డాక్టర్‌ దేవరాజు మహారాజు

”భారత స్వాతంత్య్ర పోరాటగాథ ముస్లింల రక్తంతో రాయబడింద”ని ప్రఖ్యాత జర్నలిస్టు, రచయిత కుష్వంత్‌ సింగ్‌ ఒక చోట రాశారు. దేశంలో వారి జనాభా అతి తక్కువ శాతమే అయినా వారి కృషి, ఔదార్యం, త్యాగనిరతి ప్రధానంగా చెప్పుకోవాల్సి ఉందని ఆయన భావన. దానికి బలమైన సాక్ష్యం కూడా చూపించారు. ఢిల్లీలోని ఇండియా గేట్‌పై రాయబడ్డ అమరులైన 95,300మంది సమరవీరుల పేర్లలో ముస్లింల పేర్లు 61,945. నిజాల్ని దాచేసి, చరిత్రను వక్రీకరించి రాసినవారి కుట్ర బట్టబయలు చేయాలంటే మనం తప్పక కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి. అంతే కాదు, భావితరాలకు నిజాలు తెలియజేయాల్సిన బాధ్యతను కూడా చేపట్టాలి.

స్వాతంత్య్ర సంగ్రామంలో ఎంతోమంది సమిధలయ్యారు. మరెంతో మంది త్యాగాలు చేశారు. అవన్నీ ఇప్పటి తరాలవారికి తెలియదు. వారికి వారి ప్రమేయం లేకుండానే స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అందుబాటులోకి వచ్చాయి. అందువల్ల వారికి ‘స్వాతంత్య్రానికి’ ఉన్న విలువ తెలియడం లేదు. తొలిసారిగా స్వాతంత్య్రం కోసం బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా 1780లో పోరాడింది మైసూరు రాజు హైదర్‌ ఆలీ. ఒక దశాబ్దం తర్వాత 1790లో పోట్లాడింది ఆయన కొడుకు టిప్పుసుల్తాన్‌. తొలిసారి ఇనుప రాకెట్లు, కానన్లు బ్రిటిష్‌ చొరబాటుదారుల మీద ప్రయోగించింది వీరిద్దరే. బ్రిటిష్‌ వారితో ఝాన్సీరాణి చేసిన యుద్ధం చరిత్రలో ప్రాచుర్యం సంతరించుకుంది. అది అందరికీ బాగా తెలిసిన విషయం. ఆమె తన పెంపుడు కొడుకుకోసం రాజ్యాన్ని కాపాడాలనుకున్నారు. కానీ, చాలామందికి తెలియని విషయం, చరిత్రలో మరుగున పడిన విషయం ఒకటుంది. బేగం హజ్రత్‌ మహల్‌ గురించి ఎంతమందికి తెలుసూ? తొలిదశలో జరిగిన స్వాతంత్య్ర సమరంలో ఆమె వీరోచితంగా పోరాడి బ్రిటిష్‌ పాలకుడైన సర్‌ హెన్రీ లారెన్స్‌ను చంపేశారు. 1857 జూన్‌ 30న చిన్‌హట్‌లో వ్యూహాత్మకంగా బ్రిటిష్‌ పాలకుల్ని ఆమె ఓడించారు. ఈ విషయం చరిత్ర పుటల్లో అసలే చోటు చేసుకోలేదని కాదు. కానీ, ఎందుకో గాని ప్రాముఖ్యతను సంతరించుకోలేదు. కారణాలు అందరికీ తెలిసినవే.

