ఉంచవచ్చునో నిర్ణయం తీసుకునే అవకాశం కలుగుతుంది. ఫిర్యాదుల పరిష్కారానికి, మార్గదర్శకాలను పాటించని వాళ్ళ మీద చర్యలకు కూడా వీలుంది. దీనికి సంబంధించిన సలహామండలిలో కనీసం ముగ్గురు సభ్యులుంటారు వారిలో ఒకరు స్వతంత్ర సలహాదారు, ఇద్దరు ఆ సంస్థకు చెందిన సీనియర్ అధికారులు ఉంటారు. కానీ ఇక్కడే అసలు అభ్యంతరం ఉంది. మెజారిటీ సభ్యులు సంస్థ ఉద్యోగులే అయినప్పుడు నిష్పాక్షికంగా తీర్పు ఉంటుందన్న నమ్మకం లేకపోవటం సహజమే. స్వీయ నియంత్రణ ప్రతిపాదనను ప్రభుత్వం తోసిపుచ్చటానికి ఇదొక కారణం. అయితే, సెన్సార్ చేయటం లాంటి ఆలోచన లేదని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చెప్పటాన్ని బట్టి కొన్ని నిబంధనలు పెట్టి వాటి మీద నిఘా, ఫిర్యాదుల పరిశీలన కోసం కమిటీల ఏర్పాటు చేయవచ్చునని అర్థమవుతోంది.

ఇక వెబ్‌సైట్స్, వెబ్‌చానల్స్, యూ ట్యూబ్ చానల్స్ విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్నది మరో ప్రశ్న. ఇప్పటికిప్పుడు చర్య తీసుకోవటం సాధ్యం కాదు గనుక మొదటి దశలో రిజిస్ట్రేషన్ విధానం ఉంటుంది. దీని వల్ల వాటి నిర్వాహకుల సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను అతిక్రమించే వారి మీద చర్య తీసుకోవటానికి అది వెసులుబాటు కల్పిస్తుంది. దీని వల్ల సీరియస్‌గా నడిపే పెద్ద వెబ్‌సైట్లకు వచ్చిన ముప్పేమీ లేదు. పైగా, వాటికి గుర్తింపు ఇవ్వటానికి కూడా వీలవుతుంది. అక్రెడిటేషన్లు, ప్రకటనలు కేటాయించటానికి ఒక ప్రాతిపదిక కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు వచ్చే సమస్య అంతా చిన్నా చితకా వెబ్‌సైట్ల గురించే. ఇవి ఏ స్థాయికి వచ్చాయంటే రాజకీయ పార్టీలు వీటిని కొనేసుకుంటున్నాయి. ఒకపార్టీకి 150, ఇంకోపార్టీకి 200 అన్నట్టుగా లెక్కపెట్టుకునే పరిస్థితి వచ్చింది. రాజకీయపార్టీల అజెండాను భుజాలకెత్తుకొని అడ్డూ, అదుపూ లేకుండా దూషణలకు దిగటం పనిగా పెట్టుకున్న వెబ్‌సైట్లు చాలానే ఉన్నాయి. ఇకమీదట ఇలాంటి వాటి మీద నిఘా తప్పకపోవచ్చు. వార్తలతో కూడిన యూ ట్యూబ్ చానల్స్ కూడా చాలా పుట్టుకొచ్చాయి. వీలైతే కేబుల్ ద్వారా పంపిణీ చేయటం, లేదంటే అదే యూ ట్యూబ్ ద్వారా ప్రసారం చేయటం బాగా పెరిగిపోయింది. ఇవి కూడా ఇప్పుడు ఎంఐబి నిఘా పరిధిలోకి వస్తాయి.

ఇకపోతే, అసలు సమస్య నియంత్రణ అమలు చేయటంలోనే ఉంది. ఎంఐబి నేరుగా మార్గదర్శకాలు జారీ చేస్తుందా, లేదా మళ్ళీ ట్రాయ్‌ని సిఫార్సులు చేయమంటుందా అనేది తెలియాలి. ట్రాయ్ అయితే సహజంగానే ఒక చర్చాపత్రం జారీ చేసి, దాని మీద అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత సిఫార్సులు చేస్తే ఎంఐబి ఆమోదించిన మేరకు మార్గదర్శకాలు జారీ అవుతాయి. వాటి అమలును పర్యవేక్షించటానికి మళ్ళీ కమిటీలు తప్పనిసరి. కానీ ఈ ప్రక్రియ మొత్తం కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో జరగటం కుదరదు గనుక కచ్చితంగా రాష్ట్రప్రభుత్వాల సహకారం అవసరమవుతుంది. ఎప్పటిలాగానే జిల్లా కలెక్టర్లకు బాధ్యత అప్పగిస్తారు. కేబుల్ చానల్స్ విషయంలో మార్గదర్శకాలు చెప్పి హక్కులు ఇచ్చినా, అత్యధికశాతం కలెక్టర్లు వాటిని ఉపయోగించుకున్న దాఖలాలు లేవు. కేబుల్ చానల్ అని చెప్పుకున్న వాళ్లకు అక్రెడిటేషన్లు ఇవ్వటంలో ఎలాంటి ప్రాతిపదిక ఉండాలి, దేన్ని కేబుల్ చానల్‌గా గుర్తించాలి అనే విషయంలో కలెక్టర్లకు సరైన అవగాహన లేదు. ఇప్పుడు డిజిటల్ వేదికల విషయంలోనూ అంతకంటే భిన్నంగా జరుగుతుందని ఆశించలేం.

ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిందీ, విశ్లేషించాల్సిందీ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ గత చరిత్ర. కేబుల్ టీవీ పుట్టి దేశమంతా విస్తరించి నాలుగేళ్ళు గడిచిన తరువాత ఏం చేయాలో అర్థం కాక 1995లో ఒక చట్టం చేసింది. ఆ తరువాత పాతికేళ్ళలో ఎన్నో మార్పులు వచ్చినా ఇప్పటికీ ఆ చట్టంలో సమగ్రమైన మార్పు చేర్పులు జరగలేదు. శాటిలైట్ చానల్స్‌ను నియంత్రించడం కోసం ప్రభుత్వం తీసుకున్న మొదటి చర్య ఎలక్ట్రానిక్ మీడియా పర్యావేక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం. ఈ కేంద్రంలో సిబ్బంది అన్ని చానల్స్ చూస్తూ, వాటి ప్రసారాల్లో ఎక్కడైనా హద్దుమీరినతనం కనిపిస్తే సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు తెలియజేస్తారు. వివిధ శాఖల కార్యదర్శులతో కూడిన ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఆ అంశాన్ని విచారించి, చానల్ తన వాదన వినిపించటానికి కూడా అవకాశమిచ్చాక శిక్ష విధిస్తుంది. క్షమాపణ కోరుతూ స్క్రోల్ నడపటం మొదలుకుని ఒక రోజు నుంచి నెలరోజుల దాకా ప్రసారాలు నిలిపివేయటం వరకు ఇప్పటిదాకా అనేక శిక్షలు పడ్దాయి. దాదాపు 150 చానల్స్‌కు 500 వరకు శిక్షలు విధించినా, 95శాతం కేసులలో అమలు జరగలేదు. కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవటం అందుకు కారణం.

శాటిలైట్ చానల్స్ మీద, కేబుల్ చానల్స్ మీద వచ్చే ఫిర్యాదులు పరిశీలించి తనకు తెలియజేస్తే చర్యలు తీసుకోవటం సులభం కావచ్చునని ప్రభుత్వం భావించింది. అందుకే రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో పర్యావేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను కోరింది. సమాచార శాఖ ప్రతినిధి, పోలీసుశాఖ ప్రతినిధి, మహిళలు, బాలల సంక్షేమం కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఒకరు, ఒక జర్నలిస్టు.. ఇలా ఏడెనిమిది మందితో రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించింది. అది జరిగి పుష్కరకాలమైంది. మూడుసార్లు రాష్ట్రాలకు గుర్తు చేస్తే సగం రాష్ట్రాలు మాత్రమే కమిటీలు వేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా సగం రాష్ట్రాలు పట్టించుకోలేదు. జిల్లా కమిటీలు కేబుల్ చానల్స్ మీద ఫిర్యాదులు పరిశీలించి రాష్ట్ర కమిటీకి పంపితే అది పరిశీలించి చర్యలకు సిఫార్సు చేయాలి. శాటిలైట్ చానల్స్ మీద ఫిర్యాదులను రాష్ట్ర కమిటీ పరిశీలించి వాటి తీవ్రతను బట్టి కేంద్రానికి పంపుతుంది. కానీ కమిటీలే లేనప్పుడు నియంత్రణ అనేది సాధ్యమయ్యే పని కాదు.

ఇక మూడో అంశం స్వీయ నియంత్రణ. చానల్స్ అన్నీ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్‌గా విడిపోయి రెండు వేరు వేరు సంఘాలు పెట్టుకుని వాటి తరఫున కార్యక్రమాల నియంత్రణ కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశాయి. అయితే, చానల్స్ అన్నీ ఈ సంఘాల్లో చేరాలన్న నిబంధన ఏదీ లేదు. చర్యలు తీసుకోవాలన్నా, సభ్యుల మీద మాత్రమే తీసుకునే వీలుంది. ఆ చర్యలకు కట్టుబడకుండా సంఘం నుంచి వైదొలగినా చేసేదేం లేదు. రెండు తెలుగు చానల్స్ గతంలో అలాగే పరస్పర దూషణలతో వార్తాకథనాలు ప్రసారం చేసి, న్యూస్ బ్రాడ్‌కాస్టర్ల సంఘానికి ఫిర్యాదులు చేసుకున్నాయి. తీరా రెండిటినీ క్షమాపణలు చెబుతూ స్క్రోల్ నడపాలని, లక్ష రూపాయల చొప్పున జరిమానా కట్టాలని ఆదేశిస్తే అవి రెండూ సంఘం నుంచే బైటికొచ్చాయి. ఏడాదికి పది లక్షల దాకా సభ్యత్వ రుసుము కట్టటమెందుకు, శిక్షలు వేయించుకోవటమెందుకు? అనే భావం సహజంగానే ఏర్పడింది. ఇప్పుడు న్యూస్ బ్రాడ్‌కాస్టర్ల సంఘంలో చీలిక తెచ్చి ఆర్ణబ్ గోస్వామి ఇంకో సంఘం పెట్టటం తెలిసిందే. స్వీయ నియంత్రణ పరిస్థితి ఇలా ఉంటుంది.

ఇప్పటిదాకా టీవీ విషయంలో ప్రభుత్వ నియంత్రణ ఎంతమేరకు విజయం సాధించిందో గమనిస్తే ఇప్పుడు చెబుతున్న డిజిటల్ మాధ్యమాల నియంత్రణ మీద కూడా అనుమానాలు రావడం సహజం. కేంద్రం నేరుగా నియంత్రించడం సాధ్యమవుతుందా? రాష్ట్రాల మీద బాధ్యత పెడుతుందా? రాష్ట్రాలు పట్టించుకుంటాయా? పట్టించుకున్నా, రాజకీయాలకు అతీతంగా పని చేస్తాయా అనేవి ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు.

Courtesy Andhrajyothi