యోగేంద్ర యాదవ్
(స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు)

కరోనా వైరస్ నియంత్రణకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించి వారం రోజులు గడిచిపోయాయి. ఇదొక కఠిన, అయితే ఆవశ్యకమైన నిర్ణయం. మరో రెండు వారాల పాటు కొనసాగే ఈ లాక్‌డౌన్‌‌ను అమలుపరచడంలో ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోంది? ఇదే చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం స్పష్టమే. లాక్‌డౌన్‌ సవ్యంగా అమలు కావడం లేదు. కనుకనే ఆ నిర్ణయ సంభావ్య ప్రయోజనాలు సిద్ధించడం లేదు. పైపెచ్చు పరిస్థితులు అనూహ్య రీతుల్లో విషమిస్తున్నాయి.

ప్రధాన మంత్రి గత నెల 24 రాత్రి ప్రకటించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నిర్ణయానికి నేను తక్షణమే సానుకూలంగా ప్రతిస్పందించాను. లాక్‌డౌన్‌కు నేను మద్దతునివ్వడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే లాక్‌డౌన్‌కు పిలుపు నిచ్చినందుకు ప్రధాని మోదీని విమర్శించడం సహేతుకం కాదని నేను ఇప్పటికీ విశ్వసిస్తున్నాను. అయితే అది అత్యుత్తమ నిర్ణయమనో లేదా ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించేందుకు అదొక్కటే మార్గమనో నేను భావించడం లేదు.

నిజం చెప్పాలంటే కరోనా ఉత్పాతం నుంచి బయటపడేందుకు ఏది ఉత్తమ మార్గమో లేదా ఏది తక్కువ హానికర మార్గమో ఎవరికీ తెలియదు. మరి లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చినందుకు ప్రధాని మోదీని తప్పుపట్టడమెందుకు? లాక్‌డౌన్‌కు వైద్య శాస్త్ర ప్రపంచం సంపూర్ణ మద్దతునిస్తోంది. ఇప్పటికే పలు దేశాలు లాక్‌డౌన్ను అమలుపరిచాయి; ఇంకా అమలుపరుస్తున్నాయి. యథార్థానికి, ప్రధానమంత్రి గనుక ఆ నిర్ణయం తీసుకోకపోయివుంటే మోదీ విమర్శకులు ఆయన్ని క్షమించేవారేనా? కరోనా నియంత్రణకు అత్యంత ఆవశ్యకమైన చర్యను చేపట్టడంలో ఆలస్యం చేస్తున్నందుకు మోదీని ఉతికి ఆరేసేవారు కాదా? స్పష్టమైన, సుసంగతమైన, సత్వర రాజకీయ నిర్ణయం తీసుకోవల్సిన సందర్భం కరోనా కల్లోలం. అంతేకాదు, లాక్‌డౌన్‌ మొదటి వారం రోజుల్లో చోటుచేసుకున్న అవకతవకలకు ప్రధానమంత్రిని తప్పుపట్టడం ఏమాత్రం సరికాదు. ఇటువంటి బృహత్తర నిర్ణయం తీసుకుని, అమలుపరచడంలో ఎన్నో కష్టనష్టాలు సంభవించడం అనివార్యం.

సరే, కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి మోదీ ప్రభుత్వాన్ని విధిగా మూడు ప్రశ్నలు అడగ వలసివున్నది. అవి: లాక్ డౌన్ను ఎలా అమలుపరచాలి, పర్యవసానాలు ఎలా ఉంటాయన్న విషయయై మోదీ ప్రభుత్వం సమాలోచన జరిపిందా? లాక్‌డౌన్‌ నిర్ణయం గురించి ప్రజలకు సమగ్రంగా, సూటిగా, స్పష్టంగా వివరించారా? లాక్‌డౌన్‌‌ను ప్రకటించిన క్షణం నుంచీ చోటుచేసుకుంటున్న పరిణామాలు, మారుతున్న పరిస్థితులకు ప్రభుత్వం శీఘ్రగతిన, అర్థవంతంగా ప్రతిస్పందిస్తున్నదా? ఈ మూడు ప్రశ్నలకు సమాధానం నకారాత్మకమైనది కావడం ఒక మహా విచారకరమైన విషయం.

ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ఎటువంటి శషభిషలకు పోకుండా దానినెదుర్కొని తీరాలి. కరోనా మహమ్మారి విరుచుకుపడిన సందర్భం కూడా ఇలాంటిదే. అన్నీ ఆలోచించడానికి వ్యవధిలేని విపత్తు అది. ప్రధాని మోదీ సహేతుకంగానే, అనివార్యంగానే లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఇదే సమయంలో కొవిడ్ -19 ఒక భూకంపం లాంటిది కాదనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. భూకంపానికి, ఆ దుర్ఘటన సంభవించిన అనంతరం మనం ప్రతిస్పందిస్తాము. జరగవలసిన నష్టం జరిగిన తరువాత మాత్రమే మనం ఏమైనా చేయగలిగేది.

