వ్యవసాయ రంగంలో పురోగతి చక్కగా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ లోని ఇతర రంగాల పరిస్థితి ఆశాజనకంగా లేదు. 2020-–21 ఆర్థిక సంవత్సర జీడీపీ 2019–-20 ఆర్థిక సంవత్సర జీడీపీని మించిపోయినప్పుడు మాత్రమే ఆర్థిక వ్యవస్థ కోలుకున్నదని నిశ్చయంగా చెప్పగలుగుతాము. అలాంటి మెరుగైన పరిస్థితి 2022-–23 ఆర్థిక సంవత్సరం వరకు నెలకొనకపోవచ్చు. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు నిండు ఆశాభావం ఉంటే 2020-–21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ పెరుగుదల రేటు ధనాత్మకంగా ఉంటుందని ఎందుకు చెప్పలేదు?

భవిష్యత్తు ఏమిటి? కొంతమందికి సమగ్ర దృష్టి ఉంటుంది. కొంతమంది మెరుగ్గా చూడగలుగుతారు. ఇటువంటివారే ద్రష్టలు. సామాన్యులు చూడలేని విషయాలను ద్రష్టలు చూడగలుగుతారు. కొంతమంది మరింత మెరుగ్గా చూడగలుగుతారు. వీరు దైవసమానులు. సామాన్యులు ఊహించలేని భావి పరిణామాలను వారు ఖచ్చితంగా చెప్పగలుగుతారు.

నా చుట్టుపక్కల పరిసరాలలో నేను చూస్తున్న వాటి గురించి మీకు నివేదిస్తాను. మీరు, మీ చుట్టుపక్కల చూస్తున్న సంఘటనలు, పరిణామాలతో వాటిని పోల్చి చూసుకోండి. చెన్నై మహానగరంలో ప్రతిదీ తెరిచే వుంటుంది. జనజీవనంలో ప్రతిదీ స్పష్టంగా వుంటుంది. అవునా? అంతలోనే ప్రతి దాన్ని హఠాత్తుగా మూసి వేయడం సంభవిస్తుంది. లాక్‌డౌన్, లాక్‌డౌన్ ఎత్తివేత, మళ్ళీ లాక్‌డౌన్… ఇదొక విస్మయకర ఆవృత పరిణామం. ఏది ఎప్పుడు తెరిచివుంటుందో, ఏది ఎప్పుడు మూసివేతకు గురవుతుందో చెప్పలేని పరిస్థితి. భ్రమ, వాస్తవం కలగలిసిపోతున్నాయి సుమా!

సంపన్నులు, ఉన్నత స్థాయి మధ్యతరగతి ప్రజలు ఇంటి పట్టునే ఉండిపోతున్నారు. జీవితం సుఖంగా సాగిపోవడానికి అవసరమైన సిరిసంపదలు వారికి వున్నాయి. లేదూ, పొదుపు చేసుకున్న ఆర్జనపై ఈ కష్టసమయంలో ఆధారపడుతున్నారు. కరోనా పీడకల వీలైనంత త్వరగా ముగిసిపోవాలని పరాత్పరుడిని ప్రార్థిస్తున్నారు… ఆ శుభ సమయం ఎప్పుడు ఆసన్నమయ్యేది ఎవరికీ తెలియదు. క్రిందిస్థాయి మధ్యతరగతి ప్రజలు తమ తమ పని ప్రదేశాలకు వెళుతున్నారు. తప్పదు గదా. తిరిగి ఇంటికి వస్తున్నారు. నిత్య జీవితంతో దాగుడుమూతలు ఆడుతున్నారు. మరీ అవసరమయితేనే ఇంటి నుంచి బయటకు వెళుతున్నారు. పని ముగించుకుని వెన్వెంటనే వెనక్కి వస్తున్నారు. భయం వారి జీవితాలను వెంటాడుతోంది.

సరే, పేదలు మరీ ముఖ్యంగా దుకాణదారులు, స్వయం ఉపాధి ఆటో డ్రైవర్లు; వడ్రంగులు, ప్లంబర్లు మొదలైన వృత్తి నిపుణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పని అన్వేషణలో బయటకు వెళుతున్నారు. సాధారణ ఆర్జనలో యాభై శాతం కంటే తక్కువ ఆదాయంతో ఇంటికి తిరిగివస్తున్నారు. అసంతృప్తి సదా వారిని ఆవహించివుంటోంది. వారి జీవితోత్సాహాన్ని చంపివేస్తోంది. నిరుపేదలు పూర్తిగా కృంగిపోయారు. జీవితం సర్వనాశనమయినప్పుడు మరేమవుతారు? బతుకుతెరువు కోసం వలసవచ్చిన అభాగ్యులు వారు. కరోనా కష్టాలతో మళ్ళీ తమ స్వస్థలాలకు మరలిపోయారు. ఇప్పుడు వారి జీవితాలకు రెండే రెండు ఆలంబనలుగా ఉన్నాయి. ఒకటి- జాతీయ ఆహార భద్రతా పథకం; రెండు- గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ రెండూ యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినవే. చాలామంది నిరుపేదలు ఎన్ జి ఓ ల దాతృత్వంపై ఆధారపడివున్నారు. ప్రభుత్వాలు తమను పట్టించుకోకపోవడం పట్ల వారు అమితంగా చిరాకు పడుతున్నారు. ఇది తమ కర్మ అంటూ సరిపెట్టుకుంటున్నవారి సంఖ్య తక్కువేమీ కాదు.

