• రాజ్యాంగం స్వీకరించి ఏడు దశాబ్దాలు
 • ప్రజలకు హక్కులతోపాటు బాధ్యతలు ఏర్పాటైన రోజు
 • సర్వ పౌర సమానత్వాన్ని దశదిశలా చాటిన ప్రకాశిక
 • ఆ మహనీయుని దుర్నిరీక్ష్య దేశ సౌభ్రాతృత్వానికి ప్రతీకే రిపబ్లిక్‌ డే
 • సర్వసత్తాక, సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిన భారత్‌

ప్రజా సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలిచిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే గణతంత్ర దినోత్సవంగా జరుపుకొంటున్నాం. విశాల భారతదేశానికి దశ, దిశ చూపించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు 1950 జనవరి 26. శతాబ్దాల బానిస సంకెళ్ల చెర వీడిన స్వతంత్ర భారతం… ఒక దేశంగా మనగలుగుతుందా? అని ప్రపంచ మేధావులు నాడు సందేహించారు. ఆ సందేహాలు పటాపంచలయ్యాయి. భారత్‌ ఇప్పుడు బలమైన శక్తి. ప్రపంచాన్నే ప్రభావితం చేయగల శక్తి. మన భారతం ఇలా సుదృఢంగా నిలవడానికి ముఖ్య కారణం… రాజ్యాంగమే చుక్కానిగా సాగడమే! అలాంటి రాజ్యాంగం అమలులోకి వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది…

రాజ్యాంగ నిర్మాత ఎలా అయ్యారంటే!
అంబేడ్కర్‌ను భారత రాజ్యాంగ నిర్మాతగా కొనియాడతారు. మరి ఎంతో మంది మేధావులు రాజ్యాంగం కోసం కృషి చేయగా.. ఈ కీర్తి అంబేడ్కర్‌కు మాత్రమే ఎలా దక్కింది? దీనికి సమాధానం ఇదే.. ‘‘రాజ్యాంగ ముసాయిదా సంఘంలో నియమితులైన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు. ఒకరు మరణించారు. వేరొకరు అమెరికాలో ఉండిపోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలయ్యారు. ఉన్న ఒకరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు. దీంతో రాజ్యాంగ రచనా బాధ్యతలను సంపూర్ణంగా అంబేడ్కర్‌ భుజాలకెత్తుకున్నారు. భరత జాతి ముందు తరాలు ఎలా ఉండాలో ఆయన స్వప్నించారు. ప్రతి ఒక్కరికీ సంపూర్ణ ఫలాలు అందేలా, రాజ్యాంగ రచనకు అత్యంత ప్రామాణికాలను జోడించారు. అందుకే ఆయనను రాజ్యాంగ నిర్మాత అనడంలో అతిశయోక్తి లేదు!’’ అని రాజ్యాంగ పరిషత్‌ సమావేశంలో అప్పటి కేంద్ర మంత్రి హోదాలో టీటీ కృష్ణమాచారి కొనియాడారు.

భారతావని గణతంత్ర దేశంగా ఆవిర్భవించి 70 వసంతాలు పూర్తయ్యాయి. 1950 జనవరి 26న దేశం రిపబ్లిక్‌గా ఆవిర్భవించింది. దేశాన్ని గణతంత్రంగా మార్చే పనినే తొలుత చేపట్టింది. 1946 డిసెంబరు 9న రాజ్యాంగ సభ తొలి సమావేశం జరిగింది. సచ్చిదానంద సిన్హా తాత్కాలిక ఛైర్మన్‌. ఆ మరుసటి సంవత్సరం ముస్లింలీగ్‌ సహా రాష్ట్రాల నేతలు చేరారు. బాబూ రాజేంద్రప్రసాద్‌ పూర్తిస్థాయి ఛైర్మన్‌గా, హెచ్‌సీ ముఖర్జీ ఉపాఽధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. రాజ్యాంగ రచన కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించిన బీఆర్‌ అంబేడ్కర్‌ సమగ్రమైన, చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన రాజ్యాంగాన్ని నిర్మించడంలో అపూర్వమైన పాత్ర పోషించారు. ఆయనకు ప్రముఖ న్యాయకోవిదుడు బీఎన్‌ రాజు, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌, ప్రొఫెసర్‌ కేటీ షా లాంటి న్యాయ నిపుణులు కీలక సలహాలిచ్చి ఈ రచనలో తమ వంతు బాధ్యత పోషించారు.

