రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)

ఉత్తరప్రదేశ్‌లో ఆయా వర్గాల వారి పట్ల ప్రభుత్వం బహిరంగంగా ప్రదర్శిస్తున్న వివక్ష అనాగరికమైనది. ఇదొక కొత్త పరిణామం. అలాగే రాజకీయ వ్యతిరేకులను, మీడియాను అణచివేసే చర్యలు కూడా మునుపెన్నడూ కనీ వినీ ఎరుగనివే. సక్రమంగా పని చేస్తున్న ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో పోలీసు వ్యవస్థను లేదా పాలనా యంత్రాంగాన్ని దుర్వినియోగపరిచినా, చట్టాలను అనుచితంగా ప్రయోగించినా ఉత్పన్నమయ్యే అస్తవ్యస్థ పరిస్థితులను ఇతర ప్రభుత్వ విభాగాలు సరిదిద్దగలుగుతాయి. కానీ ఇప్పుడు మన దేశంలో ఇటువంటి దిద్దుబాటు చర్యలకు ఎంత మాత్రం ఆస్కారం లేదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమమంగా పని చేయడం లేదన్నది ఒక నిష్ఠుర సత్యం.

భారత్ సస్యశ్యామల భూమే గానీ భారతీయులలో పేదలు చాలా మంది ఉన్నారు. ఎవరు పేద భారతీయులు? ప్రముఖ ఆర్థికవేత్త టి.ఎన్.శ్రీనివాసన్ రెండు దశాబ్దాల క్రితం వారిని ఇలా గుర్తించారు: ‘భారత్‌లో పేదవాడు అయిన వ్యక్తి బహుశా చాలావరకు గ్రామీణ ప్రాంతాలలో నివశిస్తున్నవాడయి ఉంటాడు, దళితుడు లేదా ఆదివాసీ లేదా వివక్షకు గురవుతున్న సామాజిక వర్గానికి చెందిన వాడై ఉంటాడు, పోషకాహారం లోపించి, తీవ్ర అనారోగ్య పీడితుడై ఉంటాడు, నిరక్షరాస్యుడు లేదా వర్షాకాలపు చదువులతో నవీన వృత్తులకు అవసరమైన నైపుణ్యాలు లేనివాడై ఉంటాడు, మరీ ముఖ్యంగా బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లేదా ఒడిషా వంటి కొన్ని నిర్దిష్ట రాష్ట్రాలలో నివసిస్తున్నవాడై ఉంటాడు’.

భారత పౌరుల ఆర్థిక స్థితిగతులలోని వైవిధ్యాల గురించి ప్రొఫెసర్ శ్రీనివాసన్ చేసిన వ్యాఖానమది. ఇరవై సంవత్సరాల అనంతరం, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో ఇటీవల సంభవించిన సంఘటనల నేపథ్యంలో దేశ పౌరులకు న్యాయం అందుతున్న తీరుతెన్నుల్లోని వైరుధ్యంపై నేనొక పరిపూరక సిద్ధాంతాన్ని ప్రతిపాదించదలిచాను. దేశంలోని పోలీసువ్యవస్థ, పాలనా యంత్రాంగం, న్యాయస్థానాల నుంచి తమకు సముచిత ఆదరణ లభించాలని పౌరులు కోరుకోవడం సహజం కదా. మరి వారు ఆశిస్తున్న మర్యాదా మన్ననలు లభిస్తున్నాయా అన్నది అసలు ప్రశ్న. దీనికి నా సమాధానం ‘లేదు’ అనేదే. మీరు ఒక మహిళ లేదా ఒక దళితుడు, ఒక ఆదివాసీ లేదా ఒక ముస్లిం అయినా, నగరాలకు సుదూర గ్రామీణ ప్రాంతాలలో నివశిస్తున్నా, అంతగా చదువుకోని వారయినా, ఆంగ్ల భాషను అసలే మాట్లాడలేనివారైనా పోలీసు, పాలన, న్యాయవ్యవస్థల నుంచి మీరు న్యాయం, గౌరవాదరాలు పొందగల అవకాశాలు బహుశా తక్కువే.

