న్యూఢిల్లీ : ప్రజల నుండి ఎంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ కొవ్వాడ అణువిద్యుత్‌ ప్లాంటు విషయంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందుకే వెడుతోంది. భారత్‌- అమెరికా రక్షణ, విదేశాంగ శాఖ మంత్రుల మధ్య న్యూఢిల్లీలో రెండు రోజుల క్రితం జరిగిన మౌలికాంశాల మార్పిడి-సహకార ఒప్పందం (బీకా) చర్చల సందర్భంగా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఇక్కడ ఆరు అణురియాక్టర్లను నిర్మించేందుకు వెస్టింగ్‌హౌస్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీతో సాధ్యమైంత త్వరగా సాంకేతిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ దిశలో అవసరమైన చర్యలు తీసుకునేందుకు న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పిసిఐఎల్‌), వెస్టింగ్‌హౌస్‌ల మధ్య బాధ్యతలను పంపిణీ చేయాలని నిర్ణయించారు.

సమావేశం అనంతరం ఇరు దేశాల నేతలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ‘ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడలో ఆరు అణు రియాక్టర్లను నెలకొల్పేందుకు ఎన్‌పిసిఐఎల్‌, వెస్టింగ్‌హౌస్‌ల మధ్య ఇప్పటికే కుదిరిన ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాం. దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన సమయమిది. ఈ చర్య ద్వారా సాంకేతిక వాణిజ్య ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసుకునేందుకు మార్గం ఏర్పడుతుంది’ అని పేర్కొన్నారు. బెకా చర్చల్లో భాగంగా అణు ఒప్పందం, దానిలోభాగంగా చేపడుతున్న కార్యక్రమాలను రెండు దేశాల నేతలు సమీక్షించారు. దీంతో పాటు అణు పరిశోధనకు సంబంధించి గ్లోబల్‌ సెంటర్‌ ఫర్‌ న్యూక్లియర్‌ ఎనర్జీ భాగస్వామ్య ఒప్పందం(జసిఎన్‌ఇపి)ని మరికొంత కాలం పొడిగించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు.

ఇప్పుడే ఎందుకు ….?
కొవ్వాడ అణుప్లాంటుకు సంబంధించి సాంకేతిక వాణిజ్య ఒప్పందం చర్చకు రావడం ఇదే మొదటి సారి కాదు. 2018లోనే వెస్టింగ్‌హౌస్‌ కంపెనీ దీనికి సంబంధించిన ప్రతిపాదనలను భారత్‌కు అందచేసింది. రెండు దేశాలకు సంబంధించిన అధికారుల స్థాయిలో ప్రాధమిక స్థాయిలో చర్చలు కూడా జరిగినట్లు లోక్‌సభలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అప్పటికే వెస్టింగ్‌ హౌస్‌ కంపెనీ దివాళా తీయటం, కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌ సంస్థ దానిని స్వాధీనం చేసుకోవడానికి ముందుకు వచ్చినప్పటికీ
ఆ ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఒప్పందానికి బ్రేక్‌ పడింది. ఆ తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షడు ట్రంప్‌ జరిపిన భారత్‌ పర్యటనలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ‘సాంకేతిక వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు వెస్టింగ్‌హౌస్‌. ఎన్‌పిసిఐఎల్‌ సంస్థలను ప్రోత్సహించి, సాధ్యమైనంత త్వరగా రియాక్టర్ల నిర్మాణాలను పూర్తిచేయాలి’ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ట్రంప్‌లు అప్పట్లోనిర్ణయించారు. ట్రంప్‌ అల్లుడు జారేద్‌ కుష్నీర్‌ వెస్టింగ్‌హౌస్‌ను స్వాధీనం చేసుకున్న కెనడా సంస్థలో కీలకభాగస్వామిగా ఉండటం కూడా ఈ నిర్ణయానికి కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఉన్నత స్థాయిలో నిర్ణయం జరిగినప్పటికీ కరోనా వైరస్‌ వ్యాప్తితో ఒప్పందం దిశలో అడుగులు ముందుకు పడలేదు. మరోవైపు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో అక్కడి కార్పొరేట్‌ లాబీని కొంతమేర సంతృప్తి పరచడానికి, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చేసిన కృషిగా చెప్పుకోవడానికి ఉపయోగపడుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అణు విద్యుత్‌ మిగిలిన వనరులతో పోలిస్తే అత్యంత ఖరీదైనది. ప్రాధమిక అంచనాల ప్రకారం అణురియాక్టర్ల నిర్మాణానికి ఆరులక్షల కోట్ల రూపాయల దాకా ఖర్చవుతుంది. ఇక్కడి లభించే విద్యుత్‌ రేటు యూనిట్‌కు 25 రూపాయలు ఉంటుంది. ఇటీవల దాఖలైన సోలార్‌ బిడ్ల ప్రకారం సౌర విద్యుత్‌ యూనిట్‌కు 3 రూపాయలు మాత్రమే పడుతోంది. భవిష్యత్‌లో మరింతగా తగ్గే అవకాశం ఉంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి అంత ఖర్చు అయ్యే అణువిద్యుత్‌ ప్రాజెక్టు అవసరం లేదు. అయితే, ఎన్నికల్లో ట్రంప్‌నకు మేలు చేయాలన్న తలంపుతోనే మోడీ సర్కారు వ్యవహరిస్తోందని కొందరు విశ్లేషకుల అభిప్రాయం

Courtesy Prajashakti