రాజ్‌దీప్‌ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

జీవనసమరంలో గత్యంతరం లేని పరిస్థితులలో చిన్నాచితక నేరాలకు పాల్పడిన అభాగ్యులు బెయిల్ కోసం నెలలు, సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సి వస్తుండగా ఉన్నతస్థాయి వ్యక్తుల బెయిల్ అభ్యర్థనలను అసాధారణ ప్రాధాన్యంతో పరిగణనలోకి తీసుకోవడమేమిటి? ఆర్థిక, అధికార ప్రాభవాలు గల వ్యక్తుల కేసుల విచారణకు న్యాయవ్యవస్థ ‘ప్రత్యేక పరిగణన’ ఇవ్వడం సమ పౌరసత్వం అనే రాజ్యాంగసూత్రానికి పూర్తిగా వ్యతిరేకం కాదూ? ఒక టీవీ యాంకర్ వ్యక్తిగత స్వాతంత్ర్యం ఒక సామాన్యుని స్వేచ్ఛ కంటే గొప్పదీ గురుతరమైనదీ కాదు.

చట్టం నిర్దేశించిన విధంగా తప్ప మరొక విధంగా వ్యక్తికి గల జీవించే హక్కును గాని, అతనికి గల వ్యక్తిస్వేచ్ఛను గాని హరించరాదు.

-అధికరణ 21, భారత రాజ్యాంగం

‘పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను సంరక్షించడమే ఉన్నత న్యాయస్థానాల విధ్యుక్తధర్మం. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించేందుకు మీ అధికారాలను సంపూర్ణంగా ప్రయోగించాలనే సందేశాన్ని హైకోర్టులు అన్నిటికీ పంపుదాం. ఎందుకంటే రాజ్యాంగ న్యాయస్థానాలుగా దేశ సర్వోన్నత న్యాయస్థానం, రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాల ఉనికికి అంతిమ కారణం వ్యక్తిస్వేచ్ఛను సంరక్షించవలసిన బృహత్తర బాధ్యతే… ఒక పౌరుని వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని కాపాడే విషయంలో ఈ అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు కల్పించుకోకపోతే, మన ప్రజాస్వామిక ప్రస్థానం విధ్వంసక మార్గంలో సాగుతోందని చెప్పవలసి ఉంటుంది’- ఈ గంభీరమైన మాటలు జస్టిస్ డి వై చంద్రచూడ్‌వి అని మీకు తెలిసే ఉంటుంది. ఈ నెల 11న టెలివిజన్ యాంకర్ అర్ణబ్ గోస్వామికి బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలవి.

‘వ్యక్తిస్వేచ్ఛ’ విషయమై ఆ ప్రశంసనీయ సూత్రాలను జస్టిస్ చంద్రచూడ్ ఉద్ఘోషించిన మరుసటి రోజే సీనియర్ జర్నలిస్ట్ ఒకరిపై క్రిమినల్ కేసును కొట్టివేయడానికి మేఘాలయ హైకోర్టు నిరాకరించింది! షిల్లాంగ్ పాత్రికేయురాలు పేట్రీసియా ముఖిమ్‌పై మోపిన క్రిమినల్ కేసు అది. ఆమె చేసిన నేరం ఏమిటి? మేఘాలయలో గిరిజనేతర ప్రజలపై కొనసాగుతున్న దాడులు, దౌర్జన్యాలపై ఫేస్‌బుక్‌లో ఒక కథనాన్ని పోస్ట్ చేసినందుకు ముఖిమ్ పై క్రిమినల్ కేసు దాఖలు చేశారు! ఆమె ఒక పత్రిక ఎడిటర్. టీవీ సెలెబ్రిటీ కాదు. సమాజ గమనాగమనం మంచిచెడులపై వీక్షకులకు ధర్మోపన్యాసమిచ్చేందుకు, విశాల ప్రపంచాన్ని జడిపించేందుకు టీవీ స్టూడియోను ఒక వేదికగా ఉపయోగించుకునే వీలు కల్పించే ప్రైమ్ టైమ్ షో ఏదీ ఆమెకు లేదు. లోకం దినచర్య విశేషాలను నివేదించి, విశ్లేషించి, వివరించే అనేకానేక మంది పాత్రికేయులలో పేట్రీసియా ముఖిమ్ ఒకరు.

