స్వగతా యాదవర్, శ్రేయా రామన్‌

రాజస్తాన్, గుజరాత్‌ రాష్ట్రాల్లోని ఆరు ప్రభుత్వ ఆసుపత్రులలో 2019 డిసెంబర్‌ 1 నుంచి 500 శిశుమరణాలు చోటుచేసుకున్నాయని వార్తలు. రాజస్తాన్‌ కోటాలోని జేకే లోన్‌ ఆసుపత్రిలోనే 101 మంది శిశువులు హరీమన్నారు. జోధ్‌పూర్‌లోని ఉమైద్, ఎండీఎమ్‌ ఆసుపత్రులలో 102 మంది, బికనీర్‌లోని సర్దార్‌ పటేల్‌ మెడికల్‌ కాలేజ్‌లో 124 మంది శిశువులు మరణించడం విచారకరం. గుజరాత్‌ రాజ్‌కోట్‌లోని పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ ఆసుపత్రిలో 111 మంది, అహ్మదాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో 85 మంది శిశువులు చనిపోయారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 2018లో 7,21,000 శిశుమరణాలు చోటుచేసుకున్నాయని అంచనా. అంటే సగటున రోజుకు 1,975 మంది శిశువులు చనిపోయినట్లు లెక్క.

శిశుమరణాల సమస్య ఒక్క కోటా సమస్యే కాదని గర్భిణులు, శిశువుల ఆరోగ్యంపై పనిచేస్తున్న మమతా కార్యనిర్వాహక డైరెక్టర్, శిశువైద్యుడు సునీల్‌ మెహ్రా పేర్కొన్నారు. ‘ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగిన సౌకర్యాలు లేకపోవడం, రోగులను నిపుణులకు సిఫార్సు చేయడంలో జాప్యం, రవాణా సౌకర్యాల లేమి వంటి సంస్థాగత సమస్యలే శిశుమరణాలకు అధికంగా కారణాలవుతున్నాయి’ అని అన్నారు. దేశవ్యాప్తంగా పిల్లలు, శిశువులు ఇంత అధికంగా ఎందుకు చనిపోతున్నారో అర్థం చేసుకోవడానికి డేటా విశ్లేషణ సంస్థ ఇండియాస్పెండ్‌ 13 రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య డేటాను విశ్లేషించింది. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, అస్సాం వంటి పేద రాష్ట్రాలతోపాటు గుజరాత్, మహారాష్ట్ర వంటి సంపన్న రాష్ట్రాల ఆసుపత్రుల్లో కూడా శిశుమరణాలు సంభవిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వీటితో పోలిస్తే గోవా, కేరళ, తమిళనాడులోనే శిశుమరణాలు తక్కువగా ఉన్న రాష్ట్రాలుగా నమోదయ్యాయి. ఆరోగ్య మౌలిక వసతులు, శిశు సంరక్షణ, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, ప్రసవానంతర సంరక్షణ వంటి అంశాల్లో నాసిరకం నాణ్యతవంటివి శిశువుల ప్రాణాలను హరిస్తున్నాయని   విశ్లేషణ చెబుతోంది.

పోషకాహార లోపం, పారిశుద్ధ్యం, రోగనిరోధకశక్తి వంటి వైద్యేతరమైన సమస్యలే శిశుమరణాలకు కారణమవుతున్నాయని ఢిల్లీలోని బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ దీపా సిన్హా చెప్పారు. న్యూమోనియా వంటి ప్రాథమిక స్థాయిలోనే చికిత్స చేయదగిన ఇన్ఫెక్షన్ల వల్లే శిశుమరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. అంటే వ్యాధినిరోధక, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు  కుప్పకూలిపోయినట్లు చెప్పవచ్చని ఆమె చెప్పారు.

ప్రపంచంలోనే మరణాల రేటు అధికం
2018లో భారతదేశంలో అయిదేళ్ల లోపు పిల్లలు 8,82,00 మంది చనిపోయారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక రేటు. భారత్‌లో అతిపెద్ద శిశుజనాభాలో అయిదేళ్లలోపు పిల్లల మరణాలు (1000 మంది శిశువుల్లో 37మంది) నమోదవుతున్నప్పటికీ ప్రపంచ సగటు శిశుమరణాల రేటు (39)తో పోలిస్తే తక్కువగానే ఉంది. 1990లో వెయ్యిమందికి 126 మంది పిల్లలు మరణిస్తున్న స్థాయినుంచి సగటు శిశుమరణాల రేటు తగ్గుముఖం పట్టింది.

