తోట భావనారాయణ

టీవీ రేటింగ్స్ కుంభకోణంపై సిబిఐ విచారణను ఉపసంహరించుకోవాలని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్‌బిఎ) డిమాండ్ చేసింది. అది సాధ్యం కాదని తెలిసినా ఇలాంటి కోరిక కోరటం ద్వారా ఎన్‌బిఏ నవ్వులపాలైంది. చాలా చానల్స్ రేటింగ్స్ అవకతవకలను ప్రోత్సహించాయని వెల్లడయితే అందుకు జరిపిన చెల్లింపులు కూడా తెలుస్తాయి. రోజూ సమాజంలోని అక్రమాలను ప్రశ్నిస్తున్నామని చెప్పుకునే న్యూస్ చానల్స్ ఇలాంటి దారుణాలకు పాల్పడతాయా అని సామాన్యులు ముక్కుమీద వేలేసుకునే పరిస్థితి రావచ్చు.

పెద్దసంఖ్యలో న్యూస్ చానల్స్ సభ్యత్వం కలిగి ఉన్న న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్‌బిఎ) హఠాత్తుగా ఉలిక్కిపడింది. టీవీ ప్రేక్షకాదరణను కొలిచే టీఆర్పీకి సంబంధించిన కుంభకోణంపై సిబిఐ విచారణను ఉపసంహరించుకోవాలని అది ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ డిమాండ్ చాలా చిత్రంగా ఉందని అనుకోవచ్చుగానీ విచారణలో ఎవరెవరి బాగోతాలు బైటపడతాయోనన్న భయాలే దానికి అసలు కారణం. అసోసియేషన్‌ డిమాండ్‌లో ఇంటిగుట్టు రట్టవుతుందన్న ఆందోళన కనబడుతూనే ఉంది.

ఇదంతా ఎలా మొదలైందంటే, ఆర్ణబ్ గోస్వామి తన రిపబ్లిక్ టీవీలో కొంతకాలంగా పనిగట్టుకొని తమకు వ్యతిరేకంగా వివిధ కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారని మహారాష్ట్ర పాలకులకు అనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే పాలకులు ఎమ్మెస్వోల మీద ఒత్తిడి తెచ్చి అలాంటి చానల్ ప్రసారాలు ఆపేస్తారు. కానీ ఇది జాతీయ చానల్ కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వానికి అలా చేయడం కుదరలేదు. రేటింగ్స్ కోసం అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపిస్తూ రిపబ్లిక్ టీవీ మీద దృష్టి పెట్టి విచారణ ప్రారంభించింది. స్వయంగా ముంబై పోలీస్ కమిషనర్ ఈ విచారణకు నేతృత్వం వహించారు. ‘మా వాళ్ళను వేధిస్తున్నారు. విచారణ ఆపండి’ అంటూ ఆర్ణబ్ గోస్వామి సుప్రీంకోర్టుకు వెళితే, హైకోర్టుకు వెళ్ళమని సూచించింది.

ఇదిలా ఉన్నప్పుడే ఉత్తరప్రదేశ్‌లో ఒక చిన్న యాడ్ ఏజెన్సీ కూడా టీవీ రేటింగ్స్ మీద కేసుపెట్టింది. ఇలాంటి కేసులు ఇంతకుముందు కూడా చాలా రాష్ట్రాల్లో దాఖలయ్యాయి. పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం ఈ కేసును నేరుగా సిబిఐకి అప్పగించింది. మహారాష్ట్ర కేసుతోపాటు, రేటింగ్స్ లెక్కించే బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) పనితీరు మీద కూడా సీబీఐ దర్యాప్తు జరుగుతుందని తెలియటంతో, చాలా చానల్స్‌లో కలవరం మొదలైంది. పైగా, ఇంతటితో ఆగకుండా టీవీ పరిశ్రమలోకి వస్తున్న భారీ మొత్తాల మీద ఆదాయపన్ను శాఖ దృష్టి పడేలా చేయవచ్చునన్నది ఈ దర్యాప్తులో మరో కోణం.