ఆమె ఒక రాజకీయ ప్రతినిధి కూడా కాదు. మరి ఆమెకు వ్యతిరేకంగా కోర్టు ఏమైనా వ్యాఖ్యలు చేసినా, ఆదేశాలు జారీ చేసినా పట్టించుకునే వారెవరూ ఉండరు. కచ్చితంగా ఆ పాత్రికేయురాలికి మద్దతు తెలుపుతూ ఏ అమాత్యుడూ ఎలాంటి ట్వీట్ లు చేయడు. ఏ రాజకీయ పార్టీ ఐటి సెల్ కూడా హ్యాష్ ట్యాగ్‌లు పెట్టవు. ముఖిమ్ జైలుకు వెళ్ళడం అనివార్యమయితే ఎవరికీ చీమ కుట్టినంత బాధ కూడా ఉండదు. జైలు నుంచి విడుదలయినప్పుడు ఆమెకు స్వాగతం పలికేందుకు రాజకీయ కార్యకర్తలు కారాగారం వెలుపల బారులు తీరుతారా? అసంభవం. అయితే మీరు ఒక వాస్తవాన్ని విస్మరించకూడదు. పేట్రీసియా ఈ దేశ పౌరురాలు. కనుక, వ్యక్తిస్వేచ్ఛ విషయమై మరే భారతీయ పౌరుడు, పౌరురాలికి ఉండే మౌలికహక్కులు అన్నీ ఆమెకూ ఉంటాయి, ఉండి తీరాలి కూడా. అంతగా ప్రఖ్యాతులు కాని పాత్రికేయులు ఎందరో తరచు అరెస్టవుతున్నారు; దేశద్రోహ అభియోగాలకు గురవుతున్నారు. ఏమిటి వారి అపరాధం? వ్యవస్థకు, మరీ ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ భావాలు, అభిప్రాయాలు వ్యక్తం చేయడమే సుమా!

నిజానికి ‘వ్యక్తిస్వేచ్ఛ’ నిర్వచనాలను ఎంపిక చేసిన వ్యక్తులకు మాత్రమే వర్తింప చేస్తున్నారు. ఇది, మన న్యాయవ్యవస్థలో అంతకంతకూ పెరుగుతోన్న ద్వంద్వ ప్రమాణాలకు ఒక తిరుగులేని తార్కాణం. అర్ణబ్ గోస్వామికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టే, జమ్మూ కశ్మీర్‌లో నిర్బంధితులైన పలువురు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ అభ్యర్థనల విషయంలో తన కర్తవ్యాన్ని పదే పదే పరిత్యజిస్తోంది. న్యాయవాది, -సామాజిక ఉద్యమకారిణి అయిన సుధా భరద్వాజ్ ఆరోగ్య కారణాల ప్రాతిపదికన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఇదే సుప్రీం కోర్టు తిరస్కరించింది. పైగా ‘బెయిల్ కోరేందుకు మీకు అర్హతలు ఉన్నాయి. అయితే ఒక నియత బెయిల్ దరఖాస్తును ఎందుకు దాఖలు చేయరు?’ అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. మూడు సంవత్సరాలకు పైగా జైలులో ఉన్న సుధా భరద్వాజ్‌ను యుక్తమైన పద్ధతిలో బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పిన సుప్రీంకోర్టే తన మాటకు విరుద్ధంగా వ్యవహరించింది! ప్రాధాన్యతా ప్రాతిపదికన ఒక సెలెబ్రిటీ జర్నలిస్టు కేసును చేపట్టడంలో తాను సూచించిన ‘యుక్తమైన పద్ధతి’ని సర్వోన్నత న్యాయస్థానం అతిక్రమించింది. ఇదేమి న్యాయం?

