మల్లేపల్లి లక్ష్మయ్య

ఈ రోజు కశ్మీర్‌ లోయలో నివసిస్తున్న ముస్లింలంతా పరాయి దేశస్తులు కాదు. చాలా కాలం బౌద్ధులు గానే ఉన్న వాళ్ళు ఇటు హిందువుల ఆదరణ లేక, అటు ముస్లిం దండయాత్రలను తట్టుకోలేక ముస్లింలుగా మతమార్పిడి చేసుకున్నారు. కశ్మీర్‌లో ఈరోజు ముస్లింలుగా ఉంటూ, భారతదేశ మెజారిటీ ప్రజలందరి దృష్టిలో టెర్రరిస్టులుగా, దేశ ద్రోహులుగా పిలువబడుతున్న వాళ్ళంతా ఒకనాటి బౌద్ధులే, హిందువులే అన్నది మరువకూడదు. కశ్మీర్‌ భూభాగమే మనకి కీర్తి పతాక అయినప్పుడు అక్కడి ప్రజలు ఎట్లా శత్రువులవుతారు? నిజానికి వాళ్లంతా మన ఈ మట్టి బిడ్డలేనని గుర్తించాలి మనం. ఆ నేలను ప్రేమిస్తే, ఆ ప్రజలను కూడా ప్రేమించాలి. ఈ దేశాన్ని పట్టి పీడిస్తోన్న ద్వేషభావాన్ని విడనాడాలంటే దేశమంటే మట్టికాదని అర్థం చేసుకోవాలి. మనుషుల్ని ప్రేమించగలగడమే నిజమైన దేశభక్తి అని గుర్తెరగాలి.

‘‘కశ్మీర్‌ విషయంలో మనం పోరాడే సమ యమంతా ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు అని వాదించుకుంటున్నాం. నాకు తోచినంత వరకు ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది ముఖ్యం కాదు. ఏది సరైనది అని తేల్చుకోవాలి. నా దృష్టిలో కాశ్మీర్‌ విభజనే మంచి పరిష్కారం. భారతదేశ విభజన సందర్భంగా చేసినట్లుగానే హిందువులు, బౌద్ధులు ఉన్న ప్రాంతా లను భారతదేశానికీ, ముస్లింలు ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్‌కు ఇస్తే సరిపోతుంది. లేదా మీకు ఇష్టమైతే కశ్మీర్‌ను మూడు భాగాలు చేయండి. కాల్పుల విరమణ జోన్, కశ్మీర్‌లోయ, జమ్మూ – లదాఖ్‌ ప్రాంతాలుగా విభజించండి. కశ్మీర్‌ లోయలో మాత్రమే ప్రజాభి ప్రాయ సేకరణ(ప్లెబిసూట్‌) జరపండి. తమ ఇష్టప్రకారం నడుచు కునే అవకాశం వారికి ఇవ్వండి’’ అంటూ 1951, అక్టోబర్‌ 10 న కేంద్రన్యాయశాఖ మంత్రిపదవికి రాజీనామా చేసిన సందర్భంగా బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ రాసిన ఉత్తరంలోని వాక్యాలివి. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రచనలలో 14వ సంపుటి, రెండవ భాగంలో ఈ ఉత్తరం అచ్చయ్యింది. పాకిస్తాన్‌ వివాదమే విచారకరమని ఆనాడు అంబే డ్కర్‌ ప్రకటించారు. ఆ సమయంలో తూర్పు పాకిస్తాన్‌లోని ముస్లిమే తరుల పరిస్థితి గురించి భారతదేశం పట్టించుకోవడం లేదనీ, మన సమయాన్నంతా కశ్మీర్‌ విషయంలో వెచ్చిస్తున్నామనీ, దీని వల్ల తూర్పు పాకిస్తాన్‌ (నేటి బంగ్లాదేశ్‌)లో పరిస్థితులను విస్మరిస్తున్నా మన్న అభిప్రాయాన్ని అంబేడ్కర్‌ వెలిబుచ్చారు. అంతేకాకుండా, 1940 డిసెంబర్‌లో రాసిన ‘పాకిస్తాన్, భారతదేశ విభజన, పుస్త కంలో పాక్, భారత్‌ విభజన గురించి చాలా వివరంగా చర్చించారు.