చిన్న పట్టణాలలో ప్రతిదీ తెరిచే వుంటోంది. బజార్, దుకాణాలను పగలంతా తెరుస్తున్నారు. వివిధ సేవలనందించే వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు. అయితే కూరగాయలు, పండ్లు, మాంసం, చేపలకు మినహా పాదరక్షలు, బట్టలు మొదలైన వాటిని కొనుగోలుచేసేవారెవరూ బజార్ లో కన్పించడం లేదు.

గ్రామీణ భారతం ఉల్లాసంగా ఉన్నది. నిత్యకార్యకలాపాలు యథావిధిగా పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. చాలా కొద్దిమంది మాత్రమే మాస్క్‌లు ధరిస్తున్నారు. పంటల సమృద్ధిగా పండాయి. రబీ పంటల దిగుబడుల సేకరణ వూర్తయింది. రైతులు మళ్ళీ నాట్లు వేస్తున్నారు. పొలం పనులకు ఉత్సాహంగా పోతున్నారు. గ్రామస్తులు నిత్యావసర సరుకులను కొనుగోలు చేసుకుంటున్నారు. అంతకుమించి మరి వేటినీ కొనుగోలుచేయడానికి వారు సిద్ధపడడం లేదు. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల విక్రయాలు సజావుగా కొనసాగుతున్నాయి. సంపన్న రైతులు ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేసు కొంటున్నారు. స్కూటర్ల, చిన్న కారుల కొనుగోళ్ళు కూడా బాగానే జరుగుతున్నాయి. వాణిజ్య వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల వాహనాల కొనుగోలుదారులను నిరుత్సాహపరుస్తోంది. వస్తుసేవల పన్ను మొదలైన అవరోధాలు ఉన్నప్పటికీ సరఫరా పరంపరలను పునరుద్ధరింపబడుతున్నాయి. 2020–-21 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయరంగం పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశం ఎంతైనా ఉన్నది. మెరుగైన ఫలితాల నివ్వడమంటే వృద్ధిరేటు ఎంతలేదన్నా నాలుగు శాతంగా ఉండి తీరాలి. అలాంటి వృద్ధిని సాధించినప్పుడు మాత్రమే స్థూల దేశియోత్పత్తి (జీడీపీ) 0.60 శాతం పెరుగుదలకు వ్యవసాయ రంగం దోహదం చేయగలదు.

వ్యవసాయరంగంలో పురోగతి చక్కగా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ లోని ఇతర రంగాల పరిస్థితి ఆశాజనకంగా లేదు. వ్యవవసాయేతరరంగాలలో వ్యాకులత, అనిశ్చితి నెలకొనివున్నాయి. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు (క్లుప్తంగా చిన్న పరిశ్రమలు) మరింత సంక్షోభంలోకి దిగజారిపోయాయి. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని చిన్నపరిశ్రమల యజమానులు భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం 10 కోట్ల చిన్న పరిశ్రమలు ఉండగా వాటిలో 45 లక్షల పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల రుణ సదుపాయం కల్పించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హామీ పడింది. బ్యాంకుల నిరర్థక ఆస్తులలో 10 శాతం స్థాయిలో అంటే రూ.30 లక్షల కోట్ల మేరకు చిన్న పరిశ్రమలకు రుణ సదుపాయం కల్పించాలి. అయితే కేవలం రూ.70,000 కోట్లు మాత్రమే మంజూరు చేయడం జరిగింది. అందులో కూడా కేవలం రూ.35,000 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. వేలాది చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షలాది కార్మికులు వీధిన పడ్డారు. ఉద్యోగాల నష్టం భారీ స్థాయిలో ఉన్నది. ఈ నష్టం శాశ్వతమైనది అనడంలో సందేహం లేదు.

