ప్రేమించి పెండ్లి చేసుకోవడమే కాదు.. పెండ్లి చేసుకుని కూడా ప్రేమించొచ్చు. మరీ మాట్లాడితే ప్రేమికుల రోజును సెలబ్రేట్‌ చేసుకోవాల్సింది దంపతులే. ప్రేమికులకు పెండ్లి లక్ష్యమైతే… దంపతులకు ప్రేమ గమ్యమవ్వాలి. అప్పుడే ఆ బంధం చిరకాలం నిలిచి ఉంటుంది. పెండ్లంటే భౌతికమైంది కాదు.. ఇరువురూ భౌతికంగా కలిసి ఉన్నా మానసికంగా విడిపోతే.. వ్యక్తిగతంగా చిమ్మచీకటిలో కూరుకుపోయినట్లే. ఈ పరిస్థితి రావడానికి కొన్ని కారణాలు లేకపోలేవు. అయితే అవి తెలుసుకుని జాగ్రత్త పడితే ఆ బంధం ప్రేమగా సాగిపోతుంది. ఆ సమస్యలకు కారణాలు ఏమిటో, ఎలా ఉంటే ప్రేమ పదికాలాలు పదిలంగా ఉంటుందో మానవితో కొన్ని ప్రేమ జంటలు పంచుకుంటున్నాయి. వారి అభిప్రాయాలు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా… వివాహానికి ముందు ఎన్నో ఊసులాడుకునే జంటలు వివాహం జరిగిన కొన్ని నెలలకే చిరాకులు, చీత్కారాలతో కాలం గడుపుతున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. దానికి కారణాలు అనేకం ఉండవచ్చు. అయితే ముఖ్యంగా గుర్తించిన కారణం మాత్రం దంపతుల మధ్య మూడో వ్యక్తి జోక్యం. అంటే దంపతులు ఏదైనా విషయంపై చర్చించుకునే సమయంలో గానీ కుటుంబం, పిల్లల గురించి నిర్ణయాలు తీసుకునే సమయంలో గానీ మరో వ్యక్తి జోక్యం చాలా మంది దంపతులకు ఇష్టం ఉండదు. ఇలాంటి సమయంలో ఒకరిపై ఒకరు కోపాన్ని ప్రదర్శించుకుంటారు. కొంత సమయం తర్వాత పరిస్థితి చక్కబడినా మనసులో కలత మాత్రం తగ్గదు. ఇలాంటి సందర్భాల్లో దంపతులిద్దరూ సహనంతో మెలిగినట్లయితే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

అప్పుడు.. ఇప్పుడు..
ప్రేమ వివాహం కావచ్చు, పెద్దలు కుదిర్చిన వివాహం కావచ్చు.. దాంపత్య బంధంలో ‘అప్పుడు.. ఇప్పుడు..’ అనే మాటలు చాలా సందర్భాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఒక జంట పరిచయం అయిన, అవుతున్న ప్రారంభ దశలో ఒకరిని ఒకరు ఆకట్టుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేస్తారు. ఆ సమయంలో త్యాగం చేయడానికి సిద్ధపడతారు. ఆ ప్రేమ ఎదుటివారికి అర్థం కావాలని తాపత్రయ పడతారు. కానీ వివాహం జరిగిన కొన్నాళ్ళకి చాలా జంటల్లో ఆ వాతావరణం కనిపించదు. త్యాగం చేయాలంటే ప్రాణం పోయినట్లు అనుకుంటారు. పర్సనల్‌ స్పేస్‌ అంటూ మనసు సలిపేస్తుంటుంది. ఆ సమయంలోనే ‘అప్పుడు అలా అన్నావు, అలా చేశావు.. ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు..’ అంటూ నిందించడం మొదలవుతుంది. ఇది చివరకు బంధాన్ని తెంచుకునే వరకు వెళుతుంది. అందుకే ప్రేమించే వ్యక్తి కోరుకునే విధంగా వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం కన్నా మీ వ్యక్తిత్వాన్ని ప్రేమించే వ్యక్తికి ప్రేమని వ్యక్తీకరించడం మేలు.