బెయిల్ పిటిషన్స్ విషయంలో న్యాయవ్యవస్థ నిర్హేతుక నిర్ణయాలను ప్రశ్నించి తీరాలి. స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వెర్సెస్ బాలచంద్ కేసులో జైలుకు పంపించడం కంటే బెయిల్ మంజూరు చేయడమే ముఖ్యమన్న ఒక మౌలిక న్యాయ నియమాన్ని సుప్రీంకోర్టు నిర్దేశించింది. కేసు యోగ్యతలను బట్టి విచక్షణాధికారాలను ఉపయోగించి నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించింది. న్యాయవిచక్షణాధికార భావనలకు చపలచిత్త ధోరణులు కాకుండా విధాన సంబంధ నిశ్చయితే కచ్చితంగా ప్రాతిపదిక కావాలి. న్యాయవ్యవస్థ నిర్ణయాలు తరచు అలా లేకపోవడం వల్లే అనేక సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పి తీరాలి. ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణకు గురయిన వ్యక్తి బెయిల్‌కు అర్హుడయినప్పుడు అదే న్యాయవిచక్షణ జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియాకు ఎందుకు వర్తించదు? (అయోధ్యలో రామాలయానికి సంబంధించి ఒక ట్వీట్‌ను రీ ట్వీట్ చేసినందుకు గాను ప్రశాంత్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి రెండు నెలల పాటు జైలులో నిర్బంధించారు).

నిజమేమిటంటే బెయిల్ పిటిషన్లపై న్యాయస్థానాల ప్రతిస్పందన తరచు అరెస్టయిన వ్యక్తుల సామాజిక హోదా, ఆర్థిక పరపతి, రాజకీయ వాతావరణంపై ఆధారపడి ఉంటోంది. కాకపోతే ఉపా కింద అరెస్టయిన వారి బెయిల్ అభ్యర్థనల పట్ల కోర్టులు ఎందుకు ఉదాసీనత చూపుతున్నాయి? ఉపా బాధితులలో పలువురు యువ విద్యార్థులు ఉన్నారనేది ఒక వాస్తవం. పౌరసత్వ సవరణ చట్టాలను వ్యతిరేకిస్తున్నవారిని జాతి వ్యతిరేకులు లేదా అర్బన్ నక్సల్స్‌గా పరిగణిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మందిని అరెస్ట్ చేశారు. భిన్న రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండడమే వారి నేరమా?

‘వ్యక్తిస్వేచ్ఛ’ విషయమై మన వ్యవస్థ భావనలు ఎంత ప్రయోజన రహితంగా ఉన్నాయో ఫాదర్ స్టాన్‌స్వామి కేసే ఒక మంచి ఉదాహరణ. 83 సంవత్సరాల ఈ ఉపా డిటెన్యూను అక్టోబర్‌లో ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్ట్ చేశారు. ఇదే కేసులో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణపై పలువురు వామపక్షవాదులనూ అరెస్ట్ చేసిన విషయం విదితమే. దశాబ్దాలుగా గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఫాదర్ స్వామి పార్కిన్సన్ వ్యాధి పీడితుడు. తత్కారణంగా తాను మంచినీళ్ళు తాగే గ్లాసును సరిగ్గా పట్టుకోలేనని, కనుక నీళ్ళు తాగేందుకు స్ట్రా, సిప్పర్ ఉపయోగించుకునేందుకు అను మతినివ్వాలని ఒక ప్రత్యేక న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఆయన పిటిషన్‌కు సమాధానమివ్వడానికి ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్‌ఐఏ) న్యాయవాదులు 20 రోజుల గడువు అడిగారు. వృద్ధుడైన ఫాదర్ స్వామి అభ్యర్థనపై ప్రతిస్పందించేందుకు ఇంచు మించు మూడు వారాల వ్యవధి అవసరమా? ఎంత హాస్యాస్పదం! అంతకు ముందు అదే ప్రత్యేక న్యాయస్థానం వైద్య కారణాల ప్రాతిపదికన ఫాదర్ స్వామి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది..