చివరి మొగల్‌ చక్రవర్తి బహుద్దుర్‌ షా జాఫర్‌ కూడా 1857లో స్వాతంత్య్రం కోసం పోరాడినవాడే. ఆయన పోరాటాన్ని ఎవరూ పెద్దగా శ్లాఘించలేకపోయినా భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఆయన సమాధి దగ్గర నివాళులర్పిస్తూ తన సంతాపాన్ని ఇలా తెలియజేశారు. ”భారతదేశంలో మీకింత చోటు దక్కకపోయినా, అక్కడ మీ పేరు సజీవంగా ఉంది. తొలిదశలో స్వాతంత్య్రం కోసం పోరు సల్పిన ఆ మహౌన్నత స్మృతికి నా హృయపూర్వక శ్రద్ధాంజలి” అని. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మరణించిన వారు 90శాతం మంది ముస్లింలే. అందులో ఆనాటి గొప్ప నాయకుడు, కార్యకర్త మౌలాలీ అహ్మదుల్లా షా చంపబడ్డాడు. బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర చేశాడన్న నేరంపై తొలిసారి ఉరితీయబడింది ఇరవైయేండ్ల యువకుడు అశ్వాఖుల్లా ఖాన్‌! ఎందుకో మరి ఇలాంటి విషయాలు బయటికి రాకుండా, చర్చించకుండా, ప్రాముఖ్యాన్ని సంతరించుకోకుండా అణచిపెట్టారూ? ఆలోచించాల్సిన విషయం కదా!
యం.కె.యం. అమీర్‌ హంజా ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ (ఐఎన్‌ఏ)కి కొన్ని మిలియన్ల డబ్బు విరాళమిచ్చారు. ఐఎన్‌ఏకి సంబంధించిన వివరాలు గ్రంథాలయాల్లో చదివి, స్ఫూర్తిని పొంది దాదాపు తన సర్వస్వం త్యాగం చేశారు. ఆయన తర్వాత, ఆయన కుటుంబం వీధిన పడింది. నిరుపేద కుటుంబంగా తమిళనాడులోని రామనాథపురంలో అద్దె ఇంట్లో పూటగడవడమే కష్టమైన దశలో బతికింది. ఆ కుటుంబాన్ని ఎవరూ ఆదుకోలేదు. మీమొన్‌ అబ్దుల్‌ హబీబ్‌ యూసుఫ్‌ మర్ఫానీ – దాదాపు ఆ రోజుల్లోనే తన యావదాస్థీ దాదాపు ఒక కోటి ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీకి ధారాదత్తం చేశారు. ఆ ఆర్మీలో అతి ముఖ్యమైన పాత్ర పోషించిన షా నవాజ్‌ ఖాన్‌ నేతాజీ సైన్యంలో కమాండర్‌గా ఉండేవారు. ఒక సైనికుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా ఆయన చాలా కీలకమైన పాత్ర పోషించారు. నేతాజీ సైన్యంలో ఉన్న ముఖ్యమైన పందొమ్మిదిమంది అధికారుల్లో ఏడుగురు ముస్లింలే నన్నది గమనించాలి. అలాగే బీవమ్మ అనే ఒక ముస్లిం మాతృమూర్తి తన దగ్గరున్న ముప్పయి లక్షల్ని స్వాతంత్య్రోద్యమానికి ఖర్చుపెట్టారు. మన జాతీయ జెండా రూపొందుతున్న దశలో సురయ్యా తియ్యాబ్జి అనే ముస్లిం మహిళ అందుకు కొంత కృషి చేశారని చెపుతారు.

తమిళనాడుకు చెందిన ఇస్మాయిల్‌ సాహెబ్‌ మరుదనయగం వరుసగా ఏడేండ్లు బ్రిటిష్‌ వారితో పోరాడి బ్రిటిష్‌ ప్రభుత్వానికి చెమటలు పట్టించారు. స్వాతంత్య్రోద్యమంలో భాగంగా వెస్ట్‌ ఇండియన్‌ కంపెనీపై దాడి చేసినవాడు క్పలోటియా తమిల్జన్‌ వీఓసీ అనే నావికుడు. అయితే అతను నడిపిన నౌకను దేశానికి విరాళమిచ్చిన మహనీయుడు ఫకీర్‌ మహ్మద్‌రాథర్‌. ఒక మహౌన్నతమైన ఆశయసాధన కోసం ఒక ‘నౌక’ను విరాళమివ్వడం అంటే మాటలా? ఎంతటి నిబద్ధత కావాలీ! వీఓసీ తమిల్జన్‌ను అరెస్ట్‌ చేసినప్పుడు ఆయనను విడుదల చేయాలని ప్రదర్శన చేపట్టిన మహ్మద్‌ యాసీన్‌ను బ్రిటిష్‌ పోలీసులు కాల్చిచంపారు. తిరుప్పూర్‌ కుమారన్‌ (కోడి కాట కుమారన్‌) స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. అతనితో పాటు మరో ఏడుగురు అరెస్టయ్యారు. వారు అబ్దుల్‌ లతీఫ్‌, అక్బర్‌ అలీ, మొహిదీన్‌ ఖాన్‌, అబ్దుల్‌ రహీమ్‌, వావూ సాహెబ్‌, అబ్దుల్‌ లతీఫ్‌, షేక్‌ బాబా సాహెబ్‌ మొదలైనవారు.
మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ విద్యావేత్త, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు. గాంధీజీ పిలుపు విని స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న దేశభక్తుడు. మద్యం షాపులకు వ్యతిరేకంగా గాంధీజీ సాగించిన పికెటింగ్‌లో పాల్గొని అరెస్టయిన వారు. ఆనాడు అరెస్టయిన పందొమ్మిది మందిలో పదిమంది ముస్లింలే. అబ్దుల్‌ కలాం ఆజాద్‌, జిన్నా, బీహార్‌ నవాబు – ఈ ముగ్గురూ కలిసి స్వాతంత్య్రోద్యమానికి ముఖ్యమైన పథకాలు, ప్రణాళికలు రూపొందించిన వారు.

