– సర్కార్‌ రియల్‌ దందా
– మధ్యదళారీ పాత్ర
– ఇండిస్టియల్‌ క్లస్టర్ల పేరుతో 50 వేల ఎకరాల సేకరణ
– రైతులకు చెల్లిస్తున్నది రూ.8లక్షలనుంచి రూ.12.5 లక్షలే
– పరిశ్రమలకు విక్రయిస్తున్న ధర రూ 30 లక్షల నుంచి రూ. కోటి
హైదరాబాద్‌: రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన అడుగు పెట్టింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరిట రియల్‌ దందాకు దిగింది. రైతుల నుంచి భూములను తక్కువ ధరకు సేకరించి ఎక్కువ ధరకు అమ్మడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును ఆర్జించేందుకు సన్నాహాలు చేసింది. రాష్ట్రంలోని పలు ఇండిస్టియల్‌ క్టస్టర్లలో ఇప్పటికే ఈ తరహా వ్యాపారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం వారిని నట్టేట ముంచుతున్నది. మధ్యదళారీ పాత్ర పోషిస్తూ పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నది.

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఎటు చూసినా అప్పులు.. ఆర్థిక మాంద్యం పేరు చెప్పి పన్ను బకాయిల్లో కేంద్రం కోత పెట్టింది. మరోవైపు నిధుల్లేక పథకాలు ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలోనే సర్కార్‌ రియల్‌ దందాకు శ్రీకారం చుట్టిందని తెలుస్తోంది. 2014లో పరిశ్రమల కోసం భూ బ్యాంక్‌ (ల్యాండ్‌ బ్యాంక్‌)ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఉపయోగంలో లేని భూమితో కలుపుకుని మొత్తం లక్షా 50 వేల ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. గడిచిన ఐదేండ్ల కాలంలో 49 పారిశ్రామిక క్లస్టర్లకు శ్రీకారం చుట్టి ఇప్పటి వరకు 50 వేల ఎకరాలను సేకరించింది. వీటినే ప్రస్తుతం పరిశ్రమలకు కొన్న ధరకంటే మూడునుంచి నాలుగు రెట్లు అధికమొత్తంలో అమ్ముతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2013కు ముందు ప్రభుత్వం నిర్ణయించిన ధరలను ప్రామాణికంగా తీసుకుని వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరిట రూ.8 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు చెల్లించి భూమలను స్వాధీనం చేసుకున్నది.. అయితే, హైదరాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌, కరీంనగర్‌ తదితర ప్రాంతాల్లో మార్కెట్‌ ధరలు కోట్లల్లో ఉన్నాయి. సేకరించిన భూములను మార్కెట్‌ ధరలకంటే అధిక మొత్తాలకు పారిశ్రామిక వేత్తలకు విక్రయించి రియల్‌ వ్యాపారానికి ప్రభుత్వం పాల్పడుతున్నదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వమే దళారి పాత్రను పోషిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దాంతో రైతులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. రూ. 20లక్షల నుంచి మొదలుకొని కోటి రూపాయల వరకు ధరను నిర్ణయిస్తున్నారు రంగారెడ్డి, వరంగల్‌, మెదక్‌ తదితర ప్రాంతాల్లో డిమాండ్‌ను బట్టి ధరలను నిర్ణయించి పారిశ్రామిక వేత్తలకు కేటాయిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన భూముల్లో దాదాపు 30 శాతం భూములను పరిశ్రమలకు కేటాయించినట్టు అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలోని ప్రధాన క్లస్టర్లలో జరిగిన భూసేకరణ వివరాలు
1) ముచ్చర్ల ఫార్మా సిటీ రంగారెడ్డి జిల్లా
మొత్తం ప్రతిపాదిత భూ విస్తీర్ణం – 19,333 ఎకరాలు
ఇప్పటి వరకు సేకరించినది – 8,400 ఎకరాలు
2) వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ – 2,000 ఎకరాలు
ఇప్పటి వరకు సేకరిచిన భూమి – 1,200 ఎకరాలు
3. నిమ్జ్‌ జహీరాబాద్‌ ప్రతిపాదిత భూమి – 12,635 ఎకరాలు
ఇప్పటివరకు సేకరించినది – 3500 ఎకరాలు
4.రావిర్యాల ఫ్యాబ్‌ సిటీ ప్రతిపాదిత భూమి – 630 ఎకరాలు
5. దండు మల్కాపూర్‌ ప్రతిపాదిత భూమి – 471.58 ఎకరాలు

Courtesy Nava telangana