భారతదేశ విభజన జరిగితే, బ్రిటిష్‌ ప్రమేయంలేని ఒక అంత ర్జాతీయ బృందం మధ్యవర్తిత్వంలో విభజన జరగాలని ఆయన ప్రతి పాదించారు. కానీ దానిని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పటి వరకు అంబేడ్కర్‌ చేసిన సూచనలను ఎవ్వరూ ప్రస్తావించలేదు. ముఖ్యంగా రాజకీయ నిర్ణయాలు చేస్తున్న పార్టీలకు ఇవేమీ పట్టలేదు. కానీ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పేరును మాత్రం తప్పుడు పద్ధతుల్లో ఉద హరిస్తున్నారు. ఆయన ఎక్కడా ప్రస్తావించని విషయాన్ని తమ రాజ కీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. పది రోజుల క్రితం జరిగిన కశ్మీర్‌ విభజన, 370 ఆర్టికల్, 35 ఏ ఆర్టికల్‌ రద్దు సంద ర్భంగా అంబేడ్కర్‌ని వివాదాల్లోకి లాగారు. జనసంఘ్, ఆరెస్సెస్‌ సిద్ధాంత కర్తల్లో ఒకరైన బల్‌రాజ్‌ మదోక్‌ పుస్తకంలో, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని, 370 ఆర్టికల్‌ని, అంబేడ్కర్‌ వ్యతిరేకించినట్టు ఉన్న విష యాన్ని తమ అధికార బలంతో అనవసరంగా ప్రచారం చేస్తున్నారు. అంబేడ్కర్‌ 370 ఆర్టికల్‌ని వ్యతిరేకించినట్టు ఆయన రచనల్లోగానీ, ప్రసంగాల్లోగానీ ఎక్కడా లేదు. జనసంఘ్‌ ప్రముఖ నేత రాజ్యాంగ సభ సభ్యులు శ్యాంప్రసాద్‌ ముఖర్జీతో అంబేడ్కర్‌ అన్నట్టు బుల్‌రాజ్‌ మదోక్‌ తన పుస్తకంలో రాసుకున్నారు. అయితే దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. నిజానికి అంబేడ్కర్‌ తన అభిప్రాయాలను ఎప్పుడూ దాచుకోలేదు. వ్యక్తులతో ప్రైవేట్‌గా చర్చించే విషయం లోనూ ఆయన ఎప్పుడూ పరిమితులు విధించుకోలేదు. ఒకవేళ అంబేడ్కర్‌కు అటువంటి అభిప్రాయమే ఉన్నట్లయితే, 1951, అక్టో బర్‌లో రాసిన లేఖలో దాన్ని తప్పనిసరిగా పేర్కొనేవాడు.

