డి. జయప్రకాష్

పెట్టుబడిదారీ వ్యవస్థ పురోగమనంపై నేడు సందేహాలు వ్యక్తం చేస్తున్నది కమ్యూనిస్టులు కాదు. ఆర్థిక సంక్షోభాలు, అంతులేని నిరుద్యోగం, తీవ్ర అసమానతలు, పర్యావరణ విధ్వంసం తదితర పరిణామాల నేపథ్యంలో పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు, మేధావులే ఈ వ్యవస్థ మనుగడను శంకిస్తున్నారు. మరోవైపు మార్క్సిస్టు వ్యతిరేకులూ మార్క్స్ వైపు చూస్తున్నారు. ఇటువంటి సానుకూల పరిస్థితుల్లో భారత కమ్యూనిస్టు ఉద్యమం ఒక మెరుగైన కార్యాచరణను రూపొందించుకోవాలంటే, ముందుగా చేయవలిసింది విమర్శనాత్మకంగా సమీక్షించుకోవడమే.

భారత కమ్యూనిస్టు ఉద్యమానికి వందేళ్ళు అన్న విషయమై వివిధ పక్షాల్లో నెలకొన్న భిన్నాభిప్రాయాలను అటుంచితే, ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందనే దానికన్నా అది ఇప్పుడు ఏ స్థితిలో ఉందన్న అంశానికి ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం. కార్మిక, కర్షక, విద్యార్థి, యువజనులను సంఘటితం చేయడంలోను, వలసవాద దోపిడీకి వ్యతిరేకంగా వారిని ముందుకు నడిపించడంలోనూ కమ్యూనిస్టు ఉద్యమం నిర్వహించిన పాత్ర నిర్వివాదాంశం. స్వాతంత్ర్య పోరాటంలో ప్రేక్షకపాత్ర పోషించిన పరివారం, నేడు దేశభక్తి పాఠాలను వల్లెవేస్తున్న సందర్భంలో ఈ చరిత్రకు మరింత ప్రాధాన్యం ఉంది.

లోతుల్లోకి వెళ్ళినప్పుడు అనేక సైద్ధాంతిక సమస్యలు ఏంతో గంభీరంగా కనిపిస్తాయి. పార్టీ కార్యక్రమానికి సంబంధించి భారత కమ్యూనిస్టు ఉద్యమంలో నెలకొన్న సమస్య కూడ అలాంటిదే. దేశంలో ఇన్ని కమ్యూనిస్టు పార్టీలు, గ్రూపులు ఎందుకు ఉన్నాయి అన్న ప్రశ్నకు సులభమైన సమాధానం ఏమిటంటే, దేశంలో పీడిత ప్రజలకు శత్రువెవరు? అన్న విషయంలో ఆయా పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమే. పెట్టుబడిదారీ వర్గం దళారీ పాత్ర మాత్రమే పోషిస్తున్నందున సామ్రాజ్యవాదమే ప్రధాన శత్రువని కొందరు, సామ్రాజ్యవాదంతో తమ ప్రయోజనాల మేరకు రాజీపడుతూ, స్వతంత్రంగా వ్యవహరిస్తున్న గుత్త పెట్టుబడిదారీవర్గమే ప్రధాన శత్రువని ఇంకొందరు, మినహాయింపులు లేకుండా స్వదేశీ, విదేశీ, పెద్ద, చిన్నపెట్టుబడిదారీవర్గమంతా శ్రామిక వర్గానికి వైరి వర్గమేనని మరికొందరు భావిస్తున్నారు. మరోవిధంగా చెప్పాలంటే ప్రధాన పోరాటం ఎవరిపైనన్న విషయంపైనే కమ్యూనిస్టు పార్టీలు నేటికీ ఒక ఉమ్మడి అవగాహనకు రాలేకపోయాయి. ఈ ప్రధాన సమస్యకు అనుబంధంగా అనేక ఉప సమస్యలు ఉన్నాయి. అందుకే ఇన్ని గ్రూపులు. ఇటువంటి మౌలిక సమస్యపైనే ఏకాభిప్రాయం లేక ముక్కలు చెక్కలవ్వడం ఏవో కొన్ని పార్టీలు, గ్రూపులకు సంబంధించి కాక మొత్తంగా వామపక్ష ఉద్యమ సైద్ధాంతిక బలహీనతనే సూచిస్తోంది.