న్యూస్ చానల్స్ సంఘం ఇప్పుడు ఒక్కటే కాదు. న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్‌బిఎ) పేరుతో ఉన్న సంఘానికి ఇండియా టీవీ అధిపతి రజత్ శర్మ నాయకత్వం వహిస్తుండగా ఇప్పుడు కొత్తగా ఆర్ణబ్ గోస్వామి నాయకత్వంలో న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ఏర్పాటైంది. టీవీ 9 గ్రూప్ కూడా ఎన్‌బిఎ నుంచి వైదొలగి ఇందులో చేరింది. అయినప్పటికీ దీంట్లో సభ్యత్వం ఉన్న చానల్స్‌ సంఖ్య చాలా తక్కువ. టైమ్స్ గ్రూప్, ఇండియా టుడే గ్రూప్, నెట్ వర్క్ 18, ఎన్డీటీవీ, జీ గ్రూప్, ఎబిపి గ్రూప్ లాంటి ప్రధాన న్యూస్ చానల్స్ అన్నీ ఎన్‌బిఎ లోనే ఉన్నాయి.

మొదట్లో రేటింగ్స్ తారుమారు చేయడం ఎలా సాధ్యమని అనుకునేవాళ్ళు. కానీ శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు రేటింగ్స్ లెక్కల్ని ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో దేశమంతా 10 వేల మీటర్లు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వెయ్యి మీటర్లుండేవి. అవి ఏయే ఇళ్లలో ఉన్నాయో తెలుసుకునేవారు. ముఖ్యంగా కేబుల్ ఆపరేటర్‌కు ఆ విషయం సులభంగా తెలిసిపోతుంది. కేబుల్ ఉద్యోగి ఇంటింటికీ వసూళ్లకు వెళ్ళినప్పుడు, లేదా ఉద్దేశపూర్వకంగా కూడా టీవీని సరిచూసే మీటర్ ఉన్న ఇళ్ళను గుర్తించేవాడు. దీని ఆధారంగా చానల్‌ యాజమాన్యాల తరఫున రంగంలోకి దిగే పంపిణీ విభాగం ఉద్యోగులు ఆ ఇళ్లవాళ్లతో మాట్లాడతారు. వాళ్లకు సరికొత్త ఎల్‌ఇడి టీవీ బహుమతిగా ఇచ్చి, ఇకమీదట అందులోనే చూసుకోమని చెప్పేవారు. అదే సమయంలో రేటింగ్స్ మీటర్ ఉన్న టీవీలో తమ చానల్ ఆన్ చేసి, మ్యూట్‌లో పెట్టి ఎలాంటి చిరాకూ లేకుండా దాన్ని వెనక్కి తిప్పి పెట్టమనేవారు. అలా కొద్ది ఇళ్ళు చేయగలిగినా, 24 గంటలపాటు అదే చానల్ చూసినట్టు నమోదైతే తక్కువ శాంపిల్ వల్ల దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. అయితే, ఆ తరువాత కాలంలో ఏదైనా చానల్ 24 గంటలూ చూసినట్టు నమోదైతే ఆ లెక్కలు తీసుకోకూడదన్న అభిప్రాయానికొచ్చారు.