ఎన్నో సందేహాలు..!
రాజ్యాంగ సభ ఏర్పడేటపుడు భారత్‌ అసలు ఓ ప్రజాస్వామిక దేశంగా, ఓ గణతంత్రంగా ఆవిర్భవించి మనగలదా.. అన్న సందేహాలు అనేకమందిలో కలిగాయి. ఓ రకంగా 1946-50 మధ్య కాలం దేశ రాజకీయ నాయకత్వానికి పరీక్షా కాలం. కానీ అంబేడ్కర్‌లో చెక్కుచెదరని విశ్వాసం. ఈ రాజ్యాంగం కాలపరీక్షకు తట్టుకుంటుందనీ, ఆచరణయోగ్యమైనదనీ గాఢంగా నమ్మారు. ప్రజల వల్ల విఫలమవుతుందేమో గానీ ఓ రాజ్యాంగంగా ఇది ఫెయిల్‌ కాదని ఆయన అన్నారు. ఆయన భావించినట్లే రాజ్యాంగం చేవ గలదిగా నిరూపించుకుంది. ఇంతటి బహుళత్వం ఉన్న దేశంలో ప్రజాస్వామ్యం ఇంత అద్భుతంగా వేళ్లూనుకున్నది ప్రపంచంలో వేరెక్కడా లేదు. రాజ్యాంగాన్ని ఇప్పటిదాకా 103 సార్లు సవరించారు.

మరెన్నో సవాళ్లు..!
ఈ ఏడుపదుల ప్రస్థానంలో దేశ రాజ్యాంగ ప్రజాస్వామ్యం అనేక సవాళ్లను ఎదుర్కొని నిలిచింది. అన్నింటికంటే పెద్ద పరీక్ష 1975లో విధించిన ఎమర్జెన్సీ. ప్రజల ప్రాథమిక హక్కులను రద్దు చేసిన ఇందిర నియంతృత్వ పోకడ రెండేళ్లలోనే ముగిసినా అది ఇప్పటికీ ప్రజాస్వామ్యంపై మచ్చలా మిగిలిపోయింది. ఆర్థిక వృద్ధి దేశంలో లక్షల మందిని పేదరికం నుంచి బయటపడేసినా దారిద్య్రం ఇప్పటికీ కొనసాగడం ఓ ముల్లులా బాధించే అంశం. దేశం లౌకిక రాజ్యంగా ఆవిర్భవించినా మతతత్వం, ఎన్నికల్లో మతప్రాతిపదికన సమీకరణ జరుగుతూనే కొనసాగుతూనే ఉన్నాయి. ఇక అందరికీ న్యాయం కొన్ని చోట్ల అందని ద్రాక్షగా మిగిలింది.

ఫెడరలిజానికి పరీక్ష
ప్రజాస్వామ్యం బలపడ్డ మాట వాస్తవమే అయినా రాజ్యాంగ వ్యవస్థలను పాలక ప్రభుత్వాలు దెబ్బతీస్తున్నాయన్న ఆరోపణలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ఎలక్షన్‌ కమిషన్‌, ఆర్‌బీఐ, సీబీఐ, సీఐసీ, సుప్రీంకోర్టు, సీవీసీ… ఒకటేమిటి.. దాదాపు అన్ని సంస్థలనూ మోదీ ప్రభుత్వం తన అనూహ్య చర్యలతో నియంత్రిస్తోందన్న విమర్శలు పదేపదే వస్తున్నాయి. ఒకప్పుడు బలమైన కేంద్రం, బలమైన రాష్ట్రాలనే సిద్ధాంతం ఉండేది. ఇపుడు బలమైన కేంద్రం- బలహీన రాష్ట్రాలు అనే పద్ధతిని అనుసరిస్తోందని, సహకార సమాఖ్య స్ఫూర్తికి ఇది పెద్ద దెబ్బ అని ఆరోపణలు రేగాయి. మెడికల్‌ ఎంట్రన్స్‌ ‘నీట్‌ ’ వల్ల కూడా ఫెడరల్‌ స్ఫూర్తి దెబ్బతింటోందని, ఎన్‌ఐఏ, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం లాంటి చట్టాలతో కేంద్రం అన్నీ తన చేతిలోకి తీసుకొంటోందని అంటున్నారు. సమాజంలో భిన్న దృక్ఫథాల సంఘర్షణ నిత్యం ఉంటుందని, కొంత పక్కదారి పట్టినా దిద్దుబాటు జరుగుతూనే ఉంటుందని విశ్లేషకుల భావన.