వందలాది శ్రామికవర్గ ఉద్ధండ నాయకులు, మేధావులను రూపుదిద్దిన ఉద్యమం నేడు ఇంతటి సైద్ధాంతిక గందరగోళంలో చిక్కుకుపోయి బలహీనపడటానికి కారణాలను అన్వేషించడం ముఖ్యం. రష్యన్ విప్లవ స్ఫూర్తితో, వలసవాద వ్యతిరేక స్వాతంత్ర పోరాటంలో పురుడు పోసుకున్న కమ్యూనిస్టు ఉద్యమం ఆ తర్వాత తనదైన స్వతంత్ర కార్యక్రమాన్ని, పంథానూ రూపొందించుకోలేక పోయింది. రష్యన్ విప్లవం పాత్ర భారత ఉద్యమానికి స్ఫూర్తిని ఇవ్వడానికే పరిమితం కాలేదు. విప్లవ కార్యక్రమానికి సంబంధించి భారత ఉద్యమం రష్యా మార్గదర్శకత్వాన్ని కోరే పరిస్థితి కూడ ఏర్పడింది. ఈ క్రమంలోనే కమ్యూనిస్టు ఉద్యమ చీలికలకు బీజం పడింది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో తృతీయ ప్రపంచ దేశాలకు కృశ్చేవ్ ప్రతిపాదించిన ‘శాంతియుత సహజీవన విధానం’ మరొక విపరిణామం. 90‌వ దశకం ప్రారంభంలో రష్యాలో కమ్యూనిస్టు పార్టీ పాలన అంతం అయ్యేవరకూ ఏదో ఒక స్థాయిలో రష్యన్ విప్లవ ప్రభావం భారత ఉద్యమంపై కొనసాగుతూనే ఉంది. ఇదే విధంగా చైనా విప్లవ విజయమూ భారత వామపక్ష ఉద్యమాన్ని ప్రభావితం చేసింది. చైనా మార్గమా – రష్యా మార్గమా అన్న చర్చ నుంచి, చైనా చైర్మనే మన చైర్మన్ అన్న నినాదం వరకూ జరిగిన పరిణామాల క్రమం తెలిసిందే.

వ్యవసాయిక విప్లవం, పెట్టుబడిదారీ వ్యవస్థ తీరుతెన్నులకు సంబంధించిన మౌలిక అవగాహన, ఒక దేశంలో సోషలిజం సాధ్యాసాధ్యాలు, పార్లమెంటరీ పంథా – పరిమితులు, కార్మికవర్గ అంతర్జాతీయత.. ఇటువంటి ఎన్నో మౌలిక అంశాల పట్ల భారత ఉద్యమంలో ఒక శాస్త్రీయ మార్క్సిస్టు అవగాహన ఏర్పడకపోవడానికి తగినంతగా మార్స్క్‌, ఎంగెల్స్‌ మౌలిక రచనల ఆధ్యయనం లేకపోవడమే కారణం. వలసవాద వ్యతిరేక పోరులో పుట్టి పెరిగిన భారత కమ్యూనిస్టు ఉద్యమం తదనంతర కాలంలోనూ జాతీయవాద చట్రంలోనే కూరుకుపోయిందన్నది మరో ప్రధాన విమర్శ. ఫలితంగా ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి’ అన్న నినాదాన్ని ఆచరణలో పెట్టడానికి బదులుగా ‘దేశ స్వావలంబన’, ‘మా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం’ వంటి జాతీయవాద నినాదాలు ముందుకు వచ్చాయన్నది ఈ విమర్శ సారాంశం.

