పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రతినిధులలో కాస్త ముందుచూపున్న పెద్దలు ప్రస్తుత ఆర్థిక సంక్షోభం తలెత్తిన తొలి నాళ్ళలోనే దీనినుంచి బైటపడే మార్గాల గురించి సూచనలిస్తూ వచ్చారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకొనేందుకు అవసరమైన ‘ప్రేరణ’ను ఇచ్చే విధంగా ప్రభుత్వ వ్యయాన్ని బాగా పెంచాలని వారంతా సూచించారు. ఇప్పుడు ఆ సూచన కాస్తా బ్రిటన్‌ వరకైనా ఒక అధికారిక విధానంగా మారిందని చెప్పాలి. 1930 దశకంలో అమెరికాలో అప్పటి అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌ ‘న్యూ డీల్‌’ పేరిట అమలు చేసిన విధంగానే తానూ ఇప్పుడు బ్రిటన్‌ లో ప్రభుత్వ పెట్టుబడిని బాగా పెంచుతానని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఇటీవల ప్రకటించారు. ప్రత్యేకించి రూజ్‌వెల్ట్‌ అమలు చేసిన ‘న్యూ డీల్‌’ గురించి ప్రస్తావిస్తూ అప్పటి లాగానే ఇప్పుడు కూడా అవసరమైతే సంపన్నులపై పన్నులు పెంచుతానని జాన్సన్‌ అన్నారు.

నయా ఉదారవాద విధానం ఇంక ఎంతమాత్రమూ కొనసాగే అవకాశాలు లేవని, దాని ముందున్న దారులన్నీ మూసుకుపోయాయని ఇప్పటికైనా జాన్సన్‌ గుర్తించడం అభినందనీయమే. మార్కెట్‌లో పెట్టుబడిదారులను ఏ విధంగానైనా నియంత్రించేలా ప్రభుత్వం జోక్యం కల్పించుకోరాదంటూ ఇంతకాలమూ నయా ఉదారవాదం వాదిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడది పెద్ద సంక్షోభంలో కూరుకుపోయింది. దాన్నుంచి బైట పడాలంటే ప్రభుత్వ జోక్యం అనివార్యం అయింది. మన మోడీ ప్రభుత్వానికి మాత్రం ఇంకా ఈ విషయం అర్థం కాలేదు. ఇప్పటికీ అది ‘సంపద సృష్టికర్తలకు’ ప్రోత్సాహకాలివ్వడమే అన్ని సమస్యలకూ పరిష్కారమన్న పాత చింతకాయ పచ్చడి కబుర్లనే పదే పదే వల్లిస్తోంది. మన సంగతి పక్కనబెడితే జాన్సన్‌ గాని, మరే పశ్చిమ దేశపు అధినేత గాని తాను కోరుకున్నంత మాత్రాన ‘న్యూ డీల్‌ ‘ ను తమ దేశంలో అమలు చేయడం అంత సాధ్యం అయ్యే పని కాదు.

1930 దశకంలో ‘న్యూ డీల్‌’ ను అమలు చేసేనాటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పట్లో అంతర్జాతీయీకరణ చెందిన ద్రవ్య పెట్టుబడి లేదు. ఏ దేశానికాదేశంగానే ద్రవ్య పెట్టుబడి ఉండేది. ఆయా దేశాల ప్రభుత్వాల తోడ్పాటుతో అది మనగలిగేది. ఈ దేశాలన్నీ ఒక తీవ్రమైన పరస్పర పోటీలో ఉండేవి. సామ్రాజ్యవాద దేశాల మధ్య అంతర్‌ వైరుధ్యాలు తీవ్రంగా ఉండే కాలం అది. అప్పుడు ఒక దేశంలోని ప్రభుత్వానికి ఆ దేశపు ద్రవ్య పెట్టుబడిని ఏదో ఒక మేరకైనా అదుపు చేయగలిగే వీలుండేది. తమ దేశంలో వ్యవస్థను కాపాడుకోడానికి అవసరమైన విధాన మార్పును (న్యూ డీల్‌ వంటిది) రూపొందించి దానిని ఆ దేశపు ద్రవ్య పెట్టుబడి అంగీకరించేలా ఒప్పించగలిగే పరిస్థితి ఆ దేశాల ప్రభుత్వాలకు వుండేది.

