• సంక్షేమమా? భావోద్వేగమా?
  • నేడే పోలింగ్‌.. ఆప్‌ వైపే సర్వేల మొగ్గు!
  • పౌరసత్వ చట్టానికి ఇది రెఫరెండం?
  • కాంగ్రెస్‌ పోటీ నామమాత్రం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. శనివారం ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ మొదలవుతుంది. మొత్తం 70 సీట్లకు జరిగే ఎన్నికల్లో  672 మంది అభ్యర్థుల భవితను 1.47 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీని వశం చేసుకోవాలని మోదీ, అమిత్‌ షా భావిస్తుండడంతో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కేజ్రీవాల్‌ తన పరిపాలన, సంక్షేమ పథకాలపైనే ఆధారపడితే మోదీ, అమిత్‌ షా పూర్తిగా భావోద్వేగ అంశాలపైనే ఆధారపడి ప్రచారం చేశారు. తొలుత కేంద్రంలోని తమ పాలన, విజయాలను ఏకరువు పెట్టిన బీజేపీ… తరువాత పంథా మార్చి సీఏఏను ప్రధాన ప్రచారాంశం చేసింది. దీంతో ఈ ఎన్నికలు సీఏఏపై రెఫరెండమా… అన్న చర్చ జరుగుతోంది.

దీనికి తోడు- బీజేపీ తన సీఎం అభ్యర్థి ఎవరన్నది ప్రకటించకపోవడం కేజ్రీవాల్‌ సవాల్‌ విసరడానికి తావిచ్చింది. పేరుకు ముక్కోణపు పోటీ అయినప్పటికీ కాంగ్రెస్‌ నామ్‌ కే వాస్తేగా బరిలో నిలిచింది తప్ప పెద్దగా ప్రచారం చేసింది లేదు. ఢిల్లీ ఓటర్లు మోదీ తరహా భావోద్వేగాలను ఆదరిస్తారా, లేక సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తారా అన్నది తేలిపోతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించకపోతే దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలకు ఊపు లభిస్తుందని, ప్రాంతీయ పార్టీలకు కొత్త ఉత్సాహం వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. మరోసారి మోదీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఏకమయ్యేందుకు దోహదమవుతుందని అంటున్నారు.

కేజ్రీకే మళ్లీ పట్టం?
సర్వేల తీరు చూస్తే ఆమ్‌ ఆద్మీ పార్టీయే మళ్లీ జయకేతనం ఎగురవేయవచ్చని స్పష్టమవుతోంది. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటేస్తారని ప్రశ్నించినపుడు 45.4 శాతం మంది ఆప్‌ వైపే మొగ్గు చూపినట్లు ఐఏఎన్‌ఎ్‌స-సీఓటర్‌ సర్వే వెల్లడించింది. గతంలో బాగా వెనుకబడ్డ బీజేపీ పుంజుకొని 36.6 శాతం మంది మద్దతు సాధించగలిగింది. కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని మార్చాలా అన్న ప్రశ్నకు అవసరం లేదని 58.1శాతం, మార్చాలని 39.2 శాతం మంది ఓటేశారు. సీఎంగా కేజ్రీవాలే ఉండాలని 60.2శాతం కోరుకొన్నారు.

సీఏఏ వ్యతిరేక వేదికవద్ద కాల్పుల కలకలం
జాఫ్రాబాద్‌లో సీఏఏ వ్యతిరేక వేదిక సమీపంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళుతూ తుపాకీతో గాల్లో కాల్పులు జరిపి కలకలం సృష్టించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, సీఏఏ వ్యతిరేక అల్లర్లకు, దీనికిసంబంధం లేదని పోలీసులు తెలిపారు.

కోవెలకెళ్లిన కేజ్రీకి ఈసీ నోటీసు
పోలింగ్‌ జరగడానికి ఇంకా 24 గంటలుందనగా అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం భార్య సునీతతో కలిసి కన్నాట్‌ ప్లేస్‌లోని ఓ హనుమాన్‌ దేవాలయానికి వెళ్లి పూజలు చేశారు. దీనిపై ఎలక్షన్‌ కమిషన్‌ ఆయనకు నోటీసిచ్చింది. కోడ్‌ ప్రకారం.. ఎన్నికల ప్రచార సమయంలో గానీ, ముగిశాక గానీ కులం, మతం పేరిట ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష విజ్ఞప్తులూ చేయరాదు. దాని ఆధారంగా ఈ నోటీసిచ్చింది. కాగా, బీజేపీ నేత కూడా కోవెలకు వెళ్లి పూజలు చేశారు.

సిసోడియా ఓఎస్డీ అరెస్టు
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్డీ) గోపాల్‌కృష్ణ మాధవ్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మాధవ్‌ తరఫున ధీరజ్‌ గుప్తా అనే మధ్యవర్తి.. రవాణాదారుల నుంచి రూ.2.26 లక్షలను లంచం రూపంలో స్వీకరిస్తున్నాడని సమాచారం అందడంతో మాధవ్‌ను అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. గుప్తాను అధికారులు ప్రశ్నించగా మాధవ్‌, ఇతర జీఎస్టీ అధికారుల కోసం లంచం స్వీకరించానని చెప్పాడు. సిసోడియా స్పందిస్తూ.. మాధవ్‌కు కఠినశిక్ష విధించాలని ట్వీట్‌ చేశారు. సిసోడియాకు తెలియకుండా మాధవ్‌ లంచం స్వీకరించడం సాధ్యం కాదని బీజేపీ ఆరోపించింది.

Courtesy Andhrajyothi