ట్రావెల్, టూరిజం, ఎయిర్‌ లైన్స్, బస్ ట్రాన్స్‌పోర్ట్, ఆతిథ్యం, హోటల్ రంగం, వినియోగ వస్తువులు, నిర్మాణరంగం, ఎగుమతులు మొదలైన రంగాలన్నీ కునారిల్లిపోతున్నాయి. ఈ రంగాలలోని అనేక సంస్థలు భారీగా నష్ట పోయాయి. పలుసంస్థలు తాము దివాలా తీసినట్టు సంబంధిత ప్రభుత్వ సంస్థలకు నివేదించుకున్నాయి. వ్యాపారాల దివాళాతో లక్షలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు మటుమాయ మైపోయాయి. పలు కంపెనీలు తమ మూలధన వ్యయాలను భారీగా తగ్గించుకున్నాయి. మార్కెట్లో డిమాండ్ ఇప్పటికీ చాలా చాలా తక్కువగా ఉన్నది. ఇది తయారీరంగం, సేవలరంగాన్ని తీవ్రంగా కృంగదీస్తోంది. ప్రజలు నగదును దాచిపెట్టుకుంటున్నారు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి- కొవిడ్ వ్యాధి సంక్రమిస్తుందనే భయం, సంభావ్య వైద్య వ్యయాలు; రెండు- చైనా నుంచి ముంచుకొస్తున్న ముప్పు. కొవిడ్ భయం, చైనా ముప్పు రెండూ భారత్‌ను 2020–-21 ఆర్థిక సంవత్సరంలో మాంద్యంలోకి లాగనున్నాయి. ఇలా మాంద్యంలోకి దిగజారిపోవడం 42 సంవత్సరాలలో ఇదే మొదటిసారి అవుతుంది. వృద్ధి రేటు 5 శాతం మేరకు తగ్గిపోతుంది. మాంద్యం నెలకొనడమంటే నిరుద్యోగం పెరిగిపోతుంది, ఆదాయాలు, వేతన భత్యాలు తగ్గిపోతాయి. ఇది అనివార్యం. తలసరి ఆదాయం 10 నుంచి 12 శాతం మేరకు తగ్గిపోవచ్చు. దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నవారు మరింతగా పేదరికంలోకి జారిపోతారు.

ఆర్థిక వ్యవస్థలో శీఘ్ర పురోగమనాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ చూస్తుంది. గోధుమల సేకరణ (382 లక్షల మెట్రిక్ టన్నులు), ఖరీఫ్ పంటల సాగు భూముల వైశాల్యం (13.13 మిలియన్ హెక్టార్లు), ఎరువుల విక్రయాలు, విదేశీమారక ద్రవ్య నిల్వలు (507 బిలియన్ డాలర్లు) మొదలైన అంశాలలో పెరుగుదల ఆర్థిక మంత్రిత్వ శాఖను అమితంగా ఉత్సాహపరుస్తోంది. అయితే మిగతా రంగాలు ఇటువంటి ఆశాభావాన్ని కల్పించడం లేదు. తయారీ, సేవల రంగాలలో పెరుగుదల రుణాత్మకంగా ఉన్నది. తయారీరంగం పెరుగుదల 27.4 శాతం మేరకు సంకోచించింది. సేవల రంగంలో వృద్ధి 5.4 శాతం మేరకు సంకోచించింది. విద్యుత్ వినియోగం 12.5 శాతం తగ్గిపోయింది. పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 23.2 శాతం తగ్గిపోయింది. బొగ్గు వినియోగం 4 శాతం మేరకు తగ్గిపోయింది. రైల్వే వస్తు రవాణా గత ఏడాది కంటే బాగా తగ్గిపోయింది. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో ఉద్యోగాల నష్టం భారీ స్థాయిలో ఉన్నది.

పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ కోలుకోనున్నదని ఆర్థిక మంత్రిత్వ శాఖ జోస్యం చెప్పింది. 2020–-21 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 5 శాతం తగ్గిపోయినప్పటికీ , 2021–-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5 శాతం అధికంగాఉండగలదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఘంటాపథంగా చెబుతోంది. . అయితే వాస్తవం అలా కన్పించడం లేదు. 2020-–21 ఆర్థిక సంవత్సర జీడీపీ 2019–-20 ఆర్థిక సంవత్సర జీడీపీని మించిపోయినప్పుడు మాత్రమే ఆర్థిక వ్యవస్థకోలుకున్నదని నిశ్చయంగా చెప్పగలుగుతాము. అయితే అలాంటి మెరుగైన పరిస్థితి 2022–-23 ఆర్థిక సంవత్సరం వరకు నెలకొనక పోవచ్చు. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు నిండు ఆశాభావం ఉంటే 2020-–21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ పెరుగుదల రేటు ధనాత్మకంగా ఉంటుందని ఎందుకు చెప్పలేదు? అలా చెప్పేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సాహసించదు, సాహసించలేదు!

పి. చిదంబరం
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Courtesy AndhraJyothy