భారత్‌లో న్యాయపాలన, న్యాయవితరణ ఎంతగా కుల, మత, వర్గ పక్షపాతంతో ఉన్నాయో మన తాత ముత్తాతల కాలం నుంచీ అందరికీ తెలిసిన విషయమే. మన అధమాధమ ప్రమాణాల ప్రకారం చూసినా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో పోలీసు వ్యవస్థ, పాలనా యంత్రాంగం ఇటీవల వివిధ సందర్భాలలో ప్రవర్తించిన తీరుతెన్నులు పూర్తిగా గర్హనీయమైవని, ఇంతకు ముందెన్నడూ అవి అలా ప్రవర్తించలేదని విస్పష్టంగా చెప్పక తప్పదు. 2020 ఫిబ్రవరి, మార్చి నెలల్లో దేశ రాజధానిలో జరిగిన మతతత్వ అల్లరకు సంబంధించి పోలీసులు దాఖలు చేసిన అభియోగపత్రాలు పూర్తిగా అసత్యాలు, కట్టుకథలతో రూపొందించినవి మాత్రమే. అసత్యాలతో పాలకుల ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. అహింసకు నిబద్ధమైన విద్యార్థులు, ముస్లింలపై వ్యతిరేకతలను మరింతగా రెచ్చగొట్టే లక్ష్యంతోనే ఆ అభియోగపత్రాలను రూపొందించారన్న విషయం స్పష్టమవుతుంది. అధికార పక్షంతో సన్నిహిత సంబంధాలు ఉన్న మితవాద హిందువులే హింసాకాండను ప్రజ్వరిల్లింప చేశారన్న వాస్తవాన్ని ఆ నేరారోపణ పత్రాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి.

ఢిల్లీ పోలీసులు తమ పక్షపాత, మతతత్వ ధోరణులను తమకు తామే బయటపెట్టుకోగా, ఉత్తరప్రదేశ్ పోలీసులు పూర్తిగా పక్షపాత, పితృస్వామిక, కులతత్వ, మతోన్మాద వైఖరితో వ్యవహరించారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవలి సంవత్సరాలలో దళితులకు వ్యతిరేకంగా దాడులు, దౌర్జన్యాలు 47 శాతం పెరిగాయని కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ క్రైమ్ బ్యూరో వెల్లడించింది. దేశ జనాభాలో 16 శాతం మంది ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నారు. అయినప్పటికీ దేశంలో మహిళలు, బాలికలకు వ్యతిరేకంగా సంభవిస్తున్న నేరాలలో 25 శాతం ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే జరుగుతున్నాయి. ఈ అధికారిక లెక్కలు కూడా తక్కువ అంచనాలేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉత్తరప్రదేశ్ పోలీసులకు గతంలోనూ ఏమంత మంచి పేరు లేదు. 2016లో యోగి ఆదిత్యనాథ్ అధికారానికి వచ్చిన తరువాత వాళ్లు తమ చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా తమకు తామే అధికారపక్షం కొమ్ముకాయడం ప్రారంభించారు. అత్యధిక జనాభా గల రాష్ట పరిపాలకుడిగా ఆదిత్యనాథ్ ఎంపిక భారతీయ జనతా పార్టీ పురోగమనంలో మౌలిక ప్రాధాన్యమున్న పరిణామమని ‘ఆర్టికల్ 14’ అనే వెబ్‌సైట్ వ్యాఖ్యానించింది. ఇది ముస్లిం పౌరులను, భిన్న రాజకీయ అభిప్రాయాలతో వ్యవహరించేవారిని ప్రజాశత్రువులుగా పరిగణించే పాలనా నమూనాకు ఆమోదానివ్వడమేనని కూడా ఆ వెబ్‌సైట్ పేర్కొంది. ఆదిత్యనాథ్ అధికారానికి వచ్చిన క్షణం నుంచీ గోరక్షణ నిఘా బృందాల లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని నిస్సంకోచంగా ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యానించింది. హిందువులకు, ప్రత్యేకించి ‘అగ్ర’ కులస్తులకు తొలి ప్రాధాన్యమిస్తున్నారని అభిప్రాయపడింది. ముస్లింలు, రాజకీయ వ్యతిరేకులను శిక్షించేందుకు, అప్రతిష్ఠపాలు చేసేందుకు చట్టాలను, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగపరుస్తున్నారని, కొన్ని కేసులలో ముస్లింలు, రాజకీయ వ్యతిరేకులను మట్టుబెట్టడం కూడా జరిగిందని ఆ వెబ్‌సైట్‌ పేర్కొంది’.

డాక్టర్ ఖఫీల్‌ఖాన్‌ను నిరాధార ఆరోపణలపై అరెస్ట్ చేసి జైలులో నిర్బంధించడం, కొత్త పౌరసత్వ చట్టాలను వ్యతిరేకించిన వారిని పలు విధాలుగా వేధింపులకు గురిచేయడం మొదలైన చర్యలు ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ముస్లిం వ్యతిరేక వైఖరులను స్పష్టం చేస్తున్నాయి. హథ్రాస్‌లో ఇటీవల జరిగిన దురాగతం విషయంలో ఆయన ప్రభుత్వం వ్యవహరించిన తీరు కులతత్వం, కరడుగట్టిన పితృస్వామిక ధోరణులకు అద్దం పడుతుందని స్పష్టంగా చెప్పవచ్చు. దీనిపై ‘ఫైనాన్షియల్ టైమ్స్’ ఘాటుగానే వ్యాఖ్యానించింది. ‘కులాధార జెండర్ హింసాకాండకు సంబంధించి భారత్కు సుదీర్ఘమైన, గౌరవహీనమైన చరిత్రే ఉంది. రాజకీయ సమీకరణలకు అదొక భావోద్వేగ ప్రేరణగా ఉంటోంది. హథ్రాస్‌లో బాధితురాలి కుటుంబానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని నిస్సిగ్గుగా ఉపయోగించారు. ఆ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్న వారిని బెదిరించేందుకు అధునాతన నిఘా పరికరాలను వినియోగించార’ని ఆ ప్రతిక పేర్కొంది.