పరిస్థితుల్లో మార్పు
జీవితంలో అన్ని రోజులూ ఒకేలా ఉండవు అని అందరికీ తెలిసిన విషయమే. అయితే కొందరు పరిస్థితుల్ని అవగాహన చేసుకుని అర్థం చేసుకుంటే మరికొందరు మానసిక పరిపక్వత లోపించి, అహంభావంతో సమస్యలను తెచ్చిపెట్టుకుంటారు. దంపతుల మధ్యలో ఎదురయ్యే సమస్యలు అనేకం ఉండవచ్చు. వాటిలో ముఖ్యమైనవి ఆర్థిక, సామాజిక, సాంస్కతిక పరమైనవి. భిన్న వాతావరణంలో పెరిగిన ఇద్దరు వ్యక్తులు ఒకరిని ఒకరు అర్థం చేసుకోడానికి కొంత సమయం పడుతుంది. అయితే ఈలోపే ఇరువురి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరే అవకాశం లేకపోలేదు. అందుకే వివాహ బంధంలో భాగస్వామి పెరిగిన పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటూ, వ్యత్యాసం దొర్లిన అంశంలో అర్థం చేసుకుంటూ, సమస్యాత్మక సందర్భాల్లో పరిస్థితుల్ని విశ్లేషించుకుంటూ జీవితాన్ని నడపగలగాలి.

పొరపాట్లు, తప్పులు
ప్రపంచంలో ఏ ఇద్దరి వ్యక్తుల ఆలోచనలు కలకాలం ఒకే విధంగా ఉండకపోవచ్చు. కారణం వారివారి పెరుగుదల, సామాజిక పరిస్థితులు, ఇతరత్రా. అలాంటిది విభిన్న వ్యక్తిత్వాలు గల ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించేటప్పుడు సాధారణంగా కొన్ని పొరపాట్లు జరగడం సహజం. అయితే దాన్నే సాకుగా చూపించి ఎదుటి వారిని నిందించడం ద్వారా భార్యాభర్తల సంబంధం ఆరోగ్యంగా వద్ధి చెందలేదు. అనుకోకుండా చేసేది పొరపాటు అయితే ఉద్దేశపూర్వకంగా చేయడాన్ని తప్పుగా పరిగణిస్తాం. పొరపాట్లను తప్పుగా పరిగణించి నిందించడం సమంజసం కాదు. కనుక సందర్భాన్ని బట్టి భాగస్వామిని అర్థం చేసుకుంటూ సమస్య పెరిగే వరకూ లాగకుండా ఉంటే చాలా వరకు సమస్యలు దూరమవుతాయి.

భావప్రకటన ఉండాలి
దంపతుల మధ్య ముఖ్యంగా ఉండాల్సింది భావ ప్రకటన. ఎవరి మనసులో ఎలాంటి ఆలోచన ఉందో ఎదుటి వారికి చెబితేనే అర్థమవుతుంది. మాటల్లో చెప్పలేనప్పుడు ఒకరి భావనను ఇంకొకరు వేరుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది. దాని వలన సమస్యలు ఏర్పడతాయి. కనుక సాధ్యమైనంత వరకు భావాలను బయటకు చెప్పాలి. ఒక సంఘటన జరిగిన సమయంలో మాట్లాడకుండా భవిష్యత్తులో దాని ప్రస్తావన తీసుకువచ్చి ఉన్న సమస్యను జటిలం చేయడం కన్నా సంఘటన జరుగుతున్నప్పుడే ప్రశాంతంగా పరిష్కరించుకోవడం ఉత్తమం. ప్రేమంటే ఇద్దరి మనసుల మధ్య బంధం మాత్రమే కాదు ఇద్దరి మనుషుల మధ్య సంబంధం కూడా. కనుక ప్రేమను మాటల ద్వారా, చర్యల ద్వారా తెలపవలసి ఉంటుంది.

ప్రేమంటే…
అసలైన ప్రేమ పెండ్లయిన తర్వాతే మొదలవుతుంది. ఎందుకంటే వివాహబంధంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవిస్తారు. ప్రేమంటే వ్యామోహం, శారీరక సంబంధం కాదు. ప్రేమంటే ఆప్యాయత, అనురాగం, కరుణ కలగలిసి ఉండేది. అది జీవితాంతం ఉండాలి. టీనేజ్‌లో కలిగే ప్రేమ కేవలం వ్యామోహం, మోజు. అది అవసరాలు, వ్యామోహం తీరిన తర్వాత ఉండదు. అప్పుడు ఇద్దరి మధ్య చాలా దూరం పెరుగుతుంది. అదే దంపతుల మధ్యలో అలాంటి అవకాశం ఉండదు. ఇరువురి మధ్య త్యాగం, సర్దుకుపోయే తత్త్వం ఉంటాయి. అలాంటి ప్రేమ రోజురోజుకూ పరిపక్వత చెందుతుంది. ప్రేమంటే మనసును అర్థం చేసుకుని ఒకరిలో ఒకరు ఏకీకతం కావడం. ప్రేమలో మోసం ఉండదు. ప్రేమకు తేదీ అంటూ ఉండదు. అది నిత్యం మనలో ఉండాలి. దంపతులు ఒకరికి ఒకరు సహకరించుకోవాలి, అర్థం చేసుకుని సర్దుకుపోయే గుణం ఉండాలి. ఒకరికి ఒకరు ఇచ్చుకునే బహుమతులు, గ్రీటింగ్‌లు, సర్‌ప్రైజ్‌లు ప్రేమను తెలిపేవిగా ఉండాలి. క్రియేటివ్‌గా ఆలోచించాలి. ఇరవైల్లో ఉన్న ఆలోచనల్ని అరవైల్లో కూడా కొనసాగించాలి. జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమన్వయంతో పరిష్కరించుకోవాలి. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగాలి.