సరే, ఫాదర్ స్వామి మానవ హక్కుల కార్యకర్త కాకుండా ఒక రాజకీయ వేత్త లేదా ఒక ‘ప్రముఖ’ పౌరుడు అయి ఉన్నట్టయితే ఆయన బెయిల్‌పై మన న్యాయ వ్యవస్థ ఎలా ప్రతిస్పందించి ఉండేదో ఒక సారి ఆలోచించండి. ఒక రాజకీయవేత్త లేదా ఒక ‘ప్రముఖుడి’ని అరెస్ట్ చేసిన వెంటనే సదరు వ్యక్తిని ఒక ఆస్పత్రికి తరలించడం జరిగేది కాదూ? (ఛాతీ నొప్పి అనేది ఇలాంటి వ్యవహారాలలో ఒక ఉపయుక్త సాకు). 2018లో ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టయిన విప్లవకవి వరవరరావు విషయంలో ముంబై హైకోర్టు ఎట్టకేలకు బుధవారం నాడు మానవతా దృక్పథంతో (బెయిల్ మంజూరు విషయాన్ని తరువాత పరిశీలిస్తామని చెప్పినప్పటికీ) స్పందిస్తూ వివి ని ఆస్పత్రికి తరలించి ప్రభుత్వ ఖర్చులతో వైద్యం చేయించాలని, ఆయన ఆరోగ్య స్థితిగతులపై తమకు ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని, తమకు తెలియజేయకుండా ఆయన్ని డిశ్చార్జి చేయకూడదని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరి రెండేళ్ళుగా వరవరరావు విషయంలో న్యాయవ్యవస్థ వ్యవహరించిన తీరు రాజ్యాంగబద్ధంగా ఉందని చెప్పగలమా?

అవును, జస్టిస్ చంద్రచూడ్ ప్రశస్త వ్యాఖ్యలు సుప్రీంకోర్టుకు వెలుపల న్యాయవ్యవస్థ అంతటా, ఆ మాటకొస్తే విశాల సమాజమంతటా ప్రతిధ్వనించి తీరాలి. ఈ దేశ నేర న్యాయ నిర్ణయ వ్యవస్థకు అవి నైతిక మార్గదర్శకాలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన జైలు జనాభాలో 70 శాతం మందికి పైగా విచారణలో ఉన్న ఖైదీలే. 2019 సంవత్సరాంతంలో లక్ష మందికి పైగా నిందితులు ఏడాదికి పైగా విచారణలో ఉన్న ఖైదీలుగా ఉన్నారని అధికారిక సమాచారమే వెల్లడించింది. పెండింగ్ కేసులు పేరుకు పోతున్నాయి. జైళ్ళు కిక్కిరిసిపోతున్నాయి. ఖైదీలకు కనీస వసతులు కొరవడుతున్నాయి. జీవనసమరంలో గత్యంతరం లేని పరిస్థితులలో చిన్నాచితక నేరాలకు పాల్పడిన అభాగ్యులు బెయిల్ కోసం నెలలు, సంవత్సరాల తరబడి వేచిఉండాల్సి వస్తుండగా ఉన్నతస్థాయి వ్యక్తుల బెయిల్ అభ్యర్థనలను అసాధారణ ప్రాధాన్యంతో పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవడమేమిటి? ఇదేనా మన రాజ్యాంగం నిర్దేశించిన సమాన న్యాయం? ఆర్థిక, అధికార ప్రాభవాలు గల వ్యక్తుల కేసుల విచారణకు న్యాయవ్యవస్థ ‘ప్రత్యేక పరిగణన’ ఇవ్వడం సమ పౌరసత్వం అనే రాజ్యాంగసూత్రానికి పూర్తిగా వ్యతిరేకం కాదూ? ఒక టీవీ యాంకర్ వ్యక్తిగత స్వాతంత్ర్యం ఒక సామాన్య వ్యక్తి స్వేచ్ఛ కంటే గొప్పదీ గురుతరమైనదీ కాదు.

Courtesy Andhrajyothi