ముహమ్మద్ ముజాహిద్

నేడు ఎర్రకోటపై మన ప్రధాని నరేంద్రమోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఆ ఎర్రకోట కట్టింది ఒక ముస్లిం పాలకుడని తెలియదా? ముస్లిమ్ పాలకులు ఈ దేశానికి ఎంతో చేశారు. ఎందరో ముస్లిమ్ యోధులు ఈ దేశ బానిస సంకెళ్ల బంధనాలను తెంచేందుకు ఉరికంబాన్ని ముద్దాడారు. ముస్లిం యోధుల త్యాగఫలమే స్వతంత్ర భారతం. 1400 సంవత్సరాలుగా ఈ గడ్డపైనే జీవిస్తూ, దేశం కోసం ఇన్నిన్ని త్యాగాలు చేసిన ముస్లిములు ఇప్పుడు తమ దేశభక్తిని నిరూపించుకోవాల్సి రావడం దురదృష్టకరం.

జాతి, మత భేదాలు లేకుండా దేశంలోని దాదాపు ప్రతి ఒక్కరూ భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. హిందువులు, ముస్లిములు, సిక్కులు, బౌద్ధులు.. ఇలా అన్ని మతాలు, వర్గాలకు చెందిన వారు తాము భారతీయులం అనే భావనతోనే కలిసికట్టుగా, సమైక్యంగా జాతీయోద్యమంలో వీరోచిత పోరాటాలు చేశారు. ధన, మాన, ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారు. అయితే, ముస్లిములను ద్వేషించడమే పనిగా పెట్టుకున్న కమలనాథులు చరిత్రను తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా నేడు ముస్లిముల త్యాగాలు తెలుసుకోవడం అవసరమైంది.

ఆంగ్లేయుల కన్నా ముందు దేశంలో బెంగాల్ నుంచి సింధ్ వరకు, ఢిల్లీ నుంచి మైసూరు వరకు ముస్లిముల పాలన ఉండేది. ఆంగ్లేయులు తమ పన్నాగాలతో భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. ఈ క్రమంలో ఆంగ్లేయులకు ముస్లిములే బద్ధ శత్రువులయ్యారు. 1857 మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో ముస్లిములను బంధించి జైళ్లల్లో బంధించేవారు. వందలాది మంది ముస్లిమ్ ఉలేమాలను ఢిల్లీలోని చౌరస్తాల్లో, చెట్లకు ఉరితీశారు. అయితే, కొంతమంది సంకుచిత భావాలుగల చరిత్రకారులు స్వతంత్ర పోరాటంలో అసువులు బాసిన ముస్లిం యోధుల పేర్లను కనుమరుగు చేశారు. స్వాతంత్ర్యోద్యమంలో ముస్లిములు హిందువులతో భుజంభుజం కలిపి ప్రాణాలొడ్డి పోరాడారు. కానీ, నామమాత్రంగా ఒక్కరిద్దరివి తప్ప చెప్పుకోదగ్గస్థాయిలో పేర్లు కానరావు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ పేరు ఆయన జయంతి రోజు మొక్కుబడిగా పత్రికల్లో కనపడుతుంది. స్వాతంత్ర్య పోరాటంలో నామమాత్రంగా కూడా పాల్గొనని కొన్ని సంస్థల ప్రతినిధులు దేశభక్తి, జాతీయవాదం గురించి మాట్లాడటం విడ్డూరం. మాతృభూమి కోసం ప్రాణ త్యాగాలు చేసిన అష్ఫాఖుల్లాఖాన్, హసన్ మోహానీ, టిప్పుసుల్తాన్, తదితరుల చరిత్రను జనసామాన్యానికి పరిచయం చేయడం ఇప్పటి అవసరం. జైహింద్, ఇంక్విలాబ్ జిందాబాద్ లాంటి నినాదాలు కూడా ముస్లిం యోధులు సృష్టించినవే.