పిల్లలకు అయిదేళ్లు రాకముందే ఎక్కువ మరణాలు మనదేశంలో సంభవిస్తున్నాయి. 2017లో సంవత్సరం వయసున్న పిల్లల్లో వెయ్యికి 33 మంది పిల్లలు చనిపోయారు. 11 ఏళ్లకు ముందు ఇది 42 శాతంగా ఉండేదని ప్రభుత్వ శాంపుల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ తెలిపింది. అయితే రాష్ట్రాల వారీగా చూస్తే శిశుమరణాల విషయంలో భారీ వ్యత్యాసాలను గమనించవచ్చు. 2017లో నాగాలాండ్‌ అత్యంత తక్కువగా 7 శాతం, గోవా (9), కేరళ (10) శిశుమరణాల రేటును నమోదు చేయగా, మధ్యప్రదేశ్‌ 47 శాతం అత్యధిక రేటును నమోదు చేసింది.

ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో విపరీతమైన రద్దీ
అయిదేళ్లలోపు శిశువుల మరణాల్లో కొత్తగా పుట్టిన శిశువులవే ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రసవానంతరం మాతా, శిశు ఆరోగ్య సంరక్షణలో నాణ్యతను కల్పించడం ద్వారా వీరిలో చాలామంది శిశువులను కాపాడవచ్చని యునైటెడ్‌ నేషన్స్‌ చిల్డ్రన్స్‌ ఫండ్‌ 2019 నివేదిక తెలిపింది.

దేశంలో సంస్థాగత ప్రసవాల రేటు 2005లో 38.7 శాతంతో పోలిస్తే 2015–16 నాటికి 78.9 శాతం పెరిగింది. కానీ ఈ ప్రసవాల రేటుకు అనుగుణంగా నవజాత శిశువుల సంరక్షణలో మౌలిక వసతుల కల్పన పెరగలేదని గుజరాత్‌ ఆనంద్‌లోని ప్రముఖ్‌స్వామి మెడికల్‌ కాలేజ్‌ శిశువైద్య శాఖ ప్రొఫెసర్‌ సోమశేఖర్‌ నింబాల్కర్‌ తెలిపారు. 28 రోజుల వయసు ఉన్న నవజాత శిశువుల్లోనే అత్యధిక మరణాలు (57.9 శాతం) సంభవించాయని ది లాన్సెట్‌లో ప్రచురితమైన 2019 అధ్యయనం చూపింది. కంగారూ కేర్‌ (అంటే తల్లితో అత్యంత సమీపంలో శిశువును ఉంచి వెచ్చదనాన్ని అందించడం, తల్లి పాలు తాపడం, ఇన్ఫెక్షన్ల నుంచి, శ్వాస సమస్యల నుంచి ప్రాథమిక సంరక్షణ కల్పించడం, తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతుల ద్వారా ఈ చిన్నారుల మరణాలను అరికట్టవచ్చు.

జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ కింద నవజాత శిశు సంరక్షణ వ్యవస్థలను పిల్లలను ప్రసవించే అన్ని కేంద్రాల్లో ఏర్పర్చారు. అలాగే దేశవ్యాప్తంగా అన్ని జిల్లా ఆసుపత్రుల్లో  ప్రాథమిక రెఫరల్‌ యూనిట్లను, ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ యూనిట్లను నెలకొల్పారు. కానీ  ఈ శిశు సంరక్షణ కేంద్రాల్లో వాటి శక్తికిమించిన రోగులు వెల్లువెత్తుతున్నారు. పైగా వైద్యుల కొరత, ఆసుపత్రిలో పడకల కొరత, వైద్యసామగ్రిని సకాలంలో మరమ్మతు చేసే యంత్రాంగాల కొరత తారాస్థాయికి చేరినట్లు జర్నల్‌ ఆఫ్‌ పెరినెటాలజీలో ప్రచురితమైన 2016 అధ్యయనం పేర్కొంది.

83 శాతం కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో నవజాత శిశు కేంద్రాలు ఉంటుండగా, 59శాతం కేంద్రా ల్లో ఆరోగ్య స్థిరీకరణ విభాగాలు లేవని 2018 గ్రామీణ ఆరోగ్య గణాంకాల నివేదిక తెలిపింది. ఇక కేరళ, మహారాష్ట్ర మినహా తక్కిన 13 రాష్ట్రాల్లోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో శిశువైద్య నిపుణులు లేరు. దీంతో చాలామంది రోగులు జిల్లా ఆసుపత్రుల వంటి ప్రాదేశిక సంరక్షణ విభాగాల్లో చేరాల్సి వస్తోంది. దీంతో అప్పుడే పుట్టిన శిశువుల సంరక్షణ కేంద్రాల్లో తీవ్రమైన రద్దీ నెలకొంటోంది. ఈ పరిస్థితి ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కారణమవుతోంది.

