• అమెరికా డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ సైనిక జనరల్‌ హతం
  • ట్రంప్‌ ఆదేశాలతో బగ్దాద్‌లో ఆకస్మిక ఆపరేషన్‌
  • హతుడు సులేమానీ షియాలకు దేవుడితో సమానం
  • దాడిపై టెహ్రాన్‌లో వెల్లువెత్తిన ప్రజాగ్రహం
  • ఇంతకింతా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిక
  • అమెరికా దాడిని ఖండించిన రష్యా, ఫ్రాన్స్‌, చైనా
  • మూడో ప్రపంచ యుద్ధమంటున్న సోషల్‌ మీడియా
  • భగ్గుమన్న చమురు, బంగారం ధరలు
  • తులం బంగారం రూ.40 వేలు, బ్యారల్‌ ధర 70 డాలర్లు

బగ్దాద్‌, జనవరి 3: బగ్దాద్‌ విమానాశ్రయంలో శుక్రవారం జరిగిన ఓ దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇరాన్‌లో అత్యంత శక్తిమంతుడైన రెండో నాయకుడు, పర్షియన్‌ గల్ఫ్‌లో ఇరాన్‌ భద్రతా వ్యవహారాలను చూస్తున్న ఖాసిం సులేమానీ(62)ని అమెరికా ఓ డ్రోన్‌-క్షిపణి దాడిలో హతమార్చింది. ఇరాన్‌లో అధినేత అయొతుల్లా సయ్యద్‌ అలీ హుస్సేనీ ఖామినయీ తరువాత అంతస్థాయి ఉన్న నాయకుడు సులేమానీ. విశేష ప్రజాదరణ ఉన్నవాడు. గత ఇరవయ్యేళ్లుగా ఆయన ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌లోని కీలకమైన నిఘా విభాగం ఖుద్స్‌ ఫోర్స్‌కు అధినేతగా వ్యవహరిస్తున్నారు. అమెరికా దృష్టిలో ఆయన ఓ టెర్రరిస్టు. ఇరానియన్లకు ఆరాధ్యుడు. గల్ఫ్‌లో షియాలకు దేవుడు. ఈ వైమానిక దాడితో పర్షియన్‌ గల్ఫ్‌లో యుద్ధమేఘాలను అమెరికా ఒక్క పెట్టున ఎగదోసింది. సులేమానీ హత్యతో ఇరాన్‌ భగభగలాడిపోతోంది. ప్రతీకారం తీర్చుకుంటామని, క్రిమినల్స్‌ను మట్టుబెట్టి తీరుతామని ఇరాన్‌ హెచ్చరించింది.

ఎందుకు చంపారు? : ఓ రకంగా సులేమానీ నాలుగు దేశాలకు అప్రకటిత అధినేత. సిరియా, ఇరాన్‌, యెమన్‌, లెబనాన్‌లలో షియా అధీన మిలీషియా అంతా అయన కనుసన్నల్లోనే నడుస్తుంది. ఈజి్‌ప్టలో కూడా ఆయన హవాయే. ఇరాన్‌కు సంబంధించినంత వరకూ ఖుద్స్‌ నేతే కాకుండా పరోక్షంగా విదేశాంగ మంత్రి కూడా! యుద్ధ వ్యవహారాలు, పర్షియన్‌ గల్ఫ్‌లో ఇరాన్‌ ప్రయోజనాల పరిరక్షణ అంతటినీ ఆయనే పర్యవేక్షిస్తారు. మరో కీలకాంశ మేమంటే ఆయన ఇరాన్‌కు భవిష్యత్తులో అధినాయకుడు అయ్యే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి. కిందటినెల 28న బగ్దాద్‌లో ఓ అమెరికన్‌ కాంట్రాక్టర్‌ను ఉగ్రవాదులు చంపేశారు. ఆ తరువాత అమెరికా రాయబార కార్యాలయంపై వరుసగా దాడులు జరిగాయి. ఈ దాడుల వెనుక ఖుద్స్‌ ఫోర్స్‌ హస్తం ఉందని అమెరికా భావించింది. పశ్చిమాసియాలో తమకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సులేమానీని అంతమొదిస్తే తప్ప పరిస్థితి మారదని గ్రహించింది. ఇస్లామిక్‌ స్టేట్‌ అగ్రనేత బగ్దాదీని చంపినట్లే పకడ్బందీ ప్లాన్‌తో మట్టుబెట్టింది.