ఈస్టిండియా కంపెనీ పేరుతో దేశంలోకి అడుగుపెట్టిన ఆంగ్లేయులు ముస్లిం పాలకుల నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. దీనితో స్వాతంత్ర పోరాటానికి మొదట ముస్లిములే శంఖం ఊదారు. అబ్దుల్ అజీజ్ రహీమాబాదీ (రహ్మలై) అనే యోధుడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జిహాద్ చేయాలని ఫత్వా జారీచేసిన మొదటి వ్యక్తి. 1753లో ముర్షదాబాద్, బెంగాల్‌లో సిరాజుద్దౌలా తాత అలీవర్దీఖాన్ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడారు. 1799లో దక్షిణభారతదేశంలో మైసూరు పులి టిప్పు సుల్తాన్, ఆయన తండ్రి హైదర్ ఆంగ్లేయులతో ఎడతెగని పోరు సల్పారు. 1825లో తహ్రీకే షహీదైన్ సయ్యద్ ఇస్మాయీల్ షహీద్ (రహ్మైలై), సయ్యద్ అహ్మద్ షహీద్ (రహ్మ)లు దేశమంతా తిరిగి స్వతంత్ర పోరాట స్ఫూర్తిని నలువైపులా వ్యాపింపచేశారు. వీరి పిలుపుతో దేశంలోని ముస్లిములంతా పోరుబాట పట్టారు. ఆంగ్లేయుల తూటాలకు ఎదురొడ్డి ధైర్యంగా ఛాతీ చూపించారు.

చివరి మొగల్ చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌ను బ్రిటిషర్లు రంగూన్ జైలులో బంధించి అతని కళ్లముందే నలుగురు కుమారులను గొంతుకోసి చంపేశారు. పోలీసుల లాఠీ దెబ్బలకు జాతీయోద్యమ యోధుడైన హస్రత్ మోహానీ రెండుచేతులు రక్తంతో తడిసి ముద్దయ్యాయి. చేతివేళ్లన్నీ చితికిపోయాయి. అయినా, బొగ్గుతో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జైలు గోడలపై కవితలు రాశారు. ముస్లిములు చేసిన త్యాగాలకు ఇలాంటి మచ్చుతునకలెన్నో ఉన్నాయి. పేర్లు చెప్పుకోవాలంటే చేంతాడంత ఉంటాయి.

సాదిఖ్ పూర్ ఉలేమాల ప్రస్తావన లేకుండా స్వాతంత్ర్యోద్యమ చరిత్ర పూర్తి కాదు. నేటి పాట్నా ప్రాంతంలో సాదిఖ్ పూర్ అనే వీధి ఉండేది. ఇక్కడి ఉలేమాలంతా వీరోచిత పోరు కొనసాగించారు. దీనికి ప్రతిగా ఓ ఏడాది రమజాన్ రోజు వలస పాలకులు బుల్డోజర్ తో సాదిఖ్ పూర్ ముస్లిముల ఇళ్లన్నీ కూల్చేశారు. ఈ ఉలేమాల త్యాగాలను జవహర్‌ లాల్ నెహ్రూ ఎన్నో సందర్భాల్లో ప్రశంసించారు. ‘దేశం కోసం హిందూ, ముస్లిం, సిక్కులు ఎన్నో త్యాగాలు చేశారు. అందరి త్యాగాలను త్రాసులో ఒకవైపు, సాదిఖ్ పూర్ ఉలేమాల త్యాగాలు ఒకవైపు పెట్టినా సరితూగలేవు’ అని అన్నారు. స్వాతంత్ర్య సమర యోధులు అనుభవించిన వాటిలో కాలాపానీ శిక్ష అత్యంత పాశవికమైనది. ఈ కాలాపానీ శిక్షకు గురైంది 95శాతం ముస్లిములే. అందులోనూ ఉలేమాలే అధికంగా ఉన్నారు. మౌలానా జాఫర్, మౌలానా విలాయత్ అలీ (రహ్మాలై), మౌలానా యహ్యా (రహ్మాలై) లాంటి ఉలేమాల పేర్లు ముందు వరుసలో ఉంటాయి.

కేరళలోని తిరు ప్రాంతానికి చెందిన 125 మంది మోప్లా ముస్లిములను బంధించి కోర్టులో హాజరు పర్చేందుకు మాల్ గాడీలో ఎక్కించారు. 50మంది పట్టే వాహనంలో 125మందిని కుక్కి తలుపులు మూసి మూడు రోజుల ప్రయాణం కొనసాగించారు. మాల్ గాడీని ఆపి తలుపు తీసి చూస్తే అందులో 65మంది ఊపిరాడక చనిపోయారు. మిగతా వారంతా స్పృహతప్పి పడిపోయి ఉన్నారు. బతికిన వారిని మద్రాసు కోర్టులో హాజరుపర్చి ఉరిశిక్ష విధించారు. ఇది ముస్లిముల పోరాటపటిమకు నిదర్శనం. ఉలేమాలు తమ ప్రసంగాలతో ముస్లిముల్లో జాతీయోద్యమ భావాన్ని ప్రేరేపించారు. ఈ కారణంతోనే వలస పాలకులు వీరిని బంధించేవారు. మియా నజీర్ హుసైన్ ముహద్దిస్ (రహ్మలై)ను ఏడాదిపాటు రావల్పిండి జైలులో బంధించారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (రహ్మలై) ‘అల్‌ హిలాల్‌’ అనే పత్రికను నడిపేవారు. దీన్ని సహించని ఆంగ్లేయులు పత్రికను నిషేధించి ఆయన్ని బంధించారు. అనేక ఏళ్లపాటు ఆయన జైలులోనే మగ్గారు. ఇలా ఎంతోమంది ముస్లిములు లాఠీదెబ్బలు తిన్నారు. జైళ్ల పాలయ్యారు.