ఒక వ్యవస్థీకృత పెట్టుబడిదారీ ప్రజాస్వామ్య దేశంలో ఇప్పటివరకూ సోషలిస్టు విప్లవ ప్రయోగం విజయవంతమవ్వలేదు. ఇటువంటి స్థితిలో పాలక వర్గాల సరికొత్త ఎత్తుగడలను అధ్యయనం చేయడంలోను, ఎదుర్కొనే కార్యాచరణను రూపొందించడంలోనూ వామపక్ష ఉద్యమం విజయం సాధించలేదు. ఇటువంటివి ఉద్యమ బలహీనతకు బాహ్య కారణాలు. ఈ బాహ్య, అంతర్గత కారణాలకు లోతైన సంబంధముంది. మౌలిక సైద్ధాంతిక, విధాన విషయాలపై అస్పష్టత, గందరగోళం నిండి ఉన్నప్పుడు కమ్యూనిస్టు ఉద్యమం దిశారాహిత్యానికి గురవ్వడమూ సహజం. సైద్ధాంతిక స్పష్టత లేనప్పుడు ఆచరణలో ఐక్యత అసాధ్యం. అందుకే ఇన్ని గ్రూపులు, అంచనాలు, పంథాలు. ఉద్యమ ప్రారంభంలోని భౌతిక పరిస్థితుల (రష్యన్ విప్లవ ప్రభావం, వలసవాద వ్యతిరేక పోరాటం), పర్యవసానంగా ఏర్పడ్డ సైద్ధాంతిక వైఖరుల వల్ల భారత కమ్యూనిస్టు ఉద్యమ పయనం కూడా భిన్న లక్ష్యాల వైపు, విభిన్న పంథాల్లో కొనసాగుతోంది. ప్రతి కమ్యూనిస్టు పార్టీ తమది మాత్రమే నిజమైన కమ్యూనిస్టు ఉద్యమమని, మిగిలినవన్నీ మితవాద, అతివాద ఉద్యమాలేనని నిర్ధారించే పరిస్థితి. ఆచరణలో అత్యధిక శ్రేణులు వ్యవస్థను సమూలంగా మార్చే లక్ష్యన్ని స్వాధించడానికి బదులు వ్యవస్థ లోపలే మార్పులు తీసుకువచ్చే లక్ష్యం దిశగా పయనిస్తున్నాయి.

కమ్యూనిస్టు ఉద్యమం బలహీనమవ్వడానికి కారణమేమిటన్న విషయమై ఇక్కడ ప్రస్తావించిన అంశాలు చాలా పరిమితం, సారంలో ప్రాథమికం. వందేళ్ళ కమ్యూనిస్టు ఉద్యమాన్ని స్మరించుకోవడమంటే లోతుగా సమీక్షించడమే, దాని ఆధారంగా సరికొత్త కార్యాచరణను రూపొందించుకోవడమే. వందేళ్ళ కమ్యూనిస్టు ఉద్యమ ఆచరణ అనేక విజయాలను సాధించినప్పటికీ, ఇన్ని గ్రూపులను తయారు చేసి, ఉద్యమాన్ని ఇంతగా బలహీనపర్చడం వాస్తవం. అమెరికా, బ్రిటన్ వంటి పెట్టుబడిదారీ దేశాల్లో సైతం మరోసారి పెద్ద ఎత్తున సోషలిస్టు భావజాలం (ఎన్నో పరిమితులు ఉన్నప్పటికీ) ముందుకురావడం చూస్తున్నాం. పెట్టుబడిదారీ వ్యవస్థ పురోగమనంపై నేడు సందేహాలు వ్యక్తం చేస్తున్నది కమ్యూనిస్టులు కాదు. ఆర్థిక సంక్షోభాలు, అంతులేని నిరుద్యోగం, తీవ్ర అసమానతలు, పర్యావరణ విధ్వంసం తదితర పరిణామాల నేపథ్యంలో పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు, మేధావులే ఈ వ్యవస్థ మనుగడను శంకిస్తున్నారు. మరోవైపు మార్క్సిస్టు వ్యతిరేకులూ మార్క్స్ వైపు చూస్తున్నారు. ఇటువంటి సానుకూల పరిస్థితుల్లో భారత కమ్యూనిస్టు ఉద్యమం ఒక మెరుగైన కార్యాచరణను రూపొందించుకోవాలంటే, ముందుగా చేయవలిసింది విమర్శనాత్మకంగా సమీక్షించుకోవడమే. అందుకే, ఇప్పుడు సమీక్ష కూడ ఒక కార్యక్రమమే.

Courtesy Andhrajyothi