పుట్టుకకు ముందే సమస్యలు
శిశు, పిల్లల మరణాల్లో గృహ సంపద, ప్రసూతి విద్య అనేవి ముఖ్యపాత్ర వహిస్తున్నాయి. విద్యావంత మహిళలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు పిల్లలకు మెరుగైన ఆరోగ్య పరిస్థితులను కల్పిస్తున్నాయని ఇండియాస్పెండ్‌ 2017 మార్చి 20న ప్రకటించింది. 20 శాతం సంపన్న గృహాల్లో పుట్టిన శిశువులు 20 శాతం నిరుపేద గృహాల్లో పుట్టిన శిశువుల కంటే మూడు రెట్లు ఎక్కువగా మనగలిగే పరిస్థితులు ఉంటున్నాయి. పదేళ్లవరకు మాత్రమే చదువుకుని, బాల్యవివాహాలు ఎక్కువగా చేసుకున్న మహిళలు ఉంటున్న మధ్యప్రదేశ్, అస్సాం, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో శిశుమరణాలను అధికంగా నమోదు చేస్తున్నాయి. పైగా ఈ రాష్ట్రాల్లోని మహిళలకు రక్తహీనత, పోషకాహార లేమి, అధిక రక్తపోటు, ప్రసవానంతర మధుమేహంపై ప్రత్యేక సంరక్షణ చర్యలు అందుబాటులో లేవు. ప్రసవానంతర సంరక్షణ అతి తక్కువగా లభిస్తున్న రాష్ట్రాల్లో బిహార్‌ అగ్రగామిగా ఉంటోంది.

ప్రసవసమయంలో సమస్యలు
అయిదు మంది పిల్లల్లో ఒక్కరు 205 కేజీలకంటే తక్కువ బరువుతో పుడుతున్నారు. ఇక సగంమంది పిల్లలు మాత్రమే ఆరునెలలపాటు తల్లి పాలు తాగగలుగుతున్నారు. తల్లిపాలకు నోచుకున్న పిల్లల ఆరోగ్యం మాత్రం గణనీయంగా మెరుగుపడుతోంది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అతిపెద్ద సమస్య ఏదంటే తక్కువ బరువుతో పుట్టడం, తల్లికి పోషకాహార లేమి ఉండటమేనని ఐఐటీ బాంబేకి చెందిన గ్రామీణప్రాంతాల సాంకేతిక ప్రత్యామ్నాయాల కేంద్రం శిశువైద్య నిపుణురాలు రూపల్‌ దలాల్‌ చెబుతున్నారు. శిశువుకు జన్మనిచ్చిన  సమయంలో బిడ్డకు పాలుతాపడంపై  గ్రామీణ తల్లులకు సరైన మార్గదర్శకత్వం లేదు. దీనితో తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమా దం ఎక్కువగా ఉంటోందని డాక్టర్‌ రూపల్‌ తెలి పారు. శిశువు పుట్టిన తర్వాత పాలు తాపడంలో జాప్యం జరిగితే అలాంటి పిల్లల ప్రాణాలకే ప్రమా దం సంభవిస్తుందని, తల్లిపాలకు ఎంత సమయం దూరంగా ఉంటే అంత ఎక్కువ ప్రమాదం నవజాత శిశువులకు కలిగే అవకాశం ఉంటుందని యూనిసెఫ్‌ నివేదిక హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌లో పుట్టిన నలుగురు బిడ్డల్లో ఒక్కరికి మాత్రమే గంటలోపే తల్లిపాలు అందుతుండగా రాజస్తాన్‌లో 28.4 శాతం పిల్లలు తల్లిపాలు లేకుండా గంటపైగా గడుపుతున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనే పిల్లల అధిక మరణాల రేటును చూడవచ్చు.

ఇక పిల్లలకు టీకాలు తగినంత మేరకు లభిస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు (69.7శాతం), గోవా (88.4శాతం) అగ్రస్థానంలో ఉంటున్నాయి. అస్సాం (47.1 శాతం), గుజరాత్‌ (50.4శాతం), ఉత్తరప్రదేశ్‌ (51.1 శాతం), రాజస్తాన్‌ (45.2 శాతం) రాష్ట్రాలు పిల్లలకు రోగనిరోధక శక్తి అత్యల్పంగా ఉన్న జాబితాలో అన్నిటికంటే దిగువన ఉంటున్నాయి. ఇకపోతే 2017లో ప్రచురితమైన ఇండియాస్పెండ్‌ నివేదిక ప్రకారం అయిదేళ్లలోపు పిల్లల్లో అధికమరణాలకు పోషకాహార లేమి ప్రధాన కారణమని తెలిసింది. ఇది మొత్తం శిశుమరణాల్లో 68.2 శాతంగా ఉంటోంది.

 ప్రముఖ డేటా విశ్లేషకులు ది వైర్‌’ సౌజన్యంతో..

Courtesy Sakshi