అటువంటి పరిస్థితిలో కూడా అమెరికన్‌ ద్రవ్య పెట్టుబడి ఆనాడు రూజ్‌వెల్ట్‌ తెచ్చిన ‘న్యూ డీల్‌’ ను తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ ‘న్యూ డీల్‌’ అమలు ఫలితంగా మాంద్యం నుండి అమెరికన్‌ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నప్పటికీ దాని అమలును పాక్షికంగా అడ్డుకుంది. దాంతో అమెరికన్‌ ప్రభుత్వం వెనకడుగు వేయక తప్పలేదు. దాని ఫలితంగా 1937 లో అమెరికన్‌ ఆర్థిక వ్యవస్థ తిరిగి మరోసారి మాంద్యంలో కూరుకుపోయింది. ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధానికి సిద్ధం అవుతూ ఆ క్రమంలో ఆయుధాల ఖర్చు పెంచడం ద్వారా ప్రభుత్వ వ్యయం పెరిగి దాని పర్యవసానంగా మాంద్యం నుండి ఆ దేశం బైట పడగలిగింది. అంత వరకూ వస్తు వినిమయ రంగంలో కొంత మెరుగుదల వచ్చినా, పారిశ్రామిక రంగంలో యంత్ర సాధనాలపైన గాని, ముడి సరుకులపై గాని ఖర్చు ఏమాత్రం పెరగలేదు. ఆయుధాల డిమాండు ఒక్కసారి పెరిగేసరికి పారిశ్రామిక పెట్టుబడి వ్యయం పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది.

మార్కెట్‌లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే అది కార్పొరేట్ల ద్వారా మాత్రమే జరగాలన్నది ద్రవ్య పెట్టుబడి వైఖరి. అందుకు భిన్నంగా నేరుగా ప్రభుత్వం గనుక జోక్యం కల్పించుకుంటే దానిని ద్రవ్య పెట్టుబడి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ వ్యతిరేకత అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది. కార్మిక హక్కులను కాలరాయడం, తమకు మరింతగా పన్ను రాయితీలివ్వడం వంటి చర్యలను ప్రభుత్వం అమలు చేసి తమచేత మరింత ఎక్కువగా పెట్టుబడులను పెట్టించేలా ప్రేరేపించాలే తప్ప ప్రభుత్వమే నేరుగా జోక్యం కల్పించుకోగూడదు. ద్రవ్య పెట్టుబడి కోరుకునేది ఇదే (ఇటువంటి చర్యలు అన్నీ మోడీ ప్రభుత్వం చేపట్టింది. అయినా కార్పొరేట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదు. అది వేరే సంగతి).

ఆర్థిక సంక్షోభం ఎంత తీవ్రంగా ఉన్నా, ప్రభుత్వ జోక్యం అనివార్యమైనా అటువంటి జోక్యాన్ని ద్రవ్య పెట్టుబడి ఒప్పుకోదు. ప్రభుత్వ జోక్యం వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే ఇక పెట్టుబడిదారుల ఆధిపత్యం అవసరం ఏముందన్న ప్రశ్న ఎదురౌతుంది. పెట్టుబడిదారులను కాపాడి, వారిని ప్రోత్సహించవలసిన అగత్యం సమాజానికి ఏముందన్న ప్రశ్న ముందుకొస్తుంది. ఆ వర్గం చేసే పనిని అంతకన్నా మెరుగ్గా ప్రభుత్వం, ప్రభుత్వ రంగం చేయగలిగినట్టు స్పష్టమైతే ఇక పెట్టుబడిదారుల అవసరం ఉండదని అందరికీ అర్థమైపోతుంది. అందువల్లే, ద్రవ్య పెట్టుబడి ప్రభుత్వ జోక్యాన్ని ఒప్పుకోదు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో అనేక దేశాల్లో ప్రభుత్వాలే నేరుగా ఆర్థిక వ్యవస్థలో జోక్యం కల్పించుకుని ప్రభుత్వ రంగాన్ని నిర్మించాయి. దేశాభివృద్థి జరగాలంటే పెట్టుబడిదారుల అవసరం ఏమీ లేదన్న భావన బలపడింది. అందుకే నయా ఉదారవాద సంస్కరణల అమలును చేపట్టే సమయంలో ప్రభుత్వ రంగాన్ని అపఖ్యాతిపాలు చేసే ప్రచారం ముమ్మరంగా సాగింది. ఇప్పుడు, ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ జాన్సన్‌ ప్రభుత్వ పెట్టుబడిని పెంచడం గురించి మాట్లాడుతున్నాడంటే అది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎటువంటి నిస్సహాయ స్థితిలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఉందో మనకి తెలుస్తోంది. నయా ఉదారవాద విధానాలు తెచ్చిపెట్టిన సంక్షోభం దానిని మరణశయ్య మీదకు చేర్చిందని స్పష్టం అవుతోంది.

