నిరసిస్తూ మోడీకి లేఖ రాసిన 71మంది మాజీ ప్రభుత్వాధికారులు
న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆర్థికశాఖకు చెందిన నలుగురు మాజీ అధికారులపై విచారణ జరపడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ 71 మంది మాజీ ప్రభుత్వాధికారులు ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇటువంటి చర్యలు నిజాయితీ గల అధికారులను ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకుంటాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్ణీత వ్యవధి ముగిసిన అనంతరం సంబంధిత ఫైళ్లను తిరిగి తెరవకూడదని డిమాండ్‌ చేశారు. ఈ లేఖపై మాజీ సెక్రటరీ, కెఎం. చంద్రశేఖర్‌, జాతీయ భద్రతా కార్యదర్శి, మాజీ విదేశాంగ సలహాదారు శివశంకర్‌ మీనన్‌, మాజీ విదేశాంగ కార్యదర్శి సుజాత సింగ్‌, పంజాబ్‌ మాజీ డిజిపి జూలియో రిబెరియోలు సంతకం చేశారు. కుటిల రాజకీయ ప్రయోజనాల కోసం పదవీవిరమణ పొందిన, విధులు నిర్వహిస్తున్న అధికారులను ఉద్దేశ్యపూర్వకంగా వేధించడాన్ని ఖండించారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు మంజూరు చేసిన ఎఫ్‌ఐపిబి క్లియరెన్స్‌కు సంబంధించి నీతి ఆయోగ్‌ మాజీ సిఇఒ సింధుశ్రీ కుల్లార్‌తో పాటు సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల మాజీ కార్యదర్శి అనూప్‌ కె. పూజారి, అప్పటి ఆర్థిక శాఖ డైరెర్టర్‌ ప్రభోద్‌సక్సేనా, ఆర్థిక శాఖ మాజీ సెక్రటరీ రవీంద్ర ప్రసాద్‌లపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం గత నెలలో సిబిఐకి అనుమతినిచ్చింది. మాజీ ఆర్థికమంత్రి చిదంబరంపై ఫిబ్రవరిలో విచారణకు ఆదేశించడంతో సిబిఐ అధికారులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అధికారులు తమ విధుల నిర్వహణలో భాగంగా చేపట్టిన ప్రతిపాదనలకు రక్షణ లేదన్న భయం వారిలో కలుగుతుందనడానికి ఇది నిదర్శనమని వారు లేఖలో పేర్కొన్నారు. దీంతో వారు ముఖ్యమైన ప్రతిపాదనలను పరిశీలించడానికి, పర్యవేక్షించడానికి బదులుగా వాయిదా వేసినా ఆశ్చర్యంలేదని ఎందుకంటే పదవీకాలం ముగిసిన అనంతరం వారు నేరారోపణలు ఎదుర్కోరన్న హామీ లేదని లేఖలో పేర్కొన్నారు. ఈ విధంగా ఫైళ్లను తిరిగి వెలికితీసి, వేధించడం ప్రారంభిస్తే, ప్రభుత్వంలో ఎటువంటి పనులు చేయలేమని వారు తెలిపారు. మూడుదశాబ్దాలుగా దేశానికి నమ్మకంగా సేవ చేసిన అధికారులను రాజకీయ లబ్థి కోసం ఈ విధంగా వేధించడాన్ని పాలనా వ్యవస్థలు అడ్డుకునేందుకు ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరమని, న్యాయవ్యవస్థలో ఈ సమస్యకు ముందస్తు పరిష్కారం ఉండాలని కోరుకుంటున్నామని లేఖలో పేర్కొన్నారు.

Courtesy Prajasakthi…