-భారత్‌కు ఆ సామర్థ్యం ఉందా?
ప్రస్తుత సవాళ్లు..

న్యూఢిల్లీ: యావత్‌ ప్రపంచాన్ని కరోనా (కోవిడ్‌-19) మహమ్మారి గజగజ వణికిస్తున్నది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 6లక్షలకు చేరగా..28 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇటలీ, చైనా, స్పెయిన్‌, ఇరాన్‌, ఫ్రాన్స్‌, అమెరికా దేశాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. మొత్తం కరోనా బాధితుల్లో ఇటలీ, చైనా దేశాల్లోనే 36 శాతం మంది ఉండగా.. 53 శాతం మరణాలు ఇక్కడే చోటుచేసుకున్నాయి. మెరుగైన వైద్య సౌకర్యాలు కలిగిన దేశాల్లో ఒకటైన అమెరికాలో అత్యధికంగా (1.05లక్షలు) కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ప్రపంచదేశాలను కలవరపెడుతున్నది. భారత్‌లోనూ కోవిడ్‌-19 చాపకింద నీరులా వ్యాపిస్తున్నది. శనివారం నాటికి దేశంలో 938 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 21 మంది ప్రాణాలు కోల్పోగా.. 84 మంది కోలుకున్నారు. అయితే.. వారం వ్యవధిలోనే పాజిటివ్‌ కేసుల సంఖ్య రెట్టింపు కావడం దేశంలో కరోనా వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతున్నది. ప్రపంచవ్యాప్త కరోనా గణాంకాలను గమనిస్తే.. ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య 2-3 శాతంగా ఉంది. అయితే, ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు, రక్షణ చర్యలు అవసరమవుతున్నాయి. మన దేశంలో ప్రస్తుతమున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. కరోనాతో భారత్‌ ఎన్ని రోజులు పోరాడగలదు? ఎంత మంది ప్రాణాలు కాపాడుకోగలదు? ప్రస్తుతం భారత్‌కు కరోనాను కట్టడిచేసే సామర్థ్యం ఉందా? అనే ప్రశ్నలు వైద్యలు, నిపుణులతోపాటు సామాన్య ప్రజానీకంలోనూ మెదలుతున్నాయి.

ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో పది లక్షల జనాభాలో కరోనా ప్రబలిన వారు 0.6 మందితో తక్కువగానే ఉన్నారు. అయితే, పలు అంతర్జాతీయ సంస్థల అధ్యయనాలు, విశ్లేషణలు గమనిస్తే.. మే నెల మధ్య నాటికి దేశంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులూ కరోనా రోగులతో నిండిపోతాయనీ, మౌలిక సదుపాయాల కొరత తీవ్రస్థాయి లో ఉంటుందని అంచనా వేశాయి. అలాగే, జులై చివరి నాటికి దాదాపు 30-50 కోట్ల మంది కరోనా బారినపడే అవకాశాలున్నాయని అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు (వాషింగ్టన్‌-సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్‌, ఎకనామిక్స్‌ అండ్‌ పాలసీ) అంచనా వేశారు. వీరిలో 30-50 లక్షల మంది తీవ్రంగా ప్రభావితమవుతారని తెలిపారు. అయితే, ముందుస్తు చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం సామాజిక దూరాన్ని పాటించటం, ప్రజలు స్వీయనిర్బంధంలో ఉండేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు చివరికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను సైతం విధించింది. అయినప్పటికీ విదేశాల నుంచి ఇదివరకే వచ్చినవారితో కరోనా వైరస్‌ ఇప్పటికీ వ్యాపిస్త్తూనే ఉంది. కర్ఫ్యూ కొనసాగుతున్నప్పటికీ.. ప్రపంచ జనాభాలో 18 శాతం మంది ఉన్న భారతీయులు ఈ మహమ్మారితో పోరాడటానికి ఎంతవరకూ సన్నద్ధంగా ఉన్నారనే దానితోపాటు దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ఇటలీ, చైనా, అమెరికాల నుంచి భారత్‌ ఏం నేర్చుకోవాలి?
కరోనా మహమ్మారి కారణంగా బలమైన ఆర్థిక వ్యవస్థలు, మెరుగైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు కలిగిన చైనా, అమెరికా, ఇటలీ వంటి దేశాలు తీవ్ర స్థాయిలో కలవరపడుతున్నాయి. ఆయా దేశాల్లో ఉన్నటువంటి వైద్య సంబంధిత సౌకర్యాలు గమనిస్తే.. భారత్‌ చాలా వెనకబడి ఉంది. మన దేశంతో పోలిస్తే.. ఆ దేశాల్లో ఆస్పత్రుల పడకలు సైతం ఐదు రెట్లకు పైగా ఉన్నాయి. ఆరోగ్య రక్షణ చర్యలు సైతం మెరుగ్గా ఉన్నాయి. అలాంటి దేశాలు సైతం కరోనా ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అదే భారత్‌ విషయానికొస్తే.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించి వివరాల ప్రకారం.. 10 లక్షల జనాభాకు కేవలం 7 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో మొత్తం పడకలు 15.7 లక్షలు ఉండగా, ప్రయివేటు ఆస్పత్రుల్లో 10.5 లక్షల పడకలు అందుబాటులో ఉన్నాయి. అలాగే, లక్ష కంటే తక్కువ ఐసీయూలు, 20 వేల వెంటిలేటర్లు ఉన్నాయి. దేశ ప్రజల ప్రస్తుత ఆరోగ్య వివరాల ప్రకారం.. జనాభాలో మూడో వంతు ప్రజలు రక్తపోటు, పది మందిలో ఒకరు డయాబెటీస్‌తో బాధపడుతున్నారు. పోషకాహార లోపం, న్యూమోనియా, హృద్రోగవ్యాధులతో బాధపడేవారు సైతం అధికంగానే ఉన్నారు. దీనికి తోడు దేశంలో గాలి నాణ్యత సైతం తక్కువగానే ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య లాక్‌డౌన్‌ అనేది ఈ మహామ్మారి నుంచి దీర్ఘకాలిక పరిష్కారం ఇవ్వదనే విషయాన్ని అధికారులు గుర్తించాలి.

కరోనాపై పోరుకు.. పలువురు ఆరోగ్య నిపుణులు, సంస్థల సూచనల ప్రకారం.. దేశంలో ఆరోగ్య సంరక్షణ వసతులను మెరుగుపర్చాలి. దీని కోసం ఆస్పత్రుల సంఖ్యతో పాటు ఐసోలేషన్‌ వార్డులు, వెంటిలేటర్లు, ఐసీయూలను భారీ స్థాయిలో పెంచుకోవాలి. ఆరోగ్య సిబ్బంది రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఐసీయూ పరికరాలు, వెంటిలేటర్లు, ఔషధాలు, మాస్కులను సమకూర్చుకోవాలి. అలాగే, కరోనా అనుమానితులను గుర్తించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. మొత్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను పూర్తి స్థాయిలో బలోపేతం చేయడానికి ప్రయత్నాలు ఇప్పటి నుంచే ముమ్మరం చేయగలిగితే.. ఎక్కువ సంఖ్యలో ప్రజల ప్రాణాలను కాపాడుకోగలమని నిపుణులు అంటున్నారు.

Courtesy Nava Telangana