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఎల్లప్పుడూ మైనారిటీల భద్రత, రక్షణ, హక్కుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆయన ప్రజాస్వామ్య దృక్పథంలో మైనారిటీల హక్కులనేవి అత్యంత ముఖ్యమైనవి. అవి కులం, మతం, ప్రాంతం, భాష ఏ కోణమైనా కావచ్చు. అందుకే అంబేడ్కర్‌ నిజమైన ప్రజాస్వామ్య దృక్పథం కలిగి ఉన్నాడని అర్థం చేసుకోవాలి. భారతదేశ భవిష్యత్తు గురించీ, సామాజిక అణచివేత, పీడనల నుంచి విముక్తి కోసం ఆలోచించి, దాని అమలుకోసం అహ రహం శ్రమించిన వారిలో అంబేడ్కర్‌ అతి కీలకమైన వ్యక్తి. అటు  వంటి వ్యక్తి అభిప్రాయాలను తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం సరైన ది కాదు. ప్రస్తుతం కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులకు మనమంతా కశ్మీర్‌ ప్రజలను బాధ్యులను చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు భారతదేశంలోని చాలా మంది మన సుల్లో కశ్మీర్‌లో ఉన్న ముస్లింల పట్ల ఒక వ్యతిరేక భావాన్ని నింపారు. ఇది చాలా ఉచ్ఛస్థాయికి చేరింది. కశ్మీర్‌పై భారత ప్రభుత్వం తీసు  కున్న ఆర్టికల్‌ 370  రద్దు అనే తీవ్రమైన నిర్ణయం ఒక ముఖ్యమైన విషయంగా మారింది. ఇది భారత్‌ దేశ ప్రజలందరి సమస్యగా మార్చారు. కశ్మీర్‌ భూభాగం మీద అపారమైన ప్రేమ, భక్తి, అక్కడ నివసిస్తున్న ప్రజల మీద ద్వేషాన్ని మెజారిటీ ప్రజలకు కలిగించారు. అందులో భాగమే 370 ఆర్టికల్‌ రద్దు.

నిజానికి కశ్మీర్‌లో ఈ రోజు నివసిస్తున్న ప్రజలు ముఖ్యంగా ముస్లింలు అందరూ ఎక్కడో మధ్య ఆసియా నుంచి వచ్చిన వాళ్ళు కాదు. నిజానికి కశ్మీర్‌ ప్రాంతానికి ఇస్లాం ప్రవేశించింది 14వ శతాబ్దంలో. అంతకు ముందు ఈ ప్రాంతం భారతదేశంలోనే ఆవిర్భ వించిన బౌద్ధం, హిందూ మత సాంప్రదాయాలలోనే ఉంది. క్రీస్తు పూర్వం 3 వేల సంవత్సరాలకు పూర్వం నుంచి ఇక్కడ ప్రజలు నివసిస్తున్నట్టు ఆధారాలున్నాయి. వేదకాలం నుంచి ఇక్కడ జనజీ వనం అభివృద్ధి చెందిందని చరిత్రకారులు భావిస్తున్నారు. అలెగ్జాం డర్‌ దండయాత్రలను కూడా ఈ ప్రాంతం చవిచూసింది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో సామ్రాట్‌ అశోకుడు మౌర్య సామ్రాజ్యాన్ని ఇక్కడికి విస్తరింపజేశాడు. అనాటి నుంచే బౌద్ధం ఈ ప్రాంతమం తటా వ్యాప్తి చెందింది. ఆ కాలంలోనే శ్రీనగర్‌ పట్టణం నిర్మాణ మైంది. క్రీస్తుశకం రెండవ శతాబ్దంలో రాజ్యమేలిన కుషాన్‌ వంశ రాజైన కనిష్కుడు బౌద్ధానికి మరింత విస్తృత ప్రచారం కల్పించాడు. బౌద్ధం నాలుగవ సంగీతి కశ్మీర్‌లోనే జరిగింది. క్రీస్తు శకం 502లో సైనిక తిరుగుబాటు చేసి అధికారంలోకి వచ్చిన మిహిరకులుడు అత్యంత పాశవికంగా బౌద్ధులను హతమార్చాడు. ఆ తర్వాత శైవ మతం అక్కడ బాగా వ్యాప్తి చెందింది. ఈ క్రమం చాలా కాలం కొన సాగింది. అయితే ముస్లిం దండయాత్రలు మొదలైంది 1103లో అని చరిత్రకారుడు మొహబిల్‌హసన్‌ చెప్పారు. ఇది కూడా స్థానిక రాజులు, సామంతుల మధ్య ఉన్న అనైక్యత వల్లనే ముస్లిం సైన్యాలు కశ్మీర్‌ను ఆక్రమించుకున్నాయి. ఇది చరిత్ర.