‘న్యూ డీల్‌’ ను 1930 దశకంలో వ్యతిరేకించినట్టే, అదే కారణాల వలన, ఇప్పుడూ అటువంటి ప్రతిపాదనలను ద్రవ్య పెట్టుబడి వ్యతిరేకిస్తుంది. ఈ వ్యతిరేకత అప్పటికన్నా చాలా తీవ్రంగా ఉంటుంది. 1930 ల్లో ఏ దేశానికి ఆ దేశం తన స్వంత ద్రవ్య పెట్టుబడిని ఒప్పించగలిగితే సరిపోయేది. కాని ఇప్పుడు ప్రతీ దేశమూ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని ఎదుర్కోవాలి. ద్రవ్య పెట్టుబడి అంతర్జాతీయీకరణ చెందడమంటే ఏమిటి? ఏ ప్రభుత్వమైనా ఈ ద్రవ్య పెట్టుబడి ఆదేశాలకు భిన్నంగా గనుక వ్యవహరిస్తే, ‘న్యూ డీల్‌’ వంటి చర్యలతో సంపన్నులపై పన్నులను పెంచితే, ద్రవ్యలోటును పరిమితికి మించి పెంచితే, వెంటనే ఆ దేశం నుంచి పెట్టుబడి ఇతర దేశాలకు ఎగిరిపోతుంది. దాంతో ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రమౌతుంది. గతంలో ద్రవ్య పెట్టుబడి తన ప్రభుత్వంపై రాజకీయంగా వత్తిడి తెచ్చేది. ఇప్పుడు ఆ రాజకీయ వత్తిడికి తోడు ఆర్థిక దాడికి కూడా పూనుకుంటుంది. ఆ దేశం నుండి పెట్టుబడి ఎగిరిపోతుంది.

ఇప్పుడు ప్రపంచం మొత్తం గనుక ఒకే ప్రభుత్వంగా ఉన్నట్లయితే ఈ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి ముకుతాడు వేయవచ్చు. కనీసం అన్ని ప్రభుత్వాలూ కలిసి కూడబలుక్కుని వ్యవహరించినట్లయితే, ఒకేసారి అన్ని దేశాల్లోనూ ‘న్యూ డీల్‌’ అమలు చేపట్టినట్టయితే ఇక ఎక్కడికి ఎగిరిపోవాలో తెలియక ద్రవ్య పెట్టుబడి దిగిరావచ్చు. కాని ఇటువంటి ఆలోచనలను ఏ పెట్టుబడిదారీ సిద్ధాంతవేత్తగాని, ఏ సంపన్న దేశంగాని చర్చించడానికి ప్రయత్నమే చేయడంలేదు.

ఇటువంటి సమయంలో బోరిస్‌ జాన్సన్‌ సంపన్న దేశం అయిన బ్రిటన్‌లో విడిగా ‘న్యూ డీల్‌’ ను అమలు చేయడానికి పూనుకుంటే తన దేశం నుండి పెట్టుబడి ఎగిరిపోకుండా అవసరమైన చర్యలను తీసుకోవలసి వుంటుంది. అందుకు అవసరమైన ఆంక్షలను పెట్టుబడిపై విధించవలసి వుంటుంది. బ్రిటన్‌ ఆర్థికంగా బలమైన దేశమే. దాని ఆర్థిక ప్రయోజనాలన్నీ లండన్‌ నగరం చుట్టూ నెలకొని వున్నాయి. ఆ నగరాన్ని వదిలిపెట్టి ద్రవ్య పెట్టుబడి ఎగిరిపోకుండా నిరోధించే శక్తి బ్రిటన్‌ కు లేదు. ఈ సంగతి విస్మరించి న్యూడీల్‌ గురించి మాట్లాడడం అంటే అది కేవలం కాలక్షేపం కోసం కబుర్లు చెప్పడం వంటిదే. సంక్షోభం ఎందుకొచ్చిందో, దానిని నివారించడానికి ఏం చేయాలో ఒక ఆర్థిక సిద్ధాంతంగా జాన్‌ మేనార్డ్‌ కీన్స్‌ ఆనాడు చెప్పాడు. కాని అది అమలు కాలేదు. ద్రవ్య పెట్టుబడి ప్రతిఘటనే దానికి కారణం. ఇప్పుడూ అంతే. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రతిఘటనను పరిగణనలోకి తీసుకోకుండా, దానిని తిప్పికొట్టే చర్యలకు పూనుకోకుండా ‘న్యూ డీల్‌’ గురించి మాట్లాడడం అంటే అది వట్టి కబుర్లు చెప్పడమే.

ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రతిఘటనను ఓడించి మరో ‘న్యూ డీల్‌’ వంటిది అమలు చేయాలంటే అది వర్గ పోరాటం ద్వారా మాత్రమే సాధ్యం. కార్మిక వర్గాన్ని సమీకరించి ద్రవ్య పెట్టుబడి పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడాల్సి వుంటుంది. కాని అది బోరిస్‌ జాన్సన్‌ సారథ్యం వహిస్తున్న ఒక మితవాద ప్రభుత్వానికి సాధ్యమా? నిజానికి ఆ దేశంలో ప్రతిపక్షంగా ఉన్న లేబర్‌ పార్టీకి, దాని ‘మధ్యేవాద’ నాయకత్వానికి సైతం ఇటువంటి పోరాటం చేయడం, అందులో కార్మిక వర్గాన్ని సమీకరించడం సాధ్యమయ్యే పని కాదు. అటువంటి పోరాటాలు వామపక్ష ఉద్యమాలద్వారా మాత్రమే సాధ్యపడతాయి. వామపక్ష శక్తులు గనుక అటువంటి ఉద్యమాలను నిర్వహిస్తే అప్పుడు సాగే వర్గ పోరాటాలు ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్థ చట్రం పరిధికే ఎందుకు పరిమితం కావాలి? ఇప్పుడున్న తరుణంలో దేశాన్ని ముందుకు నడిపించడానికి జరిపే పోరాటాలు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ లోనే పరిమితం కాకుండా ఆ పరిధిని దాటి సోషలిజం దిశగా సాగే అవకాశం ఉంది.

ఇరవయ్యో శతాబ్దం తొలినాళ్ళలో గుత్త పెట్టుబడిదారీ విధానం గురించి, దాని కొల్లగొట్టే దోపిడీ గురించి చర్చ నడిచింది. గుత్త పెట్టుబడిదారీ విధానం వలన సంక్షోభం వస్తోంది గనుక తిరిగి వెనక్కి, అంటే అంతకు ముందున్న స్వేచ్ఛా మార్కెట్‌ పోటీ ఉండే పెట్టుబడిదారీ విధానానికి మరలాలని పలువురు వాదించారు. దీనిని ఆనాడు లెనిన్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. స్వేచ్ఛా మార్కెట్‌ విధానం నుండే గుత్త పెట్టుబడిదారీ విధానం తలెత్తిందని వివరించారు. అందుచేత చెట్టు తిరిగి మొక్కగా మారడం సాధ్యం కానట్టే గుత్త పెట్టుబడిదారీ విధానం నుండి తిరిగి వెనక్కి స్వేచ్ఛా మార్కెట్‌ విధానానికి మళ్ళడం సాధ్యం కాదని లెనిన్‌ స్పష్టం చేశారు. గుత్త పెట్టుబడిదారీ దశ తర్వాత ఇక సోషలిజానికి మార్పు చెందడమే పరిష్కారం అని తెలిపారు.

ప్రస్తుతం కూడా ఇటువంటి చర్చే సాగుతోంది. నయా ఉదారవాదం ముందున్న దారులన్నీ మూసుకుపోయాయి. కనుక వెనక్కి మళ్ళి రెండో ప్రపంచ యుద్ధానంతర కాలంలో అమలు చేసిన ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానాన్ని అమలు చేయాలని పెట్టుబడిదారీ వ్యవస్థ సమర్ధకులు, బోరిస్‌ జాన్సన్‌ వంటి నాయకులు వాదిస్తున్నారు. ఆ విధానం యొక్క ఒకానొక రూపమే ‘న్యూ డీల్‌’. అయితే, ఈ తరహా ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం నుంచి పుట్టుకొచ్చిందే నయా ఉదారవాద విధానం. ప్రభుత్వం జోక్యంతో అమలు జరిగిన పెట్టుబడిదారీ విధానంలోని వైరుధ్యాల నుండి నయా ఉదారవాద విధానం పుట్టింది. ఇప్పుడు దీనిలోని వైరుధ్యాలను పరిష్కరించడానికి తిరిగి వెనక్కి పోవాలనే ప్రతిపాదన సరైన పరిష్కారం కాబోదు. కాలాన్ని వెనక్కు నడిపించడమనేది చరిత్రలో సాధ్యపడేది కాదు. ఇక్కడి నుంచి ముందుకు సాగడమే పరిష్కారం. ఆ ముందుకు సాగే ప్రక్రియ నుండే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధులను కూడా అధిగమించి ముందుకు పోయే అవకాశాలూ వస్తాయి.

– ప్రభాత్‌ పట్నాయక్‌
(స్వేచ్ఛానుసరణ)

Courtesy Prajasakti