సర్దుకుపోతేనే బంధం నిలబడుతుంది
ఈ మధ్య పిల్లల్లో సర్దుకుపోయే ఓపిక తగ్గిపోయింది. ఎంత తొందరపడి ప్రేమిస్తున్నారో అంతే తొందరగా విడిపోతున్నారు. అలాంటి జంటలను చూస్తే బాధగా వుంటుంది. తొందరపాటు ఎక్కువగా ఉంది. ప్రేమ పెండ్లి అయినా, పెద్దలు కుదిర్చిన పెండ్లయినా సర్దుకుపోతేనే నిలబడుతుంది. పెద్దలు కుదిర్చిన దానికంటే ప్రేమ పెండ్లి విడిపోతే దాని గురించి పెద్దగా చేస్తారు. అందుకే ప్రేమ జంటలు మరింత జాగ్రత్తగా వుండాలి. ప్రేమించి పెండ్లి చేసుకుంటున్నారంటే కుటుంబం నడుపుకునేందుకు చిన్న ఉద్యోగమైనా వుండాలి. అప్పుడు వాళ్లు ఎంతో కొంత ప్రశాంతంగా బతకగలరు. ఉద్యోగం లేకుండా, ఆర్థిక వెసులుబాటు లేకుండా ఇద్దరూ జీవితాంతం నిలబడలేరు. కాబట్టి కులాంతర వివాహాలు చేసేటప్పుడు వాళ్ళకు ఉపాధి అవకాశం కూడా కల్పించాలి. మేము పుట్టింది భూస్వామ్య కుటుంబంలో. చిన్నప్పటి నుండి మా ఇంట్లోనే కుల వివక్ష చూస్తూ పెరిగాను. అందుకే కులాంతర వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నా. అందుకే రాములు గారిని కులాంతర వివాహం చేసుకున్నా. మాది కమ్యూనిస్టు కుటుంబం కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పటికి మా పెండ్లయి 42 ఏండ్లు. పెండ్లి చేసుకోవడం గొప్పకాదు దాన్ని నిలబెట్టుకోవడమే గొప్ప విషయం.
– ప్రమీల

అర్థం చేసుకుంటేనే…
పెండ్లి కాకముందు అందరూ ఆకర్షణ అనుకుంటారు. నిజమైన ప్రేమలో ఆకర్షణ వుండదు. బాధ్యత ఉంటుంది. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, అర్థం చేసుకుంటూ, బాధ్యతగా ఉంటే ఆ సంబంధం జీవితాంతం కొనసాగుతుందని నా అభిప్రాయం. అప్పుడే ఎలాంటి సమస్యలు ఉండవు. ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకరు తగ్గడం. భార్యాభర్తల మధ్య తగ్గడం అంటే అర్థం చేసుకోవడం. ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోవడం. నా అభిప్రాయాన్ని భాస్కర్‌ గౌరవిస్తాడు. భాస్కర్‌ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. దీని వల్లనే మా రిలేషన్‌ కొనసాగుతుందని నేను నమ్ముతున్నాను.
– సుధా

మమ్మల్నే ఆదర్శంగా చూపిస్తున్నారు
ప్రేమ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం. నేను గొప్పా నేను గొప్పా అనుకుంటే సమస్యలు వస్తాయి. రెండు కుటుంబాలను కూడా అర్థం చేసుకోవాలి. మా పెండ్లయి ఇప్పటికి 11 సంవత్సరాలు. ఇప్పటి వరకు మా మధ్య ఎలాంటి సమస్యలు రాలేదు. అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడమే దీనికి కారణం. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇద్దరం మాట్లాడుకుంటాం. ఒకరి అభిప్రాయాలు ఒకరం గౌరవించుకుంటాం. మొదట్లో దిలీప్‌కు జాబ్‌ లేదని మా ఇంట్లో పెండ్లికి ఒప్పుకోలేదు. అందుకే ఐదు సంవత్సరాలు వెయిట్‌ చేసి జాబ్‌ వచ్చిన తర్వాతనే పెండ్లి చేసుకున్నాం. ఇద్దరం హ్యాపీగా ఉన్నాం కాబట్టే ఇప్పుడు అందరూ మమ్మల్ని గౌరవిస్తున్నారు. మా రెండు కుటుంబాలు కూడా ఒకరిని ఒకరు గౌరవించుకుంటారు. ఇన్నేండ్లు మేం కలిసి ఉన్నామంటే మా బంధువుల్లో చాలా మంది నమ్మలేకపోతున్నారు. దిలీప్‌ క్రిష్టియన్‌, నేను ముస్లిం. మా బంధం ఎక్కువ కాలం నిలబడదని చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు మా బంధువులు చాలా మంది ఇప్పటి జంటలకు మమ్మల్నే ఆదర్శంగా చూపిస్తున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే పిల్లలు ప్రేమించుకుంటే తల్లిదండ్రులకు అర్థమయ్యేలా ఓపిగ్గా చెప్పాలి. ఒప్పించి పెండ్లి చేసుకోవాలి. అప్పుడు ఎలాంటి సమస్యలూ ఉండవు. మరో విషయం కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటే తల్లిదండ్రులు పరువు పోయిందని పిల్లల్ని చంపేస్తున్నారు. మిర్యాలగూడలో అదే జరిగింది. దాని వల్ల నష్టపోయింది ఆ అమ్మాయి. ఇప్పుడు చిన్న బాబుతో బతుకుతుంది. కన్నపిల్లల కన్నా పరువు ఎక్కువ అనుకుంటున్నారు. ఇష్టం లేకపోతే అర్థమయ్యేట్టు చెప్పాలి. వినకపోతే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారని వదిలేయాలి. అంతేకాని చంపడం కరెక్టు కాదు.
– మహా జబీన్‌, టీచర్‌

కలిసి వుంటేనే గౌరవం
మా పెండ్లయి 42 ఏండ్లు అవుతుంది. అప్పట్లో కులాంతర, మతాంతర వివాహాలంటే చిన్నచూపు చూసేవారు. ఇప్పుడు కాస్త కామన్‌ అయిపోయింది. ఖండాంతరాలు దాటికూడా పెండ్లి చేసుకుంటున్నారు. అయితే పెండ్లి చేసుకుని దూరంగా వెళ్ళి బతికేవాళ్ళకు సమస్యలు పెద్దగా లేవు. గ్రామంలోనో, ఒకే దగ్గర ఉండి కుటుంబాలతో సంబంధాలు కొనసాగించే వాళ్ళు మాత్రం సమస్యలు ఎదుర్కొంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఫీల్డ్‌లో వుండే వాళ్ళు ప్రేమించి పెండ్లి చేసుకుంటున్నారు. కానీ త్వరగా విడిపోతున్నారు. పెండ్లి చేసుకున్న తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకున్న వాళ్ళే జీవితాంతం కొనసాగుతున్నారు. నేనూ, నా అనే ఆలోచన వల్లే ఎక్కువగా సమస్యలు వస్తుంటాయి. ఈ ఆలోచన ఉంటే ఆ బంధం దీర్ఘకాలం నిలబడదు. వినరుకుమార్‌తో పెండ్లికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. పెండ్లి తర్వాత ఒప్పుకున్నారు. మా పిల్లల్ని కూడా మా అమ్మ వాళ్ళే చూసుకున్నారు. మా అబ్బాయిని అయితే మా మరదలే పాలిచ్చి మరీ పెంచింది. మేము రెండు కుటుంబాలతో కలిసి మెలిసి వుంటున్నాం. ఇరువైపు వారిని సమానంగా గౌరవిస్తాం. కాబట్టే ఇబ్బందులు ఏమీ రాలేదు. మా పిల్లలిద్దరు కూడా కులాంతర వివాహాలే చేసుకున్నారు. అందరూ హాయిగా ఉన్నారు. కులం ఏదైనా, మతం ఏదైనా ప్రేమించి పెండ్లి చేసుకున్న వారు కలిసి వుంటేనే ఎవరికైనా విలువ, గౌరవం.
– సుజావతి

Courtesy Nava Telangana