ఇదంతా ఇక్కడ ప్రస్తావించడానికి కారణం ఉన్నది. ఈ రోజు కశ్మీర్‌లోయలో నివసిస్తున్న ముస్లింలంతా పరాయి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు మొదట వేద సంస్కృతిలో, ఆ తర్వాత బౌద్ధంలో, తదనంతరం హిందువులుగా మారారు. చాలా కాలం బౌద్ధులు గానే ఉన్న వాళ్ళు ఇటువైపు హిందువుల ఆదరణ లేక, అటు వైపు ముస్లిం దండయాత్రలను తట్టుకోలేక ముస్లింలుగా మతమా ర్పిడి చేసుకున్నారు. నేటి అప్గానిస్తాన్, పాకిస్తాన్‌ దేశాలు ఒకనాటి గాంధార, పెషావర్‌ రాజ్యాలు. అవన్నీ కూడా బౌద్ధంలోనే వికాసం చెందాయి. కానీ హిందువుల ఊచకోత, ముస్లింల దాడులు కలగలిసి బౌద్ధులందరూ హిందువులుగా, ముస్లింలుగా మారిపోయారు. అందుకే అప్గానిస్తాన్‌. పాకిస్తాన్, కశ్మీర్, బంగ్లాదేశ్‌లలో ముస్లింల జనాభా ఆ స్థాయిలో పెరిగింది. అందుకే కశ్మీర్‌లో ఈరోజు ముస్లిం లుగా ఉంటూ, భారతదేశ మెజారిటీ ప్రజలందరి దృష్టిలో టెర్రరిస్టు లుగా, దేశ ద్రోహులుగా పిలువబడుతున్న వాళ్ళంతా ఒకనాటి బౌద్ధులే, హిందువులే అన్న విషయం మరువకూడదు. వాళ్లంతా తర తరాల నుంచి ఇక్కడి సంస్కృతీ, సాంప్రదాయాలకు నిజమైన వార సులే. ఆధునిక భారతదేశంలో స్వార్థ రాజకీయాల కారణంగా  వాళ్ళు భారత దేశానికి శత్రువులుగా కనిపిస్తున్నారు.

అందువల్లనే అక్కడ కశ్మీర్‌ ప్రజలు నిత్యయుద్ధవాతావరణంలో సతమతమౌతోంటే, ఏ క్షణం ఏం జరుగుతుందో అని గుండెలు గుప్పిట్లో పెట్టుకొని ప్రాణభయంతో బతుకులీడుస్తోంటే మనం ఆనందంలో గంతులు వేస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు 80 వేల మంది కశ్మీరీ ప్రజలు ప్రాణాలు కోల్పోతే మనకు చీమకుట్టినట్టయినా లేదు. కశ్మీర్‌ భూమి మనకు పవిత్రమైనదైనప్పుడు, ఒట్టి మట్టికే మనం అంత గౌరవం ఇస్తున్నప్పుడు, కశ్మీర్‌ భూభాగమే మనకి కీర్తి పతాక అయినప్పుడు అక్కడి ప్రజలు ఎట్లా శత్రువులవుతారు? నిజా నికి వాళ్లంతా మన ఈ మట్టి బిడ్డలేనని గుర్తించాలి మనం. ఆ నేలను ప్రేమిస్తే, ఆ ప్రజలను కూడా ప్రేమించాలి. ఈ దేశాన్ని పట్టి పీడిస్తోన్న ద్వేషభావాన్ని విడనాడాలంటే దేశమంటే మట్టికాదని అర్థం చేసుకో వాలి. ఏ భూమిపై నున్న మనుషులైనా మనుషులేననీ, మనుషుల్ని ప్రేమించగలగడమే నిజమైన దేశభక్తి అనీ గుర్తెరిగి మసలుకుంటే మానవత్వం పరిమళిస్తుంది. లేదంటే ఒక కశ్మీర్‌ కాదు దేశమంతటా కల్లోలాలు పెల్లుబుకుతూనే ఉంటాయి.

వ్యాసకర్త : సామాజిక విశ్లేషకులు.

( Courtacy Sakshi)