చైనా, కరోనా వైరస్ తొలుత ప్రబలిన తమ వూహాన్ నగరంలో లాక్‌డౌన్ను ప్రకటించిన ఎనిమిది వారాలకు భారత్ జాతీయ లాక్‌డౌన్‌ను ప్రకటించింది; అప్పటికి ఇటలీ నాలుగువారాలుగా కొన్ని ప్రాంతాలలో లాక్‌డౌన్ను అమలుపరుస్తోంది. రెండు వారాల అనంతరం ఇటలీ అంతటా లాక్డౌన్ను అమలుపరిచారు. ఈ విషయాలు స్పష్టం చేస్తున్నదేమిటి? లాక్‌డౌన్‌ గురించి సమగ్రంగా ఆలోచించి, అమలుకు ఒక పటిష్ఠ ప్రణాళికను రూపొందించుకునేందుకు భారత్‌కు చాలా సమయం అందుబాటులో ఉన్నదనే కాదూ? లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చిన మొదటి వారంరోజుల్లో సంభవించిన సంఘటనలు, పరిణామాలను నిశితంగా గమనిస్తే ఎటువంటి పకడ్బందీ ప్రణాళికను ప్రభుత్వం రూపొందించుకున్న దాఖలాలు కన్పించనేలేదు. లాక్‌డౌన్‌ కాలంలో పైగా ఇది పంట కోతల కాలం అనే విషయాన్ని ప్రభుత్వం ఎలా విస్మరించింది? అసంఘటితరంగ వలస శ్రామికుల సంక్షేమానికి ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ఎందుకు ప్రకటించలేదు?

ప్రస్తుత సంక్షేమ పథకాల పరిధిలోకి రాని వారికి నిత్యావసర సరుకుల పంపిణీని ప్రకటించేందుకు ఆకలి మరణాలు సంభవించే దాకా ఎందుకు వేచి ఉన్నారు? రవాణా వ్యవస్థల షట్‌డౌన్‌ను అమలుపరిచిన తీరు (తొలుత ప్యాసెంజర్ రైళ్ళ రద్దు, ఆ తరువాత అంతర్-రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం, ఆఖరుకు దేశీయ, అంతర్జాతీయ విమానసర్వీసులపై ఆంక్షలు) తర్క విరుద్ధంగా ఉండడానికి కారణమేమిటి? ఈ విషయమై ఎవరైనా ఆలోచించారా? రవాణా వ్యవస్థలను సంపూర్ణంగా షట్‌డౌన్ చేయడమంటే సరుకుల సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, నిత్యావసర సరుకుల కొరత నెలకొనడమే గాక అక్రమ వ్యాపార కార్యకలాపాలు ప్రబలిపోతాయని ముందుస్తుగా ఎందుకు ఊహించలేకపోయారు? సహాయ చర్యలను ప్రకటించడంలో అంత జాప్యం ఎందుకు జరిగింది? ఈ ప్రశ్నల గురించి లోతుగా, ప్రగాఢంగా ఆలోచించండి. ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన తరువాతనే లాక్‌డౌన్‌ గురించి ఆలోచించడం, అమలుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందనే వాస్తవం మీకు స్పష్టమవుతుంది. ఇదొక అసంబద్ధ దృక్పథం. కనుకనే ఏ సంక్షోభాన్ని అయితే ఎదుర్కోవడానికై లాక్‌డౌన్ను ప్రకటించడం జరిగిందో ఆ సంక్షోభం కంటే మరింత పెద్ద విషమ పరిస్థితిని ప్రభుత్వ నిర్ణ యం సృష్టించింది! ఎంత విషమంగా ఉన్నది ప్రస్తుత పరిస్థితి! దేశవ్యాప్త లాక్‌డౌన్‌ సృష్టించిన జీవనాధారాల సంక్షోభం ముందు ప్రజల ఆరోగ్యానికి కొవిడ్ -19నుంచి ఎదురవుతున్న ముప్పు వెలవెలబోవడం లేదూ?

ప్రజలకు చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పగల వచోనిపుణుడు నరేంద్రమోదీ. భావ ప్రసారంలో ప్రతిభా పరిపూర్ణుడైన మోదీ, దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించే సందర్భంలో జాతినుద్దేశించి వెలువరించిన ప్రసంగం ఆరోగ్య అత్యవసరపరిస్థితి సమయంలో నెలకొన్న, వ్యాపిస్తున్న విషమ పరిస్థితిని ఎలా తెలియజేయకూడదనడానికి ఒక ఉదాహరణగా చెప్పి తీరాలి. కరోనా కల్లోలం గురించి ప్రజలకు తెలియజేయడంలో ప్రధానమంత్రి వారిలో అమిత వ్యాకులతను సృష్టించారు. ప్రధాన మంత్రి ప్రసంగించిన తీరు ప్రతి ఒక్కరి – విద్యాంతులు, నిరక్షరాస్యులు-లో భీతావహ భావాన్ని సృష్టించింది. మశూచికం, కలరా, ప్లేగ్ వలే కరోనా వైరస్ కూడా ఒక ప్రాణాంతక వ్యాధి అనే భావం ప్రజల మనస్సుల్లో నెలకొన్నది. తత్‌క్షణం నుంచి వారు తీవ్ర ఆందోళనలో జీవిస్తున్నారనడం సత్యదూరం కానేకాదు.