ముస్లింలు ఈ దేశాన్ని సుమారు ఎనిమిది వందల ఏండ్లు పరిపాలించారు. అయినా వారు బ్రిటిష్‌, డచ్‌, ఫ్రెంచ్‌ వారిలాగా ఈ దేశాన్ని కొల్లగొట్టుకుని పోలేదు. వారిలాగా ఈ దేశం పరాయిదని అనుకోలేదు. ఈ దేశం తమదని భావించారు. అందులో భాగమైపోయారు. సంస్కృతిలో అంతర్భాగమైపోయారు. ఇది వారు పుట్టిపెరిగిన గడ్డ అని అనుకున్నారు గనక, అభివృద్ధి కూడా చేశారు. సాహిత్య కళారంగాల్ని ప్రోత్సహించారు. ఆ కాలంలోనే ఆర్కిటెక్చర్‌ (నిర్మాణకళ) మహౌన్నత స్థాయికి చేరుకుందని చెప్పడానికి అనేకానేక కట్టడాలున్నాయి. న్యాయ, రాజకీయ వ్యవస్థల్ని సమర్థవంతంగా నిర్వహించారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేమంటే.. ఈ దేశంలో సిక్కులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఈ దేశ మూల వాసులైన ఒకప్పటి హిందువులే! కాలక్రమంలో వచ్చిన మార్పులవల్ల చేకూరిన లాభాలూ వసతుల వల్ల కొందరు ఇతర మతాల్లోకి మారారు. హిందూ మతంలో ఎదురైన నిరాదరణను తప్పించుకోవడానికి కూడా వారు ఇతర మతాల్లో చేరారన్నది వాస్తవం! అందువల్ల వీరికి ఈ దేశం మీద ప్రేమ ఉండకుండా ఎలా ఉంటుందీ? మత సామరస్యానికీ, స్నేహ బాంధవ్యానికి ఈ దేశంలో గొప్ప ఉదాహరణలున్నాయి.
స్వాతంత్య్ర సాధనలో భారతదేశంలోని ముస్లింల నిబద్ధతను ఎవరూ శంకించాల్సిన అవసరం లేదు. రికార్డయి ఉన్న వాస్తవాలలో ఇవి కొన్ని మాత్రమే! హిందూమతతత్వవాదులు రాసుకున్న చరిత్ర గ్రంథాలలో ఇలాంటి నిజాలు సరిగా నమోదు కాలేదేమోగాని, నిజాలు నిజాలు కదా? విదేశీ చరిత్రకారులు రాసిన రచనల్లో ఇవన్నీ ఉన్నాయి. కొన్ని విషయాలు దాచిపెట్టాలన్న దురుద్దేశం వారికి ఉండదు. అయినా నిజాలు దాచేస్తే దాగవు కదా? కొంతకాలం దాగినా, ఎల్లకాలం దాగలేవు కదా? మనుషుల్ని విడగొట్టి ఓట్లు రాబట్టుకునే నికృష్టపు రాజకీయంలో కొంతమంది వాస్తవాల్ని వక్రీకరిస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యం పేరుతో మనుషుల మధ్య విద్వేషాలు సృష్టించి, వాటిని సజీవంగా ఉంచే దుర్మార్గమైన ధోరణి నశిస్తేగాని ఈ దేశం బాగుపడదు. వివక్షలు లేకుండా అందరూ సమానంగా, గౌరవంగా బతికే సమాజాన్ని రూపుదిద్దాల్సిన ప్రభుత్వాలు అతిఘోరంగా విఫలమవుతూ వచ్చాయి. అందువల్ల దేశ ప్రజలే ఆలోచించుకోవాలి. మనుషులం గనక మనుషుల్లాగా బతుకదాం అని నిర్ణయించుకోవాలి. కుట్రలు చేసేది ఎవరైనా సరే ఎండగట్టడమే పనిగా పెట్టుకోవాలి. భారతదేశం ఇతర దేశాల వంటిది కాదు. వివిధ మతాల, భాషా సంస్కృతుల సమ్మేళనం. అందరి కృషిని అందరూ గుర్తించాలి. గౌరవించాలి. చారిత్రక, ఆర్థిక, సామాజిక కారణాలు ఏవైనా కావొచ్చు. అందరం మనుషులమేనన్నది మరువకూడదు. న్యాయమా, అన్యాయమా మాత్రమే ఉంటాయి. వాటి గూర్చి నిర్భయంగా నిస్సంకోచంగా మాట్లాడ గలగాలి.

వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.