హైదరాబాద్‌ : కోళ్ల ఫామ్‌లో రెండు కోళ్లను దొంగిలించారనే నెపంతో దళిత దంపతులైన బాణాల రమేష్‌, నాగమణిలను కట్టేసి కొడుతూ దుర్భాషలాడి దాడి చేసిన కోళ్ల ఫామ్‌ యజమాని గోపాల్‌రెడ్డి, శ్రీకాంత్‌రావులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) డిమాండ్‌ చేసింది. ఈ విషయమై సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కోరింది. ఈమేరకు బుధవారం సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కాడిగళ్ల భాస్కర్‌, తప్పెట్ల స్కైలాబ్‌బాబు ఒక ప్రకటన విడుదల చేశారు.కురవి మండలం రాజోలు శివారు పొలంపల్లి గ్రామానికి చెందిన గోపాల్‌ రెడ్డి, శ్రీకాంత్‌ రవి వద్ద దళిత కుటుంబం పని చేస్తున్నదని తెలిపారు. రూ 50 వేల వేతనం అడిగితే రెండు కోళ్లను దొంగిలించారనే నెపంతో బాణాల రమేష్‌ భార్య నాగమణిలను కట్టేసి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ కాళ్లావేళ్లా పడ్డా వదల్లేదనీ, బూతులు తిట్టి మహిళను తాకరాని చోట తాకి చిత్రవధకు గురిచేశారని పేర్కొన్నారు. నీ కుమారున్ని తీసుకురావాలని బలవంతపెట్టడంతో తండ్రి రమేష్‌ వెళ్లి తీసుకొస్తున్న క్రమంలో సోమవారం రాత్రి మహబూబాబాద్‌ పట్టణ శివారు ప్రాంతంలో ఎదురుగా వచ్చే కారు ఢకొీని బాణాల రమేష్‌, కుమారుడు కర్ణస్వామి, రజిత మతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే దోషులను చట్టరీత్యా విచారించి కఠినంగా శిక్షించాలనీ, ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గిరిజన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా ప్రతినిధులు మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.

Courtesy Nava Telangana