– కాశ్మీర్‌ పౌరులకు సత్వర న్యాయం అందేలా చూడాలన్న సుప్రీం
– కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడంలో విఫలమైందా..?

న్యూఢిల్లీ: ఆధునిక కాలంలో ఇంటర్‌నెట్‌ ప్రాథమిక హక్కుల్లో భాగమని ఈ ఏడాది జనవరి 10న సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. జస్టిస్‌ ఎన్‌వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసం ఈ తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని అధికరణం 19(1) (ఏ)లో పేర్కొన్న భావ ప్రకటనా స్వేచ్ఛ, అధికరణం 19(1)(జీ)లో పేర్కొన్న వృత్తిపరమైన(వ్యాపార) స్వేచ్ఛకు ఇంటర్‌నెట్‌పై నిషేధం వల్ల భంగం కలుగుతుందని సుప్రీంకోర్టు ఆ తీర్పులో స్పష్టం చేసింది. కాశ్మీర్‌లో నిరంతరం ఇంటర్‌నెట్‌పై నిషేధం విధించకుండా తగు చర్యలు చేపట్టాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. వారం రోజుల్లోగా దీనిపై సమీక్షించాలని తెలిపింది. జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణం 370ని రద్దు చేస్తూ గతేడాది ఆగస్టు 5న కేంద్రం నిర్ణయించడానికి ఓ రోజు ముందు నుంచే ఆ ప్రాంతంలో ఇంటర్‌నెట్‌ సౌకర్యాన్ని తొలగించిన విషయం తెలిసిందే.

టెలికం సర్వీసెస్‌ నిబంధనలు-2017 ప్రకారం ఆయా ప్రత్యేక పరిస్థితుల్లో ఇంటర్‌నెట్‌పై నిషేధం తాత్కాలికంగానే తప్ప నిరంతరం కొనసాగించేందుకు వీల్లేదు. తాత్కాలిక నిషేధం కూడా న్యాయ సమీక్షకు నిలువాల్సి ఉంటుంది. అయితే, ఓ విషయంలో సుప్రీంకోర్టు కూడా తన తీర్పులో స్పష్టతనీయలేదని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. తాత్కాలిక నిషేధమైనా ఎన్ని రోజులు, ఏ పరిస్థితుల్లో అన్నది స్పష్టం చేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టుకు కేంద్రం తరఫున ఇచ్చిన వివరణలోనూ నిరంతర నిషేధమేమీ ఉండదని తెలిపింది. కానీ, ఇప్పటివరకూ 196 రోజులపాటు కాశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌పై నిషేధం కొనసాగింది. ఇన్ని రోజులపాటు ఓ ప్రాంత ప్రజలకు ప్రాథమిక హక్కులు లేకుండా చేయడం ఏవిధంగా సరైంది.? ఇంటర్‌నెట్‌ విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలివ్వడంలో న్యాయస్థానం విఫలమైనట్టుగా న్యాయ నిపుణులు విమర్శిస్తున్నారు. హెబియస్‌ కార్పస్‌(వ్యక్తుల నిర్బంధానికి సంబంధించి), భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన పిటిషన్లలో సత్వర న్యాయానికి న్యాయ స్థానాలు చొరవ చూపాలని సూచిస్తున్నారు.

Courtesy Nava Telangana