• ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందే
  • 24 గంటల్లో వైద్య పరీక్షలు చేయించండి
  • మరణ వాంగ్మూలాన్ని పరిగణించాల్సిందే
  • రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు

న్యూఢిల్లీ : హాథ్రస్‌ గ్యాంగ్‌రేప్‌, హత్య ఘటన నేపథ్యంలో మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి తప్పనిసరిగా తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. అత్యాచారం కేసుల దర్యాప్తు రెండు నెలల్లో పూర్తి చేయాలని చెప్పింది. మృతురాలి మరణ వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్‌ నమోదు చేయలేదన్న కారణంతో దాన్ని తోసిపుచ్చరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మూడు పేజీల మార్గదర్శకాలతో రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు, డీజీపీలకు లేఖలు రాసింది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ కింద నేరంగా పరిగణించదగ్గ అంశమైతే అత్యాచారం ఫిర్యాదులపై వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని చెప్పింది. నేరం జరిగిందని సమాచారం అందుకున్న పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నేరం జరగకపోయినా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేయాలని చెప్పింది.

మహిళలపై లైంగిక దాడులకు కూడా జీరో ఎఫ్‌ఐఆర్‌ వర్తిస్తుందని తెలిపింది. ఎంత కఠిన చట్టాలు తెచ్చినా, ఎంత సాధనా సంపత్తి సమకూర్చినా పోలీసులు ఈ తప్పనిసరి మార్గదర్శకాలకు కట్టుబడి వ్యవహరించక పోతే ప్రజలకు, ముఖ్యంగా అత్యాచార బాధితులకు న్యాయం జరగదని వ్యాఖ్యానించింది. పోలీసులు నిర్దేశిత మార్గదర్శకాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దర్యాప్తు చేసి, సంబంధిత అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో 173వ నిబంధన ప్రకారం రేప్‌ కేసులో దర్యాప్తు రెండు నెలల్లో పూర్తి చేయాలని గుర్తు చేసింది.

164ఎ నిబంధన ప్రకారం లైంగిక దాడి జరిగినపుడు బాధితురాలిని సమాచారం అందిన 24 గంటల్లో ఆమె అనుమతితో గుర్తింపు పొందిన వైద్యురాలితో వైద్య పరీక్షలు చేయించాలని చెప్పింది. 1872 సాక్షుల చట్టం ప్రకారం మరణించిన వ్యక్తి బతికి ఉన్నపుడు లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగా ఇచ్చిన ప్రకటనను దర్యాప్తులో సరైన సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకోవాలని గుర్తు చేసింది. ఆ ప్రకటనలో తన మరణానికి దారితీసే పరిణామాలకు సంబంధించిన సాక్ష్యం ఉంటే దాన్ని సరైన సాక్ష్యంగా పరిగణించాలని చెప్పింది. మరణ వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్‌ స్వీకరించలేదని, పోలీసు అధికారి స్వీకరిస్తున్నపుడు మూడోవ్యక్తి  ప్రత్యక్షంగా ఉండి సాక్షి సంతకం చేయలేదన్న కారణంగా మరణ వాంగ్మూలాన్ని తోసిపుచ్చజాలరని 2020 జనవరి 7న సుప్రీంకోర్టు చెప్పిందని కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసింది. సదరు వాంగ్మూలం కోర్టు పరీక్షకు నిలబడితే చాలని చెప్పింది. లైంగిక దాడి జరిగినపుడు సాక్ష్యాలు సేకరించడానికి అవసరమైన కిట్లను తప్పనిసరిగా వాడాలని, అలాంటి కిట్ల వాడకంపై కేంద్ర హోంశాఖ తరచూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోందని గుర్తు చేసింది.

శాంపిల్స్‌ సేకరణ, నిల్వ, ఫోరెన్సిక్‌ పరీక్ష చేయడంపై… పోలీసులకు, న్యాయవాదులకు, వైద్య అధికారులకు ఇందులో విడివిడిగా శిక్షణ ఇస్తామని తెలిపింది. కేంద్రం మార్గదర్శకాలను పోలీసులు పాటిస్తున్నారో లేదో రాష్ట్ర ఉన్నతాధికారులు తెలుసుకోవడానికి ‘లైంగిక నేరాల దర్యాప్తు పర్యవేక్షణ వ్యవస్థ’(ఐటీఎ్‌సఎ్‌సవో)ను ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చామని వెల్లడించింది. రాష్ట్రాల పోలీసు అధికారులు లైంగిక నేరగాళ్ల జాతీయ డేటాబే్‌సను వినియోగించుకొని మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడే వారిని గుర్తించాలని సలహా ఇచ్చింది. గత ఏడాది మే, డిసెంబరు నెలల్లో కూడా ఇలాంటి మార్గదర్శకాలనే రాష్ట్రాలకు పంపించామని కేంద్రం గుర్తు చేసింది. లైంగిక నేరాలను అరికట్టేందుకు చట్టపరంగా కూడా భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ప్రస్తావించింది. రాష్ట్రాలు సంబంధిత వ్యక్తులు, వ్యవస్థలకు చట్టాల నిబంధనలు కచ్చితంగా పాటించేట్లు ఆదేశాలు జారీ చేయాలని చెప్పింది. ఐటీఎ్‌సఎ్‌సవో ద్వారా లైంగిక నేరాల కేసులను పర్యవేక్షిస్తూ దోషులకు త్వరగా శిక్ష పడేట్లు చర్యలు తీసుకోవాలని సూచించింది.

Courtesy Andhrajyothi