అమెరికన్లకు ముప్పు: పాంపియో : సులేమానీ జీవించి ఉంటే వందల మంది అమెరికన్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లేదనీ, అమెరికా ఆర్థిక, రాజకీయ, దౌత్య ప్రయోజనాలూ ప్రమాదంలో పడేవనీ, అందుకే అంతమొందించామనీ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఓ ప్రకటనలో తెలిపారు. అనేక మంది అమెరికా దౌత్యవేత్తలను చంపడానికి ఆయన కుట్రపన్నాడని పేర్కొన్నారు. పెంటగాన్‌ కూడా ఓ ప్రకటనలో సులేమానీ హత్య వార్తను ధ్రువపరిచింది. ట్రంప్‌ ఆదేశాల మేరకే ఆయనను కడతేర్చామని వెల్లడించింది.

ప్రపంచదేశాల ఆందోళన : ఇరానీ కమాండర్‌ సులేమానీని హతమార్చడం, ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడంపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తప్పు కొంతవరకూ ఇరాన్‌ది కూడా ఉందని, అమెరికన్లను కవ్వించింది ఇరానేనని బ్రిటన్‌, జర్మనీ పేర్కొనగా- భద్రతామండలిలో మరో మూడు శాశ్వతసభ్య దేశాలు- రష్యా, ఫ్రాన్స్‌, చైనా అమెరికన్‌ చర్య సమర్థనీయం కాదని వ్యాఖ్యానించాయి. దీని వల్ల తీవ్ర విపరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తుందని రష్యా హెచ్చరించింది. అన్ని పక్షాలూ సంయమనం పాటించాలని, గల్ఫ్‌లో శాంతి భధ్రతలే ప్రధానం కావాలని భారత్‌ కోరింది. అయితే ఉద్రిక్తతలు పెచ్చరిల్లడంపై సోషల్‌ మీడియాలో మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయిందంటూ ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో ట్వీట్లు వెలువడ్డాయి.

ఎలా చంపారు? : సులేమానీని హతమార్చాలని అమెరికా ఎప్పటినుంచో మాటు వేసుక్కూచుంది. సిరియాలో ఇరానీ సేనల ఆపరేషన్లపై సమీక్ష జరిపి డమాస్కస్‌ నుంచి బాగ్దాద్‌ వచ్చిన ఆయన పీఎంఎఫ్‌ (పాపులర్‌ మొబిలైజేషన్‌ ఫోర్స్‌- కొన్ని ఇరాన్‌-అనుకూల మిలిటెంట్‌ గ్రూపుల సంయుక్త విభాగం) ఉపాధ్యక్షుడు అబూ మహదీ అల్‌ మహందీతో చర్చలు జరపాల్సి ఉంది. వీరిద్దరూ అమెరికా హిట్‌లి్‌స్టలో ఉన్నవారే. వీరితో పాటు సీనియర్‌ కమాండర్లు కూడా ఆయన వెంట ఉన్నారు. సులేమానీ విమానంలోంచి దిగి మహందీ వద్దకు వచ్చి షేక్‌హ్యాండ్‌ ఇచ్చాక కార్లో కూర్చోబోతున్న సమయంలోనే అమెరికా వైమానిక దాడి జరిగినట్లు ప్రత్యక్షసాక్షుల కథనం. డ్రోన్‌నుంచి బాంబుల వర్షం కురవడంతో కాన్వాయ్‌ మొత్తం తుత్తునియలైంది. సులేమానీ, మహందీల మృతదేహాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. సులేమానీ సాధారణంగా తన వేలికి ఎర్రరంగు ఉంగరాన్ని ధరిస్తారు. ఆ ఉంగరాన్ని బట్టి ఆయన మృతదేహాన్ని గుర్తించారు.

పెరిగిన చమురు ధరలు : సులేమానీ హత్యతో గల్ఫ్‌లో చమురు ధరలు ఒక్క పెట్టున పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 4.3 శాతం పెరిగినట్లు, బ్యారెల్‌ చమురు ధర 70 డాలర్లకు చేరినట్లు బ్రెంట్‌ క్రూడ్‌ తెలిపింది. బంగారం ధరలు కూడా 1.3 శాతం పెరిగినట్లు స్టాక్‌ మార్కెట్లు వెల్లడించాయి.

Courtesy Andhrajyothi