దీనికీ చానల్స్‌వాళ్లు విరుగుడు కనిపెట్టారు. ఏకంగా రేటింగ్స్ లెక్కించే సంస్థ ఉద్యోగుల ద్వారానే ఇళ్ల సమాచారం తెలుసుకోవటం మొదలైంది. ఆ తరువాత కొంతమంది ఏజెంట్లు స్వయంగా చానల్స్‌కు సహకరించటానికి ముందుకొచ్చారు. ఒక్కో చానల్‌ను నాలుగైదు గంటలపాటు ఆ ఇళ్లలో చూసేట్టు చేస్తామంటూ కమీషన్ రేట్లు మాట్లాడుకున్నారు. అందుకు ఒప్పుకున్న ఇళ్ళలో ఫలానా చానల్ ఫలానా సమయంలో ఆన్ చేసి పెడితే (చూసినా, చూడకపోయినా) నెలకు ఇంత మొత్తం డబ్బు వస్తుందని ఆశ చూపారు. అలా రేటింగ్స్ కొనుక్కునే చానల్స్‌కు పని సులభమైంది. అప్పుడప్పుడు బార్క్ అలాంటివాళ్లను పట్టుకొని కేసులు పెట్టింది. ఆ మధ్య కర్ణాటకలో ఒక ముఠా, కరీంనగర్‌లో ఇంకో ముఠా పట్టుబడటం, బార్క్ సిబ్బంది ద్వారానే శాంపిల్ ఇళ్ళ జాబితా బైటపడినట్టు తేలటం తెలిసిందే. అయితే, ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న చానల్స్ జాబితా చిన్నదేమీ కాదు. వాటిపై అడపాదడపా కేసులు పెట్టినా, ఇప్పుడు సిబిఐతో విచారణ అనేసరికి ఉలిక్కిపడటానికి కారణం అదే.

ఇంతకీ రేటింగ్స్ కోసం ఎందుకింత తాపత్రయం? అనే ప్రశ్న సహజంగా వచ్చేదే. భారతదేశంలో ప్రకటనల ఆదాయం 70 వేల కోట్లు. అత్యధికశాతం ఎంటర్‌టైన్‌ మెంట్ చానల్స్‌కు పే చానల్ చందాల రూపంలో అంతకంటే ఎక్కువ ఆదాయమే వస్తుంది. కానీ న్యూస్ చానల్స్ విషయానికొస్తే 95శాతం చానల్స్ ఎలాంటి చందాలూ తీసుకోకుండా ఉచితంగా అందేవే. అందువల్ల వాటికి ప్రకటనలు మాత్రమే ఏకైక ఆదాయం. ప్రకటనలు రావాలంటే ఏ చానల్‌కు ఎంత రేటింగ్స్ అనేది చాలా అవసరం. ఎక్కువమంది చూస్తుంటేనే ఆ చానల్‌కు ప్రకటనలివ్వటానికి ప్రకటనదారులు మొగ్గు చూపుతారు. అందువలన వారం వారం విడుదలయ్యే రేటింగ్స్‌కు సహజంగానే ప్రాధాన్యముంటుంది. రేటింగ్స్‌ను ఒక ప్రజాసంబంధాల వ్యవహారంగా కూడా మార్చేశారు. ఎవరికి వాళ్లు మా చానల్‌కు ఇంత రేటింగ్స్ అని చెప్పుకోవటం ద్వారా ప్రజలలో సదభిప్రాయం సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక నిర్దిష్ట సమయంలో ఒక నిర్దిష్ట కార్యక్రమానికి ఎంత రేటింగ్స్ వస్తున్నదో కూడా తెలుస్తుంది కాబట్టి అందుకు తగినట్టుగా ఆ సమయంలో ప్రకటనలు ఇచ్చేవిధంగా యాడ్ ఏజెన్సీలను లేదా ప్రకటనదారులను ఒప్పించగలుగుతారు. రేటింగ్స్‌కు ఇంత ప్రాధాన్యం ఉండటం వల్లనే ఏడాదికి కనీసం రూ.15 లక్షలు చందా కట్టి మరీ రేటింగ్ ఏజెన్సీ సభ్యత్వం తీసుకుంటారు.

