ఖర్చుల భారం ప్రజలపైనే ఎక్కువ
ప్రభుత్వం చేస్తున్న వ్యయం జీడీపీలో 1.1 %
శ్రీలంక కంటే అధ్వాన పరిస్థితి
వెల్లడించిన నీతి ఆయోగ్‌

ప్రపంచంలో ప్రజల ఆరోగ్యం కోసం అత్యంత తక్కువ ఖర్చుపెడుతున్న దేశం భారత్‌ మాత్రమేనని నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడించింది. ఈ విషయంలో శ్రీలంక కంటే దిగువస్థాయిలో మన దేశం ఉన్నట్లు తేల్చింది. ‘హెల్త్‌ సిస్టం ఫర్‌ ఎ న్యూ ఇండియా: బిల్డింగ్‌ బ్లాక్స్‌’ పేరుతో నీతి ఆయోగ్‌ సోమవారం బిల్‌గేట్స్‌ చేతుల మీదుగా ఓ నివేదికను విడుదల చేసింది. వైద్య రంగ లోపాలను సరిదిద్ది, పటిష్ఠ వ్యవస్థను తీర్చిదిద్దడం ఎలా? అన్న కోణంలో అధ్యయనంచేసి, అందులో వెల్లడైన అంశాలను ఈ నివేదికలో పొందుపరిచింది.

ఏం చెప్పింది?
దేశంలోని వైద్యరంగం చిన్నచిన్న విభాగాలుగా ఉండటం పెద్ద లోపం. ఆదాయ వనరులు, వైద్య బీమా, నిధులను వ్యూహాత్మకంగా ఖర్చు చేయడంలో మన వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. మధ్య ఆదాయ దేశాలతో పోలిస్తే ప్రజారోగ్యం కోసం అత్యంత తక్కువ ఖర్చుపెడుతోంది భారతే. బీమా వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే వైద్యం కోసం ప్రజలు పెద్దమొత్తంలో సొంత డబ్బును ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో పేద, దిగువ మధ్యతరగతి వారు ఆర్థికంగా చితికిపోతున్నారు. సరైన వైద్యం ఎక్కడ లభిస్తుందో తెలుసుకోవడానికి రోగులు పడుతున్న పాట్లు ఇన్నీఅన్నీ కావు. ఒక్క క్షయ రోగులనే తీసుకుంటే… మంచి వైద్యం లభించే వ్యవస్థను గుర్తించడానికి కనీసం ఎనిమిది మందిని విచారించాల్సి వస్తోంది.

మరేం చేయాలి?
వైద్య రంగం విజయవంతం కావాలంటే ముక్కలుగా ఉన్న ఈ రంగాన్ని ఏకీకృతం చేయాలని నీతి ఆయోగ్‌ పేర్కొంది. 2030 నాటికి సాధించాల్సిన కొన్ని లక్ష్యాలనూ నిర్దేశించింది.
* 2030 నాటికి పది లక్షల మంది చిన్నారుల ప్రాణాలను కాపాడాల్సి ఉంది. పనిచేయదగ్గ స్థితిలో ఉన్న వయోజనుల మరణాలను 16% మేర తగ్గించాలి. ఫలితంగా ఆర్థిక వృద్ధి వేగవంతమై, వాస్తవ జీడీపీ 64% మేర పెరుగుతుంది.

* ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని 45 శాతానికి పరిమితంచేస్తే… 15 లక్షల కుటుంబాలను దారిద్య్రంలోకి జారిపోకుండా కాపాడవచ్చు.
* ప్రస్తుత వైద్య వ్యవస్థపై ప్రజల సంతృప్తిస్థాయిని, నమ్మకాన్ని పెంచాలి. ప్రపంచ స్థాయిలో పోటీపడే వైద్యబీమా వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ‘మెడికల్‌ టూరిజం’ను అభివృద్ధి చేయాలి.

‘‘చికిత్సలకయ్యే ఖర్చుల్లో 62% ప్రజలే భరించాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వైద్యం కోసం వెచ్చిస్తున్నది దేశ స్థూల జాతీయోత్పత్తిలో కేవలం 1.1 శాతమే.’’

‘‘దేశంలో 64% వైద్యసేవలను చిన్నసంస్థలే అందిస్తున్నాయి. 98% ఆసుపత్రుల్లో సిబ్బంది కేవలం పది మందిలోపే ఉంటున్నారు.’’
వైద్య రంగంపై ఏటా చేస్తున్న ఖర్చు రూ.4,98,000 కోట్లు
ఇందులో ప్రజలు భరిస్తున్నది: రూ.3,15,000 కోట్లు

Courtesy Eenadu..