ప్రజలకు అవసరమైన సమాచారమివ్వడంలోనూ, భవిష్యత్తుపై భరోసా కల్పించడంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం విఫలమయింది. కొవిడ్-19 సోకిన వారిలో మరణించిన వారి సంఖ్య 2 శాతం, అంతకంటే తక్కువగా ఉందనే వాస్తవాన్ని ఆయన వెల్లడించలేదు. దేశవ్యాప్త లాక్‌డౌన్కు ప్రభుత్వ సన్నద్ధత గురించిన వాస్తవాలను కూడా ఆయన తన శ్రోతలతో పంచుకోనేలేదు. అలాగే మన డాక్టర్ల, వైద్య పరిశోధకుల ప్రతిభా పాటవాల నాణ్యత గురించి కూడా ప్రజలలో ఒక గట్టి నమ్మకాన్ని ఆయన కలిగించలేకపోయారు.

నిరంతర కర్ఫ్యూలాంటి లాక్‌డౌన్లో అనుమతించే వాటి గురించి, ఆంక్షలు విధించే వాటి గురించి ఆయన వివరించనే లేదు. తత్ఫలితంగానే ఆయన ప్రసంగం అనంతరం దేశవ్యాప్తంగా ప్రజలు, 21 రోజులకు అవసరమయ్యే నిత్యావసర సరుకులను సమకూర్చుకునేందుకు గాను కిరాణా దుకాణాల ముందు బారులు తీరవలసివచ్చింది. ఇంతకంటే ఘోరమైన విషయమేమిటంటే సమాజంలోని దుర్బల వర్గాల వారికి, ఆహారం, ఇతర నిత్యావసరాలు సమకూర్చుతామనే విషయమై ఎటువంటి భరోసా నివ్వకపోవడం మరింత ఘోరమైన విషయం. ఈ కారణంగానే నగరాలలలోని పేద వలస కార్మికులు తమ పల్లెలకు పెద్ద ఎత్తున తిరిగి వెళ్ళిపోవడం ప్రారంభమయింది. జాతి నుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం ప్రజారోగ్య సంక్షోభాన్ని ఒక ఉమ్మడి ఉన్మాద స్థితిగా మార్చివేసింది.

ఇంత విషమ పరిస్థితులలోనూ సంక్షోభ నిర్వహణ కంటే నిత్యం పతాక శీర్షికలలో వుండేందుకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది! బాధితులను ఆదుకునేందుకు ఏ మంత్రిత్వ శాఖ ఆరాటపడుతోంది? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘనమైన గణాంకాలను వెల్లడిస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర మోదీ రైతులకు అందిస్తున్న సహాయ సహకారాల గురించి మాట్లాడుతున్న దేమీ లేదు. కరోనా వైరస్ గురించి ప్రజల్లో మెరుగైన అవగాహన కల్పించడం కంటే టీవీ సీరియల్స్‌కే ప్రాధాన్యమిస్తూ కరోనా సంక్షోభ సందర్భాన్ని మీడియాపై మరింత నియంత్రణ సాధించేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది.

వ్యక్తిపూజకు నిరంతరం ప్రాధాన్యమివ్వడం పెరిగిపోవడంతో బీజేపీలోనూ, ప్రభుత్వంలోనూ అధినేత మినహా ఇతరుల ప్రాధాన్యం అంతకంతకూ క్షీణించిపోతోంది. ఒక వ్యక్తి లోపాలు వ్యవస్థాగత బలహీనతలుగా పరిణమించాయి.

జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రభుత్వ వ్యవస్థ పాలనకంటే ప్రజాసంబంధాలకే అధిక ప్రాధాన్యమిస్తోంది. విపత్తు నివారణ, అందునా కరోనా వైరస్‌లాంటి సంక్షోభం విషయంలో ఇలాంటి దృక్పథాన్ని అనుసరించడం వినాశనకర ఫలితాలను మాత్రమే ఇస్తుంది. ఈ విపత్కర పరిణామం మీకు వేటిని గుర్తు చేస్తున్నాయి? 2016 నోట్ల రద్దు పర్యవసానాలనే కాదూ? ఆ మహా చారిత్రక తప్పిదానికి పాల్పడి కూడా నరేంద్ర మోదీ ప్రజల ఆగ్రహం పాల్పడకుండా తప్పించుకోగలిగారు. ఉత్తర భారతావనిలో విశేష ప్రాచు ర్యంలో వున్న ఒక లోకోక్తి చెప్పినట్టు– ఒక కొయ్య పాత్రను మీరు మళ్ళా మళ్ళీ నిప్పు మీద పెట్టలేరు సుమా!

Courtesy Andhrajyothy