ఈ నేపథ్యంలో రిపబ్లిక్‌ టీవి, రేటింగ్స్ అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదు రాగానే ముంబయ్ కమిషనర్ స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయటం, ఆ చానెల్‌పై ఆరోపణలున్నాయంటూ కీలక అధికారులను గంటల తరబడి విచారించటం ప్రారంభం కాగానే ఆర్ణబ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పోలీసు కమిషనర్ వ్యాఖ్యలకూ, ప్రభుత్వానికీ ఎలాంటి సంబంధమూ లేదని మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు చెప్పటం ఈ వ్యవహారాన్ని మరో మలుపు తిప్పింది. రిపబ్లిక్‌ టీవిపై పోలీసు విచారణ మాత్రం సాగుతూ వచ్చింది. ఈ దశలో బార్క్ తన

విశ్వసనీయతను కాపాడుకోవలసిన అగత్యం ఏర్పడింది. అందుకే 12-–18 వారాలపాటు బిజినెస్ న్యూస్ సహా మొత్తం న్యూస్ చానల్స్ రేటింగ్స్ సమాచారాన్ని నిలిపివేస్తున్నట్టు, లోపాలు గుర్తించి మరింత పటిష్ఠమైన వ్యవస్థను రూపుదిద్దనున్నట్టు ప్రకటించింది.

దీంతో ఇప్పుడు న్యూస్ చానల్స్ రేటింగ్స్ వెలువడటం లేదు. ఇక్కడ మళ్లీ ఇంకో ప్రశ్న తెలెత్తింది. బార్క్ పెట్టే రేటింగ్ మీటర్లు అన్ని చానల్స్‌కూ కలిపే ఉంటాయి. న్యూస్ చానల్స్, నాన్-న్యూస్ చానల్స్ అని వేరుగా ఉండవు. అలాంటప్పుడు న్యూస్ చానల్స్‌కు మాత్రమే రేటింగ్స్ నిలిపివేయటమేమిటనే ప్రశ్న వచ్చింది. కానీ బార్క్ దీనిమీద నోరు మెదపలేదు. రేటింగ్స్‌ను ప్రశ్నిస్తున్నది న్యూస్ చానల్సే కాబట్టి వాటి రేటింగ్స్ మాత్రమే ఆపినట్టు అర్థం చేసుకోవాలి.

న్యూస్ బ్రాడ్‌కాస్టర్ల సంఘం వైఖరి కూడా చిత్రంగానే ఉంది. రిపబ్లిక్ టీవీ జర్నలిస్టులను వేధించటం ముంబై పోలీసులకు తగదని వాదిస్తూనే, ఆర్ణబ్ తరహా జర్నలిజాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఆ సంఘం అధ్యక్షుడు, ఇండియా టీవీ అధిపతి రజత్ శర్మ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంకోవైపు న్యూస్ బ్రాడ్‌కాస్టర్ల ఫెడరేషన్ పేరుతో సొంత దుకాణం పెట్టుకున్న ఆర్ణబ్ ఈ సంఘాన్ని దుయ్యబడుతూనే ఉన్నారు. రేటింగ్స్‌ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపడానికి సిద్ధం కావడాన్ని ఎన్‌బిఎ ఖండించటంతో బాటు ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అది సాధ్యం కాదని తెలిసినా ఇలాంటి కోరిక కోరటం ద్వారా ఎన్‌బిఎ నవ్వులపాలైంది. పైగా ఏ నిజాలు బైటికి వస్తాయని అడ్డుకుంటున్నారో చెప్పటం లేదు. చాలా చానల్స్ ఇలాంటి అవకతవకలను ప్రోత్సహించాయని బైటపడితే, దానికోసం జరిపిన చెల్లింపులు కూడా తెలుస్తాయి. రోజూ సమాజంలోని అక్రమాలను ప్రశ్నిస్తున్నామని చెప్పుకునే న్యూస్ చానల్స్ ఇలాంటి దారుణాలకు పాల్పడతాయా అని సామాన్యులు కూడా ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి రావచ్చు.

Courtesy Andhrajyothi