ఉత్తరప్రదేశ్‌లోనే కాదు, ఇతర రాష్ట్రాలలోనూ పోలీసు వ్యవస్థ అధికారంలో ఉన్న రాజకీయ పక్షానికి అనుకూలంగా వ్యవహరించడం ఒక ఆనవాయితీ అయిపోయింది. బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పోలీసు విభాగం పూర్తి విధేయతతో వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా పోలీసులు తరచు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూనే ఉన్నారు. ప్రతి చోటా మహిళలు, నిమ్న కులస్థులు, మైనారిటీ వర్గాల పట్ల పూర్తి వివక్ష ప్రదర్శిస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఆయా వర్గాల వారి పట్ల ప్రభుత్వం బహిరంగంగా ప్రదర్శిస్తున్న వివక్ష అనాగరికమైనది. ఇదొక కొత్త పరిణామం. అలాగే రాజకీయ వ్యతిరేకులను, మీడియాను అణచివేసే చర్యలు కూడా మునుపెన్నడూ కనీ వినీ ఎరుగనివే. 2012లో కాంగ్రెస్ పాలిత ఢిల్లీలో ఒక అత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలని అశేష ప్రజలు వీథుల్లోకి వచ్చి డిమాండ్ చేశారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని పట్టణాలు, నగరాలలో అటువంటి నిరసన ప్రదర్శనల వెల్లువను ఊహించలేం. సక్రమంగా పని చేస్తున్న ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో పోలీసు వ్యవస్థను లేదా పాలనా యంత్రాంగాన్ని దుర్వినియోగపరిచినా, చట్టాలను అనుచితంగా ప్రయోగించినా ఉత్పన్నమయ్యే అస్తవ్యస్థ పరిస్థితులను ఇతర ప్రభుత్వ విభాగాలు సరిదిద్దగలుగుతాయి. కానీ ఇప్పుడు మన దేశంలో ఇటువంటి దిద్దుబాటు చర్యలకు ఎంత మాత్రం ఆస్కారం లేదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమమంగా పని చేయడం లేదన్నది ఒక నిష్ఠుర సత్యం.

ఇటువంటి పరిస్థితుల్లో కనీసం న్యాయవ్యవస్థ అయినా తన విధ్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహించగలదని, నిర్వహించాలని అత్యధిక శాతం ప్రజలు ఆశిస్తున్నారు. విషాదమేమిటంటే సుప్రీంకోర్టు, హై కోర్టులు తమ రాజ్యాంగ కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించడంలో చాలవరకు విఫలమయ్యాయని చెప్పక తప్పదు. అధికరణ 370, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల పై సత్వర విచారణకు ఉన్నత న్యాయస్థానాలు సుముఖంగా లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సెలెబ్రిటీల కేసుల విచారణలో చూపుతున్న చురుకుదనాన్ని పేదల బాగోగులకు సంబంధించిన పిటిషన్ల విచారణ విషయంలో చూపక పోవడం సుప్రీంకోర్టుకు ప్రతిష్ఠాకరమేనా?

హథ్రాస్‌లో దళిత యువతిపై అత్యాచారం, ఆ సంఘటన పర్యవసానాలపై నిరసనలు తనను, తన ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడం కోసం అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కుట్రలో భాగమేనని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఆరోపించారు. నిజమేమిటంటే ఈ విషయంలో భారత రాజ్యవ్యవస్థకు ఎటువంటి విదేశీ సహాయం అవసరం లేదు. తనను తాను అప్రతిష్ఠపాలు చేసుకునేందుకు భారత రాజ్యవ్యవస్థ ఇప్పటికే సంసిద్ధంగా ఉంది. భారత్‌లో ధర్మం చాలా  కాలంగా నాలుగు పాదాలపై నడవడం లేదు. ముఖ్యంగా మీరు ఒక మహిళ లేదా పేద వ్యక్తి అయినా, ఒక ముస్లిం లేదా దళిత వ్యక్తి అయినా న్యాయం అనేది మీకు ఏ మాత్రం అందుబాటులో ఉండదు. ప్రస్తుత ప్రభుత్వాల పాలనలో సగటు మనిషికి అది పూర్తిగా అందని చందమామే అయిపోయింది.

Courtesy Andhrajyothi