80 మంది మృతి.. 200 మందికి గాయాలు: ఇరాన్‌ మీడియా
ఒక్కరు కూడా చనిపోలేదు నష్టాన్ని అంచనా వేస్తున్నాం: అమెరికా

టెహరాన్‌, బగ్దాద్‌అగ్రశ్రేణి సైనిక జనరల్‌ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా అమెరికాపై ఇరాన్‌ ప్రతీకార దాడులకు దిగింది. పక్కనే ఉన్న ఇరాక్‌లోని అమెరికా, దాని నాటో మిత్రదేశాల సైనిక స్థావరాలపై బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి చేసింది. బగ్దాద్‌కు పశ్చిమాన ఉన్న ఇర్బిల్‌, అల్‌ అసద్‌ స్థావరాల మీద 22 బాలిస్టిక్‌ క్షిపణులు వచ్చి పేలినట్లు, దాదాపు 80 మంది ‘అమెరికా ఉగ్రవాదులు’ మరణించినట్లు, మరో 200 మంది గాయపడ్డట్లు ఇరాన్‌ ప్రకటించింది. స్వస్థలం కెర్మన్‌లో సులేమానీ ఖననం జరిగిన కొద్ది గంటలకు, భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లారుఝామున 3-30- 4 గంటల ప్రాంతంలో ఇరాన్‌ క్షిపణులు దూసుకుపోయాయి. 1979లో టెహరాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని స్వాధీనపరుచుకున్నాక అగ్రరాజ్యంపై ఇరాన్‌ చేసిన అతి పెద్ద, సునిశిత సూటి దాడి ఇదే! పశ్చిమాసియా నుంచి అమెరికాను తరిమికొట్టడం ప్రారంభించామని, అదే అంతిమ లక్ష్యమని ఇరాన్‌ ప్రకటించింది.

సులేమానీ హత్యకు ఇదే రీతిన స్పందిస్తామని, అమెరికా స్థావరాలన్నింటి మీదా బాంబుల వర్షం కురిపిస్తామని ఇరాన్‌ తేల్చిచెప్పింది. ‘‘ఈ దాడి అమెరికాకు ఓ చెంపదెబ్బ. సులేమానీని చంపిన దుష్ట అమెరికాకు హెచ్చరిక’’ అని అత్యున్నత నేత అలీ ఖామినాయ్‌ పేర్కొన్నారు. అయితే దాడుల్లో ఒక్కరు కూడా మరణించలేదని అమెరికా స్పష్టం చేసింది. క్షిపణుల దాడి జరిగిన మాట వాస్తవమే అయినా ప్రాణనష్టం నిజం కాదని, ఎవరూ గాయపడడం కూడా జరగలేదని వెల్లడించింది. జరిగిన నష్టాన్ని అంచనావేస్తున్నట్లు తెలిపింది. ప్రధానమైన స్టెల్త్‌ బాంబర్లు, ఇతర యుద్ధవిమానాలకు నష్టం జరగలేదని కూడా పేర్కొంది.

 ఇరాక్‌కు సమాచారం
కాగా, ఈ మిసైల్‌ దాడి చేయబోతున్నట్లు ఇరాన్‌ ముందే తమకు సమాచారమిచ్చిందని ఇరాక్‌ వెల్లడించింది. ఈ సంగతిని ఇరాక్‌ కూడా వెంటనే అమెరికాకు తెలియపర్చినట్లు తెలుస్తోంది. మరోవైపు- ఇరాన్‌-అమెరికా ఘర్షణకు ఇరాక్‌ మూల్యం చెల్లించుకోరాదని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ‘ఇది ఇరాకీ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే. ఉభయ పక్షాలూ సంయమనం పాటించాలి’ అని పిలుపునిచ్చింది.
మానవీయ సంక్షోభం!
ఇరాన్‌-అమెరికా ఘర్షణ వల్ల పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్రమైన మానవీయ సంక్షోభం తలెత్తుతుందని నార్వే శరణార్థి మండలి (ఎన్‌ఆర్‌సీ) అనే దాతృత్వ సంస్థ హెచ్చరించింది. ‘‘యుద్ధం వల్ల ఇప్పటికే 2 కోట్ల 40 లక్షల మంది యెమనీలు, కోటీ ఇరవై లక్షల మంది సిరియన్లు తమ ఊళ్లూ స్థలాలు విడిచి ప్రాణాలరచేత పట్టుకుని వేరే ప్రదేశాలకు వెళ్లిపోయారు. ఇరాక్‌లో 60 లక్షల మంది, ఇరాన్‌లో 30 లక్షల మంది అఫ్గానీలు, పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాల్లోని ఇరవై లక్షల మంది శరణార్ధుల దుస్థితి అంతా ఇంతా కాదు. ఇపుడు మరో యుద్ధం తలెత్తితే కోట్ల మంది ప్రాణాలకే ప్రమాదం’’ అని ఎన్‌ఆర్‌సీ తెలిపింది.
గల్ఫ్‌కు భారత యుద్ధనౌకలు
పర్షియన్‌ గల్ఫ్‌లో భారత్‌ కూడా తన యుద్ధనౌకలను మోహరించింది. భారత్‌కు వచ్చే రవాణా నౌకలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, చమురు దిగుమతికి ఇబ్బందులు రాకుండా చూడడానికి ఈ నిఘా నౌకలను రంగంలోకి దింపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు, అవసరమైన సందర్భాల్లో తగురీతిన స్పందించేందుకు యుద్ధ విమానాలతో కూడిన యుద్ధనౌకలను మోహరించినట్లు నౌకాదళ అధికారులు వెల్లడించారు.
ఇరాన్‌ వ్యూహాత్మక వైఖరి
ఇరాన్‌ నాయకశ్రేణి అంతా దాడిని ప్రశంసిస్తూ ప్రకటనలు చేసినా దేశ విదేశాంగమంత్రి అల్‌ జరీఫ్‌ మాత్రం ‘ఈ దాడి అమెరికా చేసిన నేరానికి తగురీతిన ఇచ్చిన జవాబు’ అని చెప్పుకొచ్చారు. ‘‘ఐక్యరాజ్యసమితి చార్టర్‌ 51 ప్రకారం ఆత్మరక్షణ నిమిత్తం ఈ దాడి చేశాం. ఉద్రిక్తతలు పెంచడం మా లక్ష్యం కానే కాదు’’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే అమెరికా ఏ చర్య తీసుకున్నా వెంటనే యథోచిత ప్రతిదాడి ఉంటుందని స్పష్టం చేశారు. రక్షణరంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ప్రజలను శాంతపర్చేందుకే ఈ తక్షణ చర్య తీసుకుంది. అదే సమయంలో అమెరికా సైనికులు చనిపోరాదు. అందుకే బగ్దాద్‌కు దూరంగా మారుమూల ఉన్న అల్‌ అసద్‌ స్థావరాన్ని ప్రధానంగా ఎన్నుకుంది. అక్కడ సైనికులెవరూ బయట ఉండరు. నిజంగా సైనికులను చంపడమే లక్ష్యమైతే దాడి తీరు మరో రకంగా ఉండేది. అది జరిగితే ఇరాక్‌ మాదిరిగా తమను కూడా అమెరికా పూర్తిగా ఽధ్వంసం చేస్తుందన్న భయం ఇరానియన్లలో లేకపోలేదు.

(Courtesy Andhrajyothi)