అధ్యక్షుడిగా బాబూ రాజేంద్రప్రసాద్‌
బిహార్‌కు చెందిన డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ రాజ్యాంగ పరిషత్‌కు శాశ్వత అధ్యక్షుడిగా నియమితులయ్యారు. భారత తొలి రాష్ట్రపతిగానే కాకుండా రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా సేవలందించారు. ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి. రాజేంద్రప్రసాద్‌ తన వద్దకు వచ్చిన సమస్యలకు ఎక్కువ పర్యాయాలు సుప్రీం కోర్టు సలహాలు తీసుకున్నారు. అప్పట్లో అత్యంత వివాదాస్పదమైన ‘హిందూ కోడ్‌’ బిల్లుకు ఆమోదం తెలపకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.

ముసాయిదా కమిటీ సభ్యులు
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌(అధ్యక్షుడు), అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌, ఎన్‌. గోపాలస్వామి అయ్యంగార్‌, డాక్టర్‌ కె.ఎం.మున్షీ, సయ్యద్‌ మహ్మద్‌ సాదుల్లా, ఎన్‌. మాధవరావు(బీఎల్‌ మిట్టల్‌ స్థానంలో నియమించారు), టీటీ కృష్ణమాచార్యులు(డీపీ ఖైతాన్‌ ఆకస్మిక మరణంతో ఈయనను కమిటీలోకి తీసుకున్నారు)

సెక్యులర్‌’కు పెద్దపీట
రాజ్యాంగంలో లౌకిక వాదానికి పెద్దపీట వేశారు. అయితే, ఇది ప్రారంభంలోని రాజ్యాంగంలో లేక పోవడం గమనార్హం. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘లౌకిక’ అనే పదాన్ని చేర్చారు. తద్వారా మతం పట్ల రాజ్యాంగానికి ఉన్న విధానాన్ని స్పష్టం చేశారు. భారతదేశంలోని భిన్నమతాల లక్షణం లౌకిక రాజ్యస్థాపనకు కారణమైంది. లౌకికవాదంలో రాజ్యం/ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది. అదేవిధంగా ఏ మతాన్నీ అధికారికంగా గుర్తించదు. అంతేకాదు, అసలు మతం అనేది పౌరుని వ్యక్తిగత అంశంగా రాజ్యాంగం పేర్కొంది.

అంకెల్లో రాజ్యాంగం

 • ముసాయిదా రాజ్యాంగానికి వచ్చిన సవరణలు: 3,635
 • రాజ్యాంగ రచనకు పట్టిన కాలం: 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు
 • రాజ్యాంగ పరిషత్‌లో సభ్యులు: 389
 • పాకిస్థాన్‌ రాజ్యాంగ ప్రతిపాదనతో సభ్యుల సంఖ్య: 299
 • రాజ్యాంగంపై సంతకాలు చేసిన వారు: 284
 • ముసాయిదా కమిటీ సభ్యుల సంఖ్య: 6
 • జరిగిన సమావేశాల సంఖ్య: 11
 • రాజ్యాంగ సవరణలకు అవకాశం కల్పిస్తున్న ఆర్టికల్‌: 368
 • ఇప్పటి వరకు జరిగిన సవరణలు: 103
 • 103వ సవరణ జరిగిన ఆర్టికల్స్‌: 15, 16
 • చివరగా జరిగిన సవరణ: జనవరి 12, 2019
 • ఎందుకు సవరించారంటే: ఆర్థిక బలహీన వర్గాలకు 10% రిజర్వేషన్‌లు కల్పించడం కోసం
 • తొలి సవరణ జరిగిన సంవత్సరం: 1951, మే 10
 • తొలిసారి జరిగిన సవరణ ఆర్టికల్స్‌: 15, 19, 85, 87, 174, 176, 341, 342, 372, 376.
 • తొలి సవరణలో చేర్చిన ఆర్టికల్స్‌: 31ఏ, 31బీ షెడ్యూల్‌ 9(4)

ఇదీ రాజ్యాంగం
రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు
ఆర్టికల్స్‌: 395 షెడ్యూళ్లు: 8 భాగాలు: 22

ప్రస్తుత రాజ్యాంగంలో..
ఆర్టికల్స్‌: 448 షెడ్యూళ్లు: 12 భాగాలు: 25

Courtesy Andhrajhyothi