మరో ముస్లిం ఉస్మాన్ సేఠ్ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పాఠశాలను నడిపారు. ఈ పాఠశాల ప్రారంభోత్సవంలో గాంధీజీ, నెహ్రూ, మౌలానా షౌకత్ అలీ పాల్గొన్నారు. ఉస్మాన్ చాలా సంపన్నులన్న విషయం గాంధీజీకి తెలిసి ‘‘మీ సంపదను జాతీయోద్యమం కోసం వెచ్చించండి’’ అని అభ్యర్థించారు. దానితో సేఠ్ తన ఆస్తులన్నీ ధారపోశారు. కర్ణాటక గెజిట్ పేజీ నెం. 97లో ఈ వివరాలు ఉన్నాయి. ఉలేమాలు స్వతంత్ర సమరాంగణంలో రాజీలేని పోరాటాలు చేశారని, ఎనిమిది లక్షల మంది బలిదానాలు చేశారని డాక్టర్ తారాచంద్‌ తన గ్రంథంలో రాశారు. 1947లో స్వతంత్రం వచ్చింది, దేశ విభజన జరిగింది. విభజించడాన్ని ఈ ముస్లిములు తీవ్రంగా ఖండించారు. దేశం ముక్కలవడం వాళ్లకు ఇష్టం లేదు. అఖండ భారత్ గానే చూడాలనుకున్నారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఢిల్లీ జామా మసీదు ముందు చేసిన ప్రసంగంలో దేశాన్ని విభజించే వారిని తీవ్రంగా విమర్శించారు. ‘‘మీరంతా ఎక్కడికి వెళుతున్నారు? ఎందుకు వెళుతున్నారు? ఈ మస్జిద్ మినార్లు మిమ్మల్ని పిలుస్తున్నాయి. మీ చరిత్ర పుటలను చెరిపేస్తున్నారు. జమునా తీరంలో మీ సమూహం నమాజు కోసం వుజూ చేసింది. మీరు ఇక్కడుండేందుకు ఎందుకు భయపడుతున్నారు. ఢిల్లీ మీ రక్తంతో నిర్మితమైంది. ఈ విభజన వల్ల భారతదేశంలో ఉన్న ముస్లిములు బలహీనపడతారు. ముస్లిముల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ముస్లిములు అభద్రతాభావంలో బతకాల్సి వస్తుంది’’ అని ఆనాడు ఆయన చెప్పినది నేడు అక్షరసత్యమవుతోంది. ఈ దేశాన్ని 900 ఏళ్లు పాలించిన ముస్లిములు ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో దళితులకంటే హీనంగా బతుకుతున్నారు.

ఎర్రకోటపై మన ప్రధాని నరేంద్రమోదీ నేడు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఆ ఎర్రకోట కట్టింది ఒక ముస్లిం పాలకుడని తెలియదా? ముస్లిమ్ పాలకులు ఈ దేశానికి ఎంతో చేశారు. ఎందరో ముస్లిమ్ యోధులు ఈ దేశ బానిస సంకెళ్ల బంధనాలను తెంచేందుకు ఉరికంబాన్ని ముద్దాడారు. ముస్లిం యోధుల త్యాగఫలమే స్వతంత్ర భారతం. ముస్లిముల త్యాగాలు చిరస్మరణీయమైనవన్న విషయం పాలకులు తెలుసుకోవాలి. ఈ దేశ సగటు ముస్లిం న్యాయం కోరుతున్నాడు. తమ పట్ల వివక్ష సమసిపోవాలని అభ్యర్థిస్తున్నాడు. 1400 సంవత్సరాలుగా ఈ గడ్డపైనే జీవిస్తూ, దేశం కోసం ఇన్నిన్ని త్యాగాలు చేసిన ముస్లిములు ఇప్పుడు తమ దేశభక్తిని నిరూపించుకోవాల్సి రావడం దురదృష్టకరం.

 

(Courtacy Andhrajyothi)