ఓ ఉద్యమకారిణి ఇన్‌స్టా ప్రాజెక్ట్‌

ప్రేమ అంటే.. ఇద్దరు వ్యక్తులు ఒక్కటి కావడం. కొన్నిసార్లు, ఆ ఇద్దర్నీ విడదీయడానికి ప్రపంచమంతా ఒక్కటి కావడం. అది కులాంతర ప్రేమ అయితే.. కిరాయి గూండాలు రంగప్రవేశం చేయవచ్చు. సుపారీలు చేతులు మారవచ్చు. సఫారీలు గాల్లో ఎగరవచ్చు. ఇవేవీ జరగకపోయినా, ఆలోచనా విధానంలో తేడాలూ, జీవితాన్ని చూసే కోణాలూ.. ఆ ఇద్దరి మధ్యా అగాథాన్ని సృష్టించవచ్చు. జ్యోత్స్నా సిద్ధార్థ్‌ అనే సామాజిక ఉద్యమకారిణి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సేకరిస్తున్న కులాంతర ప్రేమికుల లవ్‌ లెటర్స్‌.. వీటన్నింటితో పాటు రెండు వైరుధ్యాల మధ్య సహజీవనాన్ని మనకు పరిచయం చేస్తాయి.

ఆప్రేమలేఖల్లో.. కృష్ణశాస్త్రి కవిత్వానికి ప్రవేశం లేదు. గుండుమల్లెల పరిమళాలు గుబాళించవు. పదానికీ పదానికీ మధ్య వెచ్చని నిట్టూర్పులు వినిపించవు. సిద్ధాంత చర్చల్లానో, పీహెచ్‌డీ థీసిస్‌లానో అకడమిక్‌గా అనిపిస్తాయి. ప్రేమ రెండు హృదయాలకో, రెండు మనసులకో, రెండు శరీరాలకో పరిమితమైన వ్యవహారంలా అనిపిస్తుంది కానీ, అనేకానేక శక్తులు దృశ్యంగా, అదృశ్యంగా జోక్యం చేసుకుంటూనే ఉంటాయి. ఒకానొక దశలో.. నేపాల్‌ సరిహద్దుల్లో చైనా సైన్యంలా సమాజమూ ఈ గొడవలోకి దూరిపోతుంది. కరోనా వైరస్‌తోపాటూ వచ్చే అనారోగ్యాల్లా కులమూ తనవంతు ప్రభావం చూపుతుంది. మరుక్షణం నుంచీ ఆ ఇద్దర్నీ.. రెండు వర్గాలకో, కులాలకో, మతాలకో ప్రతినిధులుగా చిత్రీకరించడం మొదలుపెడతారు. ఈ సంక్షోభ సమయంలో ఆమె చేతిలోని సెల్‌ఫోన్‌ని లాగేసుకుంటారు. ఆన్‌లైన్‌లో చాట్‌ చేసుకునే వెసులుబాటూ ఉండదు. గడియ పెట్టిన ఆ గదిలో కలం, కాగితం మాత్రం కనిపిస్తాయి. ఎవరో ఒకరు ఆ ఉత్తరాన్ని అవతలి వ్యక్తికి చేరవేసి పుణ్యం కట్టుకోకుండా పోతారా అన్న ఒకే ఒక్క ఆశ. ఆ ధైర్యంతోనే ‘ప్రియమైన…’ అంటూ లేఖారచనకు ఉపక్రమిస్తారు. ఇదే కాదు, ప్రతి ప్రేమలేఖకూ ఓ నేపథ్యం ఉంటుంది.

సమాజాన్ని చూసే కోణమూ..
ప్రతి జ్ఞాపకం వెనుకా ఓ సంఘటన. ఆ సంఘటనను అతను చూసే కోణం ఒకలా ఉంటుంది. ఆమె చూసే కోణం మరోలా ఉంటుంది. కారణం.. ఇద్దరి సామాజిక నేపథ్యాలూ వేరు కావడమే. “గుర్తుందా! ఓ రోజు మనం లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లొస్తున్న సమయానికి.. మున్సిపల్‌ సిబ్బంది రోడ్లు ఊడుస్తున్నారు. ‘ఆ గులాబీరంగు యూనిఫామ్‌ చాలా బాగుంది కదూ’ అన్నావు నువ్వు. ‘ఏమో, నా కండ్లకి మాత్రం ఆ రంగు గడ్డకట్టిన రక్తంలా అనిపిస్తున్నది. కనిపించే ఆ యూనిఫామ్‌ వెనుక, కనిపించని బతుకుల్ని చూస్తున్నాను నేను. వాళ్లంతా మహిళలు, దళిత మహిళలు’ – అని నేను కొంచెం ఆవేశంగానే జవాబిచ్చాను” అంటూ ఓ సంఘటనని నెమరేసుకుంటాడు ఓ ప్రేమికుడు లేఖలో. జ్యోత్స్నా సిద్ధార్థ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ఖాతాలో ఇలాంటి లేఖలు అనేకం.

‘ప్రాజెక్ట్‌ యాంటీ క్యాస్ట్‌, లవ్‌’లో భాగంగా.. కులాంతర జంటల ప్రేమలేఖల్ని సేకరిస్తున్నారు జ్యోత్స్న. ఆమె సామాజిక ఉద్యమకారిణి. తనదీ కులాంతర సహజీవనమే. కొంతకాలం బాగానే గడిచిపోయింది. ఆతర్వాత మొగుడిలోని మృగం బయటికొచ్చింది. ప్రతి చర్యలో అగ్రకుల ఆధిపత్యమే. ఆ సంకెళ్లు తెంచుకుని స్వేచ్ఛా ప్రపంచంలోకి రావడం మినహా మరోదారి కనిపించలేదు. కులాంతర వివాహానికి సిద్ధపడే అట్టడుగు వర్గాల యువతులు.. వైవాహిక బంధంలోనూ వివక్షను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇలాంటి ఓ విస్మృత కోణాన్ని ప్రపంచానికి తెలియజెప్పేందుకే ఈ ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నానని అంటారు జ్యోత్స్న. ఈ ప్రయత్నంలో తొలి అడుగు.. ‘ప్రాజెక్ట్‌ యాంటీక్యాస్ట్‌ లవ్‌.. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు గతంలో రాసుకున్న ప్రేమలేఖల్ని సేకరించాలని భావిస్తున్నది. ఆసక్తి ఉన్నవారు మాతో పంచుకోవచ్చు’ అంటూ ఆన్‌లైన్‌లో ఓ ప్రకటన ఇచ్చారు ఆమె. దానికి అనూహ్యమైన స్పందన లభించింది.

అండ కావాలి..
ప్రభుత్వాలు కులాంతర వివాహానికి ఓ రెండున్నర లక్షల ప్రోత్సాహకం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. నిజమే, ప్రపంచాన్ని ఎదిరించి నిలబడటానికి డబ్బు అవసరమే. కానీ, దానికితోడు సర్కారు మద్దతూ కావాలి. ప్రస్తుతం, ఆ ఒక్కటే కరువవుతున్నది. ఆ అండ లేకపోవడం వల్లనే కదా, నిత్యం ఏదో ఓ చోట పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. బిహార్‌లో అయితే ఓ భూస్వామి నిండుచూలాలైన కూతురినీ, ఆమె భర్తనీ కూడా కిరోసిన్‌పోసి తగులబెట్టాడు’ అంటారు జ్యోత్స్న.

ఆ ఉత్తరాలలో ఎప్పుడో కాలేజీ రోజుల్లో రాసుకున్నవీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్లు భార్యాభర్తలు, అమ్మానాన్నలు కూడా. ‘ఈరోజు నేను కాలేజీకి రావడం లేదు. నేను లేకపోతే నువ్వు ఒంటరిగా ఫీల్‌ అవుతావని తెలుసు. అయినా తప్పడం లేదు. ఈ ఉత్తరాన్ని.. ఫలానా మిత్రుడి ద్వారా పంపుతున్నాను. తనను నమ్మవచ్చు. సరేనా? ఉంటాను మరి..’ తరహాలో పెద్దగా సిద్ధాంత చర్చలేని ఉత్తరాలూ కనిపిస్తాయి. ‘మనం కలిసి ఉండాలనుకున్నా.. సమాజం ఉండనిచ్చేలా లేదు. కలిసి చావడం కంటే, కలవకుండా బతకడమే గొప్ప. ప్రేమ కంటే జీవితం గొప్పది. గుడ్‌బై నేస్తం’ తరహా అనివార్యమైన వీడ్కోలు లేఖలనూ ఇక్కడ చూడవచ్చు. ఈ ఉత్తరాలు సమాజంలోని సంక్లిష్టతలను అర్థం చేసుకోడానికి చాలా సాయపడతాయి. ప్రాజెక్టులో భాగంగా సేకరించిన ఉత్తరాలతో ఓ ఎగ్జిబిషన్‌ నిర్వహించాలన్నది ఆమె ఆలోచన.

అవగాహన కోసం..
మనిషిలోని ప్రతి ఉద్వేగమూ పెంపకంతో ముడిపడి ఉంటుంది. అగ్రహారంలో పెరిగామా, దళితవాడలో పెరిగామా, భయంభయంగా పెరిగామా, స్వేచ్ఛగా పెరిగామా.. అన్నది కూడా మన స్వభావం మీదా, అంతిమంగా మన రిలేషన్‌షిప్‌ మీదా ప్రభావం చూపుతుంది. అందానికి ఇచ్చే నిర్వచనం కూడా కులాన్ని బట్టి మారుతుంది. ఓ కులం నలుపును ద్వేషిస్తుంది. ఓ కులం నలుపును ప్రేమిస్తుంది. ఓ సంప్రదాయం మాంసాన్ని నిషేధిస్తుంది. మరో సంప్రదాయం మద్యమాంసాల్ని నైవేద్యంగా పెడుతుంది. ఓ కులాంతర జంట కలిసి బతకాలంటే.. ఇన్ని విషయాల మీద అవగాహన ఉండాలి. ఇన్ని కోణాల్ని అర్థం చేసుకోవాలి. కొందరికి ఆ శక్తి ఉంటుంది, కొందరికి ఉండదు. అందుకే జ్యోత్స్న ఇలాంటి జంటల కోసం అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు.

ఎంత ప్రేమించినా, కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి మూలాలు శూలాల్లా గుచ్చుకుంటాయి.

‘నేను నిన్ను ప్రేమించడం.. నువ్వు నన్ను ప్రేమించడమంతసులభం కాదు. ఎందుకంటే, నీ తాతముత్తాతలు నా తాతముత్తాతల్ని నిర్దాక్షిణ్యంగా అణచివేశారు’

  • ఈ తరహా పదునైన కవితాత్మక వ్యక్తీకరణలూ ఆ లేఖల దొంతరల మధ్యలో దొరుకుతాయి. అతనో ఆమెనో నచ్చి ఉండవచ్చు. ఇద్దరూ ఒకర్ని ఒకరు ఇష్టపడి ఉండవచ్చు. వర్తమానం వరకూ ఫర్వాలేదు. గతం గుర్తొచ్చిన ప్రతిసారీ.. రక్తం కుతకుతా ఉడికిపోతుందే?

– ఈ ప్రశ్నకు జవాబు ఎవరు చెబుతారు